Monday, November 30, 2020

Orwellian Times

Disclaimer : This is a work of fiction. Any resemblance to actual persons, living or dead, or actual events is purely coincidental.

ఇది నేను సహజంగా రాసే పూర్తి స్థాయి సాహిత్యం పోస్ట్ కాదు,చదువుతున్నప్పుడు భాషను గురించి వచ్చిన కొన్ని ఆలోచనలు..ఆసక్తి లేనివారు చదవడం విరమించుకోవచ్చు.

Image Courtesy Google

తరాలతోనూ, కాలాలతో పాటు భాష,దాని తాలూకా భావాలూ,భావజాలాలూ మారుతూ ఉంటాయి..మార్పు సహజం..ఒకప్పుడు 'I Love You' కీ ఇప్పటి ఐ లవ్ యూ కీ తేడా ఉన్నట్లే :) దానికి తోడు సోషల్ మీడియా పుణ్యమా అని లవ్ ఐకాన్లు ధారాళంగా ఎవరికి పడితే వాళ్ళకి వాడేస్తున్నాం..ఏమంటే మోడరన్ టైమ్స్ తో అడుగులో అడుగేసి నడవడం అంటాం..వైల్డ్,ఆర్వెల్,బార్త్ లాంటి వారు ముందే హెచ్చరించినట్లు మోడర్నిస్టు అనైతిక భావజాలానికి తగ్గట్లు దాని టెర్మినాలజీ కూడా మారిపోతోంది.

ఉదాహరణకు కొన్ని పదాలు చూద్దాం : 

* అజాత శత్రువు ( in ancient times)  = People who are friendly with all without any disputes.

 అజాత శత్రువు (in current world) = A Spineless Coward who is afraid of taking sides and wants to be friends with everyone for his personal gain.

* స్థిత ప్రజ్ఞులు ( in ancient times) = మంచి చెడుల విచక్షణనెఱిగి దేనికి స్పందించాలో దేనికి అక్కర్లేదో తెలిసి, ప్రతిదానికీ చలించకుండా స్థిరంగా ఉండేవారు.

 స్థిత ప్రజ్ఞులు ( in current world) = సామాజికపరంగా అవసరమైన సందర్భాలలో కూడా స్పందించకుండా అన్నిటికీ ఎవరినేమంటే నాకేం నష్టమో,కష్టమో అనుకుని లెక్కలేసుకుంటూ గోడమీద పిల్లుల్లా వ్యవహరించేవాళ్ళు.

* మంచితనం ( in ancient times) = అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి చేసేవాళ్ళు.  

మంచితనం ( in current world) = పిరికితనం. ఎవరితోనూ పోట్లాటలకు వెళ్లకుండా చాలా ఆచితూచి తమపని తాము చేసుకునేవాళ్ళు.

* కోపిష్టి ( in ancient times) = చీటికీ మాటికీ అందరి మీదా అకారణంగా అరిచేవాళ్ళు.

కోపిష్టి ( in current world ) =  నిజాన్ని నిర్భయంగా,నిజాయితీగా మాట్లాడేవాళ్ళు..Never trust a person who says they never get angry because anger is a trait of honesty.

* నిజాయితీ ( in ancient times) = కొన్ని విలువలకు లోబడి వర్తించడం.

నిజాయితీ  ( in current world ) = లౌక్యం లేకపోవడం /లోకం తీరు తెలీకపోవడం..A typical 'flaw'  / or Lack of Diplomacy / or having poor social skills.

* నైతిక విలువలు ( in ancient times) = సామజిక కట్టుబాట్లు,నియమాలు etc. etc. (?)

నైతిక విలువలు  ( in current world ) = నా లైఫ్ ఫిలాసఫీ (అది మంచైనా/చెడైనా) దాన్ని జస్టిఫై చేసేవి.

* ఇంటెలెక్చువల్ ( in ancient times) = A scholarly man who is capable of thinking (for the good of society) and know things.

 ఇంటెలెక్చువల్ ( in current world ) = తమ మనుగడకు అనుకూలమైన సొంత ఫిలాసఫీ ఒకటి తయారు చేసుకుని ఒక హిడెన్ అజెండాతో సొసైటీని కంట్రోల్ చేసేవాళ్ళు.

* Love ( in ancient times) = ఇవ్వడం..ఎదుటి మనిషి గురించి ఆలోచించడం.

Love ( in current world ) = తీసుకోవడం .. ఎదుటి మనిషి తనకే రకంగా ఉపయోగపడతాడా అని ఆలోచించడం. 

* Kindness  ( in ancient times) = జాలిగుండె కలిగి అవసరమైన వారికి అడగకుండా సహాయం చేసేవాళ్ళు. 

Kindness  ( in current world ) = ఖాళీ సమయంలో తన పర భేదం లేకుండా అన్ని పోస్టులకీ లవ్,కేర్ ఐకాన్లు శక్తివంచనలేకుండా నొక్కి దాన్ని ఎంపతీ,సింపతీ అనుకునేవాళ్ళు.

ఈ పోస్టుకి ఇవి చాలు..మరీ గుమ్మడికాయ దొంగల్లా భుజాలు తడిమేసుకోకండి..మహాత్ములు,మంచివాళ్ళు మన మధ్య లేరని అనుకునే సినిసిజం ఇంకా వంటబట్టలేదు. ఆ పై వర్గాల్లో నేను కూడా ఏదో ఒక కేటగిరీలో నిస్సందేహంగా ఉన్నానని నమ్ముతూ,శలవు.

Thursday, November 26, 2020

The Lost Writings - Franz Kafka

న్యూ డైరెక్షన్స్ వారు 2020 లో ఇంతవరకూ ప్రచురించని కాఫ్కా సరికొత్త పుస్తకం ఒకటి ప్రచురించారు..కాఫ్కా తన చివరి రోజుల్లో రాసిన కొన్ని రచనల్ని తగలబెట్టెయ్యమని మిత్రుణ్ణి కోరారట..కానీ వారు కాఫ్కా చివరికోరిక మన్నించకపోవడంతో ఆయన చివరి కాలంలో రాసిన కొన్ని ప్రోజ్ పీసెస్ 'ది లోస్ట్ రైటింగ్స్' (నిజానికి లాస్ట్ రైటింగ్స్ అనాలి ) మైఖేల్ హోఫ్మాన్ అనువాదంలో వెలుగు చూశాయి...చాలా కాలంగా రీడింగ్ బ్లాక్ వల్ల ఏ రచయితా నా అటెన్షన్ ని హోల్డ్ చెయ్యలేకపోయిన సమయంలో కాఫ్కా ఆ బాధ్యత తీసుకున్నారు.

Image Courtesy Google

కాఫ్కా గురించి మునుపు మాట్లాడుకున్నాం కాబట్టి మరీ అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెప్పకుండా ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకనిపించిన కొన్ని విషయాలు మాత్రం ప్రస్తావిస్తాను..కాఫ్కా అనగానే కాలక్షేపానికి బఠాణీలు నములుతూ చదివే పుస్తకం కాదని మనందరికీ తెలుసు..నిజానికి కాఫ్కా గురించి మాట్లాడుతూ బఠాణీల ప్రస్తావన తేవడమే అపరాధం అనుకోండి..చేతనాచేతనల నడుమ వ్యక్తీకరణకు సాధ్యం కాని పరిధిని ఏలినవారు కాఫ్కా..ఆధ్యాత్మిక మార్గంలో కొంతదూరమైనా ప్రయాణించిన వారికి మన సంస్కృతిలో చేతనత్వానికి నాలుగు దశలుంటాయని తెలిసే ఉంటుంది..మాండూక్యోపనిషత్తులో వాటిని జాగృతావస్థ (Conscious) -> స్వప్నావస్థ -> సుషుప్తావస్థ (నిద్రావస్థ) -> తురియావస్థ (సమాధి స్థితి) లుగా విభజించారు..కార్ల్ యంగ్,సిగ్మన్డ్ ఫ్రాయిడ్ లాంటివాళ్ళు ఈ చేతనను శాస్త్రీయపరిధిలో నిర్వచించే ప్రయత్నం చేస్తే,కాఫ్కా వాటిని సాహిత్యపు పరిధిలో నిర్వచించారనిపిస్తుంది. సైంటిఫిక్ టెర్మినాలజీతో సంబంధం లేకుండా అతి సరళమైన పదాలతో ఆ పనికి పూనుకోవడం సాధారణ రచయితల వల్ల అయ్యే పని కాదు..ముఖ్యంగా ఈ జాగృత,స్వప్నావస్థల్లో ఏ ఒక్క దశలోనూ పూర్తిగా కాలుమోపకుండా మొదటి రెండు దశల మధ్య ఉన్న అతి ఇరుకైన పరిధిలో అనేక సాహితీ విన్యాసాలు చేసినవారు కాఫ్కా..ఆ చిన్న పరిధి కాఫ్కాకు చాలా ఇష్టమైన ప్లే గ్రౌండ్..బోర్హెస్,ఫెలిస్బెర్టో హెర్నాండెజ్(ఆయన పియానో స్టోరీస్ చదివాను,అవి ఈ పరిధిలోకే వస్తాయి ) వంటివారు కాఫ్కా ప్లే గ్రౌండ్ లో నిలబడి విజయవంతంగా కొన్ని ప్రయాగాలు చేసినప్పటికీ కాఫ్కా ఆ లోకాన్ని చూసినంత,ఆయన రచనల్లో మనకు చూపించినంత స్పష్టత వారి రచనల్లో కనిపించదు.

అన్ని కాఫ్కా మార్కు రచనల్లాగే ఇందులో ప్రోజ్ కూడా పాఠకులకు సగం స్వప్నావస్థలోనూ,సగం జాగృతావస్థలోనూ ఉన్నట్లనిపిస్తుంది..ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఇటీవల చదివిన హరాల్డ్ బ్లూమ్ కాఫ్కా గురించి రాసిన కొన్ని మాటలు గుర్తుకు వచ్చాయి..కాఫ్కా ప్రియురాలు మిలెనా ఆయన సంస్మరణార్ధం రాసిన కొన్ని మాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు బ్లూమ్..కాఫ్కా తన రచనల ద్వారా మనందరినీ ఒక రకమైన 'కాస్మిక్ ఎంప్టీనెస్' లోకి నెట్టేస్తారంటూ ఈ విధంగా అంటారు :

He was a hermit, a man of insight who was frightened by life.. He saw the world as being full of invisible demons which assail and destroy defenseless man.… All his works describe the terror of mysterious misconceptions and guiltless guilt in human beings.

కాఫ్కా ప్రోజ్ పీసెస్ ఒక ఎనిగ్మా లాంటి అబ్స్ట్రాక్ట్ ప్రపంచానికి ద్వారాలు తెరుస్తాయి..కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు అవి కాఫ్కా అక్షరాలను కుంచెగా చేసుకుని గీయడానికి ప్రయత్నించిన చిత్రపటాలేమో అనిపిస్తాయి..ఆ ప్రోజ్ ఎలా ఉంటుందంటే ఆయన రాసిన వాక్యాల్ని చదివి కాసేపు చదవడం ఆపేసి,ఆ చిత్రాన్ని మన మెదడులో చిన్న చిన్న సంగతులూ,విషయవిశేషాలతో సహా ఏ ఒక్క డీటెయిల్ నీ వదలకుండా మరోసారి రూపకల్పన చేసుకోవాల్సి వస్తుంది..అలా చేస్తే గానీ మనకు కాఫ్కా పూర్తి ప్రపంచం అర్ధం కాదు..దానికి తోడు కాఫ్కా ప్రోజ్ కు మొదలూ తుదీ ఉండవేమో,రెండు వైపులా చివరల్ని పట్టుసడలకుండా జాగ్రత్తగా పట్టుకుని ముడులు వేసుకుంటూ వెళ్ళడం పాఠకుల వంతు అవుతుంది..కొన్ని వాక్యాలు అసంపూర్తిగా అనిపిస్తాయి,అక్కడక్కడా కాఫ్కా తన ఆలోచనల అలజడిని తాళలేక దాల్చిన మౌనం తాలూకా కలం మరకలు కూడా పాఠకుల దృష్టికి వస్తాయి..మాట్లాడే జంతువులూ,మాటలు కరువైన మనుషులూ,చీకటి గదులూ,అంతం ఎక్కడో కనిపించని ఆకాశ హర్మ్యాలూ,ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచానికి అవలీలగా మూసిన తలుపులు తోసుకుంటూ నడుచుకు వెళ్ళగలిగే సగటు మనుషులూ,ఇవన్నీ వెరసి కాఫ్కా జీనియస్ ఈ ప్రోజ్ పీసెస్లో అడుగడుగునా కనిపిస్తుంది.

మీరు కేవలం వినోదం కోసం చదివేవారైతే ఈ పుస్తకం మీకు కాదు అంటూ ఈ పుస్తకానికి చివరిమాట రాసిన Reiner Stach,కాఫ్కా రచనలకు సంబంధించి ఈ పుస్తకాన్ని కాఫ్కా పూర్తి ప్రపంచాన్ని ఆవిష్కరించగలిగే 'అడ్వాన్స్డ్ వెర్షన్' గా అభివర్ణించారు..కానీ జనాదరణ విషయంలో ఇటువంటి క్రిటికల్ ఎడిషన్స్ పెద్దగా విజయం సాధించలేవు..ఎందుకంటే ఇటువంటి పుస్తకాలు  తమ పాఠకులను తామే వెతుక్కుంటాయి..పలుచోట్ల చాలా పొడిపొడిగా,అస్పష్టంగా ఉండే వర్ణనలు సాధారణంగా కథను ఎంజాయ్ చేద్దామనుకునే సాహితీ ప్రియుల్ని భయపెడతాయంటారు స్టాచ్.

They require of the reader that she negotiate a vast number of texts of every length and form, without the aid of a familiar title, say, or an order established by the author — and, yes, in many cases it’s not even clear whether a text was broken off or viewed by Kafka as finished.

ఇందులో ఒక ప్రోజ్ పీస్ I Loved a Girl Who Loved Me Back కు నా స్వేచ్చానువాదం : 

నేను ప్రేమించిన అమ్మాయి నన్ను తిరిగి ప్రేమించింది,కానీ నేను ఆమె నుండి మరో గత్యంతరం లేక విడిపోయాను.

ఎందుకంటే ఏమో,నాకే తెలియదు.

అన్ని దిశలకూ గురిపెట్టిన ఈటెలవంటి ఆయుధాలు ధరించిన అనేకమంది సైనికుల వలయంలో ఆమె చిక్కుకుని ఉన్నట్లు అనిపిస్తుంది.

నేను ఏ వైపునుండి ఆమెను చేరుకోవాలని ప్రయత్నించినా,వాళ్ళ పదునైన మొనలు నన్ను గాయపరచడంతో తీవ్రమైన బాధకు గురై వెనుతిరగవలసివస్తుంది.

దీనికి ఆమె ఏ విధంగానూ బాధ్యురాలు కాదా ? బహుశా కాదేమో అనే నాకూ అనిపిస్తుంది.ఉహూ,నిజానికి కాదనే నా నమ్మకం కూడా.

నేను మీకు పూర్తి కథ ఇంకా చెప్పనేలేదు. నిజానికి నేను కూడా అటువంటి ఆయుధాలు ధరించిన సైనికుల వలయంలోనే చిక్కుకుని ఉన్నాను. ఎటొచ్చీ వాళ్ళు తమ ఈటెల మొనలు వెనుకవైపుకు, అనగా నాదిశగా గురిపెట్టి ఉన్నారు. 

నేను ఆ అమ్మాయి వైపుకు జరగడానికి ప్రయత్నించిన వెంటనే, నా దిశగా ఉన్న పదునైన మొనలు నాకే గుచ్చుకుని ముందుకు అడుగువెయ్యలేకపోయేవాడిని.

బహుశా నేను ఆ అమ్మాయి చుట్టూ ఉన్న సైనిక వలయాన్ని ఎప్పటికీ చేరుకోలేదేమో. ఒకవేళ చేరుకున్నట్లైతే , ఆ సరికే నాచుట్టూ ఉన్న ఈటెలు నా హృదయంలో దిగి గాయపడి స్పృహ కోల్పోయి రక్తమోడుతూండేవాడిని.

అయితే ఆ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోతుందా ? 

లేదు, ఆమెకు సరిజోడు అయిన మరొక ప్రియుడు ఎటువంటి అవరోధాలూ లేకుండా ఆమెను అతి సునాయాసంగా చేరువయ్యాడు.

విఫలయత్నాలతో అలసిపోయిన నేను,వారిద్దరి ముఖాలూ తొలిముద్దుకు దగ్గరకు జరిగిన సమయంలో వారి మధ్య అంతకంతకూ తరిగిపోయిన శూన్యంలా  నిరాసక్తంగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాను.

I loved a girl who loved me back, but I was forced to leave her.

Why?

I don’t know. It was as though she was surrounded by a ring of armed men who held out their lances in all directions. No matter how I sought to approach, I encountered their sharp points, was wounded, and had to retire. I suffered badly.

Was the girl in no way responsible? 

I don’t think so, in fact, I know she wasn’t. The above comparison was not the whole story, because I too was ringed by armed men, though they pointed their lances backward, in my direction. As I moved toward the girl, I was immediately caught in the lances of my own men and could make no further progress. It’s possible that I never came close to the armed men of the girl, and if I did, then I was already bleeding and insensible from the lances of my own men.

Did the girl remain alone then?

No, another suitor got through to her, easily and unhindered. Exhausted by my own efforts, I watched as indifferently as though I were the air through which their faces met in their first kiss.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు,

The deep well. It takes years for the bucket to reach the top, then in an instant it plummets to the bottom, faster than you can lean down; you think you are still holding it in your hands and already you hear the faraway splash, but you’re not even listening.

There are many waiting here. A vast crowd disappearing into the darkness. What do they want? There are obviously certain demands they want to make. I will listen to them and then make my reply. I will not go out onto the balcony; I couldn’t even if I wanted to. In winter the balcony door is kept locked, and the key is somewhere else. Nor will I step up to the window. I will see no one, I will not have my head turned by a spectacle, my desk is the place for me, with my head in my hands, that is my posture.

Some prose pieces are like pictures.. you stop while reading each piece..you contemplate and  without picturing in your head you cannot understand his pieces.

He knows that this hammer is not enough to knock the least splinter out of the wall, he doesn’t seek to do so either, sometimes he runs his hammer along the walls, as though to give the signal to the great waiting machinery of rescue to swing into operation. It will
not happen exactly in this way, the rescue will begin in its own time, irrespective of the hammer, but it remains something, something palpable and graspable, a token, something one can kiss, as one cannot kiss rescue.

I rowed calmly through the waves, hardly thinking about my strokes, so intent was I on taking in with all my faculties the silence that reigned here, a silence such as I had never encountered in all my life. It was like a fruit I had never tasted, though it was the most nutritious of all fruits. I had closed my eyes and was drinking it in.

I have buried my reason happily in my hand, I carry my head upright, but my hand is hanging down, my reason is dragging it down to the ground. Look at my small, calloused, veined, wrinkled, proud-veined, five-fingered hand, how clever of me to harbor my reason in this unlikely container. What is of particular advantage is that I have two hands. As in a children’s game, I can ask myself: which hand am I holding my reason in, no one will be able to guess, because through the wrinkles in my hands, I can straightaway transfer my reason from hand to the other.

What is bothering you? What is tearing at your heart’s support? What is testing your doorknob? What calls you from out on the street that won’t walk in through the open gate? Oh, it’s only the one you are bothering, the one at whose heart’s supports you are tearing, whose doorknob you are testing, whom you are calling from the street and through whose open gate you won’t walk [. . .]

You don’t have to leave the house. Stay at your desk and listen. Or don’t even listen, wait for it to bother you. Don’t even wait, be completely quiet and alone. The world will offer itself to you to be unmasked, it cannot do otherwise, it will writhe in front of you in ecstasies.

Monday, November 9, 2020

అనేకుడు పెస్సోవా

కళల్ని ఆత్మసాక్షాత్కారానికి సాధకాలుగా చూస్తారు..కళాకారుడు ఏ కళ ద్వారానైనా తనలో ప్రపంచానికి తెలీని మరో 'అంశ'ని బయల్పరచాలని ఆరాటపడతాడు..కళకు మూలాధారమే అస్తిత్వవాదం అనుకుంటే చిన్ని కృష్ణుడు అనంతకోటి బ్రహ్మాండాన్నీ తన నోట్లో చూపించినట్టు తనలో ఉన్న అనంతమైన వ్యక్తుల్నీ,వ్యక్తిత్వాల్నీ ప్రపంచానికి చూపించే సాహసం చేసిన ఏకైక రచయిత బహుశా 'ఫెర్నాండో పెస్సోవా' మాత్రమే..పోర్చుగీసు కవి 'ఫెర్నాండో ఆంటోనియో నోగైరా పెస్సోవా' 1888 జూన్ 13 న లిస్బన్ లో జన్మించారు..తండ్రి మరణానంతరం తల్లి ద్వితీయ వివాహం కారణంగా ఏడేళ్ళ వయసు నుండీ పెస్సోవా విద్యాభ్యాసం అంతా బ్రిటీష్ పాలన క్రింద ఉన్న దక్షిణాఫ్రికా లోని డర్బన్ లో జరిగింది..ఈ కారణంగా ఆయన పోర్చుగీసు,ఇంగ్లీషు రెండు భాషల్లోనూ విరివిగా రచనలు చేశారు..1905 లో తిరిగి లిస్బన్ చేరిన తరువాత ఆయన మళ్ళీ  పోర్చుగీసు వదిలిపోలేదు..ఆ కాలంలో Orpheu మరియు Athena అనే పత్రికలకు వ్యాసాలూ,కవితలూ రాయడం ద్వారా సాహితీప్రపంచానికి పరిచయం అయ్యారు పెస్సోవా.

Image Courtesy Google

ఫెర్నాండో పెస్సోవా మానవనైజాన్ని నిర్దేశించ వీలులేదని ఘంటాపథంగా చెప్తూ,మనిషి వ్యక్తిత్వం క్షణక్షణానికీ మారిపోయే అస్థిరమైన లక్షణం కలిగి ఉంటుందని హ్యూమన్ సెల్ఫ్ లోని కన్ఫర్మిటీని తీవ్రంగా ఎద్దేవా చేశారు..రచయితల్లో ఈ తరహా 'ఆల్టర్ ఇగోస్' సంస్కృతి చాలా పాతదే అయినా,మిగతా రచయితలు మరో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల్ని మాత్రమే తమ హెటెరోనిమ్స్ గా చూపించడంలో సఫలీకృతులయ్యారు..ముఖ్యంగా ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో,రచయితల్లో ఈ ఆల్టర్ ఇగోస్ ఫ్యాషన్ కొనసాగుతున్న కాలంలో ఎజ్రా పౌండ్ కు -మాబెర్లీ, రిల్కే కు -మాల్టె లారిడ్స్ బ్రిగ్గే,వొలర్ కు - మిష్యుర్ టెస్టే లాంటి కొన్ని హెటెరోనిమ్స్ వాడుకలో ఉండేవి..ఇక్కడే పెస్సోవా మిగతా అందరికంటే కాస్త భిన్నంగా కనిపిస్తారు,ఈ 'ఆల్టర్ ఇగోస్' గేమ్ లో చాలామంది సాహితీ దిగ్గజాలు భాగం పంచుకున్నా,దాన్నిపెస్సోవా తీసుకెళ్ళినంత దూరం మరెవ్వరూ  తీసుకెళ్ళలేదు..పెస్సోవా ఈ ఆటను తుదికంటా ఆడారు.

ప్రవృత్తి రీత్యా ఒంటరి అయిన పెస్సోవాకు సామాజిక,వైవాహిక జీవితాలు లేవు ..1910 లో పోర్చుగీసు మోడర్నిస్ట్ మూవ్మెంట్ లో చురుగ్గా పాల్గొన్నా ఆయనెప్పుడూ లైమ్ లైట్ కి దూరంగానే ఉన్నారు..పెస్సోవా జీవనకాలంలో ఆయన రచనలు వెలుగు చూడలేదు..1935లో లిస్బన్ లో ఆయన మరణానంతరం ఒక చిన్న గదిలోని ట్రంక్ పెట్టెలో అస్తవ్యస్తమైన దస్తూరీలో పోర్చుగీసు,ఇంగ్లీష్,ఫ్రెంచ్ భాషల్లో రాసిన ప్రతులు దొరికాయి..ఆ ప్రతుల్లో కవితలూ,కథలూ,ఫిలాసఫీ,అనువాదాలూ,విమర్శలూ,రాజకీయ,భాషాపరమైన వ్యాసాలతో కూడిన పెస్సోవా సమగ్ర సాహిత్యం అంతా నోటుపుస్తకాల్లోనూ,బిల్లుల మీదా,చిత్తు కాగితాల మీదా,ఉత్తరాల వెనుక,ఇలా ఎక్కడపడితే అక్కడ విడదీయడానికి వీల్లేని విధంగా లభ్యమైంది..ఆయన చనిపోయిన ఎనభై ఏళ్ళ తరువాత కూడా ఆయన రచనల్ని ప్రచురణకు తీసుకువెళ్ళే దిశగా ఇంకా తీవ్రమైన పరిశ్రమ జరుగుతూనే ఉంది..పెస్సోవాని అనువదించడాన్ని 'ఒక పీడకల'గా అభివర్ణిస్తారు అనువాదకులు..ఎందుకంటే ఆ ప్రతుల్లో ఉన్నది 'ఫెర్నాండో పెస్సోవా' అనే ఒక్క వ్యక్తి కాదు,అనేకమంది రచయితల సమూహాన్ని తనలో ఇముడ్చుకుని లెక్కలేనన్ని ఆల్టర్ ఇగోస్ తో రచనలు చేశారాయన.

పెస్సోవా 'హెటెరోనిమ్స్','సెమీ హెటెరోనిమ్స్' అని ముద్దుగా పిలుచుకునే డజన్ల కొద్దీ  'ఆల్టర్ ఇగోస్' ఈ సందర్భంగా వెలుగు చూశాయి..ఎన్ని వలిచినా తరగని ఈ ఉల్లిపొర జీవితాల మధ్య పెస్సోవా తో పాటు ఆల్బర్టో కైరో,రికార్డో రైస్ మరియు అల్వారో డి కాంపోస్ అనే మరో ముగ్గురు కవుల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి...పెస్సోవా తన ఆల్టర్ ఇగోస్ కు పేర్లు మాత్రమే ఇచ్చి ఊరుకోకుండా వారికి విభిన్నమైన వృత్తులూ,ప్రవృత్తులూ,ఆహార్యాలూ కూడా ఆపాదించారు..ఒకదానికొకటి పొంతన లేని ఈ వ్యక్తిత్వాల మధ్య నిజమైన పెస్సోవా(?) ఎవరంటే కనుక్కోవడం కష్టమే..పాఠకులకు పుస్తకాల్లో ఎక్కడో ఒకచోట తమని తాము వెతుక్కోవడం పరిపాటైతే పెస్సోవా పాఠకులు మాత్రం తమ గురించి పూర్తిగా మర్చిపోయి రచయితను అన్వేషించే పనిలో పడతారు..'నా ఆలోచనలో నేనున్నాను,కానీ నా ఆలోచనలు అనంతమైనవి' అని ఒక సందర్భంలో అంటారు అల్వారో డి కాంపోస్..అంటే నా ఉనికి కూడా అనంతమేనని చెప్పడం అన్నమాట..యవ్వనం దాటాకా ఎప్పుడూ లిస్బన్ వదిలి బయటకి వెళ్ళకపోయినా పెస్సోవా వ్యక్తిత్వాలన్నీ ఆయన తన గదిలో కిటికీ ప్రక్కన కూర్చుని ఊదే సిగరెట్ పొగ అంత తేలిగ్గా విశ్వంలోకి వ్యాపిస్తాయి..పెస్సోవా మాగ్నమ్ ఓపస్ 'ది బుక్ ఆఫ్ డిస్క్వైట్' అనువాదకులు రిచర్డ్ జెనిత్ ఆ పుస్తకాన్ని ఒక అరుదైన 'అక్షరాలతో మలిచిన ఛాయాచిత్రం' గా అభివర్ణిస్తారు,ఇరవయ్యో శతాబ్దం మొత్తంలో 'హ్యూమన్ సెల్ఫ్' గురించి అంత నిజాయితీతో కూడిన రచన మరొకటి లేదని అభిప్రాయపడతారు.

సాహిత్యంలో సహజంగా  కనిపించే ప్రయోగాలూ,ప్రమాణాలూ పెస్సోవా శైలిలో కనిపించవు..సాహితీ విలువల నిర్వచనాలకు ఆయన రచనలు ఆమడదూరంలో నిలబడతాయి..పెస్సోవా రచనల్లో ముడిసరుకు స్వయంగా ఆయనే..బాహ్యప్రపంచాన్ని తన అంతఃప్రపంచంతో పోలుస్తూ రచనలు చేసే రచయితలకు భిన్నంగా తనలో దాగున్న అనంతమైన ప్రపంచాల్లో విహరిస్తూ,తన ప్రతిబింబాలైన విభిన్న వ్యక్తిత్వాలతో సంభాషిస్తూ,తాను మాత్రం వీటన్నిటినుంచీ విడివడి దూరంగా నిలబడి ఒక ప్రేక్షక పాత్ర పోషించడం ఏమంత సులభతరం కాదు..జె.ఎమ్.కాట్జీ 'యూత్' అనే నవల్లో రాసినట్లు "కళని సృజించే క్రమంలో కళాకారుణ్ణి అతనిలోనే ఉండే మరో వ్యక్తి ఆవహిస్తాడు,ఆ సమయంలో ఒక జ్వరతీవ్రతతో ఉన్న వ్యక్తిలా కళాకారుడు పని చేస్తాడు" అని..మరి ఒకరికి మించిన వ్యక్తిత్వాలు ఆవహించిన కళాకారునిలో ఈ జ్వరతీవ్రతను పూర్తిస్థాయిలో భరించగలిగిన పెస్సోవా ప్రత్యేకత నిరాకరించడానికి వీలులేనిది..ఈ పోర్చుగీసు రచయితను ప్రత్యేకం ఒక దేశ,కాలమాన చట్రాల్లో పెట్టి వర్గీకరించాడానికి వీలులేదు.."నేను పోర్చుగీసు వాణ్ణయినా నేను పోర్చుగీసులో రాయను,నన్ను నేను రాసుకుంటాను" అని చెప్పడం రచయితగా ఆయన పరిధి ఎంత విశాలమో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

తొలి ప్రచురణ : ఆంధ్ర జ్యోతి వివిధ 10త్ నవంబర్ 2020. 
https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-635153

హ్యాపీ రీడింగ్

'కామన్ రీడర్' అనే పుస్తకంలో 'ఎవరైనా పుస్తకాన్ని ఎలా చదవాలి' అనే వ్యాసంలో "The only advice, indeed, that one person can give another about reading is to take no advice." అని చమత్కరిస్తారు వర్జీనియా వూల్ఫ్..పుస్తక పఠనం విషయంలో ఏ పుస్తకం ఎలా చదవాలో,ఎందుకు చదవాలో,ఎటువంటి పుస్తకాలు చదవాలో నిజానికి ఎవరూ ఎవరికీ సలహాలు ఇవ్వరాదు,తీసుకోరాదు..మల్లెల పరిమళాన్ని ఆఘ్రాణించండం,పసిపాప బోసినవ్వుల్ని చూసి మైమరచిపోవడం,సముద్రపు అలల హోరుని చెవులప్పగించి వినడం,ప్రభాతవేళ చెంపలను తాకుతున్న నునువెచ్చని సూర్య కిరణాలను అనుభవించడం,ఇలాంటివన్నీ ఎవరూ ఎవరికీ నేర్పించలేదు,నేర్పించలేరు,ఇవన్నీ వ్యక్తిగతమైన అనుభవాలు.పుస్తక పఠనం అనేది కూడా పూర్తిగా ఒక వ్యక్తిగతమైన అనుభవం.ఇది ఇంచుమించు ఆధ్యాత్మికత లాంటిదే.ఒక పాఠకుని పఠనానుభవం అతడి మానసిక పరిపక్వతా,వ్యక్తిగత స్థితీ,పరిణితీ,గ్రాహక శక్తి,ఊహాత్మకత స్థాయిల్ని బట్టి మారుతూ ఉంటుంది.ఏ ఒక్కరి పఠనానుభవమూ ఒక్కటి కావడం అనేది దాదాపూ అసంభవం.పుస్తకపఠనం విషయంలో కొన్ని దిశానిర్దేశం చేసే అంశాలున్నప్పటికీ సిద్ధార్థ నవలలో హెస్సే అన్నట్లు చివరగా ఎవరి గమనం,గమ్యం వారిదే.

Image Courtesy Google

పుస్తకాలు ఎందుకు చదువుతారని ఎవరినైనా అడిగినప్పుడు చాలా భిన్నమైన సమాధానాలు చెబుతుంటారు.కొందరు కాలక్షేపానికి చదువుతామంటారు,మరికొందరు జ్ఞానాన్ని పెంచుకోవడానికనీ,ఆధ్యాత్మికత వైపు ప్రయాణించడానికనీ అంటే,ఇంకొందరు సత్యశోధనకోసమని చెప్పగా కూడా విన్నాను.వీటికి తోడు ఈ మధ్య కాలంలో తరచూ వింటున్న మరో సమాధానం ఏమిటంటే "రివ్యూలు రాయడం కోసం" అని.సాంకేతిక విప్లవం విమర్శకులకూ,సమీక్షకులకూ ఉన్న వైరుధ్యాన్ని చెరిపేసి ,కంప్యూటరూ,కీబోర్డు ఉండి రాయడం వచ్చిన ప్రతి వారూ వ్రాసే ప్రతి అక్షరానికీ విలువ అమాంతం పెంచేసిన ఈ తరుణంలో అందరూ పాఠకులే,అందరూ రచయితలే,అందరూ విమర్శకులే అన్నచందాన తయారయ్యింది.ఇదేమీ అభ్యంతరకరమైన వాతావరణమని కూడా అనలేం.ఎందుకంటే ఒకప్పటి కంటే నేడు ప్రచురణల సంఖ్య బాగా పెరిగింది,చదివేవారికంటే రాసేవారు పెరిగారు.ప్రచురణ సంస్థలు ముందుకు నడవాలన్నా,కొత్త రచయితలు పుట్టుకురావాలన్నా రివ్యూలు రాయాలి తప్పదు.మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఓపిగ్గా కొత్త రచయితలను ప్రోత్సహించే నిమిత్తం ప్రొఫెషనల్ గా చదివేవారు కూడా ఉంటారు.నాకు నచ్చిందే చదువుతాను అని ఎస్కేపిజంతో భీష్మించుకు కూర్చునే లగ్జరీ అందరికీ ఉంటుందనుకోను.మరి చదువు వివేకాన్ని ఇస్తుందా అంటే,అది చదివే పుస్తకాలను బట్టీ,చదవడానికి కారణమైన అంశాలను బట్టీ మారుతుంది అనుకుంటాను.కొందరు తమను తాము పుస్తకంలోని పాత్రలతో ఐడెంటిఫై చేసుకోడానికి చదువుతామంటారు.పాఠకుడే కదా అని క్రైమ్ థ్రిల్లర్స్  చదివి క్రైమ్ చేసిన వాడితో ఐడెంటిఫై చేసుకునే పాఠకుణ్ణి 'ఇంటెలెక్చువల్ పెడెస్టల్' మీద కూర్చోబెట్టలేం.అలాగే రామాయణం చదివి రావణుణ్ణీ,భారతంలో సుయోధనుణ్ణీ ఆదర్శంగా తీసుకునే పాఠకుణ్ణి ఉత్తముడనీ,జ్ఞాని అనీ అనుకోలేం.పల్ప్ ఫిక్షన్ మొదలు పోర్న్ వరకూ ఏ జానర్స్ చదివేవాళ్ళయినా ఈ 'పాఠకుల' వర్గంలోకే వస్తారు..ఒకసారి ఎవరో పెద్దావిడతో మాకు ఇద్దరికీ సాహిత్యం అంటే ప్రాణమని నా స్నేహితురాలు చెప్తే,ఆవిడ మా అక్క కూడా చాలా ఎక్కువ చదువుతుంది,స్వాతి వీక్లీ మొదలు అన్ని వారపత్రికలూ వదలకుండా చదువుతుంది అంటూ,పుస్తకాలుంటే ఆవిడకి తిండికూడా అక్కర్లేదు అన్నారు నవ్వుతూ.అప్పుడు అనిపించింది పఠనానుభవం,అందులో పొందే అపరిమితమైన తృప్తి,ఏకాంతం,ప్రశాంతత లాంటివి,చదివే జానర్స్ వేరైనా అందరికీ ఒక్కటే కదా అని.కానీ మంచి పుస్తకాలూ,చెడ్డ పుస్తకాలూ ఉండవని ఆస్కార్ వైల్డ్ అన్నట్లు పుస్తకాలు ఎక్కువ చదివేవారందరూ ఉత్తములనో,జ్ఞానవంతులనో అనుకోవడం మాత్రం వట్టి భ్రమ అని చెప్పడమే నా ఉదేశ్యం.పుస్తకాలు ఒక మిర్రర్ లాంటివి.పాఠకుడు అందులో తన ప్రతిబింబాన్నే చూసుకుంటాడు.భుజాలు తడుముకోడానికి జెనరలైజ్డ్ స్టేట్మెంట్స్  కాదులెండి,మినహాయింపులు అన్నిచోట్లా ఉంటాయి.

పుస్తకాలు చదవడం వల్ల కలిగే లాభాలేమిటో అందరికీ తెలుసు,అనేక వ్యాసాల్లో ఆ విషయాన్ని చాలాసార్లు చర్చించుకున్నాం కూడా.ఇప్పుడు దానికి భిన్నంగా పుస్తకాలు అతిగా చదవడం వల్ల కలిగే నష్టాలేమిటో కూడా చూద్దాం.ఉదాహరణకు జీవితకాలమంతా రామాయణం లాంటి ఒక గ్రంథాన్ని (నేను నాస్తికురాల్ని,ఇప్పుడు రామాయణం అన్నాను కదాని నాకు ఆస్తికత్వం అంటగట్టకండి) పారాయణం చేస్తూ గడిపే ఒక సగటు వ్యక్తి ,రాముడి లక్షణాలను తన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తాడు.ఒక నిర్ణీతమైన మార్గంలో తాను నమ్మిన,తనకు తెలిసిన విలువలతో గడిపే (అజ్ఞానం ఆనందం అంటారు మోడర్నిస్టులు) అతడి జీవితంలో కన్ఫ్యూషన్ కి ఆస్కారం చాలా తక్కువ.అదే విధంగా కాస్త క్వాలిటీ ఉన్న ఏ రియలిస్టిక్ ఫిక్షన్ అయినా పాఠకులకు నిత్యజీవితంలో మార్గదర్శిగా ఉంటుంది.ఇక అసలు చిక్కు 'ఇంటెలెక్చువల్ స్టఫ్' (ఫిలాసఫీ,సైకాలజీ,ఫాంటసీ,అబ్సర్డిటీ,మ్యాజికల్ రియలిజం లాంటి జానర్స్ ఇందులో కలపొచ్చేమో (?)) చదివేవాళ్ళతో ఉంటుంది.ఈ రకం పాఠకులు ఒక వంద మంది తత్వవేత్తల్ని చదివారనుకుందాం,ఆ తత్వాలను  వంద రకాల దుస్తులనుకుంటే,వార్డ్రోబ్ నిండిపోయి ఓవర్ ఫ్లో అయిపోతున్న వాళ్ళకి తమ వార్డ్రోబ్ లో ఉన్న వంద డిజైనర్ వేర్ సూట్స్ లో ఏ రోజు,ఏ సందర్భానికి ఏ సూటు ధరించాలో తెలియదు..కన్ఫ్యూషన్..వాళ్ళు తమ జీవితానికి అన్వయించుకోవడానికో,లేదా ఏదైనా మరో విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిన సందర్భంలో ఏ ఫిలాసఫీ మంచిదో,ఏ తత్వం ఆచరణయోగ్యమో నిర్ణయించుకోలేరు.వాస్తవ జీవితంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవలవలసిన చోట విపరీతమైన గందరగోళంతో తికమకపడుతూ అతిగా ఆలోచించడం మినహా ఖచ్చితమైన సైడ్స్ తీసుకోలేరు.ఏకకాలంలో అందరి చెప్పుల్లోనూ కాళ్ళు పెట్టుకుని ఆలోచించగలగడం,ఒక విషయాన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పద్ధతిలో వీలైనన్ని కోణాల్లో చూడగల శక్తిని ఇవ్వడం ఇటువంటి చదువు ఇచ్చే వరం అనుకుంటే,అదే సమయంలో అదొక శాపం కూడా అనిపిస్తుంది.చివరగా ఇటువంటి పాఠకులు వందమంది సరి అన్నదానిని ఖండించే నూట ఒకటో సరికొత్త విశ్లేషణతో వస్తుంటారు.ఇది ఇప్పటి సరికొత్త ఫ్యాషన్.

ఏ మనిషైనా ఒక్క జీవితంలో ఎంతమంది మనుషుల్ని కలవగలడు ? చాలా మంచి మానవసంబంధాలున్న వ్యక్తికి కూడా ఒక జీవితంలో మహా అయితే ఒక వందమంది గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది..ఇక ఇంట్రావర్టులు,మొహమాటస్థులు అయితే ఆ సంఖ్య ఖచ్చితంగా పది లోపే..అందరినీ గుడ్డిగా నమ్మగలిగే ఒకనాటి ఆదర్శ సమాజం ఎప్పుడో అంతరించిపోగా,మన గ్లోబల్ విలేజ్ లో ఏ మనిషితో కరచాలనం చేస్తే ఏ వ్యాథి సంక్రమిస్తుందో తెలియని నేటి కోవిడ్ కాలంలో మానవ సంబంధాలు మరింత బలహీనపడుతున్నాయి.వీటన్నిటిమధ్యా పుస్తకపఠనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనుషులతో ఉండే 'ఎమోషనల్ కనెక్షన్' ను కొంతవరకూ అనుభవంలోకి తీసుకువస్తుంది.

కానీ పుస్తకాలు మానవ సాహచర్యానికి సరిసమానమైన ప్రత్యామ్నాయంగా కాగలుగుతాయా ? నిస్సందేహంగా అవుననే అంటారు మార్సెల్ ప్రూస్ట్,హరోల్డ్ బ్లూమ్ వంటి కొందరు రచయితలు.ఒక మంచి మిత్రుడు ఒక పెద్ద గ్రంథాలయంతో సమానమని అంటూ ఉంటారు.ఒకప్పుడు జ్ఞానసముపార్జన కోసం పండితులతో చర్చించడం ద్వారానూ,సజ్జన సాంగత్యంలోనూ సాంఘిక,రాజకీయ,ఆధ్యాత్మిక,తాత్విక,ప్రాపంచిక విషయాలను అధ్యయనం చెయ్యడం జరిగేది..కానీ నేటి పరిస్థితుల్ని చూస్తే,మనిషి సంఘజీవిగా మనగలిగే అవకాశాలను టెక్నాలజీ సమూలంగా తుడిచేస్తోంది.ఉమ్మడికుటుంబాలనుండి న్యూక్లియర్ కుటుంబాలు ఆవిర్భవించి,కుటుంబవ్యవస్థ సైతం ఛిద్రమైన తరుణంలో ఒక సినిమా కవిగారు అన్నట్లు జగమంత కుటుంబంలో ఏకాకి జీవితాలు ఒంటరితనం బారినపడకుండా పుస్తక పఠనమనే అభిరుచి కాపాడుతుంది.One of the uses of reading is to prepare ourselves for change, and the final change alas is universal. అంటారు హరాల్డ్ బ్లూమ్..సంగీతం,నాట్యం,చిత్రలేఖనం వంటి అభిరుచులు కళాకారుణ్ణి అతడి ఆత్మతో లీనమయ్యేలా చేస్తే,పుస్తక పఠనం వాస్తవ జీవితంలో కలవడానికి అవకాశం లేని అనేకమంది గొప్ప వ్యక్తులతో సంభాషించే అమూల్యమైన అవకాశాన్ని ఇస్తుంది.'Otherness' ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి పుస్తకపఠనాన్ని  మించిన మార్గంలేదు. 

ఇక ఎందుకు చదవాలి అనే విషయానికొస్తే Sir Francis Bacon సలహా గుర్తుకువస్తుంది, "Read not to contradict and confute, nor to believe and take for granted, nor to find talk and discourse, but to weigh and consider." అందునా నేటి  సాహితీలోకంలో పుస్తక పఠనమంటే తమ విజ్ఞాన ప్రదర్శనకో,ఎవరి వాదననైనా ఖండించడానికో లేదా చదవడాన్ని ఒక ఫ్యాషన్ గా,చదివిన ప్రతీ విషయాన్నీ గుడ్డిగా నమ్మడానికో మాత్రమే ఉపయోగిస్తున్న ఈ కాలంలో బేకన్ సలహా మరింత ఆచరణీయం అనిపిస్తుంది.నిజానికి ఈ పుస్తకపఠనాన్ని సామజిక ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనంగా అంటే పూర్తి స్వార్థపూరిత చర్యగా చూస్తారు కొందరు,ఇది కూడా నిజమే.పాఠకుడు తనదైన ప్రపంచంలో తలమునకలై ఒక పుస్తకాన్ని లోతుగా అధ్యయనం చెయ్యడంలో ప్రత్యేకించిన సామజిక శ్రేయస్సు ఏదీ ఉండదు.కానీ పుస్తకాలు చదవడం ద్వారా మంచి-చెడుల విచక్షణా జ్ఞానం అలవడుతుంది,జ్ఞానం పెంపొందుతుంది..పుస్తకాలు పాఠకుని మనోవికాసానికీ దోహదపడడం ద్వారా వ్యక్తిగత స్థాయిలో మనిషికీ, తద్వారా సమాజానికీ శ్రేయస్సు చేకూరుస్తాయి.ఇదే విషయాన్ని రాబర్ట్ వాల్సర్ మరికొంత సరళంగా,ఆయన మార్కు హాస్యం మేళవించి,"పుస్తకంలో లీనమైపోయి ప్రపంచాన్ని మర్చిపోయిన పాఠకుడు,ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తలదూర్చకుండా,ఎవరితోనూ అనవసర వాదోపవాదాలు పెట్టుకోకుండా,ఎవర్నీ జడ్జి చెయ్యకుండా తన పనితాను చేసుకోవడం ద్వారా తనకు తెలీకుండానే సమాజంలో శాంతిని నెలకొల్పి ఎనలేని సేవ చేస్తున్నాడు" అంటారు.

మార్సెల్చ ప్రూస్ట్ 'డేస్ ఆఫ్ రీడింగ్' అనే పుస్తకంలో చదువుల్లో రకాలను గురించి వ్రాస్తూ,ఒక చరిత్రకారుడు గానీ లేదా మరో స్కాలర్ గానీ ఒక సత్యాన్ని కనుగొనే దిశగా పుస్తకాలను ఆశ్రయించే విధానం కేవలం ఒక ఇండెక్స్ నో,మరో చిన్న సాక్ష్యాన్నో చూసి ఆ సత్యాన్ని తమ సత్యంతో బేరీజు వేసుకోవడంలా ఉంటుందంటారు.ఈ తరహా పఠనం,కొన్ని వాస్తవికవిషయాలను (ఫ్యాక్ట్స్ ) సంగ్రహించడానికే తప్ప సత్యశోధనకు దారితీసేవిగా ఉండవని ఆయన అభిప్రాయపడతారు..వారి పరిశోధన పురోగతిలేకుండా కేవలం వారి మెదడులో అప్పటికే ఉన్న సమాచారాన్ని దానికి సంబంధించిన వాస్తవికతను ధృవీకరించుకోవడంతో ఆగిపోతుంది.ఇక 'లిటరరీ మాన్' చదువు దీనికి కాస్త భిన్నంగా ఉంటుంది..అతడు చదవాలి కాబట్టి చదువుతాడు,జ్ఞాపకముంచుకోవాలి కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకుంటాడు.అతడికి పుస్తకం,తెరవగానే రెక్కలు విప్పుకుని  సెలెస్టియల్ గార్డెన్ లోకి తీసుకువెళ్ళే ఏంజెల్ కాదు,కేవలం ఒక మాటాపలుకూ లేని జడమైన విగ్రహం మాత్రమే.ఇటువంటి చదువు పాఠకుడి ఊహాత్మకతకు పదును పెట్టేదిగా గాక అతడిలోని ఆలోచనలను ఒక ఫాల్స్ నాలెడ్జి తో నింపేస్తుంది.నిజానికి ఇది అజ్ఞానం కంటే ప్రమాదకరం.ఇది చాలా అనారోగ్యకరమైన పరిణామమని అంటూ,ఈ తరహా విద్యా విధానాన్ని ఒక 'లిటరరీ డిసీస్' గా అభివర్ణిస్తారు ప్రూస్ట్.ప్రొఫెషనల్ రీడింగ్ కీ,రీడింగ్ ఫర్ ప్లెషర్ కీ చాలా తేడా ఉంటుంది.మొదటిదానిలో నిర్బంధం ఉంది,సంతోషం పాళ్ళు తక్కువ.ఇక ప్రొఫెషనల్ రీడింగ్ లో పాఠకుడు చదువుతో స్వచ్ఛందంగా (soul కనెక్షన్) కనెక్ట్ కాలేడు.అకడమిక్ పుస్తకాలు తీర్చలేని ఈ లోటును సాహిత్యం భర్తీ చేస్తుంది.

ఇప్పుడు పుస్తకాలు చదువుకోవడం వల్ల లాభాలు చూద్దాం.ప్రూస్ట్ పుస్తక పఠనాన్ని ఒక స్నేహంగా అభివర్ణిస్తారు.వాస్తవ జీవితంలో స్నేహాలతో పోలిస్తే పుస్తకంతో స్నేహంలో నిజాయితీ పాళ్ళు మరికాస్త ఎక్కువేనంటారు కూడా.పుస్తకంతో స్నేహం చెయ్యడంలో ఉన్న అనేకానేక లాభాలను ఆయన తన 'డేస్ ఆఫ్ రీడింగ్' లో ఏకరువుపెట్టారు..ఈ స్నేహంలో స్నేహితుడు మన ఎదురుగా ఉండడు,మనం పిలిచినప్పుడు వస్తాడు,వెళ్ళిపొమ్మన్నప్పుడు ఏ రకమైన నస పెట్టకుండా వెళ్ళిపోతాడు,అతడితో ఇగో ప్రాబ్లమ్స్ ఉండవు,అతడి ఇగోని మనం బూస్ట్ చెయ్యవలసిన అవసరం లేదు,అతడి సోషల్ స్టేటస్,పరపతి,పలుకుబడి లాంటివాటిని మనం పరిగణనలోకి తీసుకోనవసరం లేదు.ఇకపోతే ఈ పుస్తకలోకంలో స్నేహితుల్లో అధిక శాతం మంది మరణించినవారే ఉంటారు.ఇది అడిషనల్ అడ్వాంటేజ్ అన్నమాట..మన బ్రతికున్నవారి లోకంలో స్నేహాలను  కాపాడుకోవడానికి నిరంతరం మన ఎనర్జీ డ్రైన్ అయిపోయేలా అతి మర్యాదలూ,తెచ్చిపెట్టుకున్న వినయ విధేయతలూ,అభిమానాలూ,ఆరాధనలూ,కృతజ్ఞతలూ వంటివి వారిపట్ల చూపించనక్కర్లేదు,ఆమాటకొస్తే పుస్తకప్రపంచంలో ఎంత గొప్పవారినైనా కలవడానికి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొనవసరం లేదు,వాళ్ళ సమయం కోసమో,వారి కరుణాదృష్టి సోకడం కోసమో క్యూలో పడిగాపులు కాయక్కర్లేదు.కానీ  నిజజీవితంలో స్నేహాలతో చాలా చిక్కులున్నాయి.ఒక స్నేహం మొదలవ్వడానికి కారణభూతమైన మన చిన్న మాటో,అభిప్రాయమో,మన వ్యక్తిత్వమో,మన గుణమో,మరొకటో ఒక వైబ్ లాంటిదేదో ఉంటుంది చూశారా,అవి మనం వదిలించుకోలేము.స్నేహితునితో గడిపే ప్రతిరోజూ అవన్నీ మనపాలిటి శిలాశాసనాలై కూర్చుంటాయి.ఆ నియమాల బరువుని మన స్నేహితుని ముందు ఒక మాస్క్ లా ధరించవలసి ఉంటుంది.ప్రతి నిత్యం మనలో మార్పుల్ని మన స్నేహితుడు అంగీకరించలేడు.పుస్తకాలతో ఆ ఇబ్బంది లేదు.ప్రతిఫలాపేక్షలేని స్వచ్ఛమైన ప్రేమను పొందే అవకాశం పుస్తకాల్లోని కాల్పనిక వ్యక్తులతో చేసే స్నేహంలో పొందే అవకాశం చాలా ఎక్కువ.అటువంటి స్నేహం మీకు అనుభవంలోకి రావాలంటే పుస్తకాలు చదవండి.హ్యాపీ రీడింగ్ :)

తొలిప్రచురణ : లీడర్ తెలుగు డైలీ : రైటర్స్ అకాడమీ సాహిత్యం పేజీ

http://www.leaderepaper.com/m5/2861243/Leader-Telugu-Daily/19-10-2020?fbclid=IwAR2fVGtZRHuxhD4ax4Ow_i4J-seEa80BYdYmIgE6-VmsdrmwlBuv6F0czO8#page/7/1

http://www.leaderepaper.com/m5/2868053/Leader-Telugu-Daily/25-10-2020?fbclid=IwAR2di_gaPK82TFw_cpOgQpf7QHI_5bXMS4sQNcj6nLRr5oJMD--Z54JrL_o#page/7/1

గూగుల్ డ్రైవ్ లింక్ : https://drive.google.com/drive/u/0/folders/1wTkghs24r54rVAdDpOrHU0OEx2tnTdYm