Thursday, January 9, 2020

Doris Lessing Stories

ఈ ఏడాది చదువు నోబుల్ గ్రహీత డోరిస్ లెస్సింగ్ (బ్రిటిష్-జింబాబ్వే రచయిత్రి) ను చదవడంతో మొదలయ్యింది..మొదలుపెట్టడం నవలలతో కాకుండా ఆవిడ కథలతో మొదలుపెట్టి మంచిపని చేశాననిపించింది..ఒక రచయిత తాలూకూ ఊహాప్రపంచంలో తనివితీరా విహరించి వచ్చాకా,ఆ కంఫర్టబుల్ జోన్ లో నుండి మళ్ళీ మరో కొత్త ప్రపంచానికి వెంటనే ప్రయాణం కట్టడం నాకు మొదట్నుంచీ కాస్త కష్టంతో కూడుకున్న పని,పాత ప్రపంచపు జ్ఞాపకాలు నెమరేసుకోడానికి కాస్త సమయం తీసుకుంటాను..కానీ డోరిస్ లెస్సింగ్ కథలు చదివినప్పుడు ఆ పరాయితనం అనిపించలేదు,ఆవిడ  శైలి పాఠకుల్ని చాలా సులభంగా దగ్గర చేసుకుంటుంది..మరో విశేషమేంటంటే,డోరిస్ అనేక మంది రచయితల్లాగా ఒకే చట్రంలో ఇమిడిపోకుండా రియలిస్టిక్ ఫిక్షన్ తో పాటు సైన్స్ ఫిక్షన్,ఫాంటసీ మొదలైన విభిన్నమైన జానర్స్ లో కూడా విశిష్టమైన రచనలు చేశారు..నేను చదివిన కథలన్నీ రియలిస్టిక్ ఫిక్షన్ జానర్ కి చెందినవి..ఈ నాలుగు పుస్తకాలూ అమెజాన్ లో కిండిల్ ఎడిషన్స్ గా లభ్యమవుతున్నాయి.ఈ కథల్లో నాకు బాగా నచ్చిన కథ An Old Woman and Her Cat.

Image Courtesy Google
An Old Woman and Her Cat :
ఉద్యోగరీత్యా ఊరూరా తిరిగే క్రమంలో అపార్ట్మెంట్ కల్చర్ లో భాగంగా గమనించిన విషయమేంటంటే,చిన్నప్పుడు ఇంట్లో పాలు అలమరాలో పెట్టి గొళ్ళెం వెయ్యడం మర్చిపోయి బయటే వదిలేస్తే దొంగతనంగా తాగేసి పోయే పిల్లులు గానీ,పరిసరాల్లో ఊరకుక్కలు గానీ ఆ నగరాల్లో ఎక్కువ కనిపించేవి కాదు..వయసుపైబడిన జంతువుల్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇంజెక్షన్లు చేసి శాశ్వత నిద్రలోకి పంపించేస్తుంటారనేది తెలిసిన విషయమే..ఇక పిచుకలు,కాకుల సంగతి సరేసరి..నగరీకరణ నేపథ్యంలో చిన్న చిన్న ఇళ్ళ స్థానంలో ఆకాశహర్మ్యాలు వెలిసిన పర్యవసానాలివి..మనం మనుషులం ఎంత స్వార్థపరులమంటే ఆ ప్రాణులకూ కూడా మనతోపాటు ఈ భూమ్మీద  జీవించే హక్కు ఉందనే చిన్న సంగతిని విస్మరిస్తాం..మన నాగరికతలో,సంస్కృతిలో,సౌకర్యాలలో వాటికీ,వాటి అల్పమైన (?) జీవితాలకూ ఎంతమాత్రం ప్రాముఖ్యత ఇచ్చే పనిలేదు.

ఈ నేపథ్యాన్నే ఆధారంగా చేసుకుని నోబుల్ గ్రహీత డోరిస్ లెస్సింగ్ 'An Old Woman and Her Cat' అనే ఒక కథ రాశారు..ఇది హెట్టీ అనే డెబ్భై ఏళ్ళ వృద్ధురాలి కథ..హెట్టీ అందరిలాంటి సాధారణమైన స్త్రీ కాదు,సాహసోపేతమైన జిప్సీ మనస్తత్వం కలిగిన విలక్షణమైన వ్యక్తి..ఆమెలోని ఈ ప్రత్యేకతను చూసే ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భర్త ఫ్రెడ్ పెన్నేఫాథర్ మధ్యవయస్సులోనే నిమోనియాతో మరణిస్తాడు..కానీ హెట్టీ స్వతంత్ర భావాల్నీ,నిలకడ లేని స్వభావాన్నీ తమకు తలవంపులుగా భావించిన ఆమె నలుగురు పిల్లలూ వృద్ధాప్యంలో ఆమెను ఒంటరిగా వదిలేస్తారు..వాడిపారేసిన బట్టల్ని అమ్ముకుంటూ స్వేచ్ఛగా సంచార జీవితాన్ని గడుపుతుంటుంది హెట్టీ.. She was enjoying herself too much, particularly the moving about the streets with her old perambulator, in which she crammed what she was buying or selling. She liked the gossiping,the bargaining, the wheedling from householders..కానీ ఆమె స్వేఛ్ఛా జీవితం కంటగింపుగా మారిన సమాజం ఆమెను అగౌరవంగా,తిరస్కారంగా చూస్తుంది..అలా ఒంటరిగా రోజులు వెళ్ళదీస్తున్న హెట్టీ కి ఒకరోజు టిబ్బీ అనే పిల్లి దొరుకుతుంది..టిబ్బీ కి హెట్టీ సాహసోపేతమైన జీవితంలో భాగంగా మారడానికి అట్టే కాలం పట్టదు..తాను పావురాళ్ళను పట్టుకుని చంపి తింటూ స్వతంత్రంగా ఉంటూ తన యజమానికి కూడా తినడానికి మరో పావురాన్ని పట్టి తెస్తుంది టిబ్బీ..టిబ్బీ రాకతో ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోయిన హెట్టీకి మరో సమస్య ఎదురవుతుంది..లండన్ కొత్తరూపును సంతరించుకునే క్రమంలో నగరనిర్మాణంలో భాగంగా పేదవాళ్ళని ఇళ్ళు ఖాళీ చేయిస్తారు,అలా వాళ్ళుండే ఇంటిని వదిలి మురికివాడలకు మకాం మారుస్తారు హెట్టీ,టిబ్బీలు..ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

ఈ కథ నాగరికుడుగా మారే క్రమంలో భూతదయకూ,భావోద్వేగాలకూ పూర్తిగా తిలోదకాలిచ్చి యంత్రంగా మారుతున్న మనిషికి పశుపక్ష్యాదులు కూడా మానవజీవితంలో అవసరమైన భాగమని గుర్తుచేస్తుంది..అనవసరమైన ఒక్క వివరమూ లేకుండా లెస్సింగ్ వాక్యంలో పొదుపు ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది,ఉదాహరణకు ఈ వాక్యాన్ని చూస్తే, హెట్టీ జిప్సీ మనస్తత్వాన్ని పరిచయం చేస్తూ,ఎటువంటి హంగులూ,ఆర్భాటాలూ లేకుండా క్లుప్తంగా She liked to see people moving about, ‘coming and going from all those foreign places’ అంటారు..హెట్టీ కి చివరి ఘడియలు ఆసన్నమయ్యాయని గమనించి టిబ్బీ మూడు రాత్రులపాటు పావురాళ్ళను పట్టుకోడానికి వెళ్ళకపోవడం,ముసలిదైపోతున్న టిబ్బీని చంపేస్తారనే భయంతో హెట్టీ సోషల్ సర్వీస్ వాళ్ళ కంటబడకుండా తను జీవించే అవకాశాన్ని త్రోసివేయ్యడం లాంటి అంశాలు కనుమరుగైపోతున్న మానవీయ విలువల్ని గుర్తుచేస్తాయి..కథలోని సంక్లిష్టతను కథనంలో చొరబడనీయకుండా జాగ్రత్తపడుతూ అతి ముఖ్యమైన అంశాలను ఎత్తి చూపే ఈ కథను మర్చిపోవడం అంత సులభం కాదు..
వస్తువో మరొకటో పాడైతే దాన్ని బాగుచేయించి తిరిగి వాడుకునే తరం నుండి,వాడుకకు పనికిరాని ప్రతిదాన్నీ విసిరిపారేసే సంస్కృతికి చేరిన మానవ నాగరికత ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతోంది..అదేంటో తెలుసా ! మనిషి కూడా ఎప్పుడో అప్పుడు అలాగే వాడుకకు పనికిరాకుండా పోతాడని..ఆ విషయాన్ని సున్నితంగా గుర్తుచేస్తూ నిద్రావస్థలో ఉన్న పాఠకుణ్ణి తట్టిలేపుతుందీ కథ.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
Hetty was sharp with the five children, complaining about their noise and mess, but she slipped them bits of money and sweets after telling their mother that ‘she was a fool to put herself out for them, because they wouldn’t appreciate it’. She was living well, even without her pension.

And he knew and deplored the fact – an institution in which the old were treated like naughty and dim-witted children until they had the good fortune to die.


Through the Tunnel :
పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపించే తల్లికి ఎప్పుడో ఒకప్పుడు ఆ చెయ్యి వదలాల్సిన సందర్భం ఎదురవుతుంది..కానీ ఆ సందర్భం హఠాత్తుగా ఎదురైనప్పుడు లోలోపల భయపడుతూనే పైకి మాత్రం ధైర్యం నటిస్తూ "ఏమీ ఫర్వాలేదు,వాడు ఎదుగుతున్నాడు" అని తల్లి తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది..మాములుగా చూస్తే ఇది అతి సర్వసాధారణమైన విషయం..కానీ ఈ మామూలు విషయమే డోరిస్ లెస్సింగ్ 'గమనింపు'లో చాలా ప్రాముఖ్యత కలిగిన విషయంగా రూపాంతరం చెందుతుంది..She was thinking. Of course he's old enough to be safe without me. Have I been keeping him too close? He mustn't feel he ought to be with me. I must be careful. She was determined to be neither possessive nor lacking in devotion అంటారు జెర్రీ అనే పిల్లవాడి తల్లి ఆలోచనల గురించి రాస్తూ..అలాగే కొంతవయసొచ్చాకా అంతవరకూ తల్లి చాటున పెరిగిన పిల్లవాడికి బయటప్రపంచంలోకి తనంతట తానే స్వేచ్ఛగా రెక్కలు విప్పుకోవాలనే ఆరాటం కలుగుతుంది..'And yet, as he ran, he looked back over his shoulder at the wild bay; and all morning, as he played on the safe beach, he was thinking of it'..మరో వైపు జెర్రీ తల్లి చేతిని ఎలాగైనా విడిపించుకుని ప్రపంచంలో తన ఉనికిని వెతుక్కుంటూ తనదైన భవిష్యత్తు దిశగా చూస్తుంటాడు..సరిగ్గా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ దగ్గరే ఈ కథ జీవం పోసుకుంటుంది..అతి సాధారణమైన విషయంగా మనం కొట్టి పారేసే లేదా మన దృష్టిని దాటిపోయే ఈ సున్నితమైన అంశాన్ని సరళమైన సంభాషణలతో కలిపి ఒక చక్కని తల్లీ కొడుకుల కథలా రాశారు లెస్సింగ్..జెర్రీ అనే పదకొండేళ్ళ పిల్లవాడు భవిష్యత్తును ఎదుర్కోడానికి సంసిద్ధమయ్యే క్రమంలో సముద్ర గర్భంలోని రహస్య సొరంగాన్ని ఈదాలనే లక్ష్యంతో ఒక సాహసం చేస్తాడు..ఈ కథలో 'టన్నెల్' ను ఆ పిల్లవాడి ట్రాన్సిషన్ కు సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేశారు..తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక ఆమెతో సేఫ్ బీచ్ కి వెళ్ళిన జెర్రీ ఆలోచనల గురించి, It was a torment to him to waste a" day of his careful self-training, but he stayed with her on that other beach, which now seemed a place for small children, a place where his mother might lie safe in the sun. అని రాస్తూ It was not his beach అని ముగించడం రచయితగా డోరిస్ లెస్సింగ్ ప్రతిభకు ఒక మచ్చు తునక మాత్రమే.


The Day Stalin Died
లెస్సింగ్ రాసిన రియలిస్టిక్ ఫిక్షన్ అంతా చాలా వరకూ ఆమె స్వానుభవాల ఆధారంగా రాసినవేనని అంటుంటారు..ఒక చారిత్రాత్మక అంశాన్ని ఆధారంగా చేసుకుని రాసిన ఈ కథను మొదటిసాటి చదివినప్పుడు సరిగ్గా అర్ధం కాలేదు,కథకు ఆధారభూతమైన లెస్సింగ్ పొలిటికల్ వ్యూస్ గురించిన కొన్ని వ్యాసాలు చదివిన తరువాత మళ్ళీ రెండోసారి చదివినప్పుడు అర్ధమైంది..అక్కడక్కడా వచ్చి పోయే లెస్సింగ్ మార్కు చెణుకులు కొన్ని మినహాయిస్తే ఈ కథ కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి..ఈ కథలో స్టాలిన్ మరణించిన రోజు కమ్యూనిస్టు పక్షపాతి అయిన ఒక యువతి జీవితంలో జరిగిన పలు సంఘటనలను వర్ణిస్తారు..వృత్తిరీత్యా రైటర్ అయిన ప్రొటొగోనిస్ట్ యొక్క ఇంటెలెక్చువల్ లెన్స్ లోనుండి మనుషుల దైనందిన జీవితాన్ని వాళ్ళ పొలిటికల్ వ్యూస్ ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని విభిన్న పాత్రల అభిప్రాయాల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు..డోరిస్ ప్రపంచ యుద్ధానంతర సమయంలో రాజకీయ పరిణామాల మూలాంశంగా రాసిన ఈ కథను జడ్జిమెంటల్గా,తన పొలిటికల్ వ్యూస్ కలపకుండా వృత్తం బయట నిలబడి చెప్పిన తీరు నన్ను ఆకట్టుకుంది.

ఆంట్ ఎమ్మా కూ ప్రొటొగోనిస్ట్ కూ మధ్య జరిగే సంభాషణలో భాగంగా రాసిన ఈ వాక్యాలు ఈ కథలో నాడిని పట్టుకుంటాయి..
Tell me, dear,’ said Aunt Emma, suddenly rougish, ‘about all the exciting things you are doing.’
Aunt Emma always says this; and always I try hard to think of portions of my life suitable for presentation to Aunt Emma.‘What have you been doing today, for instance?’
 I considered Bill; I considered Beatrice; I considered comrade Jean.
‘I had lunch,’ I said, ‘with the daughter of a Bishop.’
‘Did you, dear?’ she said doubtfully.

ఈ కథలో ఒక వాక్యం బాగా నచ్చింది,కానీ తన స్వంత పిల్లల్ని తన ప్రస్థానంలో దూరం చేసుకున్న డోరిస్ ఈ వాక్యాలు రాయడం ఆర్టు ఆర్టిస్టు వేర్వేరనే భావనను మరోసారి రుజువు చేసింది.
It’s better to love a child too much than too little.

The Old Chief Mshlanga :
డోరిస్ లెస్సింగ్ బాల్యం అంతా (1925-49 మధ్య కాలంలో) ఆఫ్రికాలోనే గడిచిన కారణంగా ఆకాలంలో నల్లజాతీయులపై జరిగిన దాష్టీకాలకు ఆమె ఒక ప్రత్యక్ష సాక్షి..అప్పుడు ప్రోగుచేసుకున్న అనుభవాల ఆధారంగా రాసిన ఈ కథలో ఆనాటి సమాజంలో వ్రేళ్ళూనుకున్న జాత్యహంకారాన్ని పధ్నాలుగేళ్ళ తెల్లజాతీయురాలైన బాలిక(డోరిస్ ?) దృష్టికోణం నుండి చూపించే ప్రయత్నం చేశారు..ఇందులో ఆఫ్రికా ఖండపు సౌందర్యాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే వర్ణనలుంటాయి..ఉదాహరణకు ప్రకృతి సౌందర్యాన్నీ,జాత్యహంకారాన్నీ ఒకే ఫ్రేములో బంధిస్తూ యజమాని జోర్డాన్ కూ,నల్లజాతీయుల తెగకు ముఖ్యుడు Mshlanga కూ మధ్య వాదన జరిగే  సందర్భాన్ని బాలిక దృష్టికోణం నుండి చూపిస్తూ,ఈ విధంగా రాస్తారు.
It was now in the late sunset, the sky a welter of colours, the birds singing their last songs, and the cattle, lowing peacefully, moving past us towards their sheds for the night. It was the hour when Africa is most beautiful; and here was this pathetic, ugly scene, doing no one any good.

ఈ కొన్ని కథలతోనే డోరిస్ లెస్సింగ్ నేనెంతో అభిమానించే రచయిత్రులు ఉర్సులా లెగైన్,మార్గరెట్ ఆట్వుడ్ ల ప్రక్కన కులాసాగా మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. :)
Happy Reading Everyone :) 

No comments:

Post a Comment