Wednesday, February 6, 2019

సాహిత్యం - ప్రశంసా,విమర్శ

ఈ మధ్య ఒక వెబ్ మ్యాగజైన్ ప్రచురించిన సాహితీ వ్యాసాలేవో చదివాను..ఆ వ్యాసాల కంటే అక్కడ వాటికి లభించిన ఆదరణ నన్ను ఎక్కువ ఆశ్చర్య పరిచింది..ఇటీవల చదివిన Ottessa Moshfegh నవలలో "School is not for artists,” “Art history is  fascism" అని ఒక ఆర్టిస్టు అంటాడు..ఈ వాదన చాలా సరైనదేనని చాలాసార్లు అనిపించినా ఒక్కోసారి మాత్రం అది 'సరైనదేనా !' అని అనుమానం వస్తుంటుంది..మన ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో లాగే దురదృష్టవశాత్తూ(?) ఆర్ట్ కి కూడా నియమ నిబంధనలు,ప్రత్యేక అర్హతలూ ఉండవు..నిజమైన  కళాకారుడు తనకూ తన సృజనకూ మధ్య హేతువాదాన్నీ,consciousness నీ జొరబడనివ్వడంటారు.
Image By Charles Joseph Travies de Villiers

నాకు తెలిసి సాహితీప్రియులు రెండు రకాలుగా ఉంటారు..కొందరు సాహిత్యానికి ఆత్మయితే మరికొందరు దాని భౌతిక స్వరూపంగా ఉంటారు..రచయితలు మొదటి వర్గం వారైతే  విమర్శకులు,ప్రచురణ సంస్థలూ,అనువాదకులూ ఈ రెండో వర్గంవారు..ఈ రెండు వర్గాలూ సాహిత్యాన్ని పెంచిపోషించడంలో తమ నిర్ణీత పరిధిలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాయి..'It is the job of thinking people not to be on the side of the executioners.' అంటారు కామూ..ఇక్కడ ఆయనన్న థింకర్స్  రచయితలైతే 'ఎగ్జిక్యూషనర్స్' చుట్టూ ఉన్న వ్యవస్థ అవుతుంది..ఈ రెండింటినీ విడగొట్టి చూడడం సమంజసమైనప్పటికీ ,ఈ రెండూ ఒకదాన్నొకటి ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ప్రభావితం చేస్తూనే ఉంటాయి..నిజానికి సాహిత్యం వ్యవస్థపై ప్రభావం చూపి తీరాలి,అలా కానప్పుడు సాహిత్యం ప్రయోజనం శూన్యం..మరి వ్యవస్థ సాహిత్యం మీద ప్రభావం చూపిస్తే ! ఇది చాలా పిచ్చి ప్రశ్న..వ్యవస్థను ప్రతిబింబించేదే సాహిత్యం కదా ! ఇక్కడ విషయం వ్యవస్థ సాహిత్యాన్ని శాసించాలని ప్రయత్నిస్తే కలిగే నష్టం గురించి.

కళాపోషణ చేసేవారికి ఉండవలసిన కనీసార్హత 'కళాభిరుచి'..మంచి సాహిత్యాన్ని అందలమెక్కించడం ఈ కళాభిరుచి ఉన్నవారి కర్తవ్యం,కాగా సాహిత్య ప్రమాణాలకు దిగువన ఉన్న రచనలు ఎటూ వాటంతటవే కాలపరీక్షను ఎదుర్కోలేక కాలగర్భంలో కలిసిపోతాయి..కళాభిరుచి పుష్కలంగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థానంలో అష్ట దిగ్గజాల్ని పోషించారు..ప్రస్తుతం రాయలు వంటి కళాపోషకుల స్థానంలో కార్పొరేట్ వ్యవస్థలో కాపిటలిస్టులు కొలువుతీరారు..'బీ ప్రాక్టికల్' మంత్రం జపించే ఈ వర్గానికి స్వప్నాలు,స్వాప్నికులూ పూర్తి గ్రహాంతర వ్యవహారం..వ్యాపారధోరణి ప్రవృత్తిగా ఉండే ఈ వర్గానికి కాల్పనిక జగత్తుపై గౌరవం కూడా తక్కువ..ఊహాప్రపంచాల్లో విహరించడమనే మాట వదిలేస్తే,కాళ్ళు భూమి మీద పూర్తిగా నిలిపి ఉంచే ప్రాక్టికల్ వర్గం ఇది..'పాపులారిటీ' స్లోగన్ గా ఉండే ఇటువంటి  వ్యవస్థ కొమ్ముకాస్తున్న సాహితీ ప్రపంచం ఆర్టిస్టులకి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది..సంపదను కొలమానంగా సాహిత్యాన్ని తక్కెడలో వేసి కొలిచే ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థ కనుసన్నలలో మెలిగే సాహిత్యం కూడా నేడు పబ్లిసిటీ,మార్కెటింగ్ ల ప్రభావానికి లోనై వెంటిలేటర్ మీదున్నట్లుంది..సూర్యుడి వెలుగుని అడ్డుకోవడం అసంభవమైనట్లే స్వచ్ఛమైన కళ,ఆలస్యమైనా ఎప్పుడో అప్పుడు వెలుగులోకి రాకమానదు,కాలగతికి ఎదురీది నిలవకా మానదు..కానీ ఈ వ్యవహారమంతటిలో నలిగిపోయేది ఆర్టిస్టులు..నిజమైన కళాకారులు తమ కళకు సరైన గుర్తింపులేక తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు..సాహితీ విమర్శ సైతం లైకులు,ఎమోటికాన్లకు పరిమితమైపోయిన ఈ టెక్నాలజీ కాలంలో సాహితీ విమర్శ చేసేటప్పుడు,కొన్ని ప్రమాణాలకు లోబడి చెయ్యడం ఎంతైనా అవసరం..

* ఏదైనా రచనను అద్భుతం/అమోఘం అని ప్రశంసించే ముందుగా రాసింది క్షుణ్ణంగా చదవాలి.
* రచయితలు స్నేహితులైతే ఆ స్నేహాన్ని కాసేపు ప్రక్కన పెట్టి రాసిన విషయాన్ని మాత్రమే చదవగలగాలి..అనగా ఆర్ట్ ను ఆర్టిస్టు నుండి వేరు చేసి చూడాలి.
* సాహితీ విమర్శ చేసేటప్పుడు డిఫెన్స్ లాయర్ గా కాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యహరించాలి.
* రచయితల కులం,మతం,భాష,జాతి,వ్యక్తిత్వం లాంటివి సాహితీ విమర్శ మధ్యలో చొరబడకూడదు..
* ఎవరు రాశారన్నదాని కంటే ఏమి రాశారన్న విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి,అనగా అథారిటీనీ,ఆత్మీయుల్నీ,మన కోటరీ వారేననే బంధు ప్రీతినీ సాహితీ విమర్శలో చొరబడనివ్వకూడదు.
* తమ సామజిక ప్రయోజనాల దృష్ట్యా 'భజనబృంద సభ్యులు'గా వ్యవహరించరాదు.
* సాహితీ అభిరుచి ఉన్నవారందరూ సాహితీవేత్తలు కాలేరు,కష్టమైనా ఈ సత్యాన్ని అంగీకరించి సాహిత్యంలో ప్రత్యక్ష పాత్ర కంటే పరోక్ష పాత్ర తీసుకుంటే చాలా మంది సాహితీ ప్రేమికులకూ,పాఠకులకు మేలు చేసినవారు అవుతారు..అనగా రచయిత అని పేరు తెచ్చుకోవాలనే తపనతో తోచింది రాసి పడేసి  పాఠకుల విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసేకంటే,అస్త్రసన్యాసం చేసి నిజమైన ఆర్టిస్టులను ప్రోత్సహించడం మేలు.
* తమ సామాజిక స్థితినీ,అధికారాన్నీ,పరపతినీ సాహిత్యాన్ని శాసించడానికో,తమ ఐడెంటిటీ క్రైసిస్ కోసమో వాడరాదు.
* చివరగా రాసే ప్రతీ అక్షరమూ సాహిత్యం కాదు..రాయడం వచ్చిన ప్రతివారూ రచయితలు కారు.

పాఠకుల్లో భావావేశాన్ని ప్రేరేపించడానికి వ్యాకరణాన్ని మించిందేదో భాషలో ఉండాలి..భాషని,ఆ భావావేశాన్ని ప్రేరేపించే  దిశగా మలచగల నేర్పు రచయిత దగ్గరుండాలి..ఏ విషయం మీదైనా ఫాక్ట్స్ అనర్గళంగా చెప్పడానికీ,ఆ విషయాన్ని కూలంకషంగా చర్చించి,సారాంశం అర్ధం చేసుకోడానికీ చాలా వ్యత్యాసం ఉంటుంది..రాసేవాళ్ళ ప్రపంచం ఎంత చిన్నదైతే ఆ రచనలో అంత డొల్లతనం వ్యక్తమవుతుంది..వివేకానికీ,జ్ఞానానికి ఉండే భేదం ఇక్కడే కనిపిస్తుంది..చదువు పేరిట ప్రస్తుతం అమలులో ఉన్న విద్యావిధానాల్లో కూడా ఈ 'ఫాక్ట్స్' నేర్పించడంలో ఉన్న శ్రద్ధ,వివేకాన్ని పెంపొందించే దిశగా లేదు..విద్యావంతుల్ని తయారుచేస్తున్న సమాజం వివేకవంతుల్ని తయారుచెయ్యడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది..చివరగా అమ్మా/అయ్యా 'క్యాపిటలిస్టు ఆర్టిస్టులూ', మీకు తోచకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులున్నాయి,లేదా ఆస్తులు ఏం చేసుకోవాలో తెలీకపోతే మరో రెండు మేడలో,నాలుగు కార్లో కొనుక్కోండి,అంతే గానీ దయచేసి సాహిత్యాన్ని మాత్రం వదిలెయ్యండి.

4 comments:

  1. ఎందుకు వదుల్తామండీ వదలం.
    దొరికిన ప్రతీదాన్నీ వ్యాపార వనరుగా మార్చుకో గలగడమే కదా వ్యాపార ప్రతిభ.

    అది సరే గాని విమర్శకు మీ సూచనలు బాగున్నాయి. అసలు తెలుగులో విమర్శ అంటూ ఉందంటారా?

    ReplyDelete
    Replies
    1. తెలుగులో విమర్శ లేకపోవడమేం ! ఉందండీ..అది మనం పీల్చే ఆక్సిజన్ లా సర్వాంతర్యామి..ఎటొచ్చీ మన కంటికి కనిపించదంతే.. :) అయినా తెలుగులో సాహితీ విమర్శ జోలికి వెళ్తే వ్యక్తిగత విమర్శల పాలవుతాం,దయచేసి నన్ను involve చెయ్యకండి గురువు గారూ :))

      Delete
  2. చివరగా రాసే ప్రతీ అక్షరమూ సాహిత్యం కాదు..రాయడం వచ్చిన ప్రతివారూ రచయితలు కారు.
    నిన్నే The Wife (2017) సినిమా చూసాను. అందులో Joan అంటుంది, "A writer has to write," దానికి జవాబుగా
    "A writer has to be read, honey," అంటుంది మరో రచయిత్రి Elaine Mozell. మనవాళ్ళకి ఇది రుచించదు. ఎందుకంటే వాళ్ళకి అంటే "రాసేవాళ్లకి చదివేవాళ్ళెప్పుడూ లోకువే." చి న

    రాసేవాళ్లందరూ కాదు, వాళ్లళ్ళో కొంతమందే అన్నది నా డిస్^క్లైమర్. హ! హ!

    తెలుగులో సాహితీ విమర్శ జోలికి వెళ్తే వ్యక్తిగత విమర్శల పాలవుతాం ! ఈ అభిప్రాయాన్ని చాలా మంది పాఠకులు, విమర్శకులు కూడా వ్యక్తపరుస్తున్నారు విమర్శని ఏ మాత్రం సహించక రచయితలు ఒక విధంగా తమ సాహిత్యాన్ని తామే సమాధి చేసుకుంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. @ అందులో Joan అంటుంది, "A writer has to write," దానికి జవాబుగా "A writer has to be read, honey," అంటుంది మరో రచయిత్రి Elaine Mozell.
      claps claps..Well said Anil garu :)

      'లోకో భిన్న రుచి' అంటుంటారు..కొంత మంది పాఠకులకు నచ్చలేదని మంచి సాహిత్యం మంచిది కాకపోదు..అలాగే కొంతమందికి నచ్చిందని అది ఉత్తమ సాహిత్యం క్రిందకీ రాదు..అది చదివేవాళ్ళ దృష్టి కోణానికి వదిలేస్తే మంచిది..ఆర్టిస్టు తన కళని సమర్ధించుకునే ప్రయత్నం చేసిన మరుక్షణం అది దాని విలువ కోల్పోతుంది..ఆర్ట్ అనేది వివరించి చెప్పేది కాదు,అలా చెప్తే అది ఆర్ట్ కాదు..వివరించి చెప్పేది,సమర్ధించుకునేది కథ కాదు..ఒక మామూలు సంభాషణ అంతే..అప్పుడెప్పుడో అన్నాను,A work of writing is an imagination job,one should not spoil it by analyzing it,especially the writer himself.

      Delete