Saturday, April 15, 2017

What we talk about when we talk about love - Raymond Carver

Image courtesy Google
అసలు ముగింపు లేని కథలు ఉంటాయా !! యెస్..ఉంటాయి..ఆ మాటకొస్తే ముగింపే కాదు,మొదలూ-తుదా లేని కథలు కూడా ఉంటాయి అని Raymond Carver కథలు చదివాకే తెలిసింది..మొత్తం పదిహేడు కథలతో కూడిన కార్వర్ రచన 'What we talk about when we talk about love' అమెరికన్ మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలకు అద్దం పడుతుంది..అమెరికన్ డ్రీమ్స్,మానవ సంబంధాలు ఆల్కహాల్ మత్తులో ఎలా చిన్నాభిన్నమయ్యాయో చూపిస్తుంది..Raymond Carver వచన ప్రయోగం చాలా సరళం..అన్ని కథల్లోనూ ఆయన ఉపయోగించిన వాడుక భాష,ఒక చక్కని కథ రాయడానికి పెద్ద పెద్ద పదాలు అవసరం లేదని నిరూపిస్తుంది...అప్పటికే కొంతమంది రచయితలు 'The language really used by men' ను సాహిత్యంలో ఉపయోగించే ప్రయోగానికి శ్రీకారం చుట్టినప్పటికీ ఆ విషయంలో పూర్తిగా సఫలీకృతులయింది మాత్రం Raymond Carver అని అంటారు..కార్వర్ లో మరో ప్రత్యేకత ఏంటంటే ఆయన పదాలను బహు పొదుపుగా ఉపయోగిస్తారు..అందుకే అప్పట్లో ప్రముఖులైన అమెరికన్ సమకాలీన సాహిత్యకారుల్లో ఈయన ఒకరిగా నిలిచారు..

మొదటి కథ Why don't you dance ? చదివాక,ఇదేంటి ఇలా అసంపూర్తిగా వదిలేశారు అనిపించింది! అసలు ఈ కథలో ముగింపు ఏమై ఉంటుంది అని నిర్ధారణ చేసుకునేదాకా ఆలోచిస్తూనే ఉన్నాను..రెండో కథ Viewfinder,ఆ తరువాత Mr.Coffee అండ్ Mr.Fixit ఇలా ఒక్కో కథా చదువుకుంటూ వెళ్తుంటే,అప్పుడు రచయిత ఏం చెప్పాలనుకున్నారో మెల్లిగా అర్ధంకాసాగింది..ముందుగా lighter vein సంభాషణల్లో మొదలయ్యే ఆయన కథలు క్రమేపీ ఒక రూపుదాల్చుకుంటాయి..అలాగే కార్వర్ కథెక్కడ మొదలుపెడతారో తెలీదు..ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ సిప్ చేస్తున్నప్పుడో,లేదా ఒక గారేజీ లోనో,నలుగురు మిత్రులు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నప్పుడో,అర్ధరాత్రి రాత్రి మంచి నిద్ర మధ్యలోనో,ఇలా చిత్రమైన సందర్భాల్లో కార్వర్ కథలు మొదలవుతాయి..అసలు ఈయన ఒక సన్నివేశాన్ని ముందుగా అనుకుని కథ రాయరేమో అనిపిస్తుంది,కార్వర్ పదాల అల్లిక మొదలుపెట్టాకే సన్నివేశం రూపకల్పన జరుగుతుంది..

కార్వర్ కథలన్నీ ముఖ్యంగా మానవ సంబంధాల చుట్టూ తిరుగుతాయి..సంక్లిష్టమైన మానవసంబంధాల్లో ఉండే 'conflict',ఐడెంటిటీ ఇష్యూస్ లాంటివి ప్రతి కథలోనూ కనిపిస్తాయి..టైటిల్ కి తగ్గట్లు ఈ సంకలనంలో కథా వస్తువు  'ప్రేమ'..ఇందులో ప్రేమ అంటే మళ్ళీ ఇప్పటి సినిమాల్లోలా హీరో-హీరోయిన్ల మధ్య ఉండే ప్రేమ ఒక్కటే కాదు..భార్య భర్తల మధ్య,తల్లితండ్రులు-పిల్లల మధ్య,ఇద్దరు స్నేహితుల మధ్య,ఇలా ప్రేమ లోని అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ ముందుకి వెళ్తాయి..ఈ కథల్లో ప్రత్యేకత ఏంటంటే,ఒక్క కథకి కూడా conclusion లేదా ముగింపు లాంటిది ఏమీ ఉండదు..ఫలానా వ్యక్తి ఇలా చేశాడు,ఫలానా ఆమె ఈ విధంగా ప్రవర్తించింది అంటూ వారిని గురించి చిన్న చిన్న సంగతులు చెప్తారు..అవి కూడా రోజువారీ జరిగే మామూలు సంఘటనల్లాగే ఉంటాయి..అతను మంచి వ్యక్తి,ఇతను చెడ్డ వ్యక్తి అంటూ జడ్జిమెంట్స్ తో కూడిన పాత్రల రూపకల్పన మనకెంత వెతికినా కనపడదు..వారి పేరు,ఉద్యోగం,రోజువారీ వ్యవహరించే పద్ధతులను గురించి చిన్న చిన్న క్లూస్ ఇచ్చి వదిలేస్తారు..ఆ పైన మనమెలా చదివితే అదే కథ...ఈ కథలు అన్నీ చదివేవాళ్ళ పర్స్పెక్టివ్ ని బట్టి రూపాంతరం చెందుతూ ఉంటాయి..No Two Persons Ever Read the Same Book అనే విషయం కార్వర్ కథలకి అన్వయిస్తే చాలా బాగా సరిపోతుంది..అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు కాకుండా,చెప్పీ చెప్పకుండా ఉండే ఈ శైలిలో కథలు రాయడం వల్ల చదివిన చాలాసేపటి తరువాత కూడా మన ఆలోచనల్లో ఆ పాత్రలన్నీ నిలిచిపోతాయి. 

1 comment:

  1. నేను చదవలేదు గానీ.
    అలా మొదలుపెట్టే కథకులే ముందుగా ఏం వ్రాయాలనుకున్నారో సరిగ్గా ప్లాన్ చేస్తూ వ్రాసేవారనుకుంటున్నాను నేను.

    ReplyDelete