సాధారణంగా రచయితలు విమర్శకు దిగినప్పుడు ఏదో ఒక పక్షం వైపు పూర్తిగా మొగ్గు చూపడం చూస్తుంటాం. కానీ ప్రూస్ట్ ఇందుకు పూర్తిగా భిన్నం. ఫ్రెంచ్ అరిస్టోక్రసీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన అటు ఉన్నత వర్గాలనూ, ఇటు సామాన్యులనూ కూడా ఉపేక్షించరు. ఆయన సూక్ష్మమైన విశ్లేషణకూ, పదునైన వ్యంగ్యాస్త్రాలకూ ఎవరూ అతీతులు కారు. బాల్బెక్ అధ్యాయం ఇందుకు ఒక చక్కని ఉదాహరణ. వర్గభేదాలకు అతీతంగా మనిషిని అతని సామాజిక హోదాతో కాకుండా, అతని ప్రాథమిక మానవ స్వభావం ఆధారంగా అంచనావెయ్యడమే ప్రూస్ట్ ప్రత్యేకత.
ప్రూస్ట్ నవల రెండో భాగం "Within the Budding Grove" చదువుతుంటే, ఉన్నట్లుండి కాళిదాసు గురించీ, కోడాక్ కెమెరా గురించీ ప్రస్తావనలొచ్చాయి. :) మార్సెల్ ప్రూస్ట్ "In Search of Lost Time" రెండో భాగమైన "Within a Budding Grove"లో ఫ్రెంచ్ అరిస్టోక్రసీలో హిపోక్రసీని తనదైన శైలిలో తూర్పారబడతారు. ఇందులో ప్రూస్ట్ రాసిన విషయాలు ఏ సమాజానికి అన్వయించుకున్నా సరిగ్గా సరిపోతాయి. ఫ్రెంచ్ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా అందులో మనుషుల గురించీ, వారి సామజిక స్థితిగతుల గురించీ ఒక ప్రేక్షకపాత్రలో నిలబడి చూసిన అనుభవాలు ఈ నవలలో అనేక చోట్ల కనిపిస్తాయి. బాల్బెక్ కి సంబంధించిన కొన్ని సంఘటనలు చదువుతుంటే ప్రూస్ట్ అసలు మనుషులను ఎంత దగ్గరగా, ఎంత ఆసక్తిగా గమనించేవారో అర్థమవుతుంది. నిజానికి ఏ రచయితకైనా ఉండాల్సిన ప్రాధమిక లక్షణం ఇదేనేమో కదా!
![]() |
| Image Courtesy Google |
మనలో చాలామందికి గొప్ప వ్యక్తుల సాంగత్యాన్ని ఆస్వాదించే అవకాశం దక్కదు. వారితో intellectual bonding ఏర్పరచుకునే అవకాశం కూడా ఉండదు. అయినాసరే, మనకంటే ప్రతిభావంతులు ఎవరూ లేరన్న నమ్మకాన్ని మాత్రం మనం వదులుకోలేం, ఆత్మాభిమానం మన కళ్ళను కప్పేస్తుంది. మన సామాజిక స్థాయి ఏదైనా, అదే గొప్పదనిపిస్తుంది. మనకంటే దిగువన ఉన్నవారిని తక్కువ అదృష్టవంతులుగా, తక్కువ సౌకర్యాలు కలిగినవారిగా చూస్తాం. అదే సమయంలో మనకంటే ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని సైతం మనకంటే తక్కువవారిగా భావిస్తాం, వారిని ఏకవచనంతో సంబోధిస్తాం, వారిని చులకన చేస్తాం, వారిపై తీర్పులు ఇచ్చేస్తాం, వారిని నిజంగా అర్థంచేసుకునే ప్రయత్నం చెయ్యకుండానే తృణీకరిస్తాం. ఇలా మనకంటే ఉన్నతంగా ఉన్నవారిని సైతం మన స్థాయికి దిగజార్చి, మనతో సమానులుగా మార్చుకోవాలని చూస్తాం. ఎందుకంటే, ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించడం కంటే, వారి గొప్పతనాన్ని మన దృష్టిలో తగ్గించుకోవడమే మన అహానికి సులభమైన మార్గం.
ఈ భాగంలో మార్సెల్ తన అమ్మమ్మతో కలిసి ఒక సముద్రతీరంలో ఉన్న రిసార్ట్ కి, అంటే బాల్బెక్ కి వెళ్తాడు. ఇక అక్కడ అనేకమంది ఫ్రెంచ్ అరిస్టోక్రసీకి చెందిన వ్యక్తులు తారసపడతారు. ఎవరో మనకు స్నేహితులుగా దగ్గరవుతారు, వాళ్ళతో మాట్లాడతాం, సమయం గడుపుతాం, వాళ్ళను ఇష్టపడతాం. కానీ ప్రూస్ట్ ఆ స్నేహాన్ని కూడా కాస్త దూరంగా నిలబడి చూడమంటారు. "మనకు ఇష్టమైన మనుషుల్ని వాళ్ళలాగే చూస్తున్నామా? లేక వాళ్ళలో లేని విషయాలను వారికి ఆపాదిస్తూ, మనం తయారుచేసుకున్న ఇమేజ్ ని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తూ చూస్తున్నామా?" అని ఆయన మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నట్లు అనిపిస్తుంది. బాల్బెక్ లో జరిగే కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నట్లుంటాయి. సెయింట్ లూ తన ఉన్నత వర్గంపట్ల తిరస్కారభావం కలిగి ఉండడం, నిస్సిమ్ బెర్నార్డ్ తనకు లేని గొప్ప పరిచయాలను కల్పించుకోవడం, బ్లోక్ లాంటి వాళ్ళ విచిత్రమైన స్నేహాలు-- ఇవన్నీ చూస్తే మనుషుల మధ్య ఉండే స్నేహం, సాన్నిహిత్యం పైకి కనిపించినంత సరళమైన విషయం కాదని అనిపిస్తుంది.
"He was one of those people who when they die, because for years they have shared a table in a restaurant on the boulevard with its news-editor, are described as “well known Paris figures” in the social column of the Radical."
ఇది చదివి ఎంతసేపు నవ్వుకున్నానో తెలీదు. ఎంత క్రూరమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది!!
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన ప్రతిభావంతుల్ని, విలక్షణమైన వ్యక్తిత్వాలు కలిగినవారిని మాకు తెలుసని చెప్పుకోవచ్చు, వారిని తమ ఇళ్ళకు విందులకు కూడా ఆహ్వానించవచ్చు, కానీ అంతమాత్రాన వారి గురించి మనకన్నీ తెలుసనుకోవడం అపోహే! రచయిత బెర్గోట్ గురించి బ్లోక్ మాట్లాడే తీరును బట్టి, అతను బెర్గోట్కు సన్నిహితుడేమో అనిపిస్తుంది, కానీ సహజంగానే బ్లోక్ కి అతడితో పెద్దగా పరిచయం ఉండదు. ఏ నాటకానికి వెళ్ళినప్పుడో, ఏ సభలోనో, మరో పబ్లిక్ గాదెరింగ్ లోనో అతణ్ణి దూరం నుంచి చూసుండొచ్చు, లేదా ఓ రెండు నిముషాలు మాట్లాడి ఉండొచ్చు. అంతే!
But with him as with all famous people, M. Bloch knew them only ‘without actually knowing them,’ from having seen them at a distance in the theatre or in the street.
సమాజంలో అంతగా గుర్తింపు లేని వర్గాల్లోని మనుషులు ప్రముఖులతో "నిజంగా పరిచయం లేకుండానే పరిచయం ఉన్నట్లుగా" మాత్రమే తెలిసినవారు, వాళ్ళని ఒక పెడెస్టెల్ మీద పెట్టి చూస్తుంటారు. వ్యక్తిగతంగా ఏమీ తెలీకపోయినా, వాళ్ళు తమకంటే చాలా తెలివైనవారనీ, వివేకవంతులనీ భ్రమపడుతూ ఉంటారు. వాళ్ళు తమ ఇంటికి భోజనానికి వస్తే, కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినంత ఆనందపడుతూ ఉంటారు. :)
But when one has lived to some extent in society, the silliness of its inhabitants makes one too anxious to live, suppose too high a standard of intelligence in the obscure circles in which people know only ‘without actually knowing.’
రాబర్ట్ సెయింట్ లూ ఒక మార్క్విజ్, అంటే అతను పుట్టుకతోనే ఫ్రెంచ్ అరిస్టోక్రసీకి చెందినవాడు. కానీ అతనికి తన సామజిక వర్గంలోని ఆర్భాటాలు, సూపర్ఫిషియల్ సంభాషణలు, నటన అంటే పరమ అసహ్యం. నిచా, ప్రూధోన్ లాంటి తత్వవేత్తల్ని చదివి, ప్రజాస్వామ్య భావాలు కలిగిన సెయింట్ లూ సామజిక సమానత్వాన్ని ఆశిస్తుంటాడు. ఇక్కడే ప్రూస్ట్ మనల్ని మన మోరల్ హైగ్రౌండ్ నుంచి అమాంతం లాగి క్రింద పడేస్తారు. సెయింట్ లూ తన ఉన్నత స్థాయిని తిరస్కరించగలగడానికి కారణం కూడా ఒకవిధంగా అతని కులీనతే అంటారు. ధనవంతుడిగా పుట్టడం వల్ల అతడికి తన హోదాను, ఉనికిని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో తనను గొప్పవాడిగా గుర్తించాలనే ఆత్రుత లేదు. అందుకే అతను అంత నిర్లిప్తంగా ఉండగలుగుతున్నాడు అంటారు. ఇది చదువుతుంటే నాకు "పారసైట్" సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. "అంత డబ్బున్నా వాళ్ళు మనతో ఎంత నైస్ గా ఉన్నారో!" అని ఒకరంటే, "అంత డబ్బుంది కాబట్టే వాళ్ళు అందరితోనూ నైస్ గా ఉంటారు" అని మరొకరు అంటారు. [A: They are rich but still nice. B: They are nice because they are rich] అంటే సెయింట్ లూ కి తన వర్గం నీడలోంచి బయటపడే స్వేచ్ఛ/ లగ్జరీ కూడా అదే వర్గం వల్ల వచ్చిందన్నది ప్రూస్ట్ చూపించే ఒక ఆసక్తికరమైన వైరుధ్యం.
ఇక ఒక పార్టీలో నిస్సిమ్ బెర్నార్డ్ ప్రగల్భాలు బాల్బెక్ భాగంలోని సరదా సంఘటనల్లో ఒకటి. ఓ ప్రక్క సెయింట్ లూ తన ఉన్నత వర్గపు హోదా నుంచి బయటపడాలని చూస్తే, మరో ప్రక్క నిస్సిమ్ బెర్నార్డ్ మాత్రం తనకు లేని హోదాను సంపాదించుకోవాలని తెగ ఉబలాటపడుతూ ఉంటాడు. మోన్సియర్ బ్లోక్ ఇంట్లో జరిగే ఒక విందులో నిస్సిమ్ బెర్నార్డ్ తనకు సెయింట్ లూ తండ్రి మార్క్విస్ ద మార్సాంటెస్ తో చాలా సన్నిహితమైన పరిచయం ఉండేదని చెబుతాడు. ఉన్నవీలేనివీ కల్పించి అదేదో గొప్ప స్నేహం అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అంతటితో ఆగకుండా మరో విందులో ప్రసిద్ధ ఫ్రెంచ్ నాటక రచయితలు కూడా ఉన్నారని గొప్పలు చెప్పుకుంటాడు. అతను చెప్పేది నిజం కాదని అక్కడున్న వాళ్ళందరికీ తెలిసినా, తెలీనట్లు ఊరుకుంటారు. కానీ అతని ప్రగల్భాలు శృతిమించడంతో, వాటికి మరికాస్త అదనంగా జోడించి అతని మీదే వ్యంగ్యంగా జోకులేస్తారు. నిస్సిమ్ అతిశయోక్తులు విని ముందుగా మోన్సియర్ బ్లోక్, "మోలియర్, రాసిన్, కార్నెయిల్ కూడా ఉన్నారు కదా!" అంటే, యంగ్ బ్లోక్ మరో అడుగు ముందుకేసి "ప్లాటస్, మెనాండర్, కాళిదాసు కూడా ఉన్నారు!" అని నవ్వుతూ చురకలేస్తాడు. బెర్నార్డ్ కి తన మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థంకాదు. "కాళిదాసు" పేరు రావడంతో నే అతను చెప్పిన గొప్పలు ఎంత కల్పితమో అందరికీ అర్థమవుతుంది. చివరికి బెర్నార్డ్ సిగ్గుపడి మిగతా సమయమంతా మాటలుడిగి మౌనంగా ఉండిపోతాడు.
మనకు లేని గొప్పదనాన్ని సంపాదించుకోవడానికి, మనకు లేని పరిచయాలను కూడా కల్పించుకుంటాం, కొత్త కథలల్లుతాం. "నాకు ఫలానా ఆయన తెలుసు" ,"మేము చాలా సన్నిహితంగా మెలగేవాళ్ళం", "మేము ఎన్నోసార్లు వాళ్ళింటికి వెళ్ళాం, వాళ్ళు మా ఇంటికి వచ్చారు, ఎన్నోసార్లు కలిసి భోజనం చేశాం" -- ఇలా లెక్కలేనన్ని గొప్పలు చెప్పుకుంటూ మనుషులు తమ సామజిక స్థాయిని, మరొకరి కీర్తినీ తమదిగా చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఎవరికీ తెలియని గతాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటివి మరీ కనిపిస్తాయి. సైన్స్, క్రీడలు, సంగీతం, సాహిత్యం, సినిమా -- ఇలా అనేక రంగాల్లో ఏ రకమైన కృషీ చెయ్యకపోయినా, ఆయా రంగాల్లో సెలెబ్రిటీస్ తో కలిసి తిరుగుతూ, వారిని అంటిపెట్టుకుని ఉంటూ, ఆ రిఫ్లెక్టెడ్ గ్లోరీ కోసం ప్రాకులాడేవాళ్ళు ఈ కాలంలో కోకొల్లలు. రోలన్ బార్త్ "మైథాలజీస్"లో ఈ టెండెన్సీ గురించి సుదీర్ఘంగా రాసుకొస్తారు. రచయితలను చదవకుండానే వాళ్ళతోనో, వాళ్ళ పుస్తకాలతోనో కలిసి ఫోటోలు దిగడం, తర్వాత సాహితీవేత్తలుగా పేరుకోసం ప్రాకులాడడం-- ఇవన్నీ మిత్ (myth) లోకే వస్తాయంటారు బార్త్.
కొన్నిసార్లు, మనిషికి తనకున్న పరిమితమైన వ్యక్తిగత ప్రయోజనాలను ఆత్మాభిమానమో, అహంకారమో ఎన్నో రెట్లు పెంచి చూపించినప్పటికీ, ఇతరులకంటే తానే ఎక్కువ సంతోషంగా ఉన్నాననే నమ్మకాన్ని కలిగించడానికి అవి మాత్రమే సరిపోవు. అలాంటి సందర్భాల్లో ఆ లోటును పూడ్చడానికి అసూయ తోడొస్తుంది. ఈ అసూయ తరచూ ఇతరులను తృణీకరించే మాటల రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తి గురించి "నాకు అతనితో పరిచయం పెంచుకోవాలనే ఆసక్తే లేదు" అని ఎవరైనా అంటున్నారంటే, దాని వెనుక ఉన్న అర్థాన్ని మనం ఇలా అనువదించుకోవాలంటారు ప్రూస్ట్ :
"అతనితో పరిచయం పెంచుకునే సామర్థ్యమూ, అవకాశమూ-- రెండూ నాకు లేవు."
అలా అంటున్న మనిషికి, తనకూ ఆ ప్రముఖ వ్యక్తికీ మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చుకోడానికి ఆ పైపై మాటలు చాలు. అంటే, ఆ ప్రముఖ వ్యక్తితో తనకు పరిచయం లేదనే వాస్తవాన్ని అంగీకరించాల్సిన అవసరం లేకుండానే, తనకు అతనితో పరిచయం అక్కర్లేదనే తన మనసును తానే సమాధానపరుచుకుంటాడు. ఆ నమ్మకమే అతనికి సంతోషాన్నిస్తుంది. అసలు ఏ మనిషి గురించైనా పూర్తిగా ఎలా తెలుస్తుంది? వాళ్ళతో కలిసి బ్రతికితే తప్ప అర్థంకాని విషయాలు, వాళ్ళతో అతిథులుగా కొన్ని గంటలు గడిపిన వాళ్ళకి తెలిసే అవకాశం ఎలా ఉంటుంది? పరిచయస్తుల మధ్య గడిపే ఆ స్వల్పకాలంలో అందరూ వాళ్ళ "బెస్ట్ బిహేవియర్"లోనే ఉంటారు కదా! ఆ కాసేపు పరిచయానికే వారిని ఋషీ, మహర్షీ, ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు అని ఎవరైనా పొగిడితే హాస్యాస్పదంగా ఉండదూ!! వాళ్ళ గురించి ఏమీ తెలీకుండా తిట్టడమో, ద్వేషించడమో కూడా ఇదేకోవలోకి వస్తుందనుకోండి!
ఈ భాగం అయిపోయాక ప్రూస్ట్ మరో ఆసక్తికరమైన చర్చకు తెరతీస్తారు. ఆయన ప్రకారం స్నేహితుల్లో మూడు రకాలుంటారట. మనుషులన్నాక ఏ లోపాలూ లేకుండా ఉండరు కదా! కానీ మనం వాళ్ళలో లోపాల్ని చూసీ చూడనట్లు వదిలేస్తాం. వాళ్ళను ప్రేమిస్తాం కాబట్టి, స్నేహాలు కోల్పోకుండా ఆ లోపాలను పట్టించుకోకుండా ఉండటం అలవర్చుకుంటాం.
మొదటి రకం: చాలా తెలివైన స్నేహితుడు. కానీ ప్రాక్టికల్ గా దేనికీ పనికిరాడు. జీవితం గురించి గొప్పగా ఆలోచిస్తాడు, అందరికంటే లోతుగా విషయాలను గమనిస్తాడు. కానీ జీవితానికి అవసరమైన బేసిక్ స్కిల్స్ ఉండవు. చిన్న చిన్న పనులు కూడా చేతకావు. ముఖ్యమైన డాక్యుమెంట్ ఏదో పోగొట్టుకుంటాడు, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళడం మర్చిపోతాడు, సమయానికి రాడు, దానికి కనీసం క్షమాపణ కూడా చెప్పడు. సోషల్ స్కిల్స్ ఉండవు, పైగా తాను టైమ్ చూసుకోనని ఒక రకమైన గర్వంతో నవ్వుతాడు. అతని తెలివితేటలు మనకు నచ్చుతాయి కానీ మెదడు మబ్బుల్లో ఉండే అతని నిర్లక్ష్యం మనల్ని చాలా విసిగిస్తుంది. అయినా అతడి స్నేహం మాత్రం వదులుకోము.
రెండో రకం: చాలా మంచివాడు...కానీ మనల్ని వదలడు. మనకి స్పేస్ ఇవ్వడు. చాలా సున్నితమైనవాడు, మర్యాదస్తుడు, మృదుభాషి-- మన ముందు ఎప్పుడూ మంచి మాటలే చెబుతాడు, కానీ మన గురించి అతని మనసులో అనేక కంప్లైంట్స్ ఉంటాయి. ముఖ్యంగా అతనికి కావాల్సింది మన సాంగత్యం. ఒకవేళ మనం "నాకు కొంచెం ఏకాంతం కావాలి" అన్నా అతనికి అర్థంకాదు. మీరు అంత ఎంగేజ్మెంట్ తో అలసిపోయినా, వెళ్ళిపోవాలనుకున్నా, అతను మిమ్మల్ని వదిలిపెట్టడు. ఇక్కడ స్నేహం కాస్తా పొస్సెస్సివ్నెస్ గా మారుతుంది. "నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నాతోనే ఉండాలి, ఇంకెవరితోనూ మాట్లాడకూడదు" అనే కంట్రోలింగ్, ఎంటైటిల్మెంట్ ఉంటుంది.
మూడో రకం: "నేను ముక్కుసూటి మనిషినీ, ఉన్నదున్నట్లు మాట్లాడతాను" అంటూ పదేపదే మనసు గాయపరిచేవాడు. ఇతను తనను తాను చాలా నిజాయితీగలవాణ్ణని భావిస్తాడు. మీ గురించి మంచైనా, చెడైనా అన్నీ చెబుతాడు. చెప్పాల్సిన అవసరంలేని విషయాలు కూడా పనిగట్టుకుని చెబుతాడు. మీకు బాధ కలుగుతుందని తెలిసినా చెప్పడం మాత్రం మానడు. మన బాధపడితే, చాలా ప్రశాంతంగా "నేనింతే!" అంటాడు. తన క్రూరత్వాన్ని కూడా నిజాయితీ పేరుతో సమర్థించుకోవడం అతని ప్రత్యేకత.
బ్లోక్ ను చూస్తే ఈ మూడు రకాల స్నేహితుల లక్షణాలు అతడిలో కొన్ని కనిపిస్తాయి. అతను మనసు కష్టపెట్టుకుని రాత్రంతా ఏడవగలడు. ఒకరితో ప్రేమగా మాట్లాడి, అతను లేని సమయంలో మళ్ళీ అతన్నే తిట్టనూగలడు. అలాగని అతని భావోద్వేగాలు నకిలీవనుకోవాల్సిన అవసరం లేదు, అతని బాధ స్వచ్ఛమే! అతని ప్రేమా స్వచ్ఛమే! కానీ అతని ప్రతి భావోద్వేగంలోనూ "కేంద్రం" అతనే! ఇతరుల గురించి అతడికి పట్టదు. కానీ అతను తన గురించి ఇతరులేమనుకుంటున్నారో చాలా పట్టించుకుంటాడు. సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, గుర్తింపూ కావాలి. అందుకే ఇతరుల్లో అతనికి నచ్చని అహంకారం, స్నాబిష్నెస్ బహుశా అతనిలోనే ఉండొచ్చు అంటారు ప్రూస్ట్.
ప్రూస్ట్ లో ప్రత్యేకత ఏంటంటే, ఆయన మనుషులను నాన్ స్టాప్ గా ఎగతాళి చేస్తూనే ఉంటారు. కానీ ఆ క్రమంలో వాళ్ళను కామెడీ కారెక్టర్లలా కాకుండా, వాళ్ళ ప్రవర్తన వెనుక భయాన్నీ, అహంకారం వెనుక అభద్రతల్నీ కూడా చూపిస్తారు. అతిగా మాట్లాడటం వెనుక గుర్తింపు కావాలనే కోరిక ఉంటుంది. అతిగా ప్రేమించడం వెనుక ఒంటరిగా మిగిలిపోతాననే భయం ఉంటుంది. అందుకే ప్రూస్ట్ పాత్రలు మొదట్లో నవ్వు తెప్పించినా, వెనువెంటనే ఆలోచనలో కూడా పడేస్తాయి. ఎక్కడో ఒకచోట, ఆ మనుషుల్లో మనల్ని మనం తప్పకుండా ఐడెంటిఫై చేసుకుంటాం.
ఇదంతా రాసి చివరకు ప్రూస్ట్ అతి ముఖ్యమైన ప్రశ్న వద్దకు వస్తారు-- "స్నేహాలు మనల్ని మనం మెరుగుపరుచుకోడానికి ఉపయోగపడతాయా?" స్నేహాలు నిస్సందేహంగా ఆనందాన్నిస్తాయి. కానీ ఇతరుల ఆలోచనలూ, భావజాలాలూ, వ్యక్తిత్వాల ప్రభావంలో పడి మనకు తెలీకుండానే అవే స్నేహాలు మనల్ని "మన" నుంచి దూరం చేస్తాయి. ప్రూస్ట్ వాదన ఏంటంటే, మనిషి వ్యక్తిత్వం మెరుగులు దిద్దుకునేది, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే! ఎవరూ మనతో మాట్లాడనప్పుడు, మన దృష్టిని వేరొకరి వైపు తిప్పాల్సిన అవసరం లేనప్పుడు, మన జ్ఞాపకాల్లో లోతుగా వెళ్ళగలిగినప్పుడు, మనలో మనకే తెలియని పార్శ్వాలను గమనిస్తున్నప్పుడు, మన అంతఃప్రపంచపు తలుపులు తెరుచుకుంటాయి. అక్కడే కళ మొదలవుతుంది. అందుకే "Within a Budding Grove" లో ప్రాముఖ్యత లేనివిగా కనిపించే చిన్న చిన్న సంఘటనలు కేవలం సరదా సంఘటనలు కావు. మనుషుల మధ్య సాన్నిహిత్యం ఎప్పుడూ పూర్తి నిజం కాదు. దానిలో మన కోరికలు, భయాలు, అహంకారం-- ఇవన్నీ అనేకం ఉంటాయి. మనకు మనమే చెప్పుకునే అబద్ధాలు, భ్రమలూ కూడా ఉంటాయి.
ఏదేమైనా మనిషి సంఘజీవి, అందుకే స్నేహం అందమైనదే. కానీ కళాకారుడు తనలోని సృజనాత్మకతను వెలికితియ్యాలంటే మాత్రం ఏదో ఒక దశలో ఆ సమాజం నుంచీ, దానితో ముడిపడ్డ సాంగత్యాలన్నిటి నుంచీ కొంచెం దూరం జరగాలి. ఇతరులతో మాట్లాడితే ప్రపంచం గురించి చాలా తెలుసుకోవచ్చు, కానీ మన గురించి మనం తెలుసుకోవడానికి మాత్రం కొంతసేపు మనతో మనమే గడపాలి. బహుశా అందుకే ప్రూస్ట్ దృష్టిలో స్నేహం ఒక అందమైన భ్రమ, మనల్ని వెచ్చగా ఉంచే భ్రమ, మన ఒంటరితనాన్ని కొంతసేపు మర్చిపోయేలా చేసే భ్రమ.

No comments:
Post a Comment