Monday, October 26, 2026

A Life Among Words

చిన్నప్పటి నుంచీ అక్షరాల మధ్య బతకడం అంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?!!

పదాలతో కలిసి పెరగడం, అక్షరాల వెనుక సంకేతాల్ని ఛేదించే ప్రయత్నం చెయ్యడం, ఒక పదానికి ఉన్న ఒక్క అర్థంతోనే ఆగిపోకుండా, కాంటెక్స్ట్ కి తగ్గట్టు దాని పర్యాయపదాలు వెతుక్కుంటూ టెక్స్ట్ లోతుల్లోకి వెళ్ళడం...ఒక వాక్యం మనల్ని అంతగా ఎందుకు కదిలిస్తుందో, ఒక మెటఫోర్ ఏళ్ళు గడిచిపోతున్నా మనల్ని ఎందుకు వెంటాడుతుందో, ఒకప్పుడు చదివిన వాక్యమే జీవితంలో మరో దశకి వచ్చాక, సరికొత్త అర్థంతో ఎందుకు కనిపిస్తుందో... ఇవన్నీ మనిషి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఊహించగలరా!!

నాకు ఊహ తెలిసినప్పటినుంచీ, అంటే సుమారు నేను ఐదో, ఆరో ఏట నుంచీ పుస్తకాలు చదువుతున్నాను. సాహిత్యం, విమర్శ లాంటి పెద్దపెద్ద పదాలకు అర్థం తెలీకముందే, "సెమియాటిక్స్, డీకన్స్ట్రక్షన్ ప్రిన్సిపుల్స్, ఫిలసాఫికల్  డిస్కోర్స్, Instability of Meaning"-- లాంటి విషయాలు బొత్తిగా పరిచయం కాకముందే  అక్షరాల కెలెడోస్కోప్ ద్వారా ఓ చిన్నపిల్ల ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టింది. ఒకప్పుడు పుస్తకాలు నాకు ఏకాంతంలో తోడొచ్చే నేస్తాలు మాత్రమే. కానీ క్రమేపీ అవే అక్షరాలు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థంచేసుకోవడానికి, మెల్లిగా నాకు నేనే అర్థంకావడానికీ, మాటల్లో పెట్టలేని అనుభవాలకు ఒక స్పష్టమైన రూపం ఇవ్వడానికీ దారులు వేశాయి.

వయసు పెరిగేకొద్దీ, ఆ పఠనం మరికాస్త లోతుల్ని వెతుక్కుంటూ వెళ్ళింది. గాయత్రి చక్రవర్తి స్పివాక్, డెరిడ్డా, ఫూకో, రోలన్ బార్త్‌, సుసాన్ సొంటాగ్, బోర్హెస్ , వాల్టర్ బెంజమిన్, పిరాండెల్లో లాంటి వాళ్ళంతా నా మానసిక ప్రపంచంలోకి ప్రవేశించారు. వారి ఆలోచనలను చదివాను, లోతుగా అధ్యయనం చేశాను, వాటిపై వ్యాసాలు రాశాను. వారి వాదనలతో ఏకీభవించిన సందర్భాలే కాదు, తలపడిన సందర్భాలూ ఉన్నాయి. వీటన్నిటి వెనుకా ఉన్న లక్ష్యం ఒక్కటే... "Search for Meaning". అసలీ "అర్థం" ఎలా పుడుతుంది? మనం సత్యమని నమ్మేవాటిని మనకు తెలియకుండానే కొన్ని భావజాలాలూ, వ్యవస్థలూ ఎలా ప్రభావితం చేస్తాయి? మనం ప్రపంచాన్ని మన దృష్టితో మాత్రమే చూస్తున్నామనుకుంటాం. కానీ మన చూపును సైతం భాష, సంస్కృతి, జ్ఞాపకం, చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మౌల్డ్ చేస్తూ, కన్స్ట్రక్ట్ చేస్తూ, రిఫైన్ చేస్తూ  ఉంటే?!! చూసే కళ్ళు మనవేనా? అసలు చూసే మనిషి మనమేనా? ఇలాంటి ప్రశ్నలు మొదలయ్యాయి.

ఒక దశలో నేను పుస్తకాలు చదివే వ్యక్తి నుంచి మొత్తం ప్రపంచాన్నే ఒక పుస్తకంలా కుదించుకుని చదివే వ్యక్తిగా ఎప్పుడు మారిపోయానో కూడా తెలీదు.

ఒక సంభాషణ నాకు పూర్తి పాఠంలా లేదా టెక్స్ట్ లా వినిపిస్తుంది. ఒక నిశ్శబ్దం వెనుక ఏదో అర్థం ఉన్నట్టనిపిస్తుంది. ఒక చూపు, మొహంలో ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక వ్యక్తి ఎంచుకునే పదం, చెప్పకుండా దాటవేసే విషయం--వీటన్నింటిలోనూ చదవతగ్గ విషయం ఏదో ఒకటి కనిపిస్తుంది. అన్నిటికంటే మనుషులు చెప్పే కథలే కాదు, తమ గురించి తాము చెప్పకుండా వదిలేసే కథలు మాలాంటి వాళ్ళకి మరింత ఆసక్తిగా అనిపిస్తాయి.

ఈ చదవడమనే వ్యసనం మెల్లిగా సంభాషణల్లో జొరబడుతుంది. ఒకరు మనతో ఏదో విషయం మాట్లాడుతుంటారు, మెదడు దాన్ని ఉన్నదున్నట్టుగా వినడానికి అంగీకరించదు. అలవాటుగా మెరుపు వేగంతో డీకోడ్ చెయ్యడం మొదలుపెడుతుంది. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పద్ధతిలో, న్యూరోలాజికల్ పాత్ వేస్ లో వెన్ డయాగ్రామ్స్ గీయడం మొదలుపెడుతుంది. ఎదుటి వ్యక్తికి అసలు మనం వింటున్నామా లేదా అని అనుమానం వస్తుంది. ప్రశ్నిస్తే, సమాధానం పేలవంగా రెండు మూడు మాటల్లో బయటపడుతుంది. వాళ్ళు చెప్పిన విషయాన్ని ఎన్ని మల్టిట్యూడ్స్ లో విన్నామో, వారికి చెప్పడం అసంభవమనిపిస్తుంది. భావవ్యక్తీకరణ అలా దారుణమైన ఫెయిల్యూర్ తో ముగుస్తుంది. ఇంకా వర్స్ ఏమిటంటే, కొన్నిసార్లు తేలికపాటి జోక్ తో, సంభాషణను డైల్యూట్ చేసేసి అక్కడ్నుంచి వాక్ ఔట్ చెయ్యడం తేలికనిపిస్తుంది.

బహుశా సాహిత్యంతో జీవితాంతం సావాసం చేస్తే మనకు అలవడేది ఇంతే కావొచ్చు-- కంటికి కనిపించిన దానితో తృప్తిపడకుండా, దానికావల ప్రపంచాల్లో ఉన్నదేమిటో తెలుసుకోవాలనే తపన, సరళమైన ప్రతీదాన్నీ కాంప్లెక్సిటీగా మార్చేస్తుంది. అన్నిటినీ మైక్రోస్కోపిక్ లెన్స్ తో చూడడం, అందరూ అంగీకరించే సత్యాలను సైతం ప్రశ్నించడం, ఒక విషయానికి ఒకటికి మించిన అర్థాలు ఉండొచ్చని, కాంటెక్స్ట్ కోసం వెతుక్కోవడం....ఇదీ ఒక వరమే గానీ, కొన్నిసార్లు విపరీతమైన అలసట కూడా!

ఎందుకంటే, ప్రతిదాన్నీ విశ్లేషించే మనసుకు విశ్రాంతి అరుదు. ఒక మాటను విన్నప్పుడు దాని అర్థంతో పాటు, ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశం కూడా గుర్తుకొస్తుంది. ఒక సంఘటనను చూసినప్పుడు అది కనిపిస్తున్నట్టుగానే కాక, మనం దానికి ఏదైనా అర్థాన్ని ఆపాదిస్తున్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే , కొన్నిసార్లు జీవించడం కంటే, జీవితాన్ని అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. Or, we can say, Deciphering signs!??

నాకు సుసాన్ సొంటాగ్‌ చాలా సన్నిహితంగా అనిపించడానికి కారణం బహుశా ఇదే కావచ్చు. తన బయోగ్రఫీలో ఆమె మనస్తత్వం గురించి రాసుకొస్తారు. ఆవిడ జీవితమంతా, ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చూడడాన్ని నిరాకరిస్తూనే బ్రతికేసింది. కళను, సాహిత్యాన్ని, ఫోటోగ్రఫీనీ, ఆలోచనలను కేవలం ఆస్వాదించి వదిలేయకుండా, వాటి గురించి మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలనే ఆవిడ ఆరాటంలో నా స్వభావానికి దగ్గరగా అనిపించే విషయం ఏదో ఉందనిపిస్తుంది. 

ప్రస్తుతం నేను మార్సెల్ ప్రూస్ట్‌ ను చదువుతున్నాను కదా! ఏళ్ళ తరబడి  అనేకమంది తత్వవేత్తల్నీ, రచయితల్నీ చదివిన తరువాత, ఇప్పుడిలా చివరకు ప్రూస్ట్ దగ్గరకు రావడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన తొందరపడనివ్వరు. ఒక అనుభవాన్ని వెనువెంటనే అర్థం చేసుకున్నానని అనుకోనివ్వరు. పరిగెడుతున్న మెదడుని పట్టుకుని ఆపేసి, తన పొడవాటి వాక్యనిర్మాణాలతో ధ్యానంలో కుర్చోపెడతారు. "Don't runaway from yourself my dear... Sit with your feelings first" అంటారు. జ్ఞాపకం, కోరిక, అసూయ, ప్రేమ, కళ, మనుషుల గురించి మనం మన మనసుల్లో నిర్మించుకునే ఇమేజెస్-- వీటన్నింటినీ మరోసారి నిదానంగా పరిశీలన చెయ్యమంటారు.

ఒక కాఫీ సిప్ చెయ్యడంలాంటి చిన్న అనుభవంలోనే విశాల విశ్వమంతా దాగి ఉంది చూడమంటారు. ఒక ముఖమో, చిత్రపటమో, ఒక రుచో, అనుకోకుండా మనసులో మెదిలిన ఒక జ్ఞాపకమో-- ఇవి పైకి ఎంత స్వల్పమైనవిగా కనిపించినా, వాటి లోపల ఒక పూర్తి స్థాయి జీవితానుభవం కనిపిస్తుంది. అదే బార్త్ అయితే ఇక్కడ చదవడానికి ఎన్ని సంకేతాలను కనుక్కునేవారో!! డెరిడ్డా  ఒక అర్థం దగ్గరే ఆగిపోవద్దని గుర్తుచేసేవారేమో!! కానీ ప్రూస్ట్ మాత్రం తొందరపడరు, తనదైన తీరుబడి పేస్ లో నెమ్మదిగా, మరోసారి చూడు, మరికొంతసేపు ఆగి చూడు అని చెబుతున్నట్టుంటారు.

నాకు అలా ఆగడం అలవాటైంది. మళ్ళీ చూడడం, మళ్ళీ వినడం అలవడింది. ఇది నా స్వభావానికి పూర్తి విరుద్ధం.

నిజానికి నాకు సాహిత్యమంటే ఇష్టం కాబట్టి పుస్తకాలు చదువుతున్నానా, లేక పుస్తకాలు చదువుతూ పెరిగినందువల్లనే నేను జీవితాన్ని ఈ విధంగా చూడడం అలవాటైందా అన్నది ఇప్పటికీ నాకు స్పష్టంగా తెలీదు. బహుశా ఆ రెండింటి మధ్య గీత ఎప్పుడో చెరిగిపోయి ఉంటుంది. ఊహ తెలిసినప్పటినుంచీ మన జీవితంలో భాగమైన విషయం, ఒక దశలో అలవాటుగా మిగలదు. అది మన ప్రాపంచిక అనుభవాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మనం ప్రపంచాన్ని చూసే చూపులోనూ, మనుషులతో మెలిగే తీరులోనూ, మనకు మనం చెప్పుకునే కథల్లోనూ కలిసిపోతుంది. అలాంటప్పుడు టెక్స్ట్ ఎక్కడ ముగుస్తుందో, నా వ్యక్తిత్వం ఎక్కడ మొదలవుతుందో చెప్పడం కష్టం.

పుస్తకాల ద్వారా నేను ఎన్నో జీవితాలను జీవించాను. కానీ ఈ చదవడం ఎప్పటికీ పూర్తిచేయలేనిపిస్తుంది. చదవాల్సిన పుస్తకాలు infinite గా ఉండటం ఒక్కటే కారణం కాదు. ప్రపంచం కూడా ప్రతిరోజూ కొత్త అర్థాలతో కనిపిస్తుంది,  నిన్న అర్థమైన విషయం ఈరోజు మరోలా కనిపిస్తుంది, ఒకప్పుడు పట్టించుకోని వాక్యం ఇప్పుడు మళ్ళీ వెంటాడుతుంది, ఒకప్పుడు ప్రక్కన పెట్టిన పుస్తకం, జీవితంలో మరో మలుపు దగ్గర నన్ను తిరిగి పిలుస్తుంది. ఇదొక వ్యసనం. కొందరు మొదట ప్రపంచాన్ని చూడటం నేర్చుకుని, దాన్ని వర్ణించడానికి పుస్తకాల దగ్గరకు వస్తారు. నేను మాత్రం మొదట పుస్తకాల దగ్గరకు వచ్చాను. అప్పటి నుంచీ ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటూనే ఉన్నాను. 📚📖

Photo : In Wayanad, 2017.

No comments:

Post a Comment