Thursday, November 2, 2023

బహుముఖ ప్రతిభాశాలి సుబ్బరామయ్య గారు

సుబ్బరామయ్య గారికున్న పలుకుబడి అంతా ఇంతా కాదు. రైతుకుటుంబంలో పుట్టినప్పటికీ బాగా చదువుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి, స్వల్పకాలంలోనే పరిశ్రమలు కూడా స్థాపించి తానే మరి కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకొని మారుతున్న కాలంతో బాటుగా ఆధునికతను అందిపుచ్చుకుని సమాజంలో అనతికాలంలోనే ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

Image courtesy Google 

కానీ ఎంత కీర్తి ప్రతిష్ఠలార్జించినా, తరతరాలూ కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించినా సుబ్బరామయ్య గారిని లోలోపల ఏదో తెలీని వెలితితో కూడిన అసంతృప్తి తినేస్తూ ఉండేది. తన రంగంలో ఇక సాధించడానికేమీ మిగలకపోవడంతో కొందరి మిత్రుల సలహా మేరకు ఆధ్యాత్మికత బాట పట్టారు. "ఉన్నదొకటే జిందగీ" అని నమ్మే సుబ్బరామయ్యకూ, దేవుడికీ మొదట్నుంచీ పెద్దగా పొసగకపోయినా కాలక్షేపంకోసమో, కుతూహలం కొద్దీనో సాధుసంతుల సాంగత్యంలో గడుపుతూ ఆ నోటా ఈ నోటా విన్న ఆధ్యాత్మిక విషయాలను అందిపుచ్చుకున్నారు. మన సుబ్బరామయ్య గారికున్న వాక్చాతుర్యం ఎంతటిదంటే ఆయన పులిని చూపించి పిల్లి అని నమ్మబలికినా జనం ఇట్టే నమ్మేసేవారు. ఆయన సభల్లో ఆధ్యాత్మిక అంశాలపట్ల ఎంత సాధికారికంగా మాట్లాడేవారంటే విన్నవాళ్ళెవరైనా ముక్కున వేలేసుకుని "ఈయన సమస్త వేదాలూ ఔపాసన పట్టేశాడ్రోయ్" అనుకునేవారు. సుబ్బరామయ్యగారు ఆ ముఖస్తుతులనూ, కరతాళ ధ్వనులనూ కాదనకుండా ముసిముసి నవ్వులతో సవినయంగా స్వీకరించేవారు. కొంతకాలానికి ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సభ జరిగినా "ఆధ్యాత్మిక జీవి" సుబ్బరామయ్య గారే ముఖ్య అతిథి.

ఇలా కొంత కాలం గడిచింది. సుబ్బరామయ్యగారిలో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. ఆధ్యాత్మిక రంగంలో తనను యెరుగనివారు లేరు. ఆయనకు సహజంగానే ఆ వాతావరణం బోర్ కొట్టసాగింది. ఈలోగా పక్కూరిలో ఏదో సాహితీ సభ జరుగుతోందని విని కండువా మీదేసుకుని ఆ సభకు బయలుదేరారు ఖాళీగా ఉన్న సుబ్బరామయ్యగారు. ఆ కొత్త వాతావరణంతో బాటు సాహితీ సమూహాల్లోని విప్లవాత్మక ధోరణులు, వింత పోకడలూ సుబ్బరామయ్యగారిని అమితంగా ఆకర్షించాయి. ముందుగా ఒకరిద్దరు ప్రముఖులతో మొదలైన పరిచయాలు క్రమేపీ ఆయన ఇంట్లో జరిగే సాహితీ సమావేశాలూ, ఆతిథ్యాలతో విస్తృత రూపం దాల్చాయి. త్వరలోనే ఆయన  పేరు సాహితీ సమూహాల్లో మారుమ్రోగసాగింది. సుబ్బరామయ్య గారింట్లో కుక్కు తయారుచేసే మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు, చట్నీలూ, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే మినప గారెల గురించి సాహితీ సంఘాల్లో పుంఖానుపుంఖాలుగా చర్చించుకునేవారు. సాహిత్యంతో పెద్దగా పరిచయం లేని సుబ్బరామయ్యగారు మాత్రం రచయితలు, కవులతో కూర్చుని వారు చెప్పే కబుర్లు పొల్లుపోకుండా వినేవారు. అలా సాహిత్యం గురించి, గొప్ప గొప్ప పుస్తకాల గురించీ ఆ నోటా ఈ నోటా సమాచారం తెలుసుకునేవారు. పుస్తకాల్లో నుండి వాళ్ళూ వీళ్ళూ కోట్ చేసే వాక్యాల్ని అందిపుచ్చుకుని మరొకరితో మరో సందర్భంలో వాడి ఆయనకు సహజంగానే ఉన్న వాక్చాతుర్యంతో సాహిత్యం గురించి తనకు సర్వమూ తెలుసని నమ్మబలికేవారు. రైట్ వింగు, లెఫ్ట్ వింగుల్లో ఇందులో చేరాలా అని లాభనష్టాలు బేరీజు వేసుకోగా, సాహితీవర్గాల్లో బాగా పాపులర్ అయిన లెఫ్ట్ వింగులో చేరడం లాభదాయకమని భావించి "లెఫ్టిస్టు" టాగ్ తగిలించుకుని తిరగసాగారు. సభల్లో మైకు దొరికినప్పుడల్లా "దేవుడు, దెయ్యం ట్రాష్" అంటూ ఆధ్యాత్మికత మీద విరుచుకుపడి సాహితీ సమూహాల జయజయధ్వానాలు అందుకునేవారు.

ఇలా కొంతకాలం గడిచింది. కాలంతో బాటు ఈ రైటు, లెఫ్టు తూకాలు మారసాగాయి. మళ్ళీ వెంటనే రైటు వైపు మొగ్గలేరు కాబట్టి సాహితీ సమూహాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న సుబ్బరామయ్య గారు ఖాళీగా ఇంట్లో ఉండడం ఇష్టంలేక దేశాటనకు బయలుదేరారు. తిరిగొచ్చిన వెంటనే సాహితీ సమూహాల్లో తన ప్రాభవం తగ్గుతోందని గ్రహించారు. మిత్రులకు తన ఇంట్లో తిన్న ఇడ్లీ, దోశలనూ, వాటిల్లో తాను మరచిపోకుండా వేసిన ఉప్పునూ గుర్తుచేశారు. కృతజ్ఞతాభారంతో కృంగిపోయి "మీరు గొప్ప సాహితీవేత్త" అన్నారొకరు. మీలాంటి "సహృదయులైన విమర్శకులు అరుదు" అన్నారు మరొకరు. "మీరు చేసిన సాహితీ కృషి అజరామరం" వంతపాడారు వేరొకరు. ఆ విధంగా సుబ్బరామయ్య గారు "సాహిత్య జీవి"గా మిగిలిపోయారు. ఎటొచ్చీ ఆయన చేసిన "సాహితీ కృషి"కి ఇడ్లీలూ, దోశలూ తప్ప ఎటువంటి ఆధారాలూ లేవు.

కొంతకాలం తరువాత సహజంగానే పాతనీటిని తోసేస్తూ కొత్తనీటి ప్రవాహం వెల్లువెత్తింది. తన వాక్పటిమ  వారిముందు పనిచేయకపోవడంతో సుబ్బరామయ్యగారిలో అసహనం పెల్లుబికింది. దాంతో "సాహిత్యం ఉత్తి డొల్ల", "ఈ రచయితలు తామేదో సర్వాంతర్యాములు అనుకుంటారు", "పుస్తకాల్లో ఏముందండీ, ఒట్టి బూడిద" అంటూ మేకపోతు గాంభీర్యంతో ప్లేటు ఫిరాయించారు సుబ్బరామయ్య గారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. "సాహిత్యం వాళ్ళూ , ఆధ్యాత్మికం వాళ్ళూ ఎవరైనా ఇంటికి వస్తే అయ్యగారు ఇంట్లో లేరని చెప్పు" అని తన పనివాడికి పురమాయించి, ఈసారి తన ప్రతిభను నిరూపించుకోడానికి ఏ రంగం మీద దృష్టిపెడితే బావుంటుందా అని ఆలోచిస్తూ తలపంకించారు సుబ్బరామయ్యగారు. 

ఇందులో పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కాదు. 


No comments:

Post a Comment