"క్లాసిక్స్ గురించి అందరూ అత్యుత్సాహంగా మాట్లాడతారు గానీ నిజానికి ఎవరూ చదవరని" తనదైన శైలిలో చమత్కరిస్తారు ఆస్కార్ వైల్డ్. పుట్టినప్పటినుండీ ఆనోటా,ఈనోటా వినీ వినీ నోట్లో నానిపోయి, విలువ కోల్పోయి వీగిపోయిన అనేక సార్వత్రిక పదాల్లో క్లాసిక్స్ కూడా ఒక భాగం. రచయితల్లో 'షేక్స్పియర్' పేరు కూడా ఒకవిధంగా అటువంటిదే.
Image Courtesy Google |
అకడెమిక్స్ లో భాగంగా కొంత చదవడం వల్ల ఆయన కథలు పరిచయమే. అయినప్పటికీ ఆయన లిరికల్ ప్రోజ్ తో పరిచయం లేదు. చాలా వరకూ ఆయన నాటకాలన్నీ కథలుగానే చదువుకున్నాను. మళ్ళీ చాలా కాలానికి నేను చదివిన రచన 'A Midsummer Night's Dream'. మనసులో ఈ ఆలోచన వచ్చిందే తడవు ఎడాపెడా రోజుకో పుస్తకం నమిలి పారెయ్యడానికి షేక్స్పియరియన్ ఇంగ్లీషు అంత సులభమేమీ కాదు. అందువల్ల ఆయన్ని ఎలా చదవాలి అన్న విషయమై కొంత గూగుల్ రీసెర్చ్ చెయ్యాల్సొచ్చింది. షేక్స్పియరును చదవడం ఆంగ్లం మాతృభాషగా ఉన్నవాళ్ళకు సైతం చాలా కష్టమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిప్రాయాలు చూసినప్పుడు అర్థమైంది. నిజానికి షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు. ప్రచురణకు తగిన ఉపకరాలు అందుబాటులో లేని కాలంలో సాహిత్యం లిఖితరూపంలో కాకుండా శబ్దరూపంలోనూ, దృశ్యరూపంలోనూ లేదా నాటకప్రదర్శనల ద్వారానూ వ్యాప్తిచెందే కాలానికి చెందినవి ఈ కథలు. అందువల్ల ఈ కథలన్నీ శబ్ద ప్రధానమైనవి. 'కోరా' వెబ్సైటులో "షేక్స్పియర్ ను ఎలా చదవాలి ?" అనే ప్రశ్నకు ఒక స్త్రీ భలే సమాధానం ఇచ్చారు. షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు కాబట్టి, పుస్తకరూపంలో ఆ 'స్క్రిప్టు' చదవడం గేమ్ ఆడకుండా ప్రోగ్రామర్ రాసిన 'కోడింగ్' చదవడంతో సమానమన్నారు. ఇది చదివి భలే నవ్వొచ్చింది.
ఏది చదివినా పైపైన చదివి వదిలెయ్యకుండా క్షుణ్ణంగా చదవడం అలవాటు కాబట్టి, షేక్స్పియరును ఒక పద్ధతిలో చదువుదామని నిర్ణయించుకున్నాను. సముద్రంలో మునగాలని నిర్ణయించుకున్నప్పుడు తగిన ఏర్పాట్లు, కొంచెం ప్లానింగ్ అవసరం కదా ! నేను "మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ " క్లుప్తంగా ఇలా మూడు దశల్లో చదివాను/ చూసాను.
* మొదటి దశలో చార్లెస్ లాంబ్, మేరీ లాంబ్ రాసిన షేక్స్పియర్ కథల్లో చదవాలనుకున్న నాటకాన్ని ఆధునికాంగ్లంలో కథలా చదివాను.
* రెండో దశలో మూలాన్ని లిరికల్ ఫామ్ లో పైకి చదువుకుంటూ క్రింద ఇచ్చిన ఫుట్ నోట్స్ లో అర్థాలు అన్వయించుకుంటూ చదివాను.
* మూడో దశలో Kenneth Branagh దర్శకత్వం వహించిన పలు షేక్స్పియర్ నాటకాలు ఆన్లైన్ లో లభ్యమైనవి డౌన్లోడ్ చేసి చూశాను. ఇంతా చేస్తే గానీ "షేక్స్పియర్ ఎస్సెన్స్" పూర్తిగా వంటబట్టదనిపించింది.
No comments:
Post a Comment