నాటి నుండీ నేటి వరకూ సాంస్కృతిక ఆధిపత్యం అంతా పితృస్వామ్య వ్యవస్థ చెప్పుచేతల్లోనే ఉంది. చరిత్ర లిఖించడం మొదలుపెట్టిన తొలినాళ్ళనుండీ దాన్ని ఒక తరంనుండి మరో తరానికి వంశపారంపర్య ఆస్తిగా బంగారు పళ్ళెంలో పెట్టి ముట్టచెబుతూనే ఉన్నారు. ఈ విధానాన్ని సాంస్కృతిక వారసత్వం పేరిట శిలాశాసనంగా భావించి తలొగ్గేవారి సంగతి ప్రక్కన పెడితే, ఎప్పుడూ "బిగ్ పిక్చర్" చూస్తూ తమకంటూ స్వంత ఆలోచనా, అభిప్రాయాలూ ఉన్నవాళ్ళు ఈ హెచ్చుతగ్గుల్నీ, వివక్షనూ తమ రచనల ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు.
Image Courtesy Google |
పితృస్వామ్యం నిర్దేశించిన చట్రం నుండి బయటపడి తమ రచనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వారిలో అమెరికన్ రచయిత్రి ఉర్సులా కె లెగైన్ కూడా ఒకరు. సాహిత్యంలో వివక్షలపై దృష్టి సారిస్తూ "The Carrier Bag Theory of Fiction" పేరిట ఆమె రాసిన ఈ వ్యాసాన్ని ఆమె వ్యాసాల సంపుటి నుండి వేరు చేసి మరీ ప్రత్యేకమైన పుస్తకంగా పునర్ముద్రించారంటేనే ఆధునిక సాహిత్యంలో దీని ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది.
మనిషికి ఆహారంగా తొలుత అందుబాటులో ఉండేవి కందమూలాలు. నిజానికి ఆకులూ, దుంపలూ, పళ్ళూ వంటివి మాత్రమే మనిషికి ప్రకృతిలో ఆహారంగా కేటాయింపబడినవి. కానీ మనిషి స్వేచ్ఛాజీవే కాదు స్వార్థ జీవి కూడా. అతడికి ఉన్నదెప్పుడూ చాలదు, ఇంకా ఏదో కావాలి. ఒక సినీ కవి అన్నట్లు, అప్పటికీ, ఇప్పటికీ "మనిషి మారలేదూ, ఆతడి కాంక్ష తీరలేదు".
కానీ మనిషికి కందమూలాలు తిని బ్రతికేస్తే పనివేళలు తగ్గిపోతాయి. తోచింది చేసుకోడానికి చేతినిండా కావాల్సినంత సమయం మిగులుతుంది. కానీ అబ్బే, మనకది నచ్చదు. మనిషికి రుచులు అధికం, అందునా "జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ" అన్నారు. గొడ్డులా చాకిరీ చెయ్యాలి, మనిషన్నాకా ఏదో ఒకటి సాధించే తీరాలి. అందుకే మనిషికి నిరంతరం కొత్త కొత్త రుచులు కావాలి. అందుకే ఆదిమ మానవుడు గుహల్లోంచి బయటకొచ్చి తన జిహ్వను సంతృప్తి పరుచుకోడానికి వ్యవసాయం చేశాడు. అలా ఒకరోజు ఆహార సముపార్జన కోసం అరణ్యంలో సాగుచేసిన పొలాల్లో కాయకష్టం చేస్తుండగా ఉన్నట్లుండి ఒక పెద్ద సింహం కనబడింది. మనిషి దానితో వీరోచితంగా పోరాడి, తన బల్లెంతో దాన్ని మట్టుబెట్టి, చేత రక్తమోడుతున్న అదే ఆయుధం ధరించి, ఆహారంతో బాటు విజయగర్వంతో తన సమూహం వద్దకు తిరిగి వచ్చాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం అతడు తెచ్చిన ఆహరం అనుకుంటే పొరపాటే, ఇక్కడ ముఖ్యమైన విషయం అతడు ఆహారంతో బాటుగా వెంటబెట్టుకుని తెచ్చిన "కథ".
యుద్ధం, సాహసం, రక్తపాతం, హింస లాంటి ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఆ కథను విని అందరూ చప్పట్లు కొట్టారు. అలా ఆ కథ ఒక చెవి నుంచి మరో చెవికి చేరింది, తీరాలు దాటింది. అతడు కథానాయకుడయ్యాడు. ఇక కథను విన్నవాళ్ళూ, చూసిన వాళ్ళూ, చిలవలు పలవలల్లి చెప్పిన మిగతా వాళ్ళంతా సహాయపాత్రల్లా ప్రాముఖ్యత లేకుండా మిగిలిపోయారు. కానీ ఈ వీరోచిత గాథనే ఏళ్ళ తరబడి అటు తిప్పి, ఇటు తిప్పి, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఈ కథలో కథానాయకుడు ఒక్కడే. తరాలు మారే కొద్దీ ఒక కథానాయకుడి పీఠంలో మరొకరొచ్చి కూర్చుంటారు. ఇది సాంస్కృతిక వారసత్వంగా, పురుషుడి హక్కుగా మారింది.
నిజానికి అతడి కథలో అసలు కథానాయకి పాత్ర చాలా కాలం వరకూ లేనే లేదు. తరువాత మెల్లిగా తమ సౌకర్యార్థం ఆ పాత్రను కథ మధ్యలో ఇరికించారు. ఆ పాత్రకు కూడా వాళ్ళే పరిమితమైన సంభాషణలు రాశారు. కథానాయకి వాళ్ళు చెప్పిందే చిలక పలుకుల్లా చెప్పాలి. అంటే హీరో కథని "ప్రాపగాండా" చెయ్యడానికే హీరోయిన్ ఉనికి పరిమితం. ఇదే మౌల్డ్ లో పోతపోసినట్లున్న కథనే వినీ వినీ మనకి విసుగొచ్చింది. కొత్తగా చెప్పుకోడానికి ఇక కథలేమీ మిగలని పరిస్థితి ఎదురైంది. సరిగ్గా ఆ సమయంలో మరో కథా నాయకుడు / నాయకురాలు ? కోణం నుంచి కథలు చెప్పడం ఆరంభమైంది.
నిజానికి హీరో ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేసిన ఆమె కథ అతడి కథంత అడ్రినలిన్ రష్ ఇచ్చే కథ కాదు. ఆమె కథ సాదాసీదాగా ప్రేమ, దయ, ఆదరణ, సేవ, సంతానోత్పత్తి, కుటుంబ పోషణ, పిల్లల పెంపకం వంటి అతి సామాన్యమైన అంశాల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఎటువంటి హింసా, రక్తపాతం, సంఘర్షణా లేని, సాహసగాథలు కాని, చెప్పకుండా వదిలేసినా ఇటువంటి కథలు మనకు మరిన్ని అవసరం. నిజానికి ఉర్సులా కథల్లో లింగవివక్ష కనపడదు. నాకు తెలిసి స్త్రీ పురుష భేదాన్ని సమూలంగా చెరిపేస్తూ తన పాత్రలకి ఏ ఒక్క జెండర్ నూ ఆపాదించకుండా "The Left Hand of Darkness" వంటి రచనలు చేసిన సాహసం చేసిన ఒకే ఒక్క రచయిత్రి ఆమె. అందుకే అటు స్త్రీవాదం వైపు కూడా పూర్తిగా మొగ్గు చూపని ఆమె రచనలు ఇంతవరకూ పెద్దగా ప్రాముఖ్యతను నోచుకోలేదు.
ఇటువంటి వ్యాసాలు చదివాక ఎంతో మంది ఫెమినిస్టు రచయిత్రులు ప్రముఖులుగా వెలుగొందగా, ఆవిడ పేరు ఆవిడ జీవించి ఉన్నకాలంలో పెద్దగా వినపడకపోవడానికి కారణం కూడా ఆవిడలో "పితృస్వామ్యానికి ప్రమాదికారిగా మారే భావజాలం" ప్రధాన కారణం అని అర్థమవుతుంది. ఈ డిస్కోర్స్ ఆధునిక సాహిత్యపు తీరుతెన్నుల్ని సమూలంగా మార్చగల అవకాశాలు మున్ముందు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment