Friday, April 13, 2018

పుస్తకాలూ-పిచ్చాపాటీ కబుర్లు

పుస్తకాల గురించి ఎవరైనా పాత్రలు,స్థలాలూ పేర్లతో సహా చెప్తూ మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది..కాస్త అసూయ కూడా కలుగుతుందనుకోండి..చదవడం ప్రతివారికీ ఒక అనుభవం..ఆ అనుభవాన్ని మాటల్లో పెట్టేవారంటే నాకు చాలా ఇష్టం.
Image courtesy Google
ఏదైనా ఒక పుస్తకం చదివిన తరువాత దాన్ని గురించి ఒక వారంలోపు రాయడం కుదరకపోతే ఇక రాసే ఉద్దేశ్యం మానుకుంటాను..అలాగే ఏదైనా చదివిన తరువాత,ఆ అనుభవాల్ని పేపర్ మీద పెట్టాకే మరో పుస్తకం మొదలుపెడతాను..ఎందుకంటే ఆ సరికే ఆ ప్రపంచం తాలూకూ జ్ఞాపకాలు మనసులో నెమ్మదిగా  మసకబారిపోతుంటాయి..లెక్కప్రకారం మనసుకి నచ్చినవన్నీ జ్ఞాపకాల పెట్టెలో భద్రంగా ఉండాలి కదా !! మరి నా విషయంలో ఆ పెట్టె ఎంత వెతికినా దొరకదేంటి ! ఒకవేళ పొరపాటున దొరికినా అదేంటో,అందులో దాచిన వస్తువులేవీ పూర్తిగా ఉండవు..

ఎందుకిలా జరుగుతోంది ! ఫలానా పుస్తకం నాకు బాగా నచ్చింది..మనసుకు హత్తుకుంది..చదివినప్పుడు నిరంతరాయంగా ఎన్నో ఉద్వేగాలకు లోనయ్యానే..ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయానే..మరి అలాంటి అనుభవం భవిష్యత్తులో తరచిచూసుకోడానికి భద్రం చేసుకోలేకపోయనేందుకు !! ఈ వ్యవహారం అర్ధంకాక బుర్ర వేడెక్కుతున్న సమయంలో సరిగ్గా ఈ వాక్యాలు కంటబడ్డాయి.."To write is to forget"..నా మనసుకి స్వాంతన చేకూర్చిన ఈ మాటలన్నది రే బ్రాడ్బరీ..

'ఓహో,అయితే నేను తిరుగాడిన ప్రపంచం గురించి అక్షరాల్లో పెట్టిన తరువాత,ఆ లోకం నా మనసులోంచి చెరిగిపోతుందన్నమాట'..కానీ పూర్తిగా కాదేమో..మనిషి మెదడేమీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ కాదు కదా,కంప్లీట్ ఫార్మాట్ బటన్ నొక్కేస్తే పూర్తిగా ఫార్మాట్ చేసెయ్యడానికి...కానీ దాదాపు అలాంటిదే..కొన్ని విహరించిన ఊహాప్రపంచపు శకలాలు ఎక్కడో సబ్కాన్షియస్ లో చిన్నాభిన్నంగా విశ్వంలోని ఆనంతకోటి గలాక్సీ లలో నక్షత్రాల్లా ఎక్కడెక్కడో తెలీని చోట అదృశ్యంగా,అస్పష్టంగా మిగిలిపోతాయి..చాలా అరుదుగా కొన్ని చెదురుమదురు జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోతాయి...

"బి అ రోమన్ ఇన్ రోమ్" అన్నట్లు రోమ్ కి వెళ్తూ వెళ్తూ రాజమండ్రిని మోసుకెళ్ళడం అనవసరమేమో కదా..నేను కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు పెట్టెలో గతాన్ని  మోసుకెళ్ళడం ఇప్పటివరకూ జరగలేదు మరి..నిజానికి ఈ క్షణమే శాశ్వతం అనుకునేవారికీ,ఈ క్షణంలో అనుభవమే  ప్రధానమనుకునే స్వార్థపరులకీ (?) గతంతో పనేంటి !

Narsissitic గా అనిపించినా మొదటినుంచి ఈ తరహా  డిటాచ్మెంట్ నన్నొదిలి పోవడం లేదు..తాత్కాలికంగా తిరుగాడిన లోకాల్లో కలిసిన మనుషులూ,వారి వివరాలు నాకు ఎంత మాత్రం గుర్తుండవు..ఎవరికీ అనుమతిలేకుండా చుట్టూ తయారు చేసుకున్న వలయం ఈ డిటాచ్మెంట్ కి కారణమా !! లేక నిజ జీవితంలో కూడా వ్యక్తుల పేర్లు,మొహాలు,మ్యాప్స్ లో డైరెక్షన్స్ గుర్తుంచుకోవడానికి కష్టపడే జబ్బు దీనికి మూల కారణమా అన్నది ఇప్పటివరకూ తేల్చుకోలేకపోతున్నాను..ఇలాంటి వివరాలు ఒక పట్టాన రిజిస్టర్ కావు అదేంటో ! ఈ గోడు ఒక ఫ్రెండ్ దగ్గర వెళ్ళబోసుకుంటే ఇంత ఎనాలిసిస్ అవసరమా,దీన్ని సింపుల్ గా 'మతిమరుపు' అంటారు అని జ్ఞానబోధ  చేశారు :) ..

కానీ మరో ఫ్రెండ్ చెప్పిన విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది..అదేంటంటే ఒక పర్టిక్యులర్ genre కి పరిమితమవకుండా రాండమ్ గా చదివేవాళ్ళకి ఈ తరహా ఇబ్బంది వస్తుందని వారి ఉవాచ..""ఒక డైరెక్షన్ లేని ప్రతిదీ ఫైనల్ outcome ను nullify చేసేస్తుంది..నువ్వు ఒక నిర్ణీత పద్ధతిలో పుస్తకాలు చదవవు.. ప్రతి పాఠకునికీ ఇష్టమైన genre ఒకటుంటుంది..కానీ నీకు ఇష్టమైన genre ఏంటంటే నువ్వు చెప్పలేవు..నిన్ను ప్రభావం చేసిన రచయిత ఎవరంటే తెల్లమొహం వేస్తావు..ఇక ఒక మంచి పుస్తకం ఏదైనా చెప్పు అంటే 3rd డిగ్రీలో టార్చర్ చేసినట్లు చూస్తావు.. Wanderlust తో పరిమితి అనేది లేకుండా ఒక genre నుంచి మరొక genre కు స్విచ్ అవుతూ,ఆ రోమ్ లో రోమన్ లా వ్యవహరిస్తూ,నీ సినికల్ క్యూరియాసిటీ తో సంబంధం లేని ప్రపంచాలు చూడాలనుకుంటావు..నీ ఐడెంటిటీ ని ఆ లోకంలో జ్ఞాపకం పెట్టుకోవు..పర్యవసానంగా ఆ లోకపు కట్టుబాట్లను గానీ,వ్యక్తుల్ని గానీ ప్రశ్నించవు..తర్కంతో నీకు పని లేదు..దానితో చిక్కేంటంటే నువ్వు ఏ ఒక్క ప్రపంచానికీ చెందకపోవడమే...belongingness అనేది నీకసలు  ఉండదు..తత్పరిణామంగా నీకు ఏదీ మనసుదాకా వెళ్ళదు..ఖాళీ కాగితంలా ఇలా మనసుపై రాస్తూ,తుడిచేస్తూ
ఉంటే చివరకి ఎంప్టీ గా మిగిలిపోవడం ఖాయం..నిన్ను ఎవరూ పూర్తి చెయ్యలేరు""..ఇదీ ఆ సారాంశం.

జలుబొచ్చిందని చెప్పడం కంటే,అదేదో నోరుతిరగని ఇంగ్లీషు జబ్బు వచ్చిందని చెప్పడం కాస్త బెటర్ గా ఉంటుందనుకుంటే ఇదే నయం అనిపించింది..ఒక పుస్తకంలో కొన్ని వాక్యాలు,మరో పుస్తకంలో కొందరు మనుషులూ,ఇంకో పుస్తకంలో ఏవో సందర్భాలూ ఇలా మంచైనా చెడైనా,ప్రతీ పుస్తకం నుంచీ ప్రతీ రచయిత నుంచీ ఎంతో కొంత ప్రభావితమవుతాం కదా ! విశ్వంలోని  అనంతకోటి నక్షత్రాల్లో ఏ తార వెలుగు నీకిష్టమంటే ఏం  చెప్పను !!

2 comments:

  1. మీ దీన్ని గురించి మరీ అంట బాధ పడాల్సిందేమీ లేదని నా ఉద్దేశం. కొంత మతి మరుపు ఉండటం మనిషికి మంచిది.

    ReplyDelete
    Replies
    1. :) ధన్యవాదాలు నారాయణ స్వామి గారూ :)

      Delete