పాశ్చాత్య సాహిత్యంలో మొదట్నుంచీ సంస్కృతిని పురుషుడిగానూ, ప్రకృతిని స్త్రీగానూ అభివర్ణించడం చూస్తూ ఉంటాం. కనీసం 19వ శతాబ్దం వరకూ సాహిత్యంలోని శైలులకు ఆపాదించిన అస్పష్ట నిర్వచనాలు ఈ లింగవివక్షల వల్ల తీవ్రంగా ప్రభావితమైనవే. ఈ క్రమంలో “the male quality is the creative gift.” అంటూ గెరాల్డ్ మాన్లీ హాప్కిన్స్ బాహాటంగానే పితృస్వామ్యాన్ని సమర్ధించుకోగా మగవారు తమ అధీనంలో ఉంచుకున్న విద్య, సృజనాత్మకత, సాంస్కృతికపరమైన ఆధిపత్యం వంటివి స్త్రీని ఈ సమీకరణం నుండి పూర్తిగా తప్పించాయి. ఆమె ఉనికిని పూర్తిగా మినహాయిస్తూ పాశ్చాత్య సాంస్కృతిక సంపద అంతా పితృస్వామ్యపు హక్కుగా మారిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి యావత్తూ విద్యావంతులైన మగవారికి వారి హేతువాద పూర్వీకుల నుండి వంశపారంపర్యమైన ఆస్తిలా సంక్రమించింది. కానీ ఈ మగవారికి సంబంధీకులైన స్త్రీలు మాత్రం జేన్ ఆస్టెన్ నవలల్లో స్త్రీ పాత్రల్లా ఎస్టేటు చివరి 'డౌవర్ హౌస్' లకు పరిమితమైపోయారంటారు అమెరికన్ సాహితీ విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్.
|
Image Courtesy Google |
గతించిన కాలంలో క్రియాశీల వ్యవస్థకు దూరంగా, వాస్తవ ప్రపంచంతో ఎంతమాత్రం సంబంధం లేకుండా స్త్రీలు తమ జీవితకాలమంతా పూర్తి ఒంటరితనంతో కేవలం సమీక్షలోనే గడిపేశారు. అనేక ఏళ్ళపాటు స్త్రీ జీవితంలో ఆమెకు వెలుపలి సంఘటనలకు చోటులేని కారణంగా ఆమె తన కథను తాను చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకోడానికి ఆమెకు కథంటూ లేదు. అలాగని ఆమె జీవితం నిరుపయోగమైనదనీ అనలేం, చలనంలేని లాంతరు నుండి వచ్చే వెలుగులా ఆమె చీకటి ప్రపంచంలో తమ కథలను చెప్పుకునే ఔత్సాహిక కథకులకు మౌనంగా దిశానిర్దేశం చేస్తుంది. వారి సృజనాత్మకతకు ప్రేరణ కోసం ఆమెవైపు చూస్తే వారిని ఊరడించి సలహా ఇస్తుంది. తనకంటూ ఒక కథ లేని ఆమె ఇతరులు చెప్పే కథలను సంతోషంగా వింటుంది, దయ చూపిస్తుంది : ఆమె సహజత్వానికి దూరంగా సాహిత్యంలో పితృస్వామ్య వ్యవస్థ ఒక మూసలో పోసి తయారు చేసిన ఒక ఆదర్శ స్త్రీమూర్తి. జాన్ రస్కిన్ వంటివారు ఆమె శక్తి పాలనకూ, యుద్ధానికీ తగదన్నారు, ఆమె హేతువాదం సృజనాత్మకతకూ, ఆవిష్కరణకూ పనికిరాదన్నారు. 'విక్టోరియన్ ఐడియల్' స్త్రీని గృహస్థుగా, భర్తకు సాంత్వన చేకూర్చే ఒక వస్తువుగానే చూసింది.
ఈ క్రమంలో స్త్రీ ఉనికిని అన్ని విధాలా పరిమితం చేసిన తీవ్రమైన పురుషాధిక్య భావజాలంతో కూడిన ఇమ్మాన్యుయేల్ కాంట్ ప్రతిపాదనలు స్త్రీవాద తత్వవేత్తల విమర్శల్లో విశేషంగా చర్చకు వచ్చాయి. కాంట్ ఎస్థెటిక్స్ ప్రకారం మగవాడు చింతన, పరిశీలన, ఆలోచన, హేతువు, తర్కం వంటి అంశాలకు ప్రతినిధిగా ఉంటే స్త్రీ కేవలం సౌందర్యానికీ, భావోద్వేగాలకూ మాత్రమే ప్రతినిధిగా కనబడుతుంది. స్త్రీని ఒక 'సౌందర్యమూర్తి' గా ప్రతిష్ఠించే క్రమంలో ఆమెను అనైతికతకు ఆస్కారంలేని దేవతా మూర్తిగా చేసి ఒక నైతిక చట్రంలో ఇమిడ్చే నర్మగర్భమైన ప్రయత్నం కనబడుతుంది. స్వతఃసిద్ధమైన స్త్రీ అస్తిత్వానికి దూరంగా ఆమెకు ఒక నిర్ధిష్టమైన రూపాన్ని అంటగట్టే ప్రయత్నంలో సాహితీ సృజనలో అవసరమైన ఇన్-యాంగ్ అంటే నీతి-అవినీతి,మంచి-చెడు, న్యాయం-అన్యాయం వంటి ద్వంద్వాలను ఆమె అస్తిత్వానికి అన్వయించుకునే అవకాశం లేకుండా కనిపించని ఆంక్షలు అమల్లో ఉండేవి. అందుకే ప్రాచీన కావ్యాల్లో కవులూ,రచయితలూ సృష్టించిన స్త్రీ పాత్రలు, అయితే మచ్చలేని చందమామను తలపించే దేవతా మూర్తులుగానో లేదా దానికి పూర్తి విరుద్ధంగా మంత్రతంత్రాలు నేర్చిన మంత్రగత్తెలూ, రాక్షసులుగానో చిత్రించబడేవారు. డాంటే, గోథే, మిల్టన్ వంటివారు ఆద్యులుగా పవిత్రమైన వర్జిన్ మొదలు గృహానికి పరిమితం చేసిన 'దేవత లాంటి ఇల్లాలి' వరకూ అన్ని కావ్యాల్లోనూ ఈ సంప్రదాయం చాలాకాలం కొనసాగింది.
ఇమ్మాన్యుయేల్ కాంట్ స్త్రీ తర్కాన్ని పూర్తిగా విస్మరించనప్పటికీ ఆమె హేతువాదం నైతిక, సామజిక వ్యవహారాల్లో పరిణితిలేనిదనీ, పూర్తి నిరుపయోగమైనదనీ నిర్ధారించారు. దీనికి ఊతమిస్తూ కార్ల్ గిల్లిగాన్ మానసికతత్వ పరిశోధనలు సైతం స్త్రీలు నైతిక నిర్ణయాలను భావోద్వేగాలూ, బాంధవ్యాల ప్రాతిపదికగా సందర్భానుసారం తీసుకుంటారని అంటారు. నిజానికి కాంటియన్ తత్వం స్త్రీ ఉనికిని కేవలం మగవాడిని పరిపూర్ణం చెయ్యడానికి పరిమితం చేస్తూ ఆమె ధర్మాన్ని వివాహవ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వచిస్తుంది. ఆ విధంగా కాంట్ స్త్రీపురుషుల వివాహాన్ని రెండు ప్రకృతుల మేళవింపుగా చూస్తారు. భావాన్ని స్త్రీత్వంగానూ, హేతువునూ,తర్కాన్నీ పురుషత్వంగానూ నిర్వచిస్తారు. ఈ కారణంగా ఆమెను తెరచాటుగా ఉంటూ మగవాడిని ఆదర్శవంతమైన నైతిక జీవనం దిశగా అడుగులు వెయ్యడంలో ప్రోత్సహిస్తూ, సహాయసహకారాలందించే పాత్రకి మాత్రమే పరిమితం చేశారు. ఈ నియమాలననుసరించి మానవ సంస్కృతి, నాగరికతా వృద్ధి చెందుతాయని కాంట్ అభిప్రాయపడతారు. ఏదేమైనా కాంటియన్ నైతిక సిద్ధాంతం బట్టి చూస్తే స్త్రీ ఆలోచనలకు విలువలేదు. కాంటియన్ వాదం సంప్రదాయ పితృస్వామ్య గుణాలుగా పరిగణించే నిర్లిప్తమైన హేతువాదాన్ని మాత్రమే గౌరవించి కరుణ, భావోద్వేగాలు వంటి స్త్రీ తత్వాన్ని నిర్వచించే అంశాలను తోసిపారేస్తుంది.
ఈ కారణాల దృష్ట్యా పురుషాధిక్య భావజాలం వ్రేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థలో తన అస్తిత్వం గుర్తెఱిగి అప్పుడప్పుడే రచనా వ్యాసంగంలో తొలి అడుగులు వెయ్యడం మొదలు పెట్టిన రచయిత్రులు సహజంగానే అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రాచీన కాలంనుండీ ఏకపక్షంగా మగవారికి మార్గదర్శకత్వం చేస్తూ వచ్చిన 'వడ్డించిన విస్తరి' లాంటి కావ్యాలూ,గ్రంథాలూ స్త్రీవాద రచయిత్రుల విషయంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల స్త్రీవాదులు తమ రచనల ద్వారా పితృస్వామ్యపు సాహితీ సృజనలో భాగంగా రూపుదిద్దుకున్న మూస నుండి బయటపడి ప్రప్రథమంగా తమ ఉనికిని నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. అనేక ఏళ్ళుగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థలో రచయితలకు రాయడం విషయంలో పూర్వపు చరిత్ర, జ్ఞానం కొంతవరకూ దిశానిర్దేశం చేసేవి. మధ్యయుగం చివరి వరకూ స్త్రీలకు రచనలు చేసే అవకాశమే లేకపోగా 1970ల తరువాత గానీ అసలు వారి రచనలకు గుర్తింపే దొరకలేదు. అందువల్ల తాను రాయడంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తనకు ఏం రాయాలో, ఎలా రాయాలో ఏదో అదృశ్యవాణి శాసిస్తున్నట్లు అనిపించేదంటారు ఇటాలియన్ రచయిత్రి ఎలెనా ఫెరాంటే, అనేకసార్లు అది పురుషుడి స్వరంలో ఉన్న ఒక అదృశ్యశక్తిగా అనిపించేదంటారు. "అతడు నా సమ వయస్కుడో, లేదా నాకంటే వయసులో పెద్దవాడో నాకు తెలియదు, బహుశా కాస్త వృద్ధుడై ఉంటాడు. అందువల్ల నేను రాయాలంటే అతడిలా ఆలోచించాలి, అతణ్ణి అనుకరించాలి. ఏకకాలంలో ఒక మగవాడిగానూ, మరికొన్నిసార్లు నా ఉనికిని కాపాడుకుంటూ ఒక స్త్రీ గానూ కూడా ఆలోచించాలి." అంటారామె.
1980ల తరువాత స్త్రీవాద తత్వవేత్తలు భాషలో స్త్రీపురుష నిర్వచనాలు ఆదినుంచీ లేవనీ, అది కేవలం పితృస్వామ్య వ్యవస్థ సృష్టనీ అంటారు. అమెరికన్ స్త్రీవాద తత్వవేత్త జుడిత్ బట్లర్ లాటిన్ అమెరికన్ స్త్రీవాద సిద్ధాంతాలలో 'స్త్రీ' అనే పదానికి నిర్వచనాలున్నాయనే ప్రతిపాదనలని సవాలు చేస్తూ అవన్నీ పితృస్వామ్యపు అభూత కల్పనలని కొట్టిపారేస్తారు. ఇదిలా ఉండగా,మరోవైపు ఫ్రెడ్రిక్ నీషే పురుషాధిక్య భావజాలంతో కూడిన మానసిక విశ్లేషణలు స్త్రీని ఆధిపత్యం,అజమాయిషీ అవసరమైన ఒక పశువుగా చూడాలని నూరిపోస్తాయి. నీషే 'Thus Spoke Zarathustra' అనే రచనలో ఒక పాత్ర "నువ్వు స్త్రీ దగ్గరకు వెళ్తున్నావా ? అయితే నీ కొరడా తీసుకెళ్ళడం మర్చిపోకు" అంటుంది.
అమెరికన్ కవి రాబర్ట్ లోవెల్ “The tranquillized fifties” గా అభివర్ణించిన 'సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజాన్ని' ప్రభావితం చేసిన వివక్షల మూలాలు నియో విక్టోరియన్ సంస్కృతిలో ఉన్నాయి. స్త్రీవాదం కొత్తగా ఊపిరిపోసుకుంటున్న డెబ్భైల దశకంలో సిల్వియా ప్లాత్, లోరైన్ హన్స్బెర్రీ, ఆడ్రె లార్డ్ వంటి అనేక మంది రచయిత్రులు యాభైల్లో చదువులో పట్టాలు పుచ్చుకున్నవాళ్ళు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న యాభైల కాలంలో స్త్రీలను కేవలం ఒక పిల్లల్ని కనే యంత్రంగా, మగవాడికి ఆనందాన్నిచ్చే వస్తువుగానే చూసేవారు. ఈ వివక్షను అధిగమించి అమెరికన్ కవయిత్రి Marianne Moore వివాహవ్యవస్థ, సంతానం వంటి ఆంక్షల్ని చెరిపేస్తూ ఆకాలంలోనే ఒక శక్తిమంతమైన మహిళగా ఒక ఉన్నత స్థానంలో నిలబడడం విశేషం. కానీ దురదృష్టవశాత్తూ కరడుగట్టిన స్త్రీవాది అయిన ఆమె సాటి కవయిత్రి సిల్వియా ప్లాత్ పై తీవ్రమైన విద్వేషం వెళ్ళగక్కారంటారు. మూర్ దృష్టిలో సిల్వియా ప్లాత్ చేసిన తప్పల్లా పిల్లల్ని కనడం, భార్యగా,తల్లిగా, కవయిత్రిగా మూడు పాత్రల్ని పోషించాలనుకోవడం (“triple threat woman, wife, mother and writer”). విచిత్రంగా ఈ రకమైన వత్తిడి సిల్వియా భర్త, కవీ టెడ్ హ్యూగ్స్ పై లేకపోవడం విశేషం. ఇవన్నీ ఆ కాలంలో యువ కవయిత్రులు ఎదుర్కున్న పలురకాల వివక్షలకు సాక్ష్యాలు. ఏదేమైనా భార్యగా, మాతృమూర్తిగా ప్లాత్ గానీ ; వివాహవ్యవస్థనూ,సంతానాన్నీ వద్దనుకుని ఆధునిక కవులుగా సుప్రసిద్ధులైన పౌండ్, విల్లియమ్స్, ఇలియట్ లాంటివాళ్ళ సరసన నిలబడ్డ మూర్ గానీ ఇద్దరూ ఫ్రాయిడ్ స్త్రీకి ఆపాదించిన 'సహజత్వపు' నిర్వచనాన్ని తమదైన శైలిలో సవాలు చేసినవాళ్ళే.
ఫ్రాయిడ్ సిద్ధాంతాలను సాహిత్యానికి అన్వయించిన విమర్శకులు హరాల్డ్ బ్లూమ్ సాహితీ చరిత్రను రాయడంలో తీవ్రమైన 'పితృస్వామ్యాన్ని' తన మోడల్ గా చేసుకున్నారు. ఈ కారణంగా చాలామంది స్త్రీవాద సాహిత్య విమర్శకులకు ఆయన రాతలు చాలా అభ్యంతరకరంగా తోచేవి, బహుశా ఇక ముందు కూడా తోస్తాయి. ఆయన కావ్యగతిని మగవాడైన కవికీ, అతడి కావ్యానికి ప్రేరణైన స్త్రీకీ మధ్య సంభోగంగా చూస్తారు. ఈ స్థితిలో వెంటనే ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, "కావ్యంలో కవయిత్రి స్థానం ఎక్కడ ?" ఆమె ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి ? ప్రేరణది ఏ లింగం ? హరాల్డ్ బ్లూమ్ ని చదివిన ఏ స్త్రీలోనైనా తలెత్తే ప్రశ్నలు ఇవే.
నిజానికి బ్లూమ్ మోడల్ ను ఆదర్శంగా తీసుకుంటే ఆయన ప్రతిపాదించిన “Anxiety of influence” ప్రభావం రచయితలపై ఉన్నంతగా రచయిత్రులపై ఉండదంటారు విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వారిపై ప్రభావం చూపించడానికి వారికొక మోడల్ అంటూ లేదు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచనగల ఏ స్త్రీనయినా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించే మానసిక రోగి అని ముద్రవేసేవారు. ఈ కారణంగా ఆ కాలపు రచయిత్రులు “Anxiety of authorship,” తో బాధపడ్డారంటారు సాండ్రా. ప్రాచీన కావ్యాల్లో ఆమె ఉనికే సందిగ్ధంలో ఉంది గనుక రాయడం తన వల్ల కాదనీ, తనలో సృజనాత్మకత లేదనీ భావించేదామె. నిజానికి ఆమె సంఘర్షణ పితృస్వామ్య రచనల్లోని ప్రపంచంతో కాదు. అతడి కలంలోనుండి జీవంపోసుకున్న ఆమె మూర్తితో. మాక్బెత్ ను కథానాయకుడిగా చూపి లేడీ మాక్బెత్ ను ఒక దిగజారిన స్త్రీగా అభివర్ణిస్తారు, అలాగే ఒడిపస్ ను కథానాయకుడిగానూ, మెడియాను ఒక మంత్రగత్తెగానూ చూపిస్తారు. ఇకపోతే కింగ్ లియర్ పిచ్చితనం అతడి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చే ఒక గొప్ప విషయమైతే ఒఫీలియా పిచ్చితనం కడుదుర్భరం అన్నట్లు వర్ణిస్తారు. ఏకపక్షంగా ఇలాంటి వర్ణనలు చేసే అతడి చేతుల్లోనుండి కలం లాక్కుని తన గురించి చెప్పే అధికారం అతడికివ్వకుండా తన సాధికారతను చాటుకోవాలంటే స్త్రీ సమాజంలో తన ఉనికిని మళ్ళీ సరికొత్తగా నిర్వచించుకోవాలి. A Room of One's Own లో షేక్స్పియర్ సోదరి జుడిత్ పాత్రను సృష్టిస్తూ, 16వ శతాబ్దంలో ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మకతతో పుట్టిన ఏ స్త్రీకి అయినా పిచ్చిపట్టడం ఖాయం అంటారు వూల్ఫ్. తన సృజనాత్మకతను కవిత్వంలో వాడడానికి ప్రయత్నించే ఆమె యొక్క మానసిక ఆరోగ్యం, చిత్తశుద్ధీ దెబ్బతింటాయని తెలియడానికి కొద్ది పాటి సైకాలజీ తెలిసినా చాలంటారామె.
స్త్రీలను ప్రాచీన కాలంనుండీ కళలకూ,సృజనాత్మకతకు దూరంగా ఉంచిన అంశాలపై 19 వ శతాబ్దం తరువాత స్త్రీవాద తత్వవేత్తలు దృష్టి సారించారు. సాహితీసృజన విషయంలో మగవారిని దైనందిన జీవితానికి సంబంధించిన బాధ్యతలనుండి మినహాయించడంతో వారికి స్వేచ్ఛగా రచనావ్యాసంగాన్ని కొనసాగించే సౌకర్యం (మేల్ ప్రివిలేజ్) ఉండేది. కానీ ఇది రచయిత్రుల విషయంలో వాస్తవదూరమైన విషయం. స్త్రీల విషయంలో సంసారం,పిల్లల పెంపకం వంటి కుటుంబ బాధ్యతల ప్రాధాన్యతల కారణంగా సాహితీ సృజన సహజంగానే మూలకు నెట్టివేయబడింది. ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్ వంటి కవయిత్రులూ, జేన్ ఆస్టెన్, బ్రోన్ట్ సిస్టర్స్ వంటి ప్రముఖ రచయిత్రులు సైతం దీనికి మినహాయింపు కాదు. జేన్ ఆస్టన్ 'పెర్సుయేషన్' కథానాయిక అన్నే ఎలియట్ ఈ విధంగా అంటుంది : "మగవారికి విద్య వంశపారంపర్య హక్కుగా సంక్రమించింది గనుక వారు స్త్రీల కథలను వారి దృష్టికోణం నుండి చెప్పడం చాలా సులభం. ఎందుకంటే కలం వారి చేతిలో ఉంది." దీనికి విరుద్ధంగా కలాన్ని తన చేతిలోకి తీసుకున్న స్త్రీని ప్రకృతి విరుద్ధమైన నేరం చేసిన అహంకారిగా పరిగణిస్తూ ఆమెకు విమోచనకు ఆస్కారంలేదని భావించేవారు.
ప్రముఖ సాహితీ విమర్శకులైన హరాల్డ్ బ్లూమ్ సైతం కవిత్వపు ప్రేరణను 'తండ్రీ కొడుకుల బంధం'గా అభివర్ణించారు. [“from the sons of Homer to the sons of Ben Jonson, poetic influence [has] been described as a filial relationship”] ఆయన యావత్ సాహితీ ప్రస్థానాన్ని ఇరువురు అత్యంత శక్తిమంతమైన సరిసమాన వ్యక్తుల మధ్య పోరుగా, అనగా తండ్రీకొడుకుల పోరుగా చూస్తారు [ Laius and Oedipus at the crossroads ]. ఈ కారణంగా పాశ్చాత్య సంస్కృతిలో ఏ రచనకైనా రచయిత ఒక తండ్రితో సమానం, ఆ విధంగా పాశ్చాత్య సాహిత్య సంస్కృతి ఒక పితృస్వామ్యంగా రూపుదిద్దికుంది. ఇకపోతే 'రచనకు సొంతదారు', 'సాహిత్యం రచయితకు ఒక ఆస్తి', లేదా 'రచనకు తండ్రి' వంటి వివిధ మెటాఫోరికల్ కోణాల్లో ఆలోచిస్తే రచయిత అనేవాడు తన రచనలో పాత్రలకూ, వాటి గుణగణాలకూ, సన్నివేశాలకూ అన్నిటికీ అధిపతిగా కనిపిస్తాడు. రచయిత తన అదుపాజ్ఞల్లో ఇష్టానుసారంగా మలచుకున్న పాత్రలు అతడి చేతిలో కీలుబొమ్మలతో సమానం. ఈ విధంగా పితృస్వామ్య రచనలు సాహిత్యంలో పురుషాధిక్యతను మెటాఫోరికల్ కోణంలో శోధిస్తూ ఉండగా “Woman’s virtue is man’s greatest invention.” అని Honoré de Balzac అన్న మాటలు స్త్రీవాదుల్లో మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి.
ఏదేమైనా ఎంత పిడికిట్లో బిగించి అదుపులో పెట్టాలని ప్రయత్నించినా ఈడెన్ సాక్షిగా ఈ కథలన్నీ ఏదో ఒక సమయంలో రచయిత మునివేళ్ళనుండి తప్పనిసరిగా జారుకుంటాయి. కథలన్నీ కాలగతిలో అనేక పరిణామాలకు లోనయ్యే అవకాశం ఉండగా, ఒకసారి బయల్పడిన రచనను పిడికిట్లో బంధించి ఎప్పటికీ శాసించడం వీలుపడదు. ఏ ఒక్క రచన ద్వారానో లేదా ఒక చిత్రం ద్వారానో ఏ మనిషి గళాన్నీ శాశ్వతంగా నొక్కిపెట్టడం అసంభవం. ఈ క్రమంలో స్త్రీవాద తత్వశాస్త్రంలో చారిత్రక నిఘంటువును సమూలంగా మార్చాల్సిన ఆవశ్యకతను స్త్రీవాదులు గ్రహించారు. నేటి తరం స్త్రీవాదులూ, విమర్శకులూ కాంట్ సిద్ధాంతాలను లోతుగా పరిశోధించకపోయినా ప్రత్యేకం కాంటియన్ నైతిక సూత్రాలూ,హేతువాదాలపై దృష్టి సారించారు. ఈ రెండిటిలో కూడా ప్రత్యేకించి కాంటియన్ నైతిక సూత్రాలు స్త్రీవాదుల చర్చల్లో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి.
స్త్రీని ఒక జీవమున్న ప్రాణిగా కాక కేవలం ఒక ఇమేజికి కుదించిన ప్రాచీన కావ్యాలను యధాతథంగా అంగీకరించడం ముందుముందు వీలుపడదు. అదే సమయంలో మిల్టన్, డాంటే, కీట్స్ మొదలు హాప్కిన్స్, బ్లేక్, ఈట్స్, ఇలియట్ వరకూ వేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్యాన్ని ఉన్నపళంగా విస్మరించడమూ వీలుకాని పని. తరతరాల సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత స్త్రీపురుష భేదం లేకుండా మనందరిపైనా ఉంది. కానీ అసలు చిక్కంతా ఆ సాహిత్యాన్ని నిస్సంశయంగా, నిర్ద్వంద్వంగా అంగీకరించాలనుకోవడంలోనే ఉంది. సరిగ్గా ఇక్కడే సాహిత్యంలో స్త్రీవాదులూ, విమర్శకుల అవసరం కనిపిస్తుంది. వేల ఏళ్ళ పాశ్చాత్య సాహిత్యాన్ని తీసిపారేసే బదులు ఆ చరిత్రను తిరగరాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చరిత్ర నుండి తీసిపారవేసే విషయాలేమీ పెద్దగా లేవు. ఎటొచ్చీ అందులో కేవలం నాణానికి ఒక వైపు కథనే చెబుతూ రెండోవైపు కథను ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేశారు. ఆ రెండో పార్శ్వం మానవజాతిలో సగం మంది మనుషుల అంటే స్త్రీల జీవితాలు. అందువల్ల చరిత్రను పునరావృతం చెయ్యవలసిన అవసరముందని స్త్రీవాదులు అంటే దానర్థం జరిగిన సంఘటనల్నీ, వాటిని చరిత్రీకరించిన ప్రతుల్నీ, గ్రంథాల్నీ మళ్ళీ విమర్శకు పెట్టవలసిన అవసరం ఉందని. ఆవిధంగా సాహితీసంస్కృతిని పునర్నిర్మించాలి, పునఃసృజించాలి, పునరాలోచించాలి, పునర్లిఖించాలి, పునఃవిశ్లేషించాలి. ఈ మార్పు తీసుకురావాలంటే భాష నుండి మొదలుపెట్టాలి. స్త్రీవాదానికీ మానవతావాదానికీ భేదం చెరిపేసే దిశగా పాశ్చాత్య సాహిత్యంలో మూలగ్రంధాలనుండీ ప్రక్షాళన జరగాలి. వర్జీనియా వూల్ఫ్ చరిత్రను తిరగరాయాలంటారు, అడ్రియన్ రిచ్ స్త్రీల రచనలు గతాన్ని పునర్విమర్శ చెయ్యడంతో మొదలవ్వాలంటారు. ఆవిధంగా వేల ఏళ్ళ సాహితీ సంస్కృతిని స్త్రీవాదులూ, సాహిత్య విమర్శకులూ కలిసి విశ్లేషించి స్త్రీతత్వాన్ని పునఃనిర్వచించాలి.
లింగవివక్ష గాలిలా కంటికి కనిపించదు. ఆ కారణంగా వివక్ష ఉందని నిరూపణ చెయ్యడం కష్టం, అలాగే దాన్నుండి తప్పించుకోవడమూ అసంభవం. స్త్రీలపై కంటికి కనిపించని భారంగా మారిన ఈ వివక్ష వారి జీవితపు పరిమాణాన్నీ, ప్రమాణాల్నీ, కదలికల్నీ నిర్దేశిస్తోంది. కానీ ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, అన్నే సెక్స్టన్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయిత్రులు తమపై మోపబడిన ఆ భారాన్ని ప్రక్కకు తోసేస్తూ, మౌనాన్ని ఛేదిస్తూ అనేక రచనలు చేశారు. అందువల్ల పురుషాధిక్యత, లింగవివక్షకు సంబంధించిన వైరుధ్యాలు ముఖ్యంగా 19వ శతాబ్దపు తొలినాళ్ళలో స్త్రీ పురుష రచయితలిద్దరి అస్తిత్వవాద రచనల్లోనూ స్పష్టంగా కనిపించేవి. 'మేల్ టెక్స్ట్' బంధనాల్ని తెంచుకుంటూ అరోరా లీ, మేరీ ఎలిజబెత్ కాలేరిడ్జ్ వంటి స్త్రీలు కొన్నిసార్లు వారికి ఆపాదించిన ద్వంద్వ ప్రవృత్తులైన దేవతగానూ, మరి కొన్నిసార్లు రాక్షసిగానూ మార్చి మార్చి తమ ఉనికిని నిర్వచించుకోవడం మొదలుపెట్టారు.
ఈ దిశగా పరిశోధనలు చేస్తూ 'ది మాడ్ వుమన్ ఇన్ ది అటిక్' పేరిట స్త్రీవాద సాహిత్య విమర్శకులు సాండ్రా గిల్బర్ట్ మరియు సుసాన్ గుబార్ లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ద్వంద్వ ప్రవృత్తి కారణంగా తరతరాలుగా 'Anxieties of authorship' ద్వారా కష్టపడుతున్న రచయిత్రులు 18వ శతాబ్దం చివరకు వచ్చేసరికి పితృస్వామ్యపు సంకెళ్ళను ఛేదిస్తూ, తమపై మోపిన ఆంక్షల్ని ప్రశ్నిస్తూ తమ ఉనికిని కొత్త కొత్త కాల్పనిక ప్రపంచాలను సృష్టించడం ద్వారా పునర్నిర్వచించుకోవడం మొదలుపెట్టారు. స్త్రీలు రచనావ్యాసంగం వైపు వెళ్ళే ముందు మగవారు తయారుచేసిన 'ఆమెలోని ఆదర్శ మూర్తి'ని చంపాలని తీర్మానిస్తారు వర్జీనియా వూల్ఫ్. మరోవిధంగా చెప్పాలంటే స్త్రీల ఉనికిని సాహిత్యంలో లేకుండా చేసిన పితృస్వామ్యం కొలమానంగా పెట్టిన 'స్త్రీ ఎస్తెటిక్ ఐడియల్' ను నాశనం చెయ్యాలని అంటారు. అలాగే ఆమె ప్రత్యర్థిగా తయారుచేసిన ఆమెలోని 'రాక్షసి'ని పోలే ప్రతిమని కూడా నాశనం చెయ్యాలంటారు. కానీ పితృస్వామ్యపు సంస్కృతి సృష్టించిన స్త్రీ ఉనికిని నిర్వచించే ఈ రెండు మూర్తులనూ నాశనం చెయ్యాలంటే ముందుగా వాటి మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని, వాటి పుట్టుపూర్వోత్తరాలూ, పూర్వాపరాలూ అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు స్త్రీలు రాసిన రచనల్ని చదవాలి, వాటిలో స్త్రీవాద తత్వాన్ని లోతుగా పరిశీలించాలి. అయితే స్త్రీని దేవతగానో లేదా రాక్షసిగానో చిత్రించిన స్థితి ఆ కాలంలో రచయిత్రులను ఏదో ఒక ఇమేజిని తప్పనిసరిగా చంపే దిశగా ప్రభావితం చేసింది.
పాశ్చాత్య సాహిత్యాన్ని పునర్విమర్శిస్తూ వర్జీనియా వూల్ఫ్ ఒక సందర్భంలో "ఒక వృద్ధ ప్రొఫెసర్ డెబ్బయ్యో సారి కీట్స్ ని శోధించడమో, నూట యాభయ్యో సారి డాంటే ,మిల్టన్ ల గ్రంథాలను తిరగరాయించడమో చేసేలోగా మా రచయిత్రులం ఒక దుకాణంలో పనిచేసే సాధారణమైన అమ్మాయి వాస్తవ చరిత్ర పూర్తిగా రాయగలం" అంటారు. పితృస్వామ్య చరిత్రను శిలాశాసనాల్లా పదేపదే పునర్లిఖించే బదులు, చరిత్ర చెప్పకుండా వదిలేసిన కథల్నీ, కొత్త కథల్నీ చెప్పుకోవలసిన అవసరం ఉందని వూల్ఫ్ ఉద్దేశ్యం కావచ్చు. ఏదేమైనా స్త్రీల విషయంలో ఈ 'సాంస్కృతిక పరాయీకరణ' కు కారణాలేమై ఉండచ్చు ? ఆమె యొక్క మౌనమా ? స్త్రీకి పరిధులు నిర్దేశించడమా ? లేదా ఆమెను ద్వితీయ స్థానానికి పరిమితం చేయడమా ? అనే దిశగా స్త్రీవాదులూ, విమర్శకులూ ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనికి తోడు పితృస్వామ్యపు సాహితీ సంస్కృతిలో ఒక రచయిత్రి స్థానం ఏమిటన్న దిశగా ఆలోచిస్తే సాహితీ విమర్శలో ప్రధానంగా చర్చించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి: ఇక్కడ ప్రధానంగా వినిపించే స్వరం పురుషుడిది కాబట్టి ఆమె స్వరం అతణ్ణి అనుకరించాలా ? లేదా ఎదిరించాలా ? అతడితో తనదైన సాధికారిక స్వరంలో, తన సొంతమైన వాక్య నిర్మాణంతో, తనదైన భాషలో తన అభిప్రాయాన్ని చర్చించాలా ? ఇటువంటి అంశాలు కేవలం ప్రశ్నలుగానే మిగిలిపోకుండా ఇటు సిద్ధాంతపరంగానూ, అటు ఆచరణలోనూ రెండు విధాలుగానూ మార్పు తీసుకురావాలి.
ఇక సమకాలీన స్త్రీవాద విమర్శ విషయానికొస్తే మార్గరెట్ ఆట్వుడ్ , ఎలెనా ఫెరాంటే, జాడీ స్మిత్, ఝంపా లహిరి, చిమమంద అడిచి వంటి కొందరు ప్రామాణికత కలిగిన అతి కొద్ది స్త్రీవాద రచయిత్రులను మినహాయిస్తే అమెరికన్ రచయిత్రి రెబెక్కా సోల్నిట్ వంటి కొందరు స్త్రీవాదానికి ఫ్యాషన్ ఐకాన్స్ గా చెలామణి అవుతున్నారు. ఇటువంటి రచయిత్రుల 'పాపులర్' రచనలు నేటి స్త్రీవాదానికి చిహ్నంగా ప్రతీ ఇంటా కాఫీ టేబుల్ మీదో , యువతుల చేతుల్లో కాఫీ కప్పులతోనో, లేదా బీచుల్లోనో ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. నిజానికి రెబెక్కా వంటి స్త్రీవాదులు 'స్త్రీ మౌనం' గురించి ఉటంకించే అనేక విషయాలు Maya Angelou, Adrienne Rich, Cynthia Ozick , Simone de Beauvoir, Allison Bechdel లాంటి మునుపటి తరం స్త్రీవాదులు అనేక రచనల్లో చెప్పినవే. నిజానికి పాత పాటే మళ్ళీ పాడుతూ స్త్రీ గళాన్ని వినిపించకుండా శతాబ్దాలుగా అణిచివేశారని తన రచనల్లో రాసే సోల్నిట్ లాంటి స్త్రీవాదులు తమ రచనల ద్వారా స్త్రీవాదానికి కొత్తగా కలిపినదేమీ లేదు. నేటి స్త్రీవాద రచనల్లో తరచూ పాత విషయాలే పునరావృతమవుతుండడం చూస్తుంటాం. కాస్త లోతుగా పరిశీలిస్తే బహుశా రచయిత్రుల విషయంలో చెప్పినదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం తప్పనిసరి అయిపోయిందేమో అనిపిస్తుంది. బహుశా స్త్రీవాదుల స్వరాలు చేరాల్సిన చెవులకు చేరడం లేదేమో ! అందువల్ల నేటి స్త్రీవాద రచనలు పదే పదే ఫిర్యాదు చేస్తున్నట్లు అనిపించినా అదృష్టవశాత్తూ అవి మునుపటిలా మౌనాన్నైతే ఆశ్రయించడంలేదు. ఇక మన అదృష్టమో దురదృష్టమో మనం సోల్నిట్ లాంటి రచయిత్రుల పుస్తకాలు కూడా వదిలిపెట్టకుండా చదువుతున్నాం.
ఏదేమైనా లింగవివక్షపై అవగాహన వచ్చినంత తేలిగ్గా స్త్రీవాదులకూ, విమర్శకులకూ సాహితీ సంస్కృతిని పునర్లిఖించడం సాధ్యం కాలేదంటారు సాండ్రా గిల్బర్ట్, గాయత్రి స్పివాక్ వంటి సాహితీ విమర్శకులు. ఈ క్రమంలో మరోరకమైన వివక్షలు వారికి వివిధ రూపాల్లో అవరోధాలుగా తయారయ్యాయి. నిజానికి ఎక్కువమంది మగవారు (రచయితలు) స్త్రీవాద సదస్సులకు వెళ్ళడానికి ఆసక్తి చూపరు. స్త్రీ రచనల్ని గానీ, వారి వ్యాసాలను గానీ చదవరు. హేతువాద ఉద్యమంలో భాగంగా పండితులూ, ఉపాధ్యాయినులూ, రచయిత్రులుగా స్త్రీల ఉనికిని ఉద్దేశ్యపూర్వకంగా గుర్తించరు. అసలందులో వారి భాగస్వామ్యాన్ని పూర్తిగా నిరాకరిస్తారు. ఇటువంటి వివక్షలో కూడా పలురకాలుంటాయి. మొదటి రకపు వివక్ష సాహిత్యానికి ఎంతమాత్రమూ సంబంధంలేని వారి నుండి ఎదురవుతుంది. వీరు కాలక్షేపానికి ఏదో సూపర్ మార్కెట్ కో, సినిమాకో వెళ్ళి ఇంటికి తిరిగొచ్చి నిద్రపోయే బాపతు, వీళ్ళ విషయంలో పఠనం ఏ న్యూస్ పేపరుకో, లేదా సోషల్ మిడియా పోస్టులకో పరిమితమవుతుంది. సుమారు 50-60 శాతం ఉండే వీరిలో చాలామంది వినరు, చదవరు. కొంతమంది మాకెందుకొచ్చిందని విసుగ్గా ఆవలిస్తారు, మరికొంతమంది అజ్ఞానం నటిస్తారు. వీళ్ళంతా స్త్రీవాద సాహిత్య విమర్శను ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరిస్తారు.
ఇక స్త్రీవాద విమర్శపై రెండో రకమైన తిరస్కరణ ఎటువంటి వివక్షా లేదని విపరీతమైన ఆశావహదృక్పథాన్ని (“apparently supportive tokenism") అవలంబించే పండితవర్గం నుండి ఎదురవుతుంది. అంతా బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారనుకునే వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, ఏవైనా సంకలనాలను ప్రచురించేటప్పుడు అందులో కనీసం ఒకరిద్దరు స్త్రీలయినా లేకపోతే బావుండదని ఎవరో ఒక 18వ శతాబ్దపు స్త్రీ కవయిత్రికి చెందిన కొన్ని కవితల్ని ఏరుకొచ్చి కంటితుడుపు చర్యగా అందులో కలిపేవారు. ఏదో విధంగా ప్రసిద్ధికెక్కినవారినో, లేదా ఆ సమయానికి తాజావార్తల్లో ఉన్న ఒకరిద్దరు రచయిత్రుల్నో తప్ప మిగతా అందర్నీ పూర్తిగా విస్మరించేవారు. అదేమంటే వీరి సమాధానం : "ఆమె స్త్రీయే కదా, ఆమె రచనల్ని సంకలనంలో కలిపాం కదా !". వీరు ప్రతీ సాహితీ విభాగంలోనూ ఒక స్త్రీవాది ఉంటే చాలనుకునే వర్గం.
ఇక స్త్రీవాద విమర్శకు మూడో తరహా తిరస్కరణ ప్రత్యక్ష శత్రుత్వం ద్వారా జరుగుతుంది. చాలాసార్లు శత్రుత్వాన్ని బాహాటంగా ప్రదర్శించడానికి రచయితలు ఇష్టపడకపోయినా రచయిత్రులు ఏ మాత్రం మొహమాటపడకుండా తమ వ్యతిరేకతనూ, తిరస్కారాన్నీ ప్రదర్శిస్తారు. ఈ శత్రుత్వం వెనుక కంటికి కనిపించని గాలిలా పితృస్వామ్య మూలాలుంటాయి. ఏదేమైనా ఈ తిరస్కారాలన్నీ అధిగమించి స్త్రీవాద విమర్శకులు స్త్రీవాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అనేక రచనల్ని ప్రచురించారు. ఏదేమైనా స్త్రీవాదులు గళం విప్పడం అన్ని చారిత్రక మూలల్నీ సమూలంగా పెకలించివేస్తుంది అనేది కేవలం ఒక మెటఫోర్ గా చూడడం వరకే బావుంటుంది. స్త్రీవాదం వినాశనాన్ని కోరదు, ఎటువంటి వివక్షలకూ తావులేని సమాజాన్ని నిర్మించే దిశగానే ప్రయాణిస్తుంది. అందువల్ల స్త్రీవాద ఉద్యమాన్ని విచ్ఛేదనంగా చూడడం కంటే పునర్నిర్మించడంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారత సంతతికి చెందిన అమెరికన్ సాహితీవేత్త గాయత్రి చక్రవర్తి స్పివాక్ ని చదువుతున్నప్పుడు ఆమె అనేక రచనలను విశ్లేషించడానికి ఉపయోగించిన డెఱిడా ప్రతిపాదించిన 'డీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్' ని స్త్రీ ఉనికిని పునఃనిర్వచించే దిశగా మన ప్రాచీన సాహిత్యం మొదలు సమకాలీన సాహిత్యం వరకూ వర్తింపచెయ్యాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. స్త్రీ అస్తిత్వాన్ని ఇప్పటి తూకపురాళ్ళతో మరోసారి తూచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో స్త్రీవాద సాహిత్య విమర్శకుల అవసరం మునుపటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఉంది. ఒకనాడు అస్తిత్వం చాటుకునే దిశగా సంకెళ్ళు తెంచుకుంటూ మొదలైన స్త్రీవాద ఉద్యమం క్రమేపీ ఆధిపత్యపోరులోకి దిగకూడదని ఆశిద్దాం. స్వాతంత్య్రం కోసం చేసే ప్రతీ పోరాటమూ గెలుపు దిశగా అడుగులు వేయిస్తుంది, కానీ ఆధిపత్యం కోసం చేసే ప్రతీ పోరాటంలోనూ కేవలం వినాశనమే మిగులుతుంది. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ మాత్రమే సాధించే దిశగా స్త్రీవాదం తన సాధికారతను చాటుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఈ వ్యాసం రాయడానికి సహాయపడిన రచనలు :
Rereading Women By Sandra M. Gilbert
Still Mad By Sanda M Gilbert
The Madwoman in the Attic By Sandra M. Gilbert, Susan Gubar
In the Margins. On the Pleasures of Reading and Writing By Elena Ferrante
A Room of One's Own By Virginia Woolf
In other worlds By Gayatri Chakravorty Spivak