'స్టోయిసిజం' అంటే స్వార్థంతో కూడిన తత్వమనీ, మనిషితనం లోపించిన ఫిలాసఫీ అనీ కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి కొందరు ఇంకాస్త ముందుకు వెళ్ళి విరాగుల్లో నార్సిసిస్టిక్ లక్షణాలు ఉంటాయని కూడా అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. విరాగులు మనుషుల్ని భావోద్వేగాల నుండి పూర్తిగా వేరుపడి హేతుబద్ధతతో ఆలోచించమంటారు. తనకుమాలిన ధర్మం చెయ్యవద్దంటారు. వ్యక్తిత్వ నిర్మాణంపై, మానసిక అభివృద్ధిపై శ్రద్ధపెట్టమంటారు. వ్యక్తిగత సమయానికీ, ఏకాంతానికీ విలువిమ్మంటారు. సంఘజీవిగా ఉంటూనే తామరాకుపై నీటిబొట్టులా ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఇక కొందరు విరాగులైతే అన్ని శాస్త్రాల్లోకీ తాత్వికత మాత్రమే అధ్యయనం చెయ్యవలసిన శాస్త్రమని బలంగా నమ్ముతారు. అందువల్ల స్టోయిక్ తత్వమంతా వ్యవస్థకు దూరంగా వ్యక్తి ప్రధానంగా కనిపిస్తుంది.
నిజానికి మార్కస్ ఆరీలియస్ వంటివారు ఒక సాధారణ జర్నల్ లా రాసుకున్న అంశాలే తదుపరి కాలంలో "మెడిటేషన్స్" పేరిట ఒక గొప్ప ఫిలాసఫీ పుస్తకంగా అవతరించాయి. సెనెకా రాసిన ఉత్తరాలే స్టోయిక్ ఫిలాసఫీలో కీలక భాగంగా మారాయి. ఎపిక్టెటస్ చేసిన ప్రసంగాలు కాలాలు మారి తాత్విక బోధనల రూపు దాల్చాయి. వీళ్ళ తత్వం చదువుతుంటే ఈ ప్రాచీన గ్రీకు, రోమన్ తత్వవేత్తలు ఆధునిక మానవుడికంటే ఎన్నో రెట్లు వివేకవంతులనిపిస్తుంది. ఎందుకంటే ఆధునిక తరానికి భిన్నంగా వీరికి మొక్కకు పురుగు పట్టి కుళ్ళిపోవడం మొదలుపెడితే వైద్యం వేర్లకు చెయ్యాలని తెలుసు. వీళ్ళు నేటి తరంలోలా ఆకులకూ, కొమ్మలకూ మాత్రమే వైద్యం చేస్తూ కూర్చోకుండా మొక్క మూలాల దగ్గర మట్టిని మారిస్తేనో లేదా శుభ్రం చేస్తేనో మాత్రమే దానికి జీవం వస్తుందనే కనీస గ్రహింపు ఉన్నవాళ్ళు. అందువల్ల వ్యక్తి బాగుంటేనే వ్యవస్థ బావుంటుందని నమ్మే వీరి తత్వమంతా మనిషిని మంచి విలువలతో ఉన్నతుడిగా మార్చే దిశగానే సాగుతుంది.
ఇక "Those who lack the courage will always find a philosophy to justify it." అని ఆల్బర్ట్ కామూ అన్నట్లు స్టోయిక్ ఫిలాసఫీని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అందులోని భావోద్వేగాలను జయించడం, స్వీయ స్పృహ కలిగి ఉండడం వంటి అంశాల్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలాంటివి ఏ ఫిలాసఫీ విషయంలోనైనా సహజంగా జరిగేదే. నేడు సూడో ఇంటెలెక్చువల్స్ రాస్తున్న బెస్ట్ సెల్లింగ్ మేనేజ్మెంట్ పుస్తకాల్లో ఎదుటి మనిషిని ఎలా ఏమార్చాలి ? మన మాట ఎలా నెగ్గించుకోవాలి ? మనదే పైచెయ్యిగా ఆధిపత్యం ఎలా సాధించుకోవాలి ? మన స్వార్థానికి ఎదుటి మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి ? వంటి అంశాలు తరచూ కనిపిస్తున్నాయి. వీటికి భిన్నంగా స్టోయిక్ ఫిలాసఫీ ఇతరులకు కీడు తలపెట్టకుండా ఆరోగ్యకరమైన / ఆమోదయోగ్యమైన 'ఆత్మరక్షణ' ఎలా చేసుకోవాలో నేర్పుతుంది.
ఏ మానవ మేధస్సు మనిషి ఉనికిని అర్థవంతంగా చేసిందో, నేడు అదే మేధస్సు కృత్రిమత్వంతో అదుపు తప్పి మనిషిని వినాశనంవైపు నడిపిస్తోంది. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నట్లు ఆధునిక ప్రపంచంలో ప్రతీ స్వల్ప విషయాన్నీ సమస్యగా మార్చుకునే మానవ మేధను నియంత్రణలో ఉంచాల్సిన తరుణంలో కులమత జాతి విద్వేషాలు, భిన్నవాదాలూ, గందరగోళాల మధ్య మనిషికి స్థితప్రజ్ఞత సాధించడానికి విరాగులు బోధించిన తత్వం యొక్క అవసరం మునుపటి కంటే నేడు మరింత ఎక్కువగా ఉందనిపిస్తుంది.
పెంగ్విన్ వారు 'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' సిరీస్ లో భాగంగా గ్రీకు, రోమన్ తత్వవేత్తలైన మార్కస్ ఆరీలియస్, సెనెకా, ఎపిక్టెటస్ రాసిన పుస్తకాల్లోని కొన్ని భాగాల్ని ఎంపిక చేసి ఆ సారాన్ని 'How to be a stoic' పేరిట ప్రచురించారు. ఇందులో, ఎపిక్టెటస్ 'Enchiridion', సెనెకా 'On the shortness of life' మరియు మార్కస్ ఆరీలియస్ 'Meditations' నుండి సంగ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. మునుపు 'ఎన్చిరిడియన్' తప్ప మిగతా రెండిటి గురించీ విడివిడిగా రాశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రస్తావించడం లేదు. 'ఎన్చిరిడియన్' లో కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం.
* మనిషి 'స్వేచ్ఛ' అంటే సకల సౌకర్యాల మధ్యా భౌతికంగా స్వతంత్రంగా బ్రతకడం మాత్రమే అనుకుంటాడు. కానీ ఎదుటివాళ్ళ అభిప్రాయాలకు అవసరం లేనప్పుడు కూడా విలువిస్తూ, ఎవరేమనుకుంటారో అని నిత్యం భయంతో బ్రతుకుతూ, ఒక చట్రంలో ఇమిడే క్రమంలో మానసికంగా తన ఆలోచనల్లో బానిసగా మిగిలిపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోలేక తన అధీనంలో లేని విషయాలను గూర్చి తలపోస్తూ నిత్యం చింతలో, ఆందోళనలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
* మన గురించి ఎదుటివారి అభిప్రాయాలు వారి మనసులో మనపట్ల కలిగే భావాలు, తలంపుల ఫలితం మాత్రమే. మనల్ని నిర్వచించేవి వారి భావాలు కాదు గనుక మన అధీనంలో ఎంతమాత్రమూ లేని ఆ అభిప్రాయాలతో మనకు నిమిత్తం లేదు.
* అజ్ఞాని తన దురదృష్టానికి ఎదుటివారిని నిందిస్తాడు. తనని తాను నిందించుకునేవాడు అభివృద్ధి మార్గం వైపు నడుస్తాడు. వివేకవంతుడు తననూ నిందించుకోడు, ఇతరులనూ నిందించడు.
* జీవితంలో అన్ని సంఘటనలూ మనకు అనుకూలంగానే జరుగుతాయనుకోకూడదు. జరిగే సంఘటనలను యథావిధిగా అంగీకరించడమే శాంతికి మార్గం.
* ఎటువంటి సందర్భంలోనూ "నేనిది కోల్పోయాను" అనుకోకు. "నేనిది తిరిగిచ్చాను" అనుకో. ఒక యాత్రికుడు తాను తాత్కాలికంగా బస చేసిన సత్రాన్ని ఎలా భావిస్తాడో అలా ఆ క్షణంలో నీకు దక్కినదానిని ఆనందించడం నేర్చుకో.
* నీ శరీరం ఎవరు పడితే వారి నియంత్రణలోకి వెళ్ళడాన్ని నువ్వు వ్యతిరేకిస్తావు. కానీ నీ మెదడుని మాత్రం నిన్ను విమర్శించిన ఎవరి నియంత్రణలోకైనా వెళ్ళడానికెందుకు అనుమతిస్తావు ?
* నువ్వు ఎటువంటి వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావో దానికి కట్టుబడి ఉండు, సమూహంలోనైనా, ఒంటరిగానైనా సరే.
* అధికభాగం మౌనాన్ని అలవరుచుకో. అవసరమైనంతే క్లుప్తంగా మాట్లాడు. ఎవరైనా మాట్లాడమని కోరితే సామాన్యమైన, వ్యర్థమైన విషయాలను గూర్చి మాట్లాడకు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులను గూర్చి పుకార్లు, ఫిర్యాదులు, పొగడ్తలు, నిందించడం, పోల్చుకోవడం లాంటివి చెయ్యకు.
* ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని తెలిస్తే సంజాయిషీ ఇస్తూ నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. దానికి బదులు- "వారికి విషయం సగం కూడా తెలియదు. తెలిస్తే మరికాస్త ఎక్కువ చెప్పి ఉండేవారు" అను.
* ఎవరైనా నిన్ను సత్యదూరంగా విమర్శిస్తుంటే, అది వారు సరైనదని నమ్ముతూ, తమ దృష్టి కోణం నుండి మాత్రమే మాట్లాడుతున్నారని గ్రహించు. వారి అభిప్రాయాలు తప్పైతే వారే మున్ముందు తమ అజ్ఞానంతో కూడిన స్వయంకృతానికి ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ నువ్వు మాత్రం నీ విమర్శకుల పట్ల దయతో వ్యవహరించినవాడివవుతావు.
Sooooooopppper like 👌👌👌
ReplyDelete