కొత్త రచయితలకు మాత్రమే ఇచ్చే అకుతాగవా ప్రైజుకు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయి "used goods" అని ముద్ర వేయించుకున్నా, స్వదేశంలోనే సాహితీ ప్రపంచం మొత్తం ఏకమై ఆయన రచనలు సాహితీ విలువలకు సుదూరమైనవంటూ తూర్పారబట్టినా, "ఆకుతాగవా ప్రైజు గెలుచుకోడంలో మురాకమీ వైఫల్యానికి కారణాలు" వంటి ఛీసీ పేర్లతో కొందరు విమర్శకులు పుస్తకాలు రాసి పరిహసించినా ప్రఖ్యాత జపాన్ రచయిత హరుకి మురాకమీ మాత్రం తాను చెయ్యాలనుకున్నదే చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన పంథాలోనే రచనావ్యాసంగాన్ని కొనసాగించి బెస్ట్ సెల్లర్స్ రాసే నవలాకారుడిగా సొంత గడ్డైన జపాన్లోనే కాక అంతర్జాతీయ ఖ్యాతిని కూడా గడించారు. ప్రతీ తరంలోనూ సాహితీ విలువల కొలమానాల్లో తూగగలిగిన రచనలు కొన్నైతే, ఆ నిర్ణీత కొలమానాలకు దూరంగా జనాదరణ పొందిన సాహిత్యంగా పాఠకుల అభిమానాన్ని చూరగొనేవి మరికొన్ని. తెలుగులో యద్దనపూడీ, ఆంగ్లంలో జేన్ ఆస్టెన్ వంటివారు అటువంటి రచనలే చేసి పాఠకుల మనసుల్లో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నారు. మురాకమీ రచనలు కూడా అటువంటి కోవకే చెందుతాయి.
|
Image Courtesy Google |
మురాకమీ జపాన్ లోని క్యోటోలో మొదలై న్యూయార్క్ టైమ్స్ వరకూ సాగిన తన సాహితీ ప్రయాణాన్ని గురించి "Novelist as a Vocation" పేరిట కొన్ని వ్యాసాలు రాశారు. కానీ ఒక స్థాయికి చేరుకున్నాకా వర్ధమాన రచయితలకు రాయడం విషయంలో సూచనలిచ్చే చాలామంది రచయితల్లా మురాకమీ ఈ పుస్తకంలో నవలలు ఎలా రాయాలో, ఎలా రాయకూడదో చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. ఒక నవలాకారునిగా ఆయన వ్యక్తిగత అనుభవాల సమాహారంగా రాసిన ఈ వ్యాసాలు యువ రచయితలకు దిశానిర్దేశం చేసే గైడ్ లా కంటే ఆయన రచయితగా ఎదిగే క్రమంలో ఎదుర్కున్న ఆటుపోట్లనూ, అనుభవాలను గురించే ఎక్కువ చెబుతాయి.
ఏ రంగంలో నైనా ఒక పోతపోసినట్లుండే శైలికి భిన్నంగా ఏది కనిపించినా ముందు తిరస్కారంతో కూడిన విమర్శలు వెల్లువెత్తడం సహజమే. సాహిత్యం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. నిజానికి ఈ పోకడలూ ఈనాటివి కాదు. చిత్రకళా రంగంలో విన్సెన్ట్ వాన్ గో, క్యూబిజం శైలికి ఆద్యుడైన పాబ్లో పికాసో వంటి దిగ్గజాల పెయింటింగ్స్ ని తొలిసారిగా చూసిన కళాప్రియులు కూడా అప్పట్లో విస్తుపోయి పెదవి విరిచారంటారు. అదే విధంగా ఎర్నెస్ట్ హెమ్మింగ్వే, Natsume Sōseki వంటివారి రచనలు నేడు నీరాజనాలందుకుంటున్నప్పటికీ, వారు కూడా తమ సమకాలీనులనుండి నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కున్నారు. అలనాటి సాంస్కృతిక మేథోవర్గం తీవ్రంగా విమర్శించిన వారి రచనలు నేడు ప్రామాణికమైనవిగా నిలబడడంలో ఎంతమాత్రమూ ఆశ్చర్యం లేదు. మురాకమీ కూడా తన రచనలు కాలగతికి ఎదురీది నిలబడతాయో లేదో భవిష్యత్తులో తన పాఠకులే చెప్పాలంటారు.
మురాకమీ రచయితగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్ళలో సాహితీ వర్గాల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నారు. "దీన్ని నవల అనలేం" అని కొందరూ, "ఇది సాహిత్యం కాదని" మరికొందరూ ఆయన రచనల్ని తరచూ విమర్శించేవారు. కథలూ, నవలికలూ రాయడంలో కూడా తనదైన ప్రత్యేకమైన ముద్రను వేసినప్పటికీ ఎక్కువ నిడివి ఉన్న పెద్ద నవలలు రాయడాన్ని తన ప్రత్యేకతగా చెప్పుకుంటూనే, ఏ రచయితకైనా తానొక కళాకారుణ్ణని చెప్పుకోకపోవడం మనసుమీద నుండి పెద్ద గుదిబండ దింపుకోవడంతో సమానమంటారు. నిజానికి తానొక "ఆర్టిస్టుని" అనుకోకపోవడం వల్ల రచయితలపై వత్తిడి ఉండదు. ముఖ్యంగా రచయితలు తాము రచయితలని భావించుకోకపోవడంలో ఒకవిధమైన స్వేచ్ఛ ఉంటుంది. ప్రపంచం వాళ్ళనెలా చూస్తుందనే దానితో సంబంధం లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఏది ఎలా కావాలంటే అలా చేసే స్వాతంత్య్రం ఉంటుంది. ఇటువంటి స్వేచ్ఛ సృజనాత్మకతలో కీలక పాత్ర పోషిస్తుంది. "వ్యవస్థ తన మార్గంలో తాను వెళ్తుంది, నేను నా మార్గంలో నా పని చేసుకుంటాను." అని ఆత్మవిశ్వాసంతో అనగలిగే మురాకమీ, ఎవరికీ జవాబుదారీ లేని విధంగా తనకు వీలైన షెడ్యూల్స్ ని బట్టి నచ్చినట్లు రాసుకోడానికి అవసరమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండడం ఒక రచయితకు మిక్కిలి అవసరమంటారు.
"నవలలు రాయడమంటే నిజానికి నీ గురించి నీవు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెప్పుకోవడం లాంటిదే. అందువల్ల ఒక రచయితగా రాయడం గురించి మాట్లాడడమంటే, నీ గురించి నువ్వు మాట్లాడడమే." అంటూ మురాకమీ ఒకవేళ తానొక రచయిత గనక కాకపోయుంటే తన ఉనికిని గుర్తించే ప్రత్యేకతలు తనలో ఏమీ లేవని అంటారు. భాష మీద పట్టూ, సృజనాత్మకత మినహా నవలాకారులవ్వడానికి ఎవరికైనా ప్రత్యేకార్హతలేవీ అవసరం లేదు కానీ మురాకమీ పరిశీలనలో బాగా తెలివైనవాళ్ళు నవలాకారులు కాలేరు. కొంత విద్య, కాసిన్ని తెలివితేటలూ, విభిన్న విషయాలపై అంతో ఇంతో జ్ఞానం రచయిత కావడానికి అవసరమే అయినా "నువ్వు తెలివైన వాడిననుకుంటున్నావా ?" అని ఎవరైనా అడిగితే, అవునని ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పడానికి కష్టపడతానంటారాయన. "మీరొక ఊరిలో నడుస్తూ వెళ్తుంటే, నాలాంటి సాధారణ వ్యక్తులు మీకు అడుగడుక్కీ తారసపడతారు. వీళ్ళు నలుగురిలో ప్రత్యేకంగా నిలబడే వ్యక్తులు కాదు, తెలవారుతుండగా కాకా హోటళ్ళలో పరమ అశుభ్రంగా ఉండే టేబుల్స్ దగ్గర టీ తాగుతూ కూర్చునే మామూలు మనుషులు. ఒకవేళ నేను నవలలు రాయకపోయి ఉంటే బహుశా నా ఉనికిని కూడా ఎవరూ గుర్తించేవారు కాదు." అనడం ఆయనలో ఎదిగినకొద్దీ ఒదిగి ఉండే తత్వానికి చిన్న ఉదాహరణ మాత్రమే.
కొంతమంది నవలాకారులు పత్రికల వాళ్ళో, ప్రచురణ సంస్థలో రాయమని కోరితే రాస్తారు. ఇది చాలామంది ప్రొఫెషనల్ రైటర్స్ సహజంగా చేసేదే. కానీ మురాకమీ ఒక పూర్తి స్థాయి రచయితగా నిలదొక్కుకునే వరకూ ఆ విధంగా రాయలేదని అంటారు. బహుశా ఆయనలాంటి వాళ్ళు ఈ కాలంలో అరుదు కావచ్చు. బాల్యంలో అన్ని రకాల పుస్తకాలూ చదివినప్పటికీ ప్రత్యేకం రష్యన్ అనువాదాలంటే ప్రీతిగా ఉండేదని చెప్పుకునే మురాకమీ, తనకు ఆధునిక జాపనీస్ సాహిత్యం (సీరియస్ వెరైటీ) పట్ల ఎటువంటి అవగాహనా లేదని చెప్పడం గమనార్హం. నిజానికి మురాకమీ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో జాపనీస్ సాహిత్యం అంటే కావబాతా, తనిజాకి, మిషిమా వంటి వారి పేర్లే ప్రముఖంగా వినిపించేవి. ఈ రచనలు కూడా నిర్ణీత మేథోవర్గానికి చెందినవి కావడంతో వాటిని చదివే పాఠకవర్గం కూడా మితంగానే ఉండేది. అటువంటి సమయంలో సాధారణ పాఠకులు సైతం తమను తాము సులభంగా గుర్తుపట్టుకోగల పాత్రల రూపకల్పన చేసిన మురాకమీ వినూత్నమైన శైలి జపాన్ సాహిత్యంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.
సమకాలీన జాపనీస్ సాహిత్యం చదవనందువల్ల తాను నవలలు రాయడం మొదలుపెట్టే సమయానికి జపాన్లో ఎటువంటి పుస్తకాలు రాసేవారో, ఎటువంటి సాహిత్యాన్ని జనం ఎక్కువగా ఆదరించేవారో తనకు తెలీదంటారు మురాకమీ. బహుశా ఈ అవగాహనాలేమే పొంతనలూ, పోటీతత్వాలకు దూరంగా నవలాకారుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన శైలిని తయారుచేసుకోవడంలో మార్గం సుగమం చేసిందనిపిస్తుంది. అందుకే, "నా వరకూ నేను ఇలా మాత్రమే రాయగలను, అందుకే అదే చేస్తాను." అంటారాయన. ప్రశంసలూ, విమర్శలకతీతంగా, వాస్తవానికి ఏ రచయితకైనా అనుకరణలకు దూరంగా తనదైన ప్రత్యేకమైన శైలీ ఉండడం ఎంతో అవసరమని ఒడిదుడుకుల మురాకమీ సాహితీ ప్రయాణం నిరూపిస్తుంది. ఈ విషయాలన్నీ పంచుకుంటున్నా మురాకమీ "నవలలు అంటే ఇలాగే రాయాలి" అని ఎక్కడా చెప్పిన దాఖలాల్లేవు. నిజమే కదా ! మనమో వందమంది నవలాకారుల్ని తీసుకుంటే, వందమంది వంద రకాలుగా రాయడం గమనిస్తాం.
ఫిక్షన్ రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో మురాకమీ శైలిపై విమర్శలు ఏ స్థాయిలో వెల్లువెత్తేవంటే, చివరకు ఒక ప్రఖ్యాత విమర్శకుడు ఆయన్ని "కాన్ మాన్" అని అవమానించారట. అయినప్పటికీ దాన్ని కూడా మెచ్చుకోలుగానే తీసుకుంటానంటారు మురాకమీ. ఒక నవలాకారుడిగా పాఠకులకు కట్టు కథలు చెప్పి మభ్యపెట్టడాన్ని మించిన బాధ్యత మరొకటుంటుందా అన్నది ఆయన వాదన. అదే సమయంలో ఎంత సానుకూల ధోరణి అవలంబించినా ఇటువంటి విమర్శలు చేదు మాత్రల్లా నిరుత్సాహపరుస్తాయి. సరిగ్గా ఇటువంటి సమయాల్లోనే పోలిష్ రచయిత హెర్బర్ట్ అన్నట్లు, "నీ లక్ష్యాన్ని చేరాలంటే ప్రవాహానికి ఎదురీదాలి. కేవలం చెత్త మాత్రమే ప్రవాహంతో బాటు వెళ్తుంది" అన్న మాటలు నిరాశ అలుముకున్న సందర్భాల్లో తన మీద ఎంతో ప్రభావం చూపించాయని చెప్పే మురాకమీ స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక నవలలు రాయడానికి విదేశాల్లో తలదాచుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సంప్రదాయతకు పెద్ద పీట వేసే అనేక ఆసియా దేశాల్లాగానే జపాన్ లో కూడా అధిక శాతం జనాభాకు ప్రవాహానికి ఎదురీదే వాళ్ళంటే ద్వేషం ఉంటుందంటారు. ఈ కారణంగా జపాన్ లాంటి దేశాల్లో సాంస్కృతికపరమైన భారాన్ని మోస్తూ ముందుకు అడుగు వెయ్యడం కళాకారులకు పెనుసవాలుగా ఉండేది.
ఫిక్షన్ విషయంలోనే కాక నాన్ ఫిక్షన్ రాయడానికి ప్రయత్నించినప్పుడు కూడా మురాకమీకి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. తన రచనలకు భిన్నంగా "టోక్యో సబ్వే గ్యాస్ ఎటాక్" నేపథ్యంలో "అండర్ గ్రౌండ్" ని ప్రచురించినప్పుడు ప్రొఫెషనల్ నాన్ ఫిక్షన్ రచయితల తీవ్రమైన విమర్శలు ఎదుర్కున్నారాయన : “a display of ignorance of the basic rules of nonfiction”; “a tearjerker of the first order”; “the work of a dilettante.” లాంటి విమర్శనాస్త్రాలెన్నో. "నిజానికి నాకు నాన్ ఫిక్షన్ రాసే ఉద్దేశ్యం లేదు. ఏ జానర్ నియమాలకూ లోబడని రచన చేద్దామని ప్రయత్నించాను. కానీ ఈ క్రమంలో 'నాన్ ఫిక్షన్ పవిత్ర స్థలాన్ని' పరిరక్షించే పులుల తోకల మీద తెలీకుండానే కాలేసి వాళ్ళకి కోపం తెప్పించానని" చిరునవ్వు నవ్వుతారాయన. కారణాలేవైనా ఒక రంగంలో నిష్ణాతులు ఆ రంగంలో కొత్తగా వచ్చినవారి పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సహజమే. ఆ అథారిటీ ఎంత శక్తిమంతంగా ఉంటే కొత్తవారిపై వ్యతిరేకత కూడా అంతే తీవ్రంగా ఉంటుంది.
కొన్ని వ్యాసాల్లో మనుషుల్నీ, మనస్తత్వాల్నీ చదవడంలో మురాకమీకి సహజంగా అబ్బిన నైపుణ్యం ఆయనపై వచ్చే విమర్శలకు సహేతుకమైన కారణాలు విశ్లేషించడంలోనూ కనిపిస్తుంది. ఆయన రచనలపై సదభిప్రాయం లేని వారి గురించి రాస్తూ, "నిజానికి చాలామంది విమర్శకులు రచనల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు, ఒకవేళ ఏదైనా నవలో, కథో అర్థమైనా దాన్ని సమర్థవంతంగా వ్యక్తీకరించడం వారికి చేత కాదు. సాధారణంగా ఇటువంటి విమర్శకుడు నవలాకారుడి కంటే చాలా తెలివైన వాడు, అతి వేగంగా పనిచేసే అతడి మెదడు మెల్లగా నడిచే వాహనమైన నవల వేగానికి సర్దుకోలేదు. ఈ కారణంగా వారు ఆ నవల మొత్తం వచనాన్ని తమ వేగానికి తగ్గట్లు చిన్న సారాంశంగా కుదించి అనువదించుకుని, దాన్ని బట్టే విమర్శను చేస్తారు. ఈ క్రమంలో నవలకు ప్రాణంపోసే ప్రాముఖ్యత కలిగిన వివరాలనూ, చిన్న చిన్న సంగతులనూ వదిలేస్తారు." అని చెప్పడంలో విమర్శకులే కాదు, పాఠకులు కూడా ఒక నవలను ఓపిగ్గా ఎలా చదవాలో, ఎలా చదవకూడదో చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది. అందులోనూ నవలా ప్రక్రియ మెల్లిగా అంతరించిపోతున్న ఈ సూపర్ ఫాస్ట్ ఆధునిక తరానికి ఈ సలహా అనుభూతి చెందడంలో వేగాన్ని తగ్గించుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది.
మురాకమీ ఒక సందర్భంలో నవల రాయడాన్ని ఒంటరి ప్రయాణంతో పోలిస్తే మరోచోట నవలాకారుడిగా మారే విధానాన్ని రెజ్లింగ్ రింగ్ లోకి ప్రవేశించడంతో పోలుస్తారు. ఆయన ఉద్దేశ్యంలో : "నవలదేముంది !! ఎవరైనా రాయగలరు." ఇలా అనడంలో ఆయనకు నవల రాయడాన్ని తక్కువ చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు అనిపించదు. ఆయన దృష్టిలో అదొక పొగడ్త. తీవ్రమైన కృషీ, సాధనా అవసరమైన అనేక కళారూపాల కంటే ఇది సులభమని ఆయన భావన. అర్హతలూ, సర్టిఫికెట్లతో సంబంధం లేని నవలాకారుల ప్రపంచం ధైర్యంగా బరిలోకి దిగి కుస్తీకి సిద్ధపడ్డ ఎవరినైనా స్వాగతించే ప్రొఫెషనల్ రెజ్లింగ్ రింగ్ లాంటిది. ఆ రెస్లింగ్ రింగ్ చుట్టూ ఉండే తాళ్ళ మధ్య అంతరం ఎవరైనా అందులో ప్రవేశించడానికి అనువైనంత వెడల్పుగా ఉంటుంది. ఆ రింగ్ లోపలి వైశాల్యం కూడా ఎక్కువే. ఇక ఎవరినైనా అందులో ప్రవేశించకుండా ఆపడానికి సెక్యూరిటీ వాళ్ళు ఉండరు, లోపల రిఫరీ బయటకి పొమ్మని మీ మీద అరవడు. అప్పటికే రింగ్ లోపల ఉన్న రెజ్లర్స్, అంటే ప్రసిద్ధ నవలాకారులు, "రావోయ్, సరదాగా ఒక పట్టు పడదాం" అని మిమ్మల్ని కూడా రింగ్ లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. The ring is—how shall I put this?—an airy, easy, accommodating, altogether laid-back environment." అంటారు మురాకమీ. కానీ కంటికి కనిపించిన ఏ విషయంపైనైనా వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసేవాళ్ళు నవలాకారులుగా రాణించే అవకాశం తక్కువన్నది మురాకమీ భావన. అటువంటి వాళ్ళు రచయితలుగా కంటే పాత్రికేయులుగా, విమర్శకులుగా బాగా పనికొస్తారంటారు.
మురాకమీ తన వ్యాసాల్లో అనేక అంశాలను చర్చించగా, ముఖ్యంగా సాహితీ పురస్కారాల గురించీ, రచయితల శారీరక, మానసిక ఆరోగ్యం గురించీ విశ్లేషించిన అంశాలు పాఠకుల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఆయన అవార్డుల గురించి రాసిన వ్యాసంలో, ఎన్ని బెస్ట్ సెల్లర్స్ రాసినప్పటికీ సాహితీ విలువలు లేవంటూ మేథోవర్గం చేసిన విమర్శల కారణంగా తన రచనల్ని సాహితీ పురస్కారాలు వరించకపోవటం పట్ల మురాకమీలో కాస్త నిరాశతో కూడిన కోపం ఉన్నట్లు కనిపిస్తుంది. మురాకమీ కోవలోనే పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న పలు రచనలు చేసిన అమెరికన్-బ్రిటిష్ రచయిత రేమండ్ చాండ్లెర్ సైతం ఒక సందర్భంలో తనకు నోబెల్ బహుమతి రావకపోవడం పట్ల స్పందిస్తూ అప్పటికే నోబెల్ ను అనేకమంది సెకండ్ రేట్ రచయితలకి ఇచ్చిన కారణంగా దానికి వెలువ లేదనీ, అయినా ఆ ప్రైజు తీసుకోడానికి హుందాగా డ్రెస్ చేసుకుని, ప్రసంగం తయారుచేసుకుని మరీ స్వీడన్ వరకూ వెళ్ళేంత విలువ నోబెల్ కి లేదనీ వ్యంగ్యాస్త్రాలు విసిరారంటారు.
సాహితీ రంగంలో తన వ్యక్తిగతానుభవాల్ని ఒక్కొక్కటిగా విప్పి చెబుతూ "ఆర్టిస్టు" ల చుట్టూ ఉండే అనేక భ్రమల్ని తొలగించే ప్రయత్నం చేస్తారు మురాకమీ. రచయితల్ని అందర్నీ ఒకే గాటన కట్టెయ్యకపోయినా, చాలా మంది నవలాకారులు నిజాయితీ, స్నేహపూర్వక స్వభావం కలిగిన వాళ్ళు కాదనీ, అందరూ అనుకున్నట్లు మంచి స్ఫూర్తినిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలిచే వాళ్ళూ అంతకంటే కాదనీ అంటారు. మురాకమీ మాటల్లోనే చూస్తే రచయితలు సహజంగా విపరీత స్వభావాలతో, విచిత్రమైన జీవన విధానాలతో, భిన్నమైన ప్రవర్తనలతో ఉంటారన్నది నిజమే అయినప్పటికే, "నా లెక్క ప్రకారం నాతో కలిపి 92% మంది రచయితలు మిగతా రచయితలందరూ తప్పు, నా దారే సరైన దారనే అప్రకటితమైన ఊహతో ఉంటారని" ఈ విమర్శలో సైతం తనను మినహాయించుకోకపోవడమే ఆయన ప్రత్యేకత అనిపిస్తుంది.
మురాకమీ నవలలు ఎలా రాయాలో చెప్పకపోయినా, రచయితలు దీర్ఘకాలం పాటు రచనావ్యాసంగంలో కొనసాగడానికి మాత్రం వారి శారీరక,మానసికారోగ్యాల పై దృష్టి పెట్టడం చాలా అవసరమని పదేపదే సూచిస్తారు. రచయితలు గంటల తరబడి కదలకుండా రాయడంలో నిమగ్నమైనప్పుడు క్రమేపీ వయసు పెరిగే కొద్దీ వారి శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం మొదలుపెడుతుంది. దీనికి తోడు ఆర్టిస్టులందరూ క్రమశిక్షణ లేని జీవితాలు మాత్రమే గడుపుతారని వారి జీవన విధానాన్ని రొమాంటిసైజ్ చేస్తూ కనిపించే అనేక సాక్ష్యాలూ, ఊహాగానాలను సవాలు చేస్తూ తన దైనందిన జీవన విధానం గురించి కొన్ని విషయాలను పంచుకుంటారు. ప్రశాంత వాతావరణంలో జీవిస్తూ, క్రమం తప్పకుండా రోజూ జాగింగ్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ, ఖచ్చితమైన వేళలకు నిద్రపోయే తన జీవన విధానాన్ని గురించి పాఠకులకు తెలిస్తే ఒక రైటర్ గా తనను రొమాంటిసైజ్ చెయ్యడం మానేస్తారేమో అని హాస్యమాడతారు. ప్రముఖ బ్రిటిష్ రచయిత ఆంథోనీ ట్రోల్లోప్ విషయంలో ఇటువంటిదే జరిగింది. మరణానంతరం ట్రోల్లోప్ క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి అంతవరకూ తెలియని వివరాలు తెలుసుకున్న యావత్ పాఠకలోకం నివ్వెరపోయిందట. మొజార్ట్, షూబర్ట్, పుష్కిన్, రిమ్బాడ్ , వాన్ గో వంటి ప్రాడిజీల మార్గంలో తక్కువకాలంలో ఒక వెలుగు వెలిగి నిష్క్రమించే ఉద్దేశ్యం ఉంటే తప్ప నవలాకారుడిగా సుదీర్ఘకాలంపాటు కొనసాగే ఉద్దేశ్యం ఉంటే మాత్రం పైన చెప్పిన సూచనలు పాటించడం తప్పనిసరంటారు మురాకమీ. నిజానికి ఒకటో రెండో నవలలు రాయడం కష్టమేమీ కాదు. కానీ అలా రాస్తూనే ఉండడం, రాయడాన్ని జీవనోపాధిగా మార్చుకోవడమే తన అనుభవంలో అత్యంత కష్టంతో కూడుకున్నపని అంటారు మురాకమీ. నలభై ఏళ్ళుగా ప్రొఫెషనల్ రచయితగా అనేక రచనలు చేసిన మురాకమీ ఈ హెర్క్యూలియన్ టాస్క్ ని సమర్ధవంతంగా పూర్తి చేసి యువ రచయితలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' 20 ఫిబ్రవరి 2023.
https://www.andhrajyothy.com/2023/editorial/extremely-professional-1014523.html?fbclid=IwAR0igKR6Pk60WCgAzQrKdY0vVd_PodxrxOM-kUI4fHalVzOITE6FWriUi_c
విత్ లాగిన్ : https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=34&edate=20/02/2023&pgid=365447