"జీవితం నుండి పూర్తిగా విడివడి ఒక ప్రక్కగా నుంచుని నీ పాత్రను నువ్వే తరచి చూసుకుంటే ఆ జీవితమనే వేదికపై నువ్విక లేనట్లే" అనే ఇటాలియన్ రచయిత లూగీ పిరాండెల్లోను కేవలం ఒక రచయితగా మాత్రమే చూడడానికి మనస్కరించదు. ఆధునిక యుగంలో రెండు ప్రపంచ యుద్ధాల తరువాత మనిషికి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ సరికొత్తగా నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. ఈ కారణంగా ఆ కాలంలో కవులూ, రచయితలూ చేసిన సింహభాగం రచనల్లో ఈ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుంది. అటువంటి ఆధునిక యుగపు రచయితల్లో హెన్రిక్ ఇబ్సెన్, జార్జ్ బెర్నార్డ్ షా, శామ్యూల్ బెకెట్ వంటి వారికి సమకాలీనులైన నోబెల్ గ్రహీత లూగీ పిరాండెల్లో (1867-1936) కూడా ఒకరు. ఇబ్సెన్ సామజిక సమస్యల నేపథ్యంలో వాస్తవికతతో కూడిన రచనలు చేస్తే, బెకెట్ మనిషిలోని నిరాశా నిస్పృహలతో కూడిన సాంఘికమైన వేర్పాటుతనాన్నీ, సామజిక పరాయీకరణనీ ఆధారంగా చేసుకుని అసంబద్ధమైన అంశాలతో కూడిన రచనలు చేశారు, వీరిరువురికీ భిన్నంగా పిరాండెల్లో రచనలు మానసిక విశ్లేషణల చుట్టూ తిరుగుతాయి.
Image Courtesy Google |
ఆధునిక రచయితలు తమ నాటకాల్లో మనస్తత్వ శాస్త్రంతోబాటు సిగ్మన్డ్ ఫ్రాయిడ్, కార్ల్ జంగ్ వంటి వారి మానసిక విశ్లేషణలకు ప్రాధాన్యతనివ్వడం గమనిస్తాం. ఈ క్రమంలో పిరాండెల్లో నాటకాల్ని 'సైకో డ్రామా' శైలికి చెందిన రచనలుగా వర్గీకరిస్తారు. ఈ 'సైకో డ్రామా' అనే పదానికి సృష్టికర్త అయిన జాకబ్ లెవీ మోనెరో ఈ శైలికి చెందిన నాటకాలు మనుషులకు తమ మానసిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా సహాయపడగలవని భావిస్తారు. ఉదాహరణకు షేక్స్పియర్ 'హేమ్లెట్'ను ఈ శైలికి చెందిన నాటకంగా పరిగణిస్తారు. ప్రప్రథమంగా ఒక నాటక రచయితగానే ఖ్యాతిని కూడగట్టుకున్నప్పటికీ తరువాతి కాలంలో పిరాండెల్లో మంచి కథకుడిగా, నవలాకారుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆయన తన రచనల్లో తరచూ 'కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్' ను ప్రధాన పాత్రగా చేస్తూ, "నేను ఎవరు ?", "ఏది వాస్తవం? ", "ఏది భ్రమ ?" అనే ప్రశ్నల్ని చర్చకు పెడతారు. ఒక సంఘజీవిగా స్పష్టమైన గుర్తింపు సంపాదించుకోవడంలో మనిషి ఎదుర్కునే సంక్లిష్టతల్నీ, భావప్రకటన విషయంలో మనుషుల మధ్య సంభాషణల్లోని అసంపూర్ణత్వాన్నీ, వాస్తవికత-భ్రమల మధ్య నిరంతరం స్థానభ్రంశం చెందే పరిధులనూ ఆయన తన రచనలకు థీమ్స్ గా వాడుకుంటారు.
19 వ శతాబ్దికి చెందిన ఆస్ట్రియన్ న్యూరాలజిస్ట్ ,సైకో ఎనాలిసిస్ ఆద్యుడూ సిగ్మండ్ ఫ్రాయిడ్ కు సమకాలీనులైన పిరాండెల్లో రచనల్లో మానసిక విశ్లేషణలు ఎక్కువగా కనిపించడంలో నిజానికి వింతేమీ లేదు. పిరాండెల్లో రచనలు ఉపచేతనావస్థలో మానవ మస్తిష్కంలోని లోపలి పొరల్ని మానసిక విశ్లేషణల ద్వారా విడదీసే ప్రయత్నం చేస్తూ, మనిషి యొక్క ఉనికినీ, గుర్తింపునీ శోధిస్తాయి. అలాగని ఆయన రచనలపై ఫ్రాయిడ్ ప్రభావం ఉందని కాదు, మనిషి మెదడులోని రహస్యాలను ఛేదించడంపై ఆ తరంలో మేథోవర్గానికున్న కుతూహలమే దీనికొక కారణం కావచ్చు. నిజానికి ఫ్రాయిడ్, పిరాండెల్లో, ఈ ఇద్దరి రచనల్లోనూ సైకో ఎనాలిసిస్ ఉమ్మడి అంశమైనప్పటికీ, వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన ఫ్రాయిడ్ సిద్ధాంతాలకూ, కళాకారుడైన పిరాండెల్లో విశ్లేషణలకూ మధ్య పొంతనలేమీ ఉండవు. పిరాండెల్లో రాసింది ఫ్రాయిడ్ రచనలకు పూర్తి విరుద్ధమైన కాల్పనిక సాహిత్యం. కానీ ఫ్రాయిడ్ మానసిక విశ్లేషణలు చదువుతున్నప్పుడు, వాటిల్లో కనిపించే మనిషి ప్రవృత్తిలోని విపరీతాలు శాస్త్రీయంగా నిరూపణలైన నిజాలు కాబట్టి మనకి పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ పిరాండెల్లో రచనల్లో సాధారణ పరిస్థితుల్లో కూడా అసంబద్ధంగా ప్రవర్తించే సహజమైన పాత్రలు నిజజీవితంలో పరిచయస్తుల్ని పోలి ఉంటాయి. ఈ కారణంగా మనిషి ప్రవర్తనా సరళిలో అసహజంగా అనిపించే లోపాలూ, పిచ్చితనంలాంటివి నమ్మశక్యంగాలేక మనల్ని అనేక సందర్భాల్లో విస్తుపోయేలా చేస్తాయి. Six Characters in Search of an Author ,హెన్రీ-IV ఈ రెండు నాటకాల్లోనూ ప్రధాన పాత్రలు గతాన్ని వర్ణించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ వర్ణన జ్ఞాపకాల్లో నుండీ, అచేతనావస్థలో నుండీ వచ్చేది కావడం వల్ల వాళ్ళు ఆ క్రమంలో తీవ్రమైన మానసిక సంఘర్షణకూ, అస్థిమితానికీ లోనవడం చూస్తాం. పిరాండెల్లో కథల సంపుటి 'The Tales of Madness' లో మనిషిలో విపరీత ధోరణులు మొదలుకుని చిత్త వైకల్యాలవంటి రుగ్మతల వరకూ వివిధ మానసిక స్థితులను అన్ని సాధ్యమైన కోణాల్లోనూ చూపిస్తారు. ఈ కథల్లో అస్తిత్వవాదాన్ని విశ్లేషించడానికి 'madness' ను ఒక మెటఫోర్ గా వాడతారు. మానసిక వైకల్యం కలిగిన భార్య Antonietta తో పిరాండెల్లో వైవాహిక జీవితం మానసికవైకల్యాలపై ఆయన ఆలోచనాసరళిని చాలా వరకూ ప్రభావితం చేసిందంటారు.
ప్రతి మనిషిలో మనకు తెలిసి కొంతా, తెలియక కొంతా పిచ్చితనం ఉండటం కూడా ఒక సహజమైన మానసిక స్థితి క్రిందకే వస్తుందని పిరాండెల్లో కథలు నిరూపిస్తాయి. వాస్తవం నుండి దూరం జరగడం, ఏదో జరుగుతుందని భయపడడం, నిజాన్ని జీర్ణించుకోలేక భ్రమలో బ్రతకడానికి అలవాటుపడటం, సమాజంలో ఇమడలేక దూరంగా పారిపోవడం లేదా 'తను' కాని తనను సామాజిక చట్రంలో ఇమిడ్చేసుకోవడం, ఈ కారణాల వల్ల ఉత్పన్నమయ్యే అనేక భయాలూ, బాధలూ, కోపతాపాలు, నిరాశా-నిస్పృహలూ వెరసి పిరాండెల్లో కథలు అన్ని కోణాల్నీ స్పృశిస్తూ మనిషి మెదడులోని రహస్యాలను లోతంటా కొలవడానికి ప్రయత్నిస్తాయి.
పిరాండెల్లో అస్తిత్వాన్ని నిరంతరం రూపాంతరం చెందుతూ మిగిలిపోయే జ్ఞాపకంగానూ, మనిషి గుర్తింపుని కాలాన్ని బట్టి నిరంతరం మారే ముసుగు వెనుక రహస్యంగానూ చూస్తారు. అందువల్ల మనిషి తన స్పష్టమైన ఉనికిని నిర్వచించుకోవడం దాదాపూ అసాధ్యమనేది ఆయన వాదన, అందునా భావదారిద్య్రం రాజ్యమేలే ఆధునిక సమాజం ఇటువంటి అంశాలను పూర్తిగా కోల్పోయిందని మనసావాచా నమ్మేవారాయన. అందువల్ల ప్రతి మనిషీ తనని తాను కోల్పోయి మాత్రమే ఇటువంటి ఒక వ్యవస్థలో భాగం కాగలడని ఆయన రచనలన్నీ మనకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరూపించే ప్రయత్నం చేస్తాయి. ఈ కారణంగానే పిరాండెల్లో పాత్రలన్నీ సంఘజీవిగా రూపాంతరం చెందే క్రమంలో తమ అసలైన వ్యక్తిత్వాన్ని ఒక అనుకూలమైన ముసుగు చాటున దాచే ప్రయత్నం చేస్తాయి.'హెన్రీ IV' నాటకంలో ప్రధాన పాత్రధారికి గుర్రం మీద నుండి పడిపోవడంతో మతిస్థిమితం తప్పుతుంది. కానీ అతడు కొంతకాలానికి కోలుకుని మామూలు మనిషైనప్పటికీ తన నిజమైన వ్యక్తిత్వాన్ని సమాజం నుండి దాచుకోడానికి ఉద్దేశ్యపూర్వకంగా పిచ్చివాడిలా నటిస్తుంటాడు. ఇలా తన అస్తిత్వాన్ని చెరిపేసుకుని నటించడం ద్వారా అతడు సామజిక శృంఖలాలనుండి తప్పించుకుని స్వేచ్ఛగా తనకు తోచినట్లు జీవించే అవకాశం ఉందని భావిస్తాడు. పిరాండెల్లో నవలల్లో బాగా పేరుపొందిన నవల 'ది లేట్ మటియా పాస్కల్' కూడా ఇటువంటి కథే. మరణించాడని సమాజం పొరపాటుగా భావించిన కథానాయకుడు తిరిగొచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకుని, వారికి నిజం చెప్పకుండా తన అస్తిత్వాన్ని సరికొత్తగా నిర్వచించుకునే ప్రయత్నం చేస్తూ కొత్త జీవితం ప్రారంభించాలని తలపోస్తాడు. ఈవిధంగా మనిషి తన గుర్తింపునీ, అస్తిత్వాన్నీ కనుగొనడానికి సహాయపడే శాస్త్రమైన కార్ల్ యుంగ్ మానసిక విశ్లేషణల్ని 'Six Characters in Search of an Author' ,'హెన్రీ -IV', 'The Late Mattia Pascal' వంటి రచనల ద్వారా పిరాండెల్లో తన కాల్పనిక ప్రపంచాలకు అన్వయించడాన్ని చూస్తాం. కార్ల్ యుంగ్ ఇగోని మనిషి గుర్తింపుకి కేంద్రంగా చూస్తారు. ఈ కారణంచేత ఎవరైనా తన వ్యక్తిత్వానికి ఒక ముసుగు తొడుక్కున్నప్పుడు తనని తాను ఆ ముసుగు ద్వారా ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడతాడు కాబట్టి అతడు తన స్వతఃసిద్ధమైన ఐడెంటిటీని కోల్పోతాడని ప్రతిపాదిస్తారాయన. ఒకవేళ పైకి అగుపించే ఆకారస్వరూపాలే మనిషి అస్తిత్వాన్ని నిర్వచించే చిహ్నాలైతే, ఆ వాస్తవికత నిరంతరం రూపాంతరం చెందుతుందని పిరాండెల్లో రచనలు పదేపదే నిరూపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ఆయన దృష్టిలో ఖచ్చితమైన, విశ్వజనీనమైన వాస్తవమంటూ అసలుండే అవకాశం లేదు కాబట్టి భ్రమను అపాయకారిగా కంటే ఒక వ్యక్తిగత ధృవీకరణగా, సమాజానికి సవాలు విసిరే అంశంగా చూడాలన్నది ఆయన భావన.
పిరాండెల్లో కథల్లో నేపథ్యాలే కాదు ఆయన కథ చెప్పే తీరు కూడా విలక్షణంగా ఉంటుంది. జీవితంలోని అబ్సర్డిటీకి హాస్యాన్నీ, వ్యంగ్యోక్తుల్నీ జోడించి దాన్నొక హాస్య కథలా చెప్పడం ఆయన ప్రత్యేకత. కథలో ఎక్కడో ఒకచోట లోతైన విషయం చర్చిస్తున్నారనుకునేలోగా ఉన్నట్లుండి చిన్న చమత్కారం దొర్లుతుంది. మరోచోట ఏదో ఒక సరదా సందర్భంలో అంతర్లీనంగా నిరాశా నిస్పృహలు, ఇదిగో మేమున్నామంటూ తొంగిచూస్తాయి. ఇంకోచోట మానవసంబంధాలను ఆవిష్కరించే క్రమంలో ఉన్నట్లుండి తాత్వికత తెరపైకొస్తుంది. ఆయన కథల్లో వర్ణనలు కూడా ఇదే తరహాలో ఉంటాయి. ఆయన శైలి పాదరసంలా ఒక వర్ణన నుండి స్వగతానికీ , స్వగతం నుండి ఒక నాటకీయ సంభాషణకూ, దాన్నుండి ప్రత్యక్ష ఉపన్యాసానికీ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో గమనించే సమయం పాఠకులకు ఇవ్వరు.
తాను జీవించి ఉన్న కాలంలో సుమారు 200 పై చిలుకు కథలు రాసిన ఆయన, తాను తొలినాళ్ళలో రాసిన కథల్నే పునాదులుగా చేసుకుని తరువాతి కాలంలో అనేక నాటకాలకు రూపకల్పన చేశారంటారు. ఆయన కథల్లో అంతఃసంఘర్షణలూ, వ్యక్తిగత సమస్యల ఆధారంగా రాసివి కొన్నైతే, అధికశాతం కథలు మాత్రం మనిషి సామజిక సాలెగూడులో చిక్కుకుని ఎదుర్కునే సంఘర్షణలూ, సామజిక కట్టుబాట్లను ఉల్లంఘించలేని నిస్సహాయత వల్ల సంఘజీవిగా మనడానికి అవసరమయ్యే ముసుగు ధరించే దిశగా పురిగొల్పే పరిస్థితుల (పిరాండెల్లో చాలా ఏవగించుకునే విషయం ) చుట్టూ తిరుగుతాయి. బహుశా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పాఠకులు పిరాండెల్లో రచనల్ని ఎక్కువ ఇష్టపడడానికి కారణం కూడా ఇదే కావచ్చు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో పాత్రల జీవితాలు విధి లిఖితంగా,ఊహించని మలుపులతో అనూహ్యంగా ఉంటాయి. అనేక వైరుధ్యాల పోగుగా ఉండే విభిన్నమైన మనుషుల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన అంతఃప్రపంచాలను పదాల్లో పెట్టాలని ప్రయత్నించడం వృథాప్రయాసేనంటూ, అక్షరీకరించిన ప్రతీ విషయమూ అర్థసత్యమేనని నిర్ధారిస్తూ సాహిత్య ప్రమాణాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తారు లూగీ పిరాండెల్లో. కాల్పనికత, వాస్తవికతలనే రెండు పాయలనూ రెండు వైపుల నుంచీ సరిసమానంగా అల్లుకొచ్చి చిట్టచివరకి వాస్తవికతకు ముడి పెట్టడంలో పిరాండేల్లో నైపుణ్యం ఆయన ప్రతీ రచనలోనూ కనిపిస్తుంది. ఆయనను చదవడమంటే తాత్వికతనూ, మానసిక తత్వశాస్త్రాన్నీ, అస్తిత్వవాదాన్నీ, కాల్పనికతనూ అన్నిటినీ సమపాళ్ళలో కలిపి వండిన విందుభోజనం చెయ్యడంలా ఉంటుంది. పిరాండెల్లో రచనలు పాఠకులకు అన్నిఅంశాలూ తగుపాళ్ళలో కుదిరిన ఒక పూర్తి స్థాయి రచన చదివిన తృప్తినిస్తాయి. మనిషి భావోద్వేగాల్ని లోతంటా తవ్వితియ్యడంలో పిరాండెల్లో కనబరిచే నైపుణ్యం మరో రచయితలో కనిపించదంటే అతిశయోక్తి కాదు.
తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి వివిధ 28th నవంబర్ 2022
https://www.andhrajyothy.com/2022/editorial/stories-told-by-changing-face-masks-956143.html
https://epaper.andhrajyothy.com/Home/ShareImage?Pictureid=e0fe4a13