Wednesday, June 10, 2020

Blue Horses - Mary Oliver

క్వారంటైన్ సమయం నుండి విముక్తి లభించిన ఆనందంలో 'కొండా కోనల్లో లోయల్లో' అని పాడుకుంటూ నీలగిరుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అలసిసొలసి హోమ్ స్వీట్ హోమ్ అనుకుంటూ ఇల్లు చేరిన తరువాత సగంలో ఉన్న పుస్తకాలు ప్రక్కన పెట్టి మరీ ఈ మేరీ ఆలివర్ 'బ్లూ హార్సెస్' చదివాను..ఉదగమండలంలో చూసిన ప్రకృతి సౌందర్యం తనివితీరక ఆ అనుభవాన్ని ఆలివర్ కవితల్లో మరోసారి పొందాలని చేసిన ప్రయత్నం ఇది..ఆమె కవితలు చదివిన మనసుతో చూస్తే ప్రకృతిలో ఎన్నెన్ని వర్ణాల్లో ! సంపాదన,సంసారం,ఇవేమీ చాలనట్లు నిరంతరం వెయ్యి గొంతుకలెత్తి వాదులాడుకునే సోషల్ మీడియా రణగొణ ధ్వనుల మధ్య భవసాగరాల్లో ఊపిరాడకుండా కొట్టుకుపోతున్న మనిషికి ఆగి తన చుట్టూ ఉన్నప్రపంచాన్ని చూడడం నేర్పిస్తారు ఆలివర్..నిశ్శబ్దంగా సెలయేటి ఒడ్డున కూర్చుని తనలోతాను ధ్యానమగ్నమై ఆ ప్రవాహపు సంగీతాన్ని వినమంటారు ..తొలకరి జల్లుల్లో మైమరచిపోయి తడవడం తప్ప మరో ముఖ్యమైన పని లేదంటారు..పూర్ణోదయాలూ,సంధ్యాసమయాల మధ్య నులివెచ్చని అపరాహ్నవేళల్ని అనుభవించడాన్ని మించిన మోక్షం,జీవిత సాక్షాత్కారం వేరే ఏముంటుందంటారు ! పచ్చని పసిరిక వాసనలు,తొలకరి చినుకుల సోయగాలు,ఎండుటాకుల గలగలలు ఆహా ఎన్నని చెప్పగలం ! ఆమె కవితలన్నీ ప్రకృతి సౌందర్యానికి స్వచ్ఛమైన ప్రతీకలుగా కనిపిస్తాయి..మనిషీ ప్రకృతీ వేర్వేరు కాదని ఘంటాపథంగా చెప్తాయి..ఇందులో ఒక కవితకు నా స్వేచ్ఛానువాదం :
Image Courtesy Google
I'm Feeling Fabulous,Possibly Too Much So.But I Love It  - Mary Oliver.

ఈ వసంతోత్సవం జరుపుకోవడానికి మాకింగ్బర్డ్ తనకు తాను సరికొత్త మార్గాలు నేర్పుకుంటోంది.
ఇక ఈ ఈదురుగాలులు మోసుకొచ్చే అర్ధంపర్ధంలేని కబుర్లు ఊహించగలవా.
ఒకప్రక్క ఆకాశం క్రొంగొత్తగా ముస్తాబవుతూ తనకు తాను చక్కని చిక్కని నీలి రంగులద్దుకుంటోంది,
ఎటొచ్చీ ఆ నీలంలో చాలా భాగం ప్రక్కనే ఉన్న కొలనులో ఒలికిపోతోంది.
నేనేమంత బరువైనదానిని కానుగానీ,ఈ క్షణంలో అయితే
మరీ దూదిపింజలా ఉన్నాను.
నువ్వంటావూ నా మనసంతా మిశ్రమభావాలతో కలగలిసిపోయి ఉందనీ.

ఒక గొంతుక,ఆహా అదిగో అది మాకింగ్బర్డ్ అంటోంది.
మరో గొంతుక,ఈ కొలను మునుపెన్నడూ ఇంత నీలంగా లేదే అంటోంది.
ఇంకో గొంతుక,ఈ క్షణంలో నేను ఈ ప్రపంచంలో భాగమై ఉన్నాను,ఇంతకంటే అద్భుతమైన ప్రపంచం మరొకటుండే అవకాశమే లేదంటోంది.
ఈలోగా ఆనందపారవశ్యంతో కూడిన ఒక ఊహ తళుక్కుమంది,నేను రెక్కలుకట్టుకుని ఎగరగలనని.
నాకు నమ్మకమే,నేను రెక్కలుకట్టుకుని ఎగరగలను.

మరో గొంతుక,ఇక ఈ తేలియాడే మేఘాల్లోంచి క్రిందకి దిగి వద్దామా ? అంటోంది.
ఇంకో గొంతుక సమాధానమిచ్చింది,సరేలే.
కానీ శాశ్వతంగా కాదు,కాసేపటికి వద్దాంలే.

No comments:

Post a Comment