Monday, March 4, 2019

Here - Wisława Szymborska

"బడుగు జీవితాలకు అద్దం పట్టలేని సాహిత్యానికి ప్రయోజనం శూన్యమని వాస్తవికవాదులంటే, సాహిత్యమంటే కష్టజీవుల స్వేదమే కాదోయ్,గులాబీ పరిమళాలు కూడానోయ్ అని  కాల్పనికవాదులంటారు..సాహిత్యంలో హేతువాదులకీ,భావుకులకీ ఎప్పుడూ చుక్కెదురే..అసలు సాహితీ ప్రపంచంలోజరిగిన/జరుగుతున్న యుద్ధాలన్నిటికీ ఇదే ప్రధాన కారణమని చరిత్ర చెబుతోంది :)
Image Courtesy Google

సాహిత్యమంటే ఏమిటనే తార్కికవాదాన్ని తర్కానికొదిలేస్తే,కొందరు కవులు తమ చుట్టూ,తమ ఉనికిని నిరంతరం ప్రభావితం చేసే రాజకీయ,సామజికాంశాలను కవితా వస్తువుగా చేసుకుంటే,వాటికి సుదూరమైన రచనలు చేసి లోకాన్ని మెప్పించినవాళ్ళూ ఉన్నారు..కవిత్వానికి మూల వస్తువు ఏమిటన్నది,కవి అనుభూతి చెందే విషయాలను బట్టి ఉంటుంది,ఆ అనుభూతి వ్యక్తిగతమైనది కావచ్చు లేదా సామాజికపరమైనదీ కావచ్చు..నిజానికి బాహ్య ప్రపంచపు ప్రభావాలకు లోనుకాకపోవడమే మనిషికి అసలు సిసలైన వ్యక్తిగత విజయమని అన్ని ఫిలాసఫీలూ ఏక కంఠంతో తీర్మానిస్తాయి..ఇదే నిజమైతే నోబెల్ గ్రహీత అయిన పోలిష్ రచయిత్రి, Wisława Szymborska కవిత్వాన్ని ఒక కవయిత్రిగా ఆమె సాధించిన విజయంగా చూడవచ్చేమో !! ఎందుకంటే ఆమె కవిత్వం పూర్తి వ్యక్తిగతమైనదీ,అంతః ప్రపంచపు అనుభూతులతో నిండి ఉన్నదీను..

ఒకప్పుడు కవిత్వం అంటే అదేదో దేవభాష అనుకునే నాలాంటి వాళ్ళకి కవిత్వాన్ని అనుభూతి చెంది,ఆనందించేలా చేసిన వారిలో గుల్జార్ ప్రప్రథములు..ఆ తరువాత జావేద్ అఖ్తర్,సాహిర్ లుధియాన్వీ లాంటివారు ఆ అనుభూతిని మరింత చేరువ చేస్తే ఠాగోర్,రూమీ,హఫీజ్ లాంటివారు తమ కవితాపథాల్లో తడబడకుండా నా చేయి పట్టుకు నడిపించారు..కొన్నేళ్ళ క్రిందట రూపీ కౌర్ లాంటి వారిని చదివి,కవిత్వమంటే ఇదేననుకున్న నా భ్రమల్ని దూరం చేస్తూ,తుఫానులా చుట్టుముట్టిన పెస్సోవా కవిత,అంతవరకూ అందని చందమామను తెచ్చి నా అరచేతిలో పెట్టింది..తొలిసారి పాశ్చాత్య కవిత్వం చేరువదనాన్ని చవిచూపించింది..మళ్ళీ ఇప్పుడు Wisława Szymborska ను చదువుతున్నప్పుడు అదే చేరువతనం అనుభవించాను..అంతకుమునుపు చదివిన కవుల సంగతి చూస్తే,దురదృష్టవశాత్తూ నెరుడా ప్రేమను ఆస్వాదించలేక,తిరస్కరించిన నా హేతువాదపు తత్వం,మేరీ అలీవర్ కవితలోని ఆకుపచ్చని జీవధారకు మాత్రం ఆత్మీయంగా తలవంచింది..పెస్సోవా తన కవిత్వం మాటున దాక్కుని దోబూచులాడే పసివాణ్ణి తలపిస్తే,మేరీ ఆలీవర్ తన కవితల్లోని సమస్త జీవజాలంలో,ఆకుపచ్చని ప్రకృతిలో తనను వెతుక్కోమంటారు.

పాశ్చాత్య కవితతో అంతగా సాన్నిహిత్యంలేని నా లాంటి పామరుల్ని కూడా తొలి పరిచయంలో దగ్గర చేసుకున్న వీరికీ మిగతా కవులకీ ఉన్న తేడా ఏంటా అని ఆలోచించగా,వీళ్ళెవరూ నిర్వచనాల దరిదాపుల్లోకి కూడా పోరనీ,సౌకర్యవంతమైన సంప్రదాయ చట్రాల్లో ఇమిడే వర్గం కాదని అర్ధం అయ్యింది..వీరి వచనానికి దేశపు సరిహద్దులు అడ్డం రావు..వీరి కవిత్వానికి కుల,మత,వర్గ,జాతి,లింగ వైరుధ్యపు జాడ్యాల జాడలతో కూడిన సిరా మరకలంటవు..'ఈ విశ్వంలో నాదొక  పరమాణువంత ఉనికి' అని తప్ప వీరి కవిత్వానికి మరో స్పృహ ఉండదు..ఈ కారణాల వల్ల సింబోర్స్కా ను చదువుతున్నప్పుడు అది పాశ్చాత్య కవిత్వమనే భావన పాఠకులకు కలగదు.

సింబోర్స్కా కవితా నేపథ్యం సార్వత్రికమూ,సార్వజనీనమైనదీనూ..మనిషిలో సమస్త విశ్వమంతా నిబిడీకృతమై ఉంటుందంటే ఏమో అనుకున్నాను..కానీ ఈ కవిత్వం చదువుతుంటే బాహ్య ప్రపంచంలోకి తెరుచుకునే ద్వారాలన్నిటికీ మూలాలు మన అంతరంగిక స్మృతిపథాల గుండానే పయనిస్తాయి అనిపిస్తుంది.."To be yourself in a world that is constantly trying to make you something else is the greatest accomplishment." అని ఎమెర్సన్ మహాశయుడన్న జీవిత పరమార్ధాన్ని నిరూపించడానికి ఈ కవిత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది..సింబోర్స్కా తన ఆంతరంగిక కవితా ప్రపంచం చుట్టూ బాహ్య ప్రపంచపు ప్రభావాలకు దూరంగా అభేద్యమైన కోటగోడను నిర్మించుకున్నారనిపిస్తుంది,

ఆమె కవిత్వం,మన ఇష్ట సఖితో మాత్రమే చెప్పుకునే రహస్యం..
జ్ఞాపకాల తీరాల్ని సున్నితంగా తాకి వచ్చే కెరటం..
అద్భుతాలు చూడాలంటే మన ఆంతరంగిక ప్రపంచాన్నితరచిచూసుకోమని చేతికందించిన అద్దం..
నిర్వచనాల్నొద్దు పొమ్మన్న స్వచ్ఛమైన అస్తిత్వం..

'Here' కవిత ఈ భూమి మీద పరమాణువంత మన ఉనికికి సెలెబ్రేషన్ లాంటిది..
'భూమి మీద జీవితం మంచి చవక బేరం,కొసరుగా,ఈ భూగ్రహమనే రంగులరాట్నంలో పైసా ఖర్చు లేకుండానక్షత్ర మండలపు మంచుతుఫానులో షికారు కెళ్ళొచ్చు'
అంటూ ఈ కవితలో పాఠకులకు టెలీస్కోప్ చేతికిచ్చి కుతూహలంగా నక్షత్రాలను వెతికే పసివాళ్ళను చేస్తారు..సింబోర్స్కా కవిత్వం వర్తమానాన్ని కేంద్రంగా చేసుకుని భూత భవిష్యద్ వర్తమానాల నడుమ ఊగిసలాడుతుంది,కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆ క్షణాన్ని మాత్రం దాటి వెళ్ళదు..
"నేను వేరే చోటునుండి మాట్లాడలేను..అన్నీ సమృద్ధిగా ఉన్న ఇక్కడ నుండే మాట్లాడతాను"మనకు తెలీని సుదూర తీరాలు అందమైనవే కావచ్చు గానీ..ఎందుకో తెలీదు అక్కడపెయింటింగ్స్ ఉండవు,కన్నీళ్ళు,హ్యాండ్ కర్చీఫులు అసలే ఉండవు"
అంటూ ఈ కవితలో ఈ భూమ్మీద అందమైన జీవితపు వైరుధ్యాన్నీ,అవకాశాల వైశాల్యాన్నీ చూపిస్తారు.
The Day After-Without Us అనే మరో కవితలో ఒక పొగమంచు నిండిన వర్షాకాలపు ఉదయాన్నీ,రాత్రినీ వరుసగా వర్ణించి చివర్లో
"రేపు ఎండకాసే అవకాశం ఉండొచ్చట,ఇంకా జీవించి ఉన్నవాళ్ళు మాత్రం బహుశా గొడుగులు తీసుకెళ్ళాలేమో"
అంటారు..అంతవరకూ వర్షపు చినుకుల ఆహ్లాదంలో తడిసి ముద్దైపోతున్న పాఠకుల్ని,ఒక్క కుదుపుతో స్వప్నావస్థనుండి బయటకు లాగి,చిన్న వాక్యంతో అలవోకగా గుండెను మెలిపెట్టి తిప్పుతారు..జీవితపు సౌందర్యాన్నీ,అస్థిరత్వాన్నీ ఏకకాలంలో పట్టిచ్చిన కవిత ఇది.ఇదే కోవకు చెందిన మరో కవిత 'Highway Accident',
ఎవరో మాకరోనీని వడగడుతున్నారు..
ఎవరో రాలిన చెట్ల ఆకుల్ని చీపురుతో తుడుస్తున్నారు..
చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ టేబుల్ చుట్టూ తిరుగుతున్నారు..
ఎవరింట్లోనో టెలిమార్కెటింగ్ ఫోన్ రింగ్ అవుతోంది..
అంటూ ఆక్సిడెంట్ అయిన స్థలంలో దైనందిన జీవన చిత్రాన్ని వర్ణిస్తూ,
ఆ క్షణంలో కిటికీ దగ్గర ఎవరైనా నిలబడి చూస్తే,వారికి తునాతునకలైపోయిన దేహం పైన ఆకాశంలో కమ్ముకున్న నీలి మేఘాలు కనబడతాయేమో,కానీ వారికది దైనందిన వ్యవహారమే..
అన్నప్పుడు జీవితపు కర్కశత్వాన్ని నిర్లిప్తంగా గమనించిన నిస్సహాయ క్షణాలు పరిచయంలేని పాఠకులుండరు.

'The Milkmaid' by Vermeer 
Rijks museum లోని వెర్మీర్ పెయింటింగ్  'ది మిల్క్ మెయిడ్' పై సింబోర్స్కా ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు..  "ఈ చిత్రపటంలోని  స్త్రీ 
చెంబులో నుండి పాలను నిశ్శబ్దంగా,తదేకమైన ఏకాగ్రతతో గిన్నెలోకి వంపుతున్నంత వరకూ 
ఈ ప్రపంచం తన ముగింపుని ఆర్జించలేదంటారు." 
ఇది చదివినప్పుడు ఆ పెయింటింగ్ ని సింబోర్స్కా దృష్టితో మళ్ళీ చూశాను..ఇందులో 'దైనందిన జీవితంలో తన పాత్రను ప్రశాంతంగా,అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వర్తిస్తున్న మిల్క్ మైడ్' ని నిత్యజీవితంలో తన పాత్రను అంతే బాధ్యతాయుతంగా,శాంతిగా  నిర్వర్తించాల్సిన మనిషికి ప్రతీకగా చూపించారామె..ఈ కవితలో అతి సాధారణమైన పదాలతో అసాధారణమైన విషయాన్ని చెప్పిన విధానం అబ్బురపరిచింది.

మరో కవితలో తన బాల్యానికి మరో రూపునిచ్చి,రెండు రూపాల్ని ప్రక్క ప్రక్కనే నిల్చోబెట్టి,ఒకరినొకరితో పోల్చి చూస్తే,మరో కవితలో గతకాలపు జ్ఞాపకాల శిథిలాల్లో ఎక్కడో ఒక చోట తనను వీడిపోయిన నీడల్ని అన్వేషిస్తారు..జ్ఞాపకాలూ,స్వప్నాలూ సింబోర్స్కా తన కవితల్లో పదే పదే  ప్రస్తావించే అంశాలు..'Hard life with memory' అనే కవితలో జ్ఞాపకాల భారాన్ని తూచే ప్రయత్నం చేస్తూ,జ్ఞాపకానికి ఒక రూపమిచ్చి ఆమెను గురించి ఈ విధంగా రాస్తారు..
ఒక్కోసారి నేను ఆమె వ్యవహారంతో విసిగిపోతాను..
మనం శాశ్వతంగా విడిపోదామని ప్రతిపాదిస్తాను..
తను నన్ను చూసి జాలిగా నవ్వుతుంది..
ఎందుకంటే తనకి తెలుసు,అది నా అంతం కూడానని..
ఇది ఒక్కసారి చదివి ప్రక్కన పెట్టేసే పుస్తకం కాదు..ఇందులో కవితలు,చదివిన ప్రతిసారీ కొత్త కొత్త అర్ధాలను స్ఫూరింపజేస్తాయి.

No comments:

Post a Comment