Image courtesy Google |
ఇరవైల వయసులో ఆ మాష్టారు(పేరు చెప్పలేదు) తన విద్యార్థిని అయిన K.S.వినోదిని (విను) ని ఇష్టపడతాడు..మళ్ళీ ఎన్నో ఏళ్ళ తరువాత ఆమె రాసిన ఒక ఉత్తరం ద్వారా ఆమె మూకాంబిక ఆలయానికి వస్తోందని తెలిసి ఆమెతో కొంత సమయం గడపాలనే ఉద్దేశ్యంతో భగవతి ఆలయానికి వెళ్ళిన ఆ మాష్టారుకి ఎదురైన వినోదిని అప్పటిలాగానే ఉందా? మనసులో స్వప్నాలన్నీ వాస్తవ రూపంలో వినోదినిగా కళ్ళముందుకొచ్చినప్పుడు ఆయనలో కలిగిన భావాలేంటి? వారిద్దరి మధ్యా చోటు చేసుకున్న సంఘటనలేంటి అన్నది కథ..
కథను పూర్తిగా మనం మాష్టారి మాటల్లోనే వింటాం..మూకాంబిక ఆలయంలో దర్శనం తరువాత ఇద్దరూ Kudajadri అనే కొండ మీద ఆలయానికి వెళ్తారు..ఆ ప్రయాణంలో అప్పటివరకూ కూడా పెళ్ళి కాని వినోదిని తాలూకూ ఊహలతో,వాస్తవానికి దూరంగా,యవ్వనం తాలూకూ మధురానుభూతుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలనేది మాష్టారి మనోగతమైతే,చెన్నైలో కేవలం మూడువందల రూపాయల జీతంతో స్కూల్ టీచర్ గా,ఇద్దరు వృద్ధ తల్లిదండ్రుల బాధ్యతను మోస్తున్న వినోదిని జీవితం ఆయనకు వాస్తవాన్ని పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది..దీనికి తోడు కడు పేదరికం అనుభవిస్తున్నా,మొహం మీద చిరునవ్వు చెదరని కొండ మీది గుడి పూజారి చెప్పిన విషయాలు కూడా మాష్టార్ని కలచివేస్తాయి..ఆయన్ను ఊహాప్రపంచం లోనుంచి వాస్తవ ప్రపంచంలోకి లాక్కొచ్చి పడేస్తాయి..
వాసుదేవన్ నాయర్ వర్ణనలో ambiance కు కథలోని పాత్రలతో సరిసమాన ప్రాధాన్యత ఉంటుంది..ఒకరకంగా ఆయన కథకు నేపధ్యమే ప్రాణం అనిపించింది ..దూరంగా ఒక కొండ మీద మినుకుమినుకుమంటూ వెలిగే దీపాలు,సాయంకాలపు గాలికి మొహంమీద పరుచుకున్న నల్లని కురులు,కొండ మీద దట్టంగా కమ్ముకున్న పొగమంచు,రాళ్ళురప్పలతో నిండిన గతుకుల రోడ్డు,ఇలాంటి వర్ణనల ద్వారా ప్రకృతిని కూడా కథలో భాగం చేస్తూ,పాత్రల భావోద్వేగాలను ఆ వివరణల ద్వారా నిర్వచిస్తారు..
Thin silvers of mist had spread over the valley and obscured the tree tops.The writhing flames of the forest fire looked like a piece of red silk being fanned out to dry.
ఈ క్రింది తరహా వర్ణనలో ప్రాంపంచిక సుఖాలను కోరుకుంటూ ప్రయాణిస్తున్న వ్యక్తిని ప్రకృతి నిలువరించిన తీరు వ్యక్తమవుతుంది..
The wind had died down.It was calm and still.But the silence was not frightening.Master felt an unseen presence holding him close,chiding him,saying soundlessly,you are nothing..
అంతే కాకుండా మాష్టారూ-వినోదినిల మధ్య సంబంధాన్ని వివరించే క్రమంలో రచయిత ఖచ్చితమైన నిర్వచనాల జోలికి పోకపోవడం చాలా బావుంది..మనకు చెప్పకుండా మన ఊహకే వదిలేసిన విషయాలు చాలా ఉంటాయి..ఇలాంటి సెన్సిటివ్ కథాంశం లో ఒక్క సంఘటన గానీ,ఒక్క మాట గానీ కథ విలువను ఆసాంతం తగ్గించే ఆస్కారం ఉంది..కానీ ఒక ప్రక్క మనిషిలో మృగాన్ని కళ్ళకుకడుతూనే మరో ప్రక్క ఎక్కడా పాత్రల ఔచిత్యం తగ్గకుండా నిలకడగా కథ చెప్పిన విధానం బావుంది..
His eyes were closed but he clearly saw the tamed animal inside him step out from its cage,prowl through the wilderness of his old dreams,stalking its prey,and come back to its cage again.
ఒకప్పుడు నడిచిన జ్ఞాపకాల దారుల్లో మరోసారి నడవాలనుకోవడం అత్యాశే..ఒక వేళ కాదని నడక మొదలుపెట్టినా అంతకుముందు కాళ్ళకు తగిలిన సుతిమెత్తని గడ్డి స్థానంలో ఇప్పుడు ముళ్ళుండే అవకాశం కూడా ఉంటుంది..ఈ కథలోని సారాంశం అదే.. వారిద్దరి ప్రయాణం మొదలైనప్పుడు దూరంగా కొండలన్నీ పొగమంచుతో కప్పి ఉన్నాయని అంటారు,అలాగే కథ చివర్లో తిరుగు ప్రయాణంలో Vinodini gazed silently at the valley from which the mists had lifted..అనీ అనడంలో వారి మనసులపై ఊహాప్రపంచపు పరదాలు తొలిగిపోయాయని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తుంది..ఇందులో మాష్టారికి,వినోదినికీ మధ్య జరిగే సంభాషణలు దాగుడుమూతలాటల్లా ఉంటాయి...నైతిక,సామాజిక విలువల్ని త్రోసిరాజనే ఈ కాలపు ప్రేమలకి దూరంగా చెప్పాలనుకున్నవి చెప్పలేక,అలా అని గతకాలపు జ్ఞాపకాలని మరచిపోలేక వారిద్దరూ పడే సంఘర్షణ అడుగడుగునా వ్యక్తమవుతూనే ఉంటుంది..ఇది గురుశిష్య సంబంధానికి ఉండే పరిధుల్ని గుర్తుచేస్తూనే కాలదోషం పట్టని అనుబంధాలు కూడా ఉంటాయని మరోసారి నిరూపిస్తుంది..ఈ కథ నాకు చాలా కాలం క్రిందట శివాజీ గణేశన్,రాధ కలిసి నటించిన 'ఆత్మబంధువు' ను గుర్తుకు తెచ్చింది..కాగా మలయాళంలో ఈ కథను జయరాం,సుహాసిని ముఖ్యపాత్రల్లో 'Teerthadanam' (2001) పేరిట సినిమాగా తీశారు.
No comments:
Post a Comment