Wednesday, February 7, 2024

చదువుకోడానికో చోటు

ఓ రెండ్రోజులు సెలవులొస్తున్నాయి. లీషర్ ట్రిప్పే కాబట్టి కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా సర్దుకుంటే మంచిది. ప్రొద్దున్నే కాఫీ టైమ్లో చదవడానికి నవల ఏదైనా, బెడ్ టైమ్ కి చదవడానికి షార్ట్ స్టోరీస్, మధ్యమధ్యలో చదవడానికి ఏదైనా మ్యూజింగ్స్, ప్రోజ్ పీసెస్, పోయెట్రీ లేదా నాన్ ఫిక్షన్ అయితే బెటర్. మనిషి ఆశాజీవి. ఆశకి అంతుండదు. ఇంటికొస్తే మళ్ళీ ఏదో ఒక పని, ఔటింగులూ, మీటింగులూ, సంసారసాగరాలు ఈదడాలు- ముప్పూటలా వీటితోనే సరిపోతుంది. కొసరుగా ఫ్లైట్లో చదువుకోడానికి కూడా మరో పుస్తకం ఏదైనా...

Image Courtesy Google 

నాలుగు పుస్తకాలతో బ్యాగ్ సిద్ధం. కోటి ఆశలతో కారెక్కిన సగటు చదువరికి క్లౌడ్ 9 లో ఉన్నట్లుంది. ఫ్లైట్ ఎక్కగానే కోలాహలం అంతా సద్దుమణిగాక మెల్లిగా బ్యాగ్లో ఉన్న పుస్తకం చేతిలోకొచ్చింది. డ్రింక్స్ వచ్చాయి. ఏం తాగుదాం !! ఒక  వేడి వేడి కాఫీ. కాఫీ సిప్ చేస్తూ ఓ నాలుగైదు పంక్తులు. మెల్లమెల్లగా వాస్తవికత అదృశ్యమైపోయి అక్షరాలు జీవం పోసుకోవడం ప్రారంభించాయి. చుట్టూరా ఉన్న ప్రపంచపు ధ్వనులు చెవులకు వినిపించడం మానేసాయి. కళ్ళముందరి ప్రపంచం బ్లర్ అయిపోయి కొత్త ప్రపంచపు తలుపులు తెరుచుకోసాగాయి. ఏదో  స్వప్నావస్థలో ఉన్నట్లు ఆత్రంగా అడుగులు ముందుకుపడ్డాయి. హఠాత్తుగా ఎవరో అరుస్తున్నారు. లేదు లేదు... పిలుస్తున్నారు. "కారెక్కేముందు నీ బ్యాగ్లో నా హెడ్ ఫోన్స్ పెట్టాను, అవి కావాలి." మేఘాల మధ్యలోంచి ఎవరో ఉన్నట్లుండి కాళ్ళుపట్టుకుని క్రిందకి లాగేస్తే, నేలమీద వెల్లకిల్లా ధబ్బుమని పడిన శబ్దం. ఉహుఁ ! పడినట్లు అనిపించిందంతే. హెడ్ ఫోన్స్ చేతులు మారాయి.

మళ్ళీ వదిలేసిన పేజీ తెరుచుకుంది. కానీ ఇందాక సునాయాసంగా తెరుచుకున్న కొత్త ప్రపంచం తలుపులు మళ్ళీ తెరుచుకోనని మొరాయించాయి. ఎలాగైనా లోపలికి వెళ్ళిపోవాలనే పట్టుదలతో తలుపులు రెండు మూడుసార్లు బలంగా బాదినా ప్రయోజనం శూన్యం. ప్రయాణం ఏర్పాట్ల బడలికతో నీరసం ఆవహించి నిద్ర ముంచుకొచ్చింది. "ఇప్పుడు చదివేసి పరీక్షలేమైనా రాయాలా ఏమన్నానా !!" గమ్యం చేరాక తీరుబడిగా చదువుకోవచ్చులే. స్లీప్ మాస్క్ తలమీదనుండి జారి కళ్ళమీదకు చేరింది.

రిసార్ట్ కి వచ్చేసాక కాస్త సేదతీరిన కళ్ళు పరిసరాలన్నీ కలియజూశాయి. చదువుకోడానికి ఇంతకంటే మంచి చోటు ఉంటుందా ఈ భూప్రపంచంలో !!  

"అబ్బా ! ఆ పుస్తకం తర్వాత చదువుకోవచ్చులే జకూజికి స్లాట్ బుక్ చేసాం, పద. వచ్చాకా ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్ లో ఏమైనా తిని వచ్చేద్దాం." 

ఆ వేడి వేడి స్టీమ్ బాత్ కి ఒళ్ళంతా గాల్లో తేలిపోతున్నట్లుంది. మళ్ళీ మత్తుగా మధ్యాహ్నం నిద్ర. సాయంత్రం కాఫీలయ్యాయి. బ్యాగ్లో పుస్తకం గుర్తొచ్చింది.

 "లేక్ సైడ్ ఈవెనింగ్ వాక్ బావుంటుందిట. టెంపరేచర్స్ పడిపోతాయి, స్వెటర్ వేసుకోవడం మర్చిపోకు, వచ్చేటప్పటికి చీకటైపోవచ్చు." 

బ్యాక్ ప్యాక్ లో వాటర్ బాటిల్ చేరింది. అదనపు బరువుగా అనిపించిన పుస్తకాలు ఒక్క నిట్టూర్పుతో టేబిల్ మీదకొచ్చి పడ్డాయి. వణికించే చలి. దుప్పట్లు ముసుగుతన్ని మూడంకె వేసుక్కూర్చున్నాయి.

"ఓహ్, డ్రీమ్ మేకర్, యూ హార్ట్ బ్రేకర్... వేరెవర్ యూ ఆర్ గోయిన్, అయామ్ గోయిన్ యువర్ వే" అని ఆడ్రే ఆహ్లాదంగా గిటార్ స్ట్రింగ్స్ మీటుతోంది.

టీవీ ఆఫ్ అయ్యింది. కళ్ళు మూతలు పడుతున్నాయి, పోనీ ఓ అరగంట  చదువుకుని అప్పుడు నిద్రపోవచ్చు. బయట మంచు పడుతోంది. లోపల హీటర్ ఆన్ అయ్యింది. పుస్తకం మళ్ళీ చేతుల్లోకి వచ్చింది.

"టైమ్ ఎంతయ్యింది ?"

"12 దాటింది. రేపు ఉదయం బోటింగ్ కీ, ఆ తరువాత ఆర్ట్ మ్యూజియంకీ వెళ్ళాలి. ఇప్పుడా పుస్తకం తెరవకు. త్వరగా నిద్రపో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్..."

"గుడ్ నైట్.... స్వీట్ డ్రీమ్స్. "

No comments:

Post a Comment