Saturday, March 18, 2023

Artist and the disease of Hero worship

చాలా కాలం క్రితం నా బ్లాగ్ ను ఏళ్ళ తరబడి శ్రద్ధగా చదువుతున్న మిత్రులొకరు, "మీ రీడింగ్ పాట్టర్న్స్ అర్థం కావడం లేదు నాకు". అన్నారు. నేను "ఎందుకంటే అక్కడ పాటర్న్ ఏమీ లేదు కాబట్టి " అన్నాను.

చిన్నప్పుడు అందరిలాగే పల్ప్ తో మొదలైన నా పఠనం అదృష్టవశాత్తూ అక్కడే ఆగిపోలేదు. ఏ ఒక్క మూసలోనూ ఇరుక్కోలేదు. పాత పేషంట్ కి డాక్టర్ కి ఉన్నంత అనుభవమూ ఉంటుందంటారు. ఈ కారణంగా రాయడం నా వొకేషన్ కాకపోయినా, రచనల క్వాలిటీ ఏమిటో చెప్పగల అనుభవం నాకు సహజంగానే చదవడం ద్వారా ఎంతో కొంత అబ్బిందనుకుంటాను. ఎవరైనా "మీరు ఎందుకు రాయరూ?" అని అడిగినా అదే చెప్తాను, "అద్భుతమైన రచనల రుచి బాగా తెలిసినదాన్నిగా అంతకంటే బాగా రాయలేనని నిస్సందేహంగా తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఉన్న ప్రింట్ చెత్తలో మరికాస్త నా వంతు చెత్త కూడా కలిపే ఉద్దేశ్యం లేదు" అని.

Image Courtesy Google

ఇక సోషల్మీడియాలో ఏదైనా రచనో, సినిమానో బావుందనో,బాగాలేదనో  చెప్పినప్పుడో, లేదా ఏదైనా విషయం మీద మన అభిప్రాయం చెప్పినప్పుడో  వెంటనే, "మీకేం తెలుసని మాట్లాడుతున్నారు ? అందరూ మేథావులే" అని ఆ "ఇంటెలెక్చువల్" అనే పదాన్ని ఘాటైన తిట్టులా వాడడం కూడా పరిపాటే.

"Where the mind is without fear and the head is held high

Where knowledge is free

Where the world has not been broken up into fragments

By narrow domestic walls" 

అంటూ పసితనంలో ప్రియంగా పదే పదే పాడుకున్న రవీంద్ర గీతి 14 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన నా బ్లాగ్ లో మొదటి పోస్ట్ కావడం కేవలం యాదృచ్ఛికం అనుకోను. ఇన్నేళ్ళ చదువూ నాకేదన్నా నేర్పించింది అంటే అది మనిషి స్వేచ్ఛా జీవే గానీ సిద్ధాంతాలకూ, సంప్రదాయాలకూ, మాన్ మేడ్ గాడ్స్ కీ కట్టు బానిస కాదనీ, మెదడుకి స్వేచ్ఛని నేర్పించాలనీ, అన్ని రకాల అథారిటీలూ ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించే యోగ్యత ఉన్నవి కావనీ మాత్రమే.

ఈరోజు మనం మళ్ళీ రాతియుగం వైపు ప్రయాణిస్తున్నట్లు ఒక రచయితనో, మరో కళాకారుణ్ణో ఒక పెడస్టల్ మీద కూర్చోబెట్టడమో, లేదా విగ్రహారాధన చేసినట్లు మెడలో దండేసి, దేవుణ్ణి చేసి కాళ్ళు కళ్ళకద్దుకోవడమో చెయ్యడం చూస్తున్నాం. నన్నడిగితే ఐడియలైజేషన్ లేదా హీరో వర్షిప్ మన దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి పట్టుకున్న దరిద్రం. మనకి మనిషిని మనిషిగా చూడడం చేతకాదు. వాళ్ళని దేవుళ్ళను చేసేస్తే గానీ నిద్రపట్టదు. కామూ అన్నదే మరో విధంగా, మనకి రెండే రెండు ఇష్టాలు, "ఒకటి ఫాలో అవ్వడం లేదా లీడ్ చెయ్యడం." మధ్యే మార్గం మనకి తెలీదు. 

ఇక్కడ ఇష్టం, ఆరాధన వరకూ పర్వాలేదు, కానీ అదొక ధృతరాష్ట్ర ప్రేమలా, గుడ్డి అనుసరణలానో, అబ్సెషన్ లానో తయారవుతోంది. తమకు నచ్చిన రచయితనో, రచయిత్రినో లేదా నటుడినో ఒక్క మాటనడానికి వీల్లేదు. వాళ్ళను అచ్చంగా దేవుళ్ళను చేసి మనం కొలిచినట్లే అందరూ కొలవాలనుకోవడం. "వాళ్ళు నా కళ్ళకు మామూలుగానే, మనుషుల్లానే కనబడుతున్నారు" అని ఎవరైనా అంటే," అబ్బే ఆ సినిమాను ఇలా మాత్రమే చూడాలి, లేదా ఈ పుస్తకాన్ని పవిత్ర గ్రంథంలా ఇలా మాత్రమే చదవాలి, నీకు చూడడం రాదు, బహుశా నీకు గుడ్డితనం ఉంది కావచ్చు" అనడం, మరికాస్త ముందుకెళ్ళి వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం. "No two people read the same book" అనే చిన్న విషయం అర్థం చేసుకోలేని మన గొప్ప గొప్ప చదువులెందుకు !! ప్రపంచాన్ని చూడడానికి ఎన్ని కళ్ళు ఉంటాయో అన్ని దృష్టి కోణాలు కూడా ఉంటాయన్న కనీస మానసిక పరిణితి లేని మన అనుభవమెందుకు !! ఆర్ట్ ఒక "ఇండివిడ్యుయల్ / పర్సనల్ ఎక్స్ప్రెషన్ " అనుకుంటే, ఆ ఆర్ట్ ని అర్థం చేసుకోవడం కూడా అంతే,  పూర్తిగా వ్యక్తిగతం. నేను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చదివిన రచనలు నా తర్వాతి తరానికి పరమ చెత్తలా అనిపించవచ్చు. తరాలను బట్టి అభిరుచులు కూడా  రూపాంతరం చెందుతూ ఉంటాయి. 

మనుషులం, ఋషులం కాదు కాబట్టి పోనీ మనకు నచ్చిన రచయితనో, రచయిత్రినో మన అభిమానం కొద్దీ దండేసి దణ్ణం పెట్టుకుందాం. మనిష్టం.  కానీ మనలాగే మరొకరు కూడా మోకరిల్లాలని ఆశించడం అపరిపక్వత క్రిందకి వస్తుంది. ఆర్ట్ కి పర్యాయపదమేదైనా ఉందంటే అది "స్వేచ్ఛ" అనుకుంటాను. కళారంగం మొదలు అన్ని చోట్లా తమ రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళను ఆరాధించడం, అభిమానించడం, ఆదర్శంగా తీసుకోవడం మంచిదే. అది అవసరం కూడాను. కానీ ఉన్న దేవుళ్ళు చాలనట్లు మనుషుల్ని కూడా దేవుళ్ళను చేసి జీవితాంతం వారి కీర్తికి కాపుకాస్తున్నామనుకుంటూ వాళ్ళని  డిఫెండ్ చేసుకుంటూ అందరి మీదా బురద జల్లడంలో, భిన్నాభిప్రాయాల ప్రాతిపదికన శత్రుత్వాలు పెంచుకోవడంలో స్వేచ్ఛ లేదు. ఉన్నదల్లా కట్టు బానిసత్వమే.

No comments:

Post a Comment