సత్యశోధనలో (స్పిరిట్యుయల్ క్వెస్ట్ అందామా !) ఒకరు ఆధ్యాత్మికతనూ, మరొకరు సాహిత్యాన్నీ సాధనాలుగా చేసుకున్నవాళ్ళం కాబట్టి నాకూ,నరేన్ కీ మధ్య ఈ విషయంలో తరచూ వాడీ వేడీ చర్చలు జరుగుతూ ఉంటాయి. అలా ఒకసారి మాటల మధ్యలో తన మార్గాన్ని ఎలివేట్ చేసుకుంటూ సాహిత్యానికి పై మెట్టు ఆధ్యాత్మికత అన్నారు నరేన్. నిజమే, నాస్తికురాలినైనా(?) నేను కూడా నిర్ద్వందంగా అంగీకరించే విషయం ఇది. ఎటొచ్చీ నా విషయంలో ఆధ్యాత్మికతకు ఉన్న నిర్వచనాలు పూర్తిగా వేరు.
Image Courtesy Google |
కానీ నా గమనింపులోకి తరచూ వచ్చే విషయం ఏమిటంటే చాలామంది సాహిత్యాన్నీ,ఆధ్యాత్మికతనూ ఒకే గాటికి కట్టేస్తారు. కాస్త పరిశీలిస్తే రెంటి మధ్యా భూమ్యాకాశాల అంతరం ఉంటుంది. సాహిత్యం ఏదో ఒక స్టాండ్ తీసుకోమంటుంది, ఆధ్యాత్మికత చూపు ఆ అంతరాల్ని దాటి ఆవలకి వెళ్తుంది. సాహిత్యాన్ని శోధించేవాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అనుకుంటే, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాడు వానప్రస్థంలో ఉన్నవాడితో సమానం. గృహస్థాశ్రమంలో ఉంటూ సర్వసంగపరిత్యాగిలా వ్యవహరించడం కుదరదు. సాహిత్యం పరమోద్దేశం బ్రతుకు చిత్రాన్ని యధాతథంగా అక్షరబద్ధంచేసి చూపించడం. నా వరకూ పురాణేతిహాసాలు కూడా ఈ కాల్పనిక సాహిత్యం క్రిందకే వస్తాయి. సాహిత్యం ప్రతిబింబించే ఈ 'బ్రతుకు చిత్రం' సహజంగా చైనీస్ ఫిలాసఫీలో ఉండే ఇన్-యాంగ్ (Yin-Yang) ని పోలి ఉంటుంది. ఇందులో మంచి-చెడు,ధర్మం-అధర్మం, నీతి-అవినీతి, వాస్తవం- కల్పన, యుద్ధం-శాంతి వంటి ద్వంద్వాలు అన్నీ పరస్పరం అనుసంధానంగా ఉంటాయి. ఈ వైరుధ్యం, ద్వంద్వం లేని సాహిత్యం అసంపూర్ణం.
ముఖ్యంగా టాల్స్టాయ్ సాహితీ ప్రస్థానంలో మొదలూ,తుదా గమనిస్తే ఈ ద్వంద్వాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అన్నా కరెనిన, వార్ అండ్ పీస్ లాంటి రచనలతో మొదలైన ఆయన సత్యశోధన చివరకు కన్ఫెషన్స్, ది డెత్ ఆఫ్ ఇవాన్ ఇలియచ్ లాంటి రచనలతో ముగిసింది. ఆయన రచనా వ్యాసంగం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తరహాలో 'హ్యాపీ గో లక్కీ' రచనలతో మొదలవ్వలేదు. ముళ్ళని విస్మరించి తన రాతల్లో ఆయన గులాబీల పరిమళాల్ని మాత్రమే వెదజల్లలేదు. నిజానికి అనేక సంఘర్షణల,సందిగ్ధతల నడుమ కళాకారుడి తొలి అడుగుపడుతుంది. సాహితీ ప్రపంచంలో వెతికితే నిజానికి గొప్ప గొప్ప సాహితీవేత్తల్ని ఎవర్ని చూసినా వారి ప్రయాణం దాదాపూ అలాగే మొదలవుతుంది. దీనికి పూర్తి విరుద్ధమైన సాహితీసృజనలో ప్రామాణికత అనుమానాస్పదం.
ఇక ఆధ్యాత్మికత అనగానే సహజంగా మనసుని నిశ్చలంగా ఉంచి రాగద్వేషాలకతీతంగా తామరాకుమీద నీటిబొట్టులా బ్రతకడం అలవర్చుకోవడం అంటారు. కానీ ఈ దశకి చేరుకున్న కళాకారుడిలో సృజనాత్మకతకు అవకాశం లేదు. ఎటువంటి సంఘర్షణకూ, రాపిడికీ లోనుకాని అతడి కలంలోంచి వెలువడే పదాల్లో భావావేశం కొరవడిన డొల్లతనం వ్యక్తమవుతుంది. ఇక్కడ సాహితీ సృజనకు ఆస్కారం శూన్యం. నిశ్చలత్వంలోంచి సాహిత్యం పుట్టదు. నిశ్చలత్వం అన్ని స్థితులకూ అతీతమైన స్థితి. అందువల్ల ఇది మత గ్రంథాలపైనా, పురాణేతిహాసాలపైనా లోతుగా వ్యాఖ్యానించే వారినుద్దేశించి అంటున్న మాట ఎంతమాత్రం కాదు. సాహిత్యం ఆధ్యాత్మికతకు భిన్నంగా క్రియాశీలకంగా వ్యవహరించడం నేర్పిస్తుంది. నిశ్చలమైన ఆధ్యాత్మిక స్థితికీ, సాహితీ ప్రయోజనానికీ చుక్కెదురని చెప్పడమే నా ఉద్దేశ్యం.
నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారిని వదిలేస్తే మనచుట్టూ తమ నిస్సహాయతనూ, అశక్తతనూ ఆధ్యాత్మికత ముసుగులో దాచుకుంటూ, సెల్ఫ్-హెల్ప్ కంటెంట్ కి సాహిత్యం పేరుపెట్టి అమ్మేస్తున్న సాహితీవేత్తలు పెరిగిపోయారు. మనిషిలో 'జడ్జిమెంట్' చెయ్యగల నేర్పు ఆరోగ్యకరమైన మెదడుకి సూచన అంటారు ప్రముఖ రచయితా,న్యూరో సైంటిస్ట్ ఆలివర్ సాక్స్. తామరకు మీద నీటిబొట్టులా జీవించాలని బోధించిన గీతాచార్యుడు కూడా సందర్భం వచ్చినప్పుడు తాను కూడా పాండవుల పక్షం తీసుకుని కర్మ సిద్ధాంతాన్నే బోధించాడు గానీ అస్త్రసన్యాసం చేసి గోడమీద పిల్లిలా తటస్థంగా ఉండమని బోధించలేదు. జడ్జిమెంట్ చెయ్యలేని చేతకానితనానికీ, ఏ పక్షమైనా తీసుకోవాలంటే లాభనష్టాల బేరీజు వేసుకోకుండా ఆ పనిచెయ్యలేని స్వార్థానికీ ఆధ్యాత్మికతను (?) సౌకర్యంగా అడ్డుపెట్టుకుంటే పెట్టుకున్నారు, కానీ సాహితీరంగంలో ఉన్నవారు ఏ పక్షమూ తీసుకోకూడదని అనేవారికి సాహిత్యం పరమోద్దేశ్యం అర్థం కాలేదని అర్థం. సాహిత్యానికి అటువంటివారి అవసరంలేదు. నిజానికి సాహిత్యానికి అటువంటి వారు చేసే మేలు కంటే కీడే ఎక్కువ.
సాహితీవేత్త శాంతి మంత్రాన్ని జపించడంతోపాటు విప్లవ గీతాన్ని కూడా ఆలపిస్తాడు. అలాకాకుండా కేవలం శాంతి మంత్రాన్ని జపించేవాడు ప్రవచనకారుడవుతాడే గానీ సాహితీవేత్త కాలేడు. కేవలం యుద్ధంవైపో, లేదా పూర్తిగా శాంతివైపో పరిమితమయిపోయిన సాహిత్యంలో ఆత్మ లేని శరీరంలా పరిపూర్ణత లోపిస్తుంది. ఆ సమతౌల్యం దెబ్బతినకుండా చూసుకోవడం కళాకారుడి బాధ్యత. సమాజం ముందుకు అడుగు వెయ్యడానికి గోర్కీలాంటి రచయితలు నమ్మి ఆచరించే కర్మ సిద్ధాంతం ఎంత అవసరమో, అవే అడుగులు తప్పటడుగులు కాకుండా ఆపి ఆలోచింపజేసే క్రిఝానోవ్స్కీ లాంటి వారి కర్మకు సుదూరమైన తాత్వికతా, ఆదర్శవాదం కూడా అంతే అవసరం. సాహిత్యంలో అనేక పార్శ్వాలు ఉంటాయి. అవన్నీ శోధించడానికి ఒక జీవితకాలం పడుతుంది. కేవలం తనకు అనువైన ఏదో ఒక పార్శ్వాన్ని పట్టుకుని వ్రేళ్ళాడుతూ సాహితీవేత్తలమైపోయామనుకునేవాళ్ళూ, మరో పార్శ్వాన్ని చూడలేని వాళ్ళూ ముందుముందు ప్రవచనకారుల్లా మిగిలిపోయే అవకాశం ఉంది. సామాజిక వైచిత్రికి అద్దంపట్టవలసిన సాహిత్యం రాజకీయ,సాంఘిక అస్థిరతలు తలెత్తినప్పుడు ఏదో ఒక పక్షం తీసుకోకుండా బాధ్యతారహితంగా,తటస్థంగా కేవలం గట్టున కూర్చుని శాంతిమంత్రాలు జపించే మత ప్రవక్తల్నీ, బాబాల్నీ తయారుచేసే నిలయంగా మారిపోయే ప్రమాదం ఉంది.
సాహిత్యంతో సావాసం వ్యక్తిగత అభిప్రాయాలనూ, సిద్ధాంతాలనూ, మోరల్ కోడ్ నీ ఏర్పరుచుకోడానికీ, మంచి-చెడులను విశ్లేషించుకోడానికీ సహాయం చేస్తుంది. అవసరమైన సందర్భాల్లో క్రియాశీలకంగా ఉండడమెలాగో నేర్పిస్తుంది. మన గళాన్ని నిర్భయంగా వినిపించే ధైర్యాన్నిస్తుంది. అలా కాని పక్షంలో సాహిత్యంతో ఏ ప్రయోజనమూ లేదు. ఆధ్యాత్మికత పేరిట జడ్జిమెంట్ కు ఉపయోగపడని ప్రవచనాలకూ, ప్రవచనకారులకూ సాహిత్యంలో స్థానం లేదు.