Wednesday, August 14, 2024

Don Quixote - Miguel de Cervantes

పాశ్చాత్య సాహిత్యంలో "తొలి ఆధునిక నవల"గా ప్రఖ్యాతి గాంచిన సెర్వాంటెజ్ "డాన్ క్విక్ సెట్" నవల చదవాలని చాలా కాలంగా అనుకుంటున్నదే. ఇలాంటి క్లాసిక్స్ ప్రత్యేకత ఏంటంటే, వాటిని చదవక ముందే అనేక రచనల్లో వాటిని గురించి చాలా సంగతులు వినో లేదా చదివో ఉంటాం. అలా ఈ నవల గురించి మునుపు రెండు మూడు రచనల్లో ప్రస్తావనలు చదివిన తర్వాత "డాన్ క్విక్ సెట్" మీద ఆసక్తి కలిగింది. ఇక ఈ కాలంలో చదవడానికి సమయం కేటాయించగలగడమే గొప్ప అనుకుంటే నా విషయంలో వెయ్యి పేజీల పుస్తకం అతి పెద్ద "డీల్ బ్రేకర్". అలా ఈ నవల ఉనికిని మర్చిపోయిన సమయంలో యాదృచ్ఛికంగా దీనికి తెలుగు అనువాదం కనిపించింది. ఎప్పుడో తోటి పుస్తకాలపురుగులెవరైనా షేర్ చేశారో, లేదా గూగుల్ వేటలో నాకే ఎప్పుడైనా కనిపించిందో కూడా గుర్తులేదు. ఏదేమైనా ఇది హార్డ్ డిస్క్లో ఓ మూలన దాక్కుని ఉంది. తర్వాతెప్పుడైనా చదువుదాంలే అనుకుంటే మళ్ళీ కనిపించడం కష్టం కాబట్టి, ఈసారి వాయిదా వెయ్యదల్చుకోలేదు.

                                        Image Courtesy Google

ఇక మూలం తెలుగైతే తప్ప సాధారణంగా ఇలాంటి పుస్తకాలు ఇంగ్లీషులో చదవడమే తేలికనిపిస్తుంది నాకు. "డాన్ క్విక్ సెట్"ను తెలుగులోకి అనువదించిన విశ్వాత్ముల నరసింహమూర్తి గారు వెయ్యి పేజీల ఈ పుస్తకాన్ని మూడొందల పేజీలకు కుదించారు. ఈ పుస్తకం విషయంలో నాకు ఆ పేజీల సంఖ్య సౌకర్యంగా అనిపించింది :) దానికి తోడు కథ పరాయిదైనా చిక్కని తెలుగుదనంతో కూడిన చమత్కారాలూ, హాస్యం అచ్చంగా తెలుగు పుస్తకమే చదువుతున్నట్లు భ్రమింపజేస్తాయి.

లామంచా అనే గ్రామంలో సామాన్య కుటుంబీకుడైన డాన్ పొద్దస్తమానమూ  పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. వీరుల, మహావీరుల గాథలన్నీ చదివి తలకెక్కించుకునేసరికి ఆయనలో ఒక వింతప్రవృత్తి మొదలవుతుంది. తాను కూడా మహావీరుణ్ణనిపించుకోవాలనీ, తన వీరగాథలు కూడా పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనీ కలలుకంటూ చివరకు ఒకరోజు బక్కచిక్కిన ముసలి గుర్రాన్ని ఎక్కి, అట్టముక్కలు అంటించిన ఉక్కు టోపీ, ముత్తాతల  కాలంనాటి తుప్పుపట్టిన కవచం ధరించి, పాత కత్తినొకదాన్ని తీసుకుని, శాంకో  పాంజా అనే బంటుతో కలిసి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్యడానికి బయలుదేరతాడు. ఆ క్రమంలో అతడికి ఎదురయ్యే అనేక సరదా సంఘటనలను నవలగా రాసుకొచ్చారు సెర్వాంటెజ్. డాన్ స్వభావరీత్యా మంచివాడే అయినప్పటికీ అతనిలోని మూర్ఖత్వం, అజ్ఞానం కలబోసిన వెఱ్ఱితనం ఒక్క అతనికి తప్ప మిగతా అందరికీ తెలుస్తూనే ఉంటుంది.

డాన్ తన కాల్పనిక ప్రపంచాన్ని వాస్తవమని మనసావాచా నమ్మడం అందరికీ  ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ప్రతీ మనిషిలోనూ అంతర్లీనంగా ఒక "డాన్ క్విక్ సెట్" ఉంటాడేమో!! ప్రతీ మనిషీ తాను గొప్పవాణ్ణనీ, మంచివాణ్ణనీ, తనలో అనేక సుగుణాలున్నాయనీ నమ్ముతాడు. ప్రతీ మనిషి కథలోనూ తనకు తానే ఒక పెద్ద హీరో. నిజానికి అది మనకు మనం చెప్పుకునే కథ. మరి ఎదుటి మనిషి కూడా మనల్ని హీరోలాగే చూస్తున్నాడా? ఈ హీరో కథను మరొక వ్యక్తిని అడిగితే నిస్సందేహంగా దాన్ని అతడి దృష్టి కోణం నుంచే చెబుతాడు. ఆ కథలో మనం హీరో కాకపోవచ్చు, విలన్ కావచ్చు, లేదా మరో సహాయక పాత్రో, కమెడియన్ పాత్రో కావచ్చు. ఆ కథకూ, మన కథకూ పోలికలుండవు లేదా ఆ కథ యథాతథంగా మనం మన గురించి చెప్పుకుంటున్న కథలా అయితే ఉండదు. మనం వీరశూరాగ్రేసరుడు "డాన్ క్విక్ సెట్" అని మనం అనుకున్నట్లు ఇతరులు అనుకోకపోవచ్చు. మన జీవితాల గురించి మనం చెప్పుకునే కథలు వాస్తవంగా జరిగినదాన్ని ప్రతిబింబించడంలో చాలాసార్లు విఫలమవుతాయి. వాటిల్లో వాస్తవికత లోపభూయిష్టమైనది. అలాగని అవి పూర్తిగా అబద్ధాలనీ కొట్టిపారెయ్యలేం.

మూడేళ్ళ క్రితం అనుకుంటా నోబెల్ గ్రహీత జె. ఎమ్. కూట్సీ, సైకోథెరపిస్టు అరాబెలా కర్ట్స్ సంయుక్తంగా రాసిన 'ది గుడ్ స్టోరీ' అనే పుస్తకం చదివాను. అందులో వాస్తవానికీ, కాల్పనికతకూ మధ్య సంబంధాన్ని సైకో ఎనలిటిక్ విశ్లేషణల నేపథ్యంలో విస్తృతంగా చర్చించారు. అందులో కూడా 'డాన్ క్విక్ సెట్' నవల ప్రస్తావన వస్తుంది. ఈ కథలో డాన్ సృష్టించుకునే ఆదర్శవంత సత్యం (ideal truth) వాస్తవిక సత్యం (real truth) కంటే మెరుగైనదేమో అనిపిస్తుంది. నవల రెండో భాగంలో ఒక సందర్భంలో డాన్ తాను అశ్వారూఢుడయిన మహా వీరుడిని అన్న భ్రమ నుండి విడివడి ఇలా అంటాడు: "నాకు ఒక శూరుడి ధర్మం పట్ల నమ్మకముంది, నేను నా నమ్మకాలకనుగుణంగా మసలుకునే వ్యక్తిని. అలా చెయ్యడం ద్వారా మనిషిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. నేను మునుపటిలా స్పానిష్ సమాజంలో శిథిలమైపోతున్న నా భవంతిలో మరణం కోసం ఎదురుచూస్తూ దుర్భరమైన స్థితిలో ఉండడం మీకు ఇష్టమా? లేదా ఇప్పటిలా పేదలకు, అణగారిన వర్గాలకు, బాధితులైన స్త్రీలకూ రక్షకుడుగా ఉండడం ఇష్టమా? అయినా నా నమ్మకాలు మనిషిగా నా ఎదుగుదలకు తోడ్పడుతున్నప్పుడు మీరు వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారెందుకు?"

డాన్ క్విక్ సెట్ మాటల్ని పరిశీలిస్తే మనిషి శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు కొన్ని భ్రమలని కూడా వాస్తవాల్లా నమ్మడంలో కోల్పోయేదేముంటుంది అనిపిస్తుంది. మనిషి మానసికారోగ్యానికి అవసరమైన మోతాదులో కాల్పనికత చేసే మేలుని గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ నాకైతే కనపడలేదు. నేటి సమాజంలో శాస్త్ర సాంకేతికాభివృద్ధి కారణంగా సృజనాత్మకతకు తావివ్వని మితిమీరిన స్పష్టత, తార్కికత లాంటివి మనిషి మానసికాభివృద్ధిని అనేక విధాలుగా నిర్వీర్యం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. డాన్ ఆదర్శవాదాన్ని ఆచరించకపోయినా అతడి ఆదర్శాల వల్ల ప్రపంచానికొరిగే నష్టమైతే లేదని శాంకో పాంజాతో సహా డాన్  అనుచరులందరూ ముక్తకంఠంతో తీర్మానిస్తారు. ఇటువంటి భ్రమల వల్ల ప్రపంచం మరికొంచెం సజీవంగా, వినోదాత్మకంగా మారుతుందని అభిప్రాయపడతారు. 

"We have art in order not to die of the truth." అంటారు ఫ్రెడ్రిక్ నీచ. అలాగని తన వాస్తవాన్ని కల్పిత కథనాలతో మార్చుకొనే స్వేచ్ఛ మనిషికి ఉందా అన్నది ప్రశ్నర్థకమే. డాన్ కు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడ్డాయి. మన వాస్తవాన్ని మనకు వీలుగా మార్చుకోవడానికి సాహిత్యం అనంతమైన అవకాశాలిస్తుందనడానికి "డాన్ క్విక్ సెట్" కథ చక్కని ఉదాహరణ. సహజంగా ‘కథ’ అనగానే సత్యదూరమైనది, కాల్పనికమైనదీ అనే స్థిరాభిప్రాయం ఉంటుంది. కానీ ఫిక్షన్ అనేది పూర్తి నిజమూ కాదు, అబద్ధమూ కాదు. అది సమీకరణాల్లో కాన్స్టెంట్ లా సాపేక్షమైనది, అస్థిరమైనదీనూ. అటువంటి కాల్పనిక ప్రపంచంలో తమకు తోచిన సత్యాన్ని తూకం వేసి నిర్ణయించుకునే అవకాశం పాఠకులకు ఎప్పుడూ ఉంటుంది.