Friday, August 30, 2019

Mrs.Fox - Sarah Hall

సమకాలీన సాహిత్యంలో రచయితలకు భాష,వ్యాకరణం లాంటి అంశాల మీద పట్టు లేదని తీర్మానించే వారెవరూ బహుశా సారా హాల్ ను చదివుండరేమో !! ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అదే నిశ్చితాభిప్రాయం కలిగి ఉండేదాన్ని..ఈ మధ్య మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో రచయితలు భావానికి మాత్రమే పట్టంకడుతూ భాషను నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి విస్మరించలేనిదైనా అక్కడక్కడా భాషా సౌందర్యంతో తళుక్కుమని మెరిసే ఇటువంటి రచనలు తారసపడినప్పుడు ఇలాంటివారుండగా భవిష్యత్తులో సాహిత్యానికి ఏ ఢోకాలేదని ఎక్కడో చిన్న నమ్మకం కలుగుతుంటుంది..ఫాబర్ స్టోరీస్ సిరీస్ లో భాగంగా ఫాబర్ సంస్థ ప్రచురించిన మరో ఆణిముత్యం ఈ సారా హాల్ రాసిన 'మిసెస్ ఫాక్స్'..1922 లో డేవిడ్ గార్నెట్ రాసిన నవలిక 'Lady into Fox' మీద పాక్షికంగా ఆధారపడి రాసిన ఈ కథ 2013 లో 'BBC National Short Story Award' ను గెలుచుకుంది..
Image Courtesy Google
ఈ కథను థర్డ్ పర్సన్ లో రాశారు..ఇద్దరు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు,వారిది అన్యోన్య దాంపత్యం..THAT HE LOVES HIS WIFE is unquestionable అంటూ అతడికి భార్యపై ఉన్న ప్రేమను నిర్వచిస్తూ ఈ కథ మొదలవుతుంది..మరి అతడి భార్య సంగతేంటి ? అంటే "ఆమె ఒక మిస్టరీ లాంటిది,అందరు తెలివైన స్త్రీలలాగే" అంటారు..రాత్రుళ్ళు ఆమెకు వచ్చే స్వప్నాలు కూడా చిత్రంగా ఉంటాయి...ఆమె చిక్కటి అడవుల్నీ,చీకటి దారుల్నీ,గుహల్నీ,పచ్చని చెట్ల వేర్లనీ,భూమినీ స్వప్నాల్లో దర్శిస్తుంటుంది.."ఆమె పర్స్ లో ఒక చిన్న ఊదారంగు బాల్ ఉంటుంది,ఉపయోగంలేనిదే..కానీ ఆమె దాన్ని భద్రంగా దాచుకుంటుంది..ఎందుకో ఎవరికి తెలుసు ? ఆమె పేరు సోఫియా"...అంటూ కథను మెల్లిగా వాస్తవికత నుండి వేరుచేసి అబ్సర్డిటీ వైపు తీసుకువెళతారు..పాఠకుడు ఈ అస్పష్టతను,అసంబద్ధతనూ అర్ధంచేసుకునేలోపు వారిద్దరూ ఒక అక్టోబర్ లో తెల్లవారుఝామునే నడకకు బయలుదేరతారు..'They do not speak, but it is not uncompanionable' అంటూ ఆ దారిలో ఒక చిన్న వాక్యంతో వారిద్దరి మధ్యా అనుబంధానికి మరో గట్టి చిక్కుముడివేసి వదిలేస్తారు సారా..జనారణ్యపు ఛాయలు పలుచబడి చిక్కని అడవి మొదలయ్యే సమయానికి సోఫియా అడుగులు వేగాన్నందుకుంటాయి,వేగాన్ని హెచ్చిస్తూ మునివేళ్ళమీద పరుగుతీస్తున్న ఆమెను వెంబడిస్తాడు భర్త..అలా కొంతదూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆమె ఒకచోట ఆగిపోయి వెనుదిరిగి చూస్తుంది..ఆ సమయంలో భర్త కళ్ళెదురుగానే సోఫియా ఒక నక్కగా మెటామోర్ఫోసిస్ చెందుతుంది..ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగతా కథ.

She turns her head and smiles. Something is wrong with her face. The bones have been recarved. Her lips are thin and her nose is a dark blade. Teeth small and yellow. The lashes of her hazel eyes have thickened and her brows are drawn together, an expression he has never seen, a look that is almost craven. A trick of kiltering light on this English autumn morning.

ఈ కథ రియలిజం,మ్యాజికల్ రియలిజం శైలుల మిశ్రమం అని చెప్పొచ్చు..ఇందులో కథకు అవసరమైన శృంగారపరమైన వర్ణనలు కూడానా చక్కని వినసొంపైన పదాలతో అలవోకగా పండించారు..ఇక ప్రకృతి వర్ణనల గురించైతే ఎంత చెప్పినా తక్కువే..సారా దీనిని గద్యంలో రాశారనడం కంటే దీన్నొక గద్య కవిత్వంగా అభివర్ణించడం సమంజసం..ఇలాంటి కథల్ని పైకి చదవడం వల్ల ఆ పదాల్లో ఆంగ్ల వచన సౌందర్యం మరింత ఇనుమడించి పాఠకులకు రసానుభూతిని కలిగించే అవకాశం ఉంటుంది..ఇందులో 'లిరికల్ ప్రోజ్' ఈ కథకు ఆత్మలాంటిది..ఆంగ్ల వచనం అత్యంత సుందరంగా అమరిన ఈ కథలో ప్లాట్ చాలా సాదాసీదాగా ఉన్నప్పటికీ నేరేషన్ మాత్రం కథను ఆద్యంతం రక్తికట్టించింది..కథనంలో భాగంగా చేసి రాసిన ప్రకృతి వర్ణనలు మరచిపోయిన మానవ సమాజపు మూలాల్ని మరోసారి గుర్తుచేస్తాయి..నాగరికత పేరిట జనారణ్యానికీ,మిగతాజీవజాలాలుండే అరణ్యాలకీ మధ్య మానవ సమాజం నిర్మించిన కనిపించని గోడల్ని కూల్చేస్తూ దానికి సమాంతరంగా మరో 'పారలెల్ యూనివర్స్' సృష్టించే ప్రయత్నం చేశారు సారా..'భాష పదును' అర్ధంకావాలంటే తప్పకుండా చదివితీరాల్సిన రచన ఈ 'మిసెస్ ఫాక్స్'..ఈ చిన్న పుస్తకం ఆమె మిగతా పుస్తకాలను చదవాలనే ఆసక్తి కలిగించింది.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

He closes his eyes. Sleep, the cure for all catastrophes, will bring relief, perhaps even reversal.

To be comfortable inside one’s sadness is not valueless. This too will pass. All things tend towards transience, mutability. It is in such mindful moments, when everything is both held and released, that revelation comes.

Saturday, August 24, 2019

Santha Rama Rau's Two Stories - 'By Any Other Name' & 'Who Cares?'

ఆ మధ్య యేదో పుస్తకం గురించి వెతుకుతుంటే 'గ్రేటెస్ట్ షార్ట్ స్టోరీస్ ఆఫ్ ది వరల్డ్' అని ఒక పుస్తకం కనిపించింది..అందులో రచయితల్లో ఇద్దరు భారతీయుల పేర్లు ఉన్నాయి..వారిలో ఒకరు ఠాగోర్ కాగా మరొకరు ఈ 'శాంతా రామా రావ్'..మొదటిసారి పేరు విన్న ఆసక్తి కొద్దీ ఈవిడ కథలు రెండు కనిపిస్తే చదివాను..ఒక కథ ఆ పుస్తకంలో చెప్పిన 'Who Cares ?' కాగా మరో కథ ది న్యూయార్కర్ లో ప్రచురితమైన కథ 'By Any Other Name'.
ఆంగ్లేయుల కాలంనాటి బ్రిటిష్ ఇండియాలో పెరిగిన శాంత స్వానుభవాల నుండి పుట్టిన ఈ కథలు కల్పితాలు కాదు..1923 లో జన్మించిన శాంతా రామారావ్ తండ్రి బెనెగల్ రామారావ్ బ్రిటీషు వారి కాలంలో సివిల్ సర్వీసెస్ లో కీలక పదవులు నిర్వర్తించారు,ఆ కారణంగా శాంతా రామారావ్ జీవితం రెండు సంస్కృతుల మధ్య వైరుధ్యాలకు కేంద్రబిందువుగా మారింది..అందువల్లనే ఈ రెండు కథల్లోనూ 'కల్చరల్ క్లాష్' ప్రధానాంశంగా కనిపిస్తుంది.

ఫస్ట్ పర్సన్ లో రాసిన Who Cares ? కథలో నేరేటర్ ఒక యువతి..అమెరికాలో ఐదేళ్ళు విద్యాభ్యాసం చేసి ఆమె బొంబాయి తిరిగొచ్చిన తరువాత అమెరికాలో సహా విద్యార్థి అయిన ఆనంద్ తో మళ్ళీ ఇండియాలో పరిచయం పెరుగుతుంది..విదేశంలో విద్యాభ్యాసం సమయంలో ముఖ పరిచయం తప్ప పెద్దగా స్నేహం లేని వారిద్దర్నీ ఇండియాలో ఎదుర్కున్న సాంస్కృతికపరమైన వైరుధ్యాలు స్నేహితులుగా మారుస్తాయి..ఆధునిక కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి(నేరేటర్) కంటే గుజరాతీ సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆనంద్ మీద సాంస్కృతికపరమైన వత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది..పాశ్చాత్య ధోరణులను వ్యతిరేకించే ఆనంద్ తల్లి అతనికి జానకి అనే సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతితో వివాహం నిశ్చయిస్తుంది..కానీ పాశ్చాత్య పద్ధతులకు అలవాటుపడిన ఆనంద్ కు ఈ వివాహం ససేమిరా ఇష్టం ఉండదు..నేరేటర్,ఆనంద్ ఒక కాఫీ షాప్ లో కలుసుకుంటూ ఈ విషయాన్ని గురించి పలుసార్లు చర్చించుకుంటూ ఉంటారు..కానీ విచిత్రంగా చివరకు ఆనంద్ జానకిని వివాహమాడడానికి అంగీకరిస్తాడు.

ఈ కథలో స్త్రీ వాదాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు రచయిత్రి...అంతవరకూ సంప్రదాయ భారత స్త్రీ వ్యక్తిత్వానికి రూపకల్పన చేసిన శరత్,ఠాగోర్ నాయికల్ని గ్లోరిఫై చేసిన ఆనాటి సాహితీ ప్రపంచం మీద ఈ కథ ఒక తిరుగుబాటులా ఉంటుంది..స్త్రీలకు కూడా విద్యా ఉద్యోగావకాశాలు పెరుగుతున్న కొత్త తరంలో నేరేటర్ పాత్ర ఆధునిక యువతికి ప్రతినిధిగా కనిపిస్తే,జానకి పాత్ర సామాన్య స్త్రీల జీవితాలపై సాంఘిక పరమైన వత్తిడులకు అద్దం పట్టేదిగా కనిపిస్తుంది..తనకంటూ స్వంత వ్యక్తిత్వం లేకుండా  కాబోయే 'భర్తను సంతోషపెట్టడమే' స్త్రీ పరమావధి అని నేర్చుకున్న జానకి తన తెలివితేటల్ని వాడి ఆనంద్ ను ఎలా తనవైపుకు తిప్పుకుందో చెప్తూ చివర్లో రచయిత్రి అంటారు,But simultaneously I was wondering, Is she, after all, really in love? It was a state she didn’t know how to cope with, and she could hope only to use the weapon she knew, an ability to please or try to please. అని...కట్టుబాట్ల కనుసన్నలలో మెలిగినా తనకేం కావాలో స్పష్టంగా తెలిసి తన 'సామజిక భద్రత'  కోసం ఆనంద్ వెనుకే తిరుగుతూ అతడికి ఇష్టమయ్యేలా మసులుకుంటూ 'ప్రేమ' (?)  పేరిట తనవైపు తిప్పుకున్న నేరేటర్ జానకిని తనను మించిన స్త్రీవాదిగా నేరేటర్ అభివర్ణించడం ఈ కథలో కొసమెరుపు..ఈ కథ చదివినప్పుడు ఉద్యోగం చేసే మహిళల వ్యక్తిత్వాలను చులకన చేసి మాట్లాడే స్త్రీ /పురుష విద్యావంతులు జ్ఞప్తికి వచ్చారు..విచిత్రం ఏంటంటే ఈ కథలో ఆనంద్ తండ్రి కంటే తల్లి కి ఈ 'ఆధునిక యువతి' పట్ల తీవ్రమైన అభ్యంతరాలు ఉండడం..తరతరాల స్త్రీ పాతివ్రత్యపు ముసుగుల హిపోక్రసీని ఈ ఒక్క కథతో తీసి అవతలకు విసిరేస్తారు రచయిత్రి.

ఆనంద్ : She said—you see, she isn’t the passive, orthodox girl you think—she told me that quite against her plans or anything she’d expected, she’d—I know this will seem silly—but she’d fallen in love with me.’
నేరేటర్ : ‘I see. And that accounted for her behaviour. Trying all the time to please you, I mean.’

తన అస్తిత్వాన్ని మర్చిపోయి అనుక్షణం సమాజానికనుగుణంగా మారడమే స్త్రీ ప్రేమకు నిర్వచనమని బోధించే బూజుపట్టిన సంప్రదాయపు భావజాలాలను సూటిగా ప్రశ్నిస్తుందీ కథ..మరి జానకి నిజంగా ఆనంద్ ని ప్రేమించిందా ? లేక తన స్వార్ధానికి 'ప్రేమ'ను అడ్డం పెట్టుకుందా ?? నిజమే 'Who Cares' ??

మరో కథ 'By Any Other Name' కూడా రెండు సంస్కృతుల మధ్య రాపిడిని ప్రతిబింబించే కథే..ఈ కథలో బ్రిటిష్ పాలననాటి కాలంలో చిన్నపిల్లల మనసుల్లో సైతం నిండి ఉన్న దేశభక్తిని అద్భుతంగా చిత్రించారు శాంత..'జాతీయత','దేశభక్తి' వంటిమాటలు పెడర్ధాల్లో వాడుకలో ఉన్న ఈ కాలానికి ఇది చాలా అవసరమైన కథ అనిపించింది..ఆకాలంలో ఉన్నతపదవుల్లో ఉన్న కొందరు భారతీయుల పిల్లలు సంప్రదాయ బ్రిటిష్ స్కూళ్ళలో చదివేవారు..జోరీనాబాద్ లో శాంత(5),ఆమె అక్క ప్రమీల(8) విదేశీయత పేరిట అమలులో ఉన్న అనేక వివక్షల నడుమ ఆంగ్లో-ఇండియన్ స్కూల్లో అడుగుపెడతారు..ఇండియాలో పదిహేనేళ్ళ నుండీ ఉంటున్నా కూడా భారతీయుల పేర్లను పలకడానికి ఇష్టపడని ఆంగ్లేయురాలైన హెడ్ మిస్ట్రెస్ తొలి రోజే ప్రమీల పేరును 'పమేలా' అనీ శాంత పేరును 'సింథియా' అనీ మార్చేస్తుంది..ఇలా ఉండగా ఒకరోజు క్లాసు మధ్యలో శాంతను తీసుకెళ్లడానికి హఠాత్తుగా ఆమె అక్క ప్రమీల ఆమె తరగతికి వస్తుంది.."పద ఇంటికి వెళదాం" అంటూ క్లాసులో టీచర్ మాటను ఖాతరు చెయ్యకుండా ఆమెను తీసుకుని బయటకు నడుస్తుంది..కోపంతో ఎర్రబడిన అక్క మొహం చూసి ఆమెను అనుసరిస్తుంది శాంత..మండుటెండలో నడుచుకుంటూ ఇల్లు చేరాక కారణమేంటని అడిగిన తల్లికి విషయం వివరిస్తుంది ప్రమీల..పరీక్ష జరుగుతున్న సమయంలో భారతీయ విద్యార్థుల్ని క్లాసులో చివర వరుసలో కూర్చోపెట్టి "భారతీయులు మోసం చేస్తారు" అంటూ విద్యార్థులను వేరుచేస్తూ మధ్య మధ్యలో టేబుళ్ళు వేశారు,అందుకే వచ్చేశాను,ఇకమీద ఆ స్కూల్ కి వెళ్ళను అని చెప్తుంది..తరువాత తల్లి,ప్రమీల నెమ్మదిగా బయట మాట్లాడుకుంటూ ఉంటే శాంత వింటుంది..తల్లి ప్రమీలను అడుగుతుంది "శాంతకు ఈ విషయం అర్ధమైందంటావా ?" అని..దానికి ప్రమీల "లేదు,అదింకా చిన్న పిల్ల" అంటుంది..అది విన్న శాంత మనసులో "Of course, they were both wrong. I understood it perfectly, and I remember it all very clearly. But I put it happily away, because it had all happened to a girl called Cynthia, and I never was really particularly interested in her" అనుకుంటుండగా ఈ కథను ముగిస్తారు రచయిత్రి..అస్తిత్వం,జాతీయత,దేశభక్తి లాంటి పలు అంశాల్ని చక్కగా ఆవిష్కరించిన కథ ఇది..ఈ కథకు టైటిల్ ను షేక్స్పియర్ రోమియో-జూలియట్ నుండి సంగ్రహించారు.

"What’s in a name? That which we call a rose
By any other name would smell as sweet."