Monday, January 8, 2024

Odyssey - Homer, Emily Wilson

"Each generation must translate for itself" అంటారు T. S. Eliot. ఆయన మాటలు బ్రిటిష్ రచయిత్రి ఎమిలీ విల్సన్ ఇటీవలే అనువదించిన హోమర్ 'ఒడిస్సీ'కి సరిగ్గా సరిపోతాయి. నేను కొంతకాలం క్రితం చదివిన మార్గరెట్ ఆట్వుడ్ 'పెనెలోపియాడ్', మాడెలైన్ మిల్లర్ 'కిర్కె' (Circe)- ఈ రెండు రచనలూ ఎప్పటికైనా హోమర్ 'ఒడిస్సీ' మూలాన్ని చదవాలనే ఆసక్తి కలిగించాయి. ఎమిలీ పుణ్యమాని ఆ కోరిక ఇన్నాళ్ళకు తీరింది. రెండు ప్రఖ్యాత గ్రీకు కావ్యాల్లో ఒకటైన ఈ 'ఒడిస్సీ'కి 1614 లో తొలి ఆంగ్లానువాదం వెలువడిందట. ఆధునికాంగ్లంలో మూలానికి అతి దగ్గరగా చేసిన అనువాదమంటూ ఈ రచనకు న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన రివ్యూలు చూసాక ఇక పుస్తకం చదవాల్సిందే అని మొదలుపెట్టాను.

Image Courtesy Google

ఈ 'ఒడిస్సీ' కథ ట్రోజన్ యుద్ధం ముగిసిన పదేళ్ళ తరువాత మొదలవుతుంది. పదేళ్ళపాటు జరిగిన ట్రోజన్ యుద్ధంలో ప్రియమ్ పట్టణాన్ని నాశనం చేసిన  తర్వాత ఒడిస్సియస్ 'ఇథాకా'కి తిరుగుప్రయాణమవుతాడు. దారిలో ఒక ద్వీపంలో మనుషుల్ని తినేసే ఒక కాలిప్సో (సముద్రపు దేవుడు పొసెడన్ కొడుకు, పోలిఫెమస్) గుహలో (ల్యాండ్ ఆఫ్ లోటస్ ఈటర్స్) తన సహచరులతో సహా చిక్కుకుపోతాడు. తన కొడుకుని గుడ్డివాడిగా మార్చాడన్న కోపంతో ఒడిస్సియస్ ని పొసెడన్ నానా కష్టాలపాలు చేస్తాడు. ఆ క్రమంలో ఒడిస్సియస్ మంత్రతంత్రాల్లో ఆరితేరిన కిర్కె దగ్గర ఏడాదిపాటు, వనదేవత కాలిప్సో దగ్గర ఏడేళ్ళపాటు చిక్కుకుపోతాడు. యుద్ధం తర్వాత 20 ఏళ్ళపాటు అసలు జీవించి ఉన్నాడోలేడో తెలియని ఒడిస్సియస్ కోసం భార్య పెనెలొపె, కొడుకు టెలేమకస్ ఇథాకాలో వేచిచూస్తూ ఉంటారు. ఈలోగా ఒడిస్సియస్ మరణించి ఉంటాడని అనుకుని ఇథాకాలో పురుషులందరూ (suitors) పెనెలొపె ని తమలో ఎవరో ఒకర్ని వివాహమాడమని వత్తిడితెస్తూ ఒడిస్సియస్ అంతఃపురంలో అతడి సంపదని తింటూ బైఠాయిస్తారు. ఈలోగా టెలేమకస్ తండ్రి జాడ వెతుక్కుంటూ పైలోస్, స్పార్టా లకు ప్రయాణమవుతాడు. ఒడిస్సియస్ సముద్రప్రయాణంలో Scylla and Charybdis వంటి రాక్షసులను తప్పించుకుంటూ గమ్యం చేరడం, భార్యను అవమానించిన వాళ్ళందర్నీ చంపడంతో కథ ముగుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కథ ఇంతే.

గ్రీకు గాథల్తో పరిచయం ఉన్న వాళ్ళకి ఇదంతా తెలిసిందే. కానీ ఈ కథనల్లుకుని మనకు తెలియని ఆసక్తికరమైన అనేక చిన్న చిన్న కథలుంటాయి. మూలకథ విషయంలో మన రామాయణానికీ దీనికీ అనేక పోలికలు కూడా కనిపిస్తాయి. భర్త కోసం ఎదురుచూసే పెనెలొపె కొన్నిచోట్ల  సీత పాత్రని తలపిస్తుంది. తనని పెళ్ళిచేసుకోవాలంటే ఒడిస్సియస్ విల్లును ఎక్కుపెట్టాలని (string it and shoot an arrow through 12 axes) Suitors కి పరీక్షపెట్టడం సీతా స్వయంవరాన్ని తలపిస్తుంది. ఒడిస్సియస్ తన ఇంట్లో  ముష్టివాడిలా మారువేషంలో తిరగడం మన విరాటపర్వాన్ని జ్ఞప్తికి తెస్తుంది.

 గ్రీకు పురాణాల్లో దేవుళ్ళ పాత్ర కీలకం. ఎటొచ్చీ ఆ దేవుళ్ళు కూడా మనుషుల్లాగే పగాప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు, వాళ్ళని శాంతపరచకపోతే ఆగ్రహిస్తారు. మనుషులు కీలుబొమ్మల్లా వాళ్ళు ఆడించినట్టల్లా ఆడుతుంటారు, వాళ్ళని ప్రసన్నం చేసుకోడానికి జంతుబలులు ఇస్తుంటారు. జ్యూస్, పోసెడన్, ఎథేనా, కిర్కె, కాలిప్సో వంటి దేవతలు మౌంట్ ఒలింపస్ సభలో మనుష్యజాతికి దిశానిర్దేశం చేస్తుంటారు. ఒడిస్సియస్ ప్రయాణంలో జ్యూస్ కూతురు ఎథేనా అతడి వెన్నంటి ఉండి అడుగడుగునా సాయపడుతుంది.

నాకు సమకాలీన రచనల్లో ఉపయోగించే భాషతో చాలా పేచీలున్నాయి. ఆ మధ్య ఆహా-ఓహో అంటుంటే Chuck Palahniuk రచన ఒకటి మొదలుపెట్టి పట్టుమని పాతిక పేజీలు కూడా చదవలేక ప్రక్కన పెట్టాను. ఇక క్లాసిక్స్  అనువాదాల విషయంలో అయితే సమకాలీనానికి పూర్తిగా దూరం. కానీ ఈ తరం రచయితల్లో సారా హాల్, క్లైర్ కీగన్ వంటి కొందరు తమ రచనలతో నాలో ఆ చికాకుని పోగొట్టారు. 'ఒడిస్సీ'కి ఇన్ని అనువాదాలుండగా ఎమిలీ అనువాదమే  ఎందుకు చదవాలి అంటే, ఆమె భాష కోసం, సొగసైన శైలి కోసం అంటాన్నేను. ఇంత చక్కని భాష ఈరోజుల్లో అరుదు.

రోజుకో యాభై పేజీలు అనుకున్నప్పటికీ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ చదివితే సుమారు ఆరువందల పేజీల పుస్తకాన్ని రిఫెరెన్సులతో సహా చదివి  పూర్తి చెయ్యడానికి నాకు ఇరవై రోజులు పట్టింది. ఎప్పుడూ చదివేటప్పుడు ఈబుక్ లో నోట్స్ మార్క్ చేసుకోవడం అలవాటు. అలాంటిది ఈసారి ఒక రీడింగ్ నోట్స్ పెట్టుకుని నోట్స్ చేత్తో రాసుకున్నాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. 'ఒడిస్సీ'లో అనేక పాత్రలు, వాటి గ్రీకు పేర్లన్నీ చాలా దగ్గరగా, ఒకేలా అనిపిస్తాయి. ఇక బంధుత్వాలు గుర్తుపెట్టుకోవడం సరేసరి. అలా నోట్స్ రాసుకుంటూ వెళ్తే ఆ పేర్లు గుర్తుండడమే కాకుండా అవి పునరావృతం అయినప్పుడు వెనక్కి వెళ్ళి రిఫర్ చేసుకోవడం కూడా సులభం. ఇలాంటి రచనలు చదివేటప్పుడు సమ్మరీ రాసుకుంటూ బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోవడం బావుంటుంది.

ఇక హోమర్ 'ఒడిస్సీ' మూలానికీ, మనకు సినిమాల ద్వారానో, కథలుగానో తెలిసిన కథకూ కొన్ని తేడాలు గమనించాను.

* హెలెన్ భర్త మెనెలాస్ ను ప్రిన్స్ హెక్టర్ చంపేసినట్లు 'ట్రాయ్' లో చూపిస్తాడు. కానీ మెనెలాస్ ఈ మూలకథలో స్పార్టాకి తిరిగి వెళ్ళి భార్య హెలెన్ తో కలిసి సంతోషంగా రాజ్యమేలుతుంటాడు. తండ్రి ఆచూకీ కోసం వచ్చిన టెలేమకస్ ను ఆదరించి ఒడిస్సియస్ ని వెతికే క్రమంలో సాయంచేస్తాడు. ఇందులో హెలెన్ పారిస్ తో సంబంధం పెట్టుకోవడం కూడా కేవలం దైవేచ్ఛని అంటారు. 

* మంత్రతంత్రాల్లో ఆరితేరిన కిర్కె ఒడిస్సియస్ తన బృందంతో వచ్చినప్పుడు అతడి సహచరులందర్నీ ఉత్తిపుణ్యానికి పందులుగా మార్చేస్తుంది. మూల కథలో ఆమెను ఒక మంత్రగత్తెగా (wicked) చూపిస్తారు. కానీ మాడెలైన్ మిల్లర్ 'కిర్కె'లో ఇదే కథను మరో కోణంలో చూపిస్తారు. ఒడిస్సియస్ బృందం కిర్కె ఇంట్లో బస చెయ్యడానికి సహాయం కోసం వచ్చి, అతిథి మర్యాదలు అందుకుంటూ, తోడు లేని ఒంటరి స్త్రీ అని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోతే అప్పుడు ఆమె వాళ్ళను పందులుగా మార్చివేసిందని రాస్తారు.

* 'పెనెలోపియాడ్'లో ఈ కథను పూర్తిగా పెనెలొపె, ఆమె చెలికత్తెల దృష్టి కోణం నుండి చెప్పుకొస్తారు ఆట్వుడ్. అందులో ఒడిస్సియస్ suitorsతో బాటుగా  పన్నెండుమంది చెలికత్తెలను కూడా పెనెలొపె ఎంత వారించినా వినకుండా ఊచకోత కోస్తాడని రాశారు. కానీ 'ఒడిస్సీ' మూలంలో మొత్తం యాభై మంది చెలికత్తెలుంటే అందులో పన్నెండు మందిని మాత్రమే (విధేయతలేకుండా suitors తో కలిసిపోయిన కారణంగా) ఒడిస్సియస్ హతమారుస్తాడు.

నావరకూ ఈ పుస్తకం 'ప్లెషర్ ఆఫ్ రీడింగ్' ని మరోసారి పూర్తిగా అనుభవంలోకి తెచ్చింది. హోమర్ 'ఒడిస్సీ' చదవాలనుకునే ఈ తరానికి ఇది చక్కని అనువాదం. హ్యాపీ రీడింగ్ :)

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు :

Suitors అందర్నీ చంపి ఇంటి ఆవరణలో ఉగ్రరూపంలో నిలబడిన ఒడిస్సియస్ వర్ణన : 

"After a lion eats a grazing ox,
its chest and jowls are thick with blood all over;
a dreadful sight. Just so, Odysseus
had blood
all over him—from hands to feet."

ఒడిస్సియస్ పేరు వెనుక కథ : 

“Name him this. I am
disliked by many, all across the world,
and I dislike them back. So name the child
‘Odysseus.’

హెలెన్ పశ్చాత్తాపంతో కూడిన మాటలు : 

I wished that Aphrodite had not made me
go crazy, when she took me from my country,
and made me leave my daughter and the bed
I shared with my fine, handsome, clever husband.”

ఒడిస్సియస్ ని వివాహమాడాలని నిర్ణయించుకుని అతణ్ణి చెరబట్టిన వనదేవత కాలిప్సో ఆగ్రహం :

Calypso shuddered and let fly at him.
“You cruel, jealous gods! You bear a grudge
whenever any goddess takes a man
to sleep with as a lover in her bed.

'లోటస్ ఈటర్స్' గురించి రాస్తూ :

With heavy hearts we sailed along and reached
the country of high-minded Cyclopes,
the mavericks. They put their trust in gods,
and do not plant their food from seed, nor plow,
and yet the barley, grain, and clustering wine-grapes 110
all flourish there, increased by rain from Zeus.
They hold no councils, have no common laws,
but live in caves on lofty mountaintops,
and each makes laws for his own wife and children,
without concern for what the others think.

పద్యానికీ, వచనానికీ మధ్య పరిధులు చెరిపేస్తూ ఎమిలీ వర్ణనలు : 

"fair wind
befriending us behind the dark blue prow."

"The sun set. It was dark in all directions.
We reached the limits of deep-flowing Ocean,
where the Cimmerians live and have their city.
Their land is covered up in mist and cloud;
the shining Sun God never looks on them
with his bright beams—not when he rises up
into the starry sky, nor when he turns
back from the heavens to earth."

భార్య నమ్మకద్రోహం కారణంగా మరణించిన ఆగమేమ్నోన్ ఆత్మ ఒడిస్సియస్ తో అన్న మాటలు : 

"So you must never treat your wife too well.
Do not let her know everything you know.
Tell her some things, hide others. But your wife
will not kill you, Odysseus. The wise
Penelope is much too sensible
to do such things."

మరి కొన్ని వాక్యాలు :

* I disapprove of too much friendliness
and of too much standoffishness. A balance
is best.

* Shame is not a friend to those in need

* Of all the creatures
that live and breathe and creep on earth, we humans are weakest. When the gods bestow on us
good fortune, and our legs are spry and limber,
we think that nothing can ever can go wrong;
but when the gods bring misery and pain,
We have to bear our suffering with calm.

Tuesday, January 2, 2024

అతడు రాసిన ఆమె కథలు

పాశ్చాత్య సాహిత్యంలో మొదట్నుంచీ సంస్కృతిని పురుషుడిగానూ, ప్రకృతిని స్త్రీగానూ అభివర్ణించడం చూస్తూ ఉంటాం. 19వ శతాబ్దం వరకూ సాహిత్యంలోని శైలులకు ఆపాదించిన అస్పష్ట నిర్వచనాలు లింగవివక్షల ప్రాతిపదికన  ఏర్పడినవే. ఈ క్రమంలో “the male quality is the creative gift.” అంటూ గెరాల్డ్ మాన్లీ హాప్కిన్స్ బాహాటంగానే పితృస్వామ్యాన్ని సమర్ధించుకోగా, మగవారు తమ అధీనంలో ఉంచుకున్న విద్య, సృజనాత్మకత, సాంస్కృతిక ఆధిపత్యం వంటివి స్త్రీని ఈ సమీకరణం నుండి పూర్తిగా తప్పించాయి. ఆమె ఉనికిని పూర్తిగా మినహాయిస్తూ పాశ్చాత్య సాంస్కృతిక సంపద అంతా పితృస్వామ్యపు హక్కుగా మారిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి యావత్తూ మగవారికి వారి హేతువాద పూర్వీకుల నుండి వంశపారంపర్యమైన ఆస్తిలా సంక్రమించింది. అందువల్ల స్త్రీలు జేన్ ఆస్టెన్ నవలల్లో స్త్రీ పాత్రల్లా ఎస్టేటు చివరి 'డౌవర్ హౌస్' లకు పరిమితమైపోయారంటారు అమెరికన్ సాహితీ విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్.

Image Courtesy AndhraJyothi

గతించిన కాలంలో క్రియాశీల వ్యవస్థకు దూరమైన స్త్రీ జీవితంలో ఆమెకు వెలుపలి సంఘటనలకు చోటులేని కారణంగా ఆమె తన కథను తాను చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకోడానికి ఆమెకు కథంటూ లేదు. అలాగని ఆమె జీవితం నిరుపయోగమైనదనీ అనలేం, ఆమె ఔత్సాహిక కథకులకు మౌనంగా దిశానిర్దేశం చేస్తూ వారి సృజనాత్మకతకు ప్రేరణగా నిలుస్తుంది. ఆమె సాహిత్యంలో సహజత్వానికి దూరంగా పితృస్వామ్య వ్యవస్థ ఒక మూసలో పోసి తయారు చేసిన "ఆదర్శ స్త్రీమూర్తి". జాన్ రస్కిన్ వంటివారు ఆమె శక్తి పాలనకూ, యుద్ధానికీ తగదన్నారు; ఆమె హేతువాదం సృజనాత్మకతకూ, ఆవిష్కరణకూ పనికిరాదన్నారు. 'విక్టోరియన్ ఐడియల్' స్త్రీని గృహస్థుగా, భర్తకు సాంత్వన చేకూర్చే ఒక వస్తువుగానే చూసింది. ఈ క్రమంలో స్త్రీ ఉనికిని అన్ని విధాలా పరిమితం చేసిన తీవ్రమైన పురుషాధిక్య భావజాలంతో కూడిన ఇమ్మాన్యుయేల్ కాంట్ ప్రతిపాదనలు స్త్రీవాద తత్వవేత్తల విమర్శల్లో విశేషంగా చర్చకు వచ్చాయి. కాంట్ ఎస్థెటిక్స్ ప్రకారం మగవాడు చింతన, పరిశీలన, ఆలోచన, హేతువు, తర్కం వంటి అంశాలకు ప్రతినిధిగా ఉంటే స్త్రీ కేవలం సౌందర్యానికీ, భావోద్వేగాలకూ మాత్రమే ప్రతినిధిగా కనబడుతుంది. 

ప్రాచీన కావ్యాల్లో స్త్రీని ఒక 'సౌందర్యమూర్తి'గా ప్రతిష్ఠించే క్రమంలో ఆమెను అనైతికతకు ఆస్కారంలేని దేవతా మూర్తిగా చేసి ఒక నైతిక చట్రంలో ఇమిడ్చే నర్మగర్భమైన ప్రయత్నం కనబడుతుంది. స్వతఃసిద్ధమైన స్త్రీ అస్తిత్వానికి దూరంగా ఆమెకు ఒక నిర్ధిష్టమైన రూపాన్ని అంటగట్టే ప్రయత్నంలో సాహితీ సృజనలో అవసరమైన ఇన్-యాంగ్ అంటే నీతి-అవినీతి, మంచి-చెడు, న్యాయం-అన్యాయం వంటి ద్వంద్వాలను ఆమె అస్తిత్వానికి అన్వయించుకునే అవకాశం లేకుండా కనిపించని ఆంక్షలు అమల్లో ఉండేవి. అందుకే ప్రాచీన కావ్యాల్లో కవులూ, రచయితలూ సృష్టించిన స్త్రీ పాత్రలు అయితే మచ్చలేని చందమామను తలపించే దేవతా మూర్తులుగానో లేదా దానికి పూర్తి విరుద్ధంగా మంత్రతంత్రాలు నేర్చిన మంత్రగత్తెలూ, రాక్షసులుగానో చిత్రించబడేవి. డాంటే, గోథే, మిల్టన్ వంటివారు ఆద్యులుగా, పవిత్రమైన వర్జిన్ మొదలు గృహానికి పరిమితం చేసిన ఇల్లాలి వరకూ అన్ని కావ్యాల్లోనూ ఈ సంప్రదాయం చాలాకాలం కొనసాగింది.

ఇమ్మాన్యుయేల్ కాంట్ స్త్రీ తర్కాన్ని పూర్తిగా విస్మరించనప్పటికీ ఆమె హేతువాదం నైతిక, సామజిక వ్యవహారాల్లో పరిణితిలేనిదని నిర్ధారించారు. దీనికి ఊతమిస్తూ కార్ల్ గిల్లిగాన్ మానసికతత్వ పరిశోధనలు సైతం స్త్రీలు నైతిక నిర్ణయాలను భావోద్వేగాలూ, బాంధవ్యాల ప్రాతిపదికగా తీసుకుంటారంటారు. నిజానికి కాంటియన్ తత్వం స్త్రీ ఉనికిని కేవలం మగవాడిని పరిపూర్ణం చేసే దిశగా వివాహవ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వచిస్తుంది. కాంట్ స్త్రీపురుషుల వివాహాన్ని రెండు ప్రకృతుల మేళవింపుగా చూస్తారు. భావాన్ని స్త్రీత్వంగానూ; హేతువునూ, తర్కాన్నీ పురుషత్వంగానూ నిర్వచిస్తారు. ఈ కారణంగా ఆమెను మగవాడిని ఆదర్శవంతమైన నైతిక జీవనం దిశగా ప్రోత్సహిస్తూ, సహాయసహకారాలందించే పాత్రకి మాత్రమే పరిమితం చేశారు.

ఈ కారణాల దృష్ట్యా అప్పుడప్పుడే రచనా వ్యాసంగంలో తొలి అడుగులు వెయ్యడం మొదలుపెట్టిన రచయిత్రులు సహజంగానే అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రాచీన కాలంనుండీ ఏకపక్షంగా మగవారికి మార్గదర్శకత్వం చేస్తూ వచ్చిన 'వడ్డించిన విస్తరి'లాంటి కావ్యాలూ, గ్రంథాలూ రచయిత్రుల విషయంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల స్త్రీలు తమ రచనల ద్వారా పితృస్వామ్య సాహితీ సృజనలో రూపుదిద్దుకున్న మూస నుండి బయటపడి ప్రప్రథమంగా తమ ఉనికిని నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. అందువల్ల 1970ల తరువాత గానీ అసలు వారి రచనలకు గుర్తింపే దొరకలేదు. తాను రాయడం మొదలుపెట్టిన తొలినాళ్ళలో  తనకు ఏం రాయాలో, ఎలా రాయాలో ఒక పురుషుడి స్వరంలో ఉన్న అదృశ్యవాణి శాసిస్తున్నట్లు అనిపించేదంటారు ఇటాలియన్ రచయిత్రి ఎలెనా ఫెరాంటే. "అతడు నా సమ వయస్కుడో, లేదా నాకంటే వయసులో పెద్దవాడో నాకు తెలియదు. నేను రాయాలంటే అతడిలా ఆలోచించాలి, అతణ్ణి అనుకరించాలి. ఏకకాలంలో ఒక మగవాడిగానూ, మరికొన్నిసార్లు నా ఉనికిని కాపాడుకుంటూ ఒక స్త్రీగానూ కూడా ఆలోచించాలి." అంటారామె.

అమెరికన్ స్త్రీవాద తత్వవేత్త జుడిత్ బట్లర్ లాటిన్ అమెరికన్ స్త్రీవాద సిద్ధాంతాలలో 'స్త్రీ' అనే పదానికి నిర్వచనాలున్నాయనే ప్రతిపాదనలని సవాలు చేస్తూ, భాషలో స్త్రీపురుష నిర్వచనాలు ఆదినుంచీ లేవనీ, అది కేవలం పితృస్వామ్యపు సృష్టనీ కొట్టిపారేస్తారు. మరోవైపు ఫ్రెడ్రిక్ నీషే పురుషాధిక్య భావజాలంతో కూడిన మానసిక విశ్లేషణలు స్త్రీని ఆధిపత్యం,అజమాయిషీ అవసరమైన ఒక పశువుగా చూడాలని నూరిపోస్తాయి. నీషే 'Thus Spoke Zarathustra' అనే రచనలో ఒక పాత్ర "నువ్వు స్త్రీ దగ్గరకు వెళ్తున్నావా ? అయితే నీ కొరడా తీసుకెళ్ళడం మర్చిపోకు" అంటుంది.

అమెరికన్ కవి రాబర్ట్ లోవెల్ “The tranquillized fifties”గా అభివర్ణించిన 'సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజాన్ని' ప్రభావితం చేసిన వివక్షల మూలాలు నియో విక్టోరియన్ సంస్కృతిలో ఉన్నాయి. స్త్రీవాదం కొత్తగా ఊపిరిపోసుకుంటున్న డెబ్భైల దశకంలో సిల్వియా ప్లాత్, లోరైన్ హన్స్బెర్రీ, ఆడ్రె లార్డ్ వంటి అనేక మంది రచయిత్రులు యాభైల్లో చదువులో పట్టాలు పుచ్చుకున్నవాళ్ళు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న యాభైల కాలంలో స్త్రీని కేవలం ఒక గృహిణిగా మాత్రమే చూసేవారు. ఈ వివక్షను అధిగమించి అమెరికన్ కవయిత్రి Marianne Moore వివాహవ్యవస్థ, సంతానం వంటి ఆంక్షల్ని చెరిపేస్తూ ఆకాలంలోనే ఒక శక్తిమంతమైన మహిళగా ఒక ఉన్నత స్థానంలో నిలబడడం విశేషం. కానీ దురదృష్టవశాత్తూ కరడుగట్టిన స్త్రీవాది అయిన ఆమె సాటి కవయిత్రి సిల్వియా ప్లాత్ పై తీవ్రమైన విద్వేషం వెళ్ళగక్కారంటారు. మూర్ దృష్టిలో సిల్వియా ప్లాత్ చేసిన తప్పల్లా పిల్లల్ని కనడం, భార్యగా,తల్లిగా, కవయిత్రిగా మూడు పాత్రల్ని పోషించాలనుకోవడం (“triple threat woman, wife, mother and writer”). విచిత్రంగా ఈ రకమైన వత్తిడి సిల్వియా భర్త, కవి టెడ్ హ్యూగ్స్ పై లేకపోవడం విశేషం.

ఫ్రాయిడ్ సిద్ధాంతాలను సాహిత్యానికి అన్వయించిన విమర్శకులు హరాల్డ్ బ్లూమ్ సాహితీ చరిత్రను రాయడంలో తీవ్రమైన 'పితృస్వామ్యాన్ని' తన మోడల్ గా చేసుకున్నారు. ఆయన కావ్యగతిని మగవాడైన కవికీ, అతడి కావ్యానికి ప్రేరణైన స్త్రీకీ మధ్య సంభోగంగా చూస్తారు. ఈ స్థితిలో కావ్యంలో కవయిత్రి స్థానం ఎక్కడన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కవయిత్రిగా ఆమె ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? ప్రేరణది ఏ లింగం ? హరాల్డ్ బ్లూమ్ ని చదివిన ఏ స్త్రీలోనైనా తలెత్తే ప్రశ్నలు ఇవే.

నిజానికి బ్లూమ్ మోడల్ ను ఆదర్శంగా తీసుకుంటే ఆయన ప్రతిపాదించిన “Anxiety of influence” ప్రభావం రచయితలపై ఉన్నంతగా రచయిత్రులపై ఉండదంటారు విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వారిపై ప్రభావం చూపించడానికి వారికొక మోడల్ అంటూ లేదు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచనగల ఏ స్త్రీనయినా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించే మానసిక రోగి అని ముద్రవేసేవారు. ఈ కారణంగా ఆ కాలపు రచయిత్రులు “Anxiety of authorship,” తో బాధపడ్డారంటారు సాండ్రా. ప్రాచీన కావ్యాల్లో ఆమె ఉనికే సందిగ్ధంలో ఉంది గనుక రాయడం తన వల్ల కాదనీ, తనలో సృజనాత్మకత లేదనీ భావించేదామె. నిజానికి ఆమె సంఘర్షణ పితృస్వామ్య రచనల్లోని ప్రపంచంతో కాదు. కవి కలం నుండి జీవంపోసుకున్న ఆమె మూర్తితో. మాక్బెత్ ను కథానాయకుడిగా చూపి లేడీ మాక్బెత్ ను ఒక దిగజారిన స్త్రీగా అభివర్ణిస్తారు, అలాగే ఒడిపస్ ను కథానాయకుడిగానూ, మెడియాను ఒక మంత్రగత్తెగానూ చూపిస్తారు. ఇకపోతే కింగ్ లియర్ పిచ్చితనం అతడి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చే ఒక గొప్ప విషయమైతే ఒఫీలియా పిచ్చితనం కడుదుర్భరం అన్నట్లు వర్ణిస్తారు. ఏకపక్షంగా ఇలాంటి వర్ణనలు చేసే అతడి చేతుల్లోనుండి కలం లాక్కుని తన గురించి చెప్పే అధికారం అతడికివ్వకుండా తన సాధికారతను చాటుకోవాలంటే స్త్రీ సమాజంలో తన ఉనికిని మళ్ళీ సరికొత్తగా నిర్వచించుకోవాలి. A Room of One's Own లో షేక్స్పియర్ సోదరి జుడిత్ పాత్రను సృష్టిస్తూ, 16వ శతాబ్దంలో ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మకతతో పుట్టిన ఏ స్త్రీకి అయినా పిచ్చిపట్టడం ఖాయం అంటారు వూల్ఫ్. ఆ కాలంలో తన సృజనాత్మకతతో కావ్యసృష్టి చేద్దామని ప్రయత్నిస్తే  ఆమె మానసిక ఆరోగ్యం, చిత్తశుద్ధీ దెబ్బతింటాయని తెలియడానికి కొద్దిపాటి సైకాలజీ తెలిసినా చాలంటారామె.

ప్రాచీన కాలంనుండీ స్త్రీలను కళారంగానికి దూరంగా ఉంచిన అంశాలపై 19 వ శతాబ్దం తరువాత స్త్రీవాద తత్వవేత్తలు దృష్టి సారిస్తూ -సృజన విషయంలో మగవారిని దైనందిన జీవితానికి సంబంధించిన  బాధ్యతలనుండి మినహాయించడంతో వారికి స్వేచ్ఛగా రచనావ్యాసంగాన్ని కొనసాగించే సౌకర్యం (మేల్ ప్రివిలేజ్) ఉండేదనీ, రచయిత్రులకు ఆ అవకాశం లేదనీ అంటారు. ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, జేన్ ఆస్టెన్, బ్రోన్ట్ సిస్టర్స్ వంటి ప్రముఖ రచయిత్రులు సైతం దీనికి మినహాయింపు కాదు. సాహితీ విమర్శకుడు హరాల్డ్ బ్లూమ్ సైతం కవిత్వ ప్రేరణను 'తండ్రీ కొడుకుల బంధం'గా అభివర్ణించారు. [“from the sons of Homer to the sons of Ben Jonson, poetic influence [has] been described as a filial relationship”] ఆయన యావత్ సాహితీ ప్రస్థానాన్ని ఇరువురు అత్యంత శక్తిమంతమైన సరిసమాన వ్యక్తుల మధ్య పోరుగా, అనగా తండ్రీకొడుకుల పోరుగా చూస్తారు [ Laius and Oedipus at the crossroads ]. ఈ విధంగా పితృస్వామ్య రచనలు సాహిత్యంలో పురుషాధిక్యతను మెటాఫోరికల్ కోణంలో శోధిస్తూ ఉండగా  “Woman’s virtue is man’s greatest invention.” అని Honoré de Balzac అన్న మాటలు స్త్రీవాదుల్లో మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి. 

ఏదేమైనా ఎంత పిడికిట్లో బిగించి అదుపులో పెట్టాలని ప్రయత్నించినా ఈడెన్ సాక్షిగా ఈ  కథలన్నీ ఏదో ఒక సమయంలో రచయిత మునివేళ్ళనుండి తప్పనిసరిగా జారుకుంటాయి. స్త్రీని ఒక జీవమున్న ప్రాణిగా కాక కేవలం ఒక ఇమేజికి కుదించిన ప్రాచీన కావ్యాలను యధాతథంగా అంగీకరించడం ముందుముందు వీలుపడదు. అదే సమయంలో మిల్టన్, డాంటే, కీట్స్ మొదలు హాప్కిన్స్, బ్లేక్, ఈట్స్, ఇలియట్ వరకూ వేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్యాన్ని ఉన్నపళంగా విస్మరించడమూ సరికాదు. తరతరాల సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత స్త్రీపురుష భేదం లేకుండా మనందరిపైనా ఉంది. కానీ అసలు చిక్కంతా ఆ సాహిత్యాన్ని నిస్సంశయంగా, నిర్ద్వంద్వంగా అంగీకరించాలనుకోవడంలోనే ఉంది. సరిగ్గా ఇక్కడే సాహిత్యంలో స్త్రీవాదులూ, విమర్శకుల అవసరం కనిపిస్తుంది. కేవలం నాణానికి ఒక వైపు కథనే చెబుతూ రెండోవైపు కథను ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేసిన ప్రాచీన సాహిత్యాన్ని తీసిపారేసే బదులు ఆ చరిత్రను తిరగరాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రెండో పార్శ్వం మానవజాతిలో సగమైన స్త్రీల జీవితాలు. అందువల్ల సాహితీసంస్కృతిని పునర్నిర్మించాలి, పునఃసృజించాలి, పునరాలోచించాలి, పునర్లిఖించాలి, పునఃవిశ్లేషించాలి. ఈ మార్పు తీసుకురావాలంటే భాష నుండి మొదలుపెట్టాలి. స్త్రీవాదానికీ, మానవతావాదానికీ భేదం చెరిపేసే దిశగా మూలగ్రంధాలనుండీ ప్రక్షాళన జరగాలి.

గాలిలా కంటికి కనిపించని లింగవివక్షను ఎదుర్కొంటూ, మౌనాన్ని ఛేదిస్తూ ఆ కాలంలో కూడా ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, అన్నే సెక్స్టన్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయిత్రులు అనేక రచనలు చేశారు. ఈ కారణంగా  పురుషాధిక్యత, లింగవివక్షకు సంబంధించిన వైరుధ్యాలు ముఖ్యంగా 19వ శతాబ్దపు తొలినాళ్ళలో స్త్రీ పురుష అస్తిత్వవాద రచనలన్నిటిలోనూ స్పష్టంగా కనిపించేవి. 'మేల్ టెక్స్ట్' బంధనాల్ని తెంచుకుంటూ అరోరా లీ, మేరీ ఎలిజబెత్ కాలేరిడ్జ్ వంటి స్త్రీలు కొన్నిసార్లు వారికి ఆపాదించిన ద్వంద్వ ప్రవృత్తులైన దేవతగానూ, మరి కొన్నిసార్లు రాక్షసిగానూ మార్చి మార్చి తమ ఉనికిని నిర్వచించుకోవడం మొదలుపెట్టారు.

ఈ దిశగా పరిశోధనలు చేస్తూ 'ది మాడ్ వుమన్ ఇన్ ది అటిక్' పేరిట రాసిన వ్యాసాల్లో స్త్రీవాద సాహిత్య విమర్శకులు సాండ్రా గిల్బర్ట్ మరియు సుసాన్ గుబార్ లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.  'Anxieties of authorship' తో కష్టపడుతున్న రచయిత్రులు రచనావ్యాసంగం వైపు వెళ్ళే ముందు మగవారు తయారుచేసిన ఆమెలోని 'ఆదర్శ మూర్తి'ని చంపాలని తీర్మానిస్తారు వర్జీనియా వూల్ఫ్. అంటే స్త్రీ ఉనికిని సాహిత్యంలో లేకుండా చేసిన పితృస్వామ్యం కొలమానంగా పెట్టిన 'స్త్రీ ఎస్తెటిక్ ఐడియల్'ను నాశనం చెయ్యాలి. అలాగే ఆమె ప్రత్యర్థిగా తయారుచేసిన ఆమెలోని 'రాక్షసి'ని పోలే ప్రతిమని కూడా నాశనం చెయ్యాలి. కానీ అలా చెయ్యాలంటే ముందు వాటి మూలాలెక్కడున్నాయో తెలుసుకుని వాటి పూర్వాపరాలు  అర్థంచేసుకోవాలి. అందుకు స్త్రీల రచనల్ని చదవాలి, వాటిలోని స్త్రీవాద తత్వాన్ని లోతుగా పరిశీలించాలి. పాశ్చాత్య సాహిత్యాన్ని పునర్విమర్శిస్తూ వర్జీనియా వూల్ఫ్- పితృస్వామ్య చరిత్రను శిలాశాసనాల్లా పదేపదే పునర్లిఖించే బదులు, చరిత్ర చెప్పకుండా వదిలేసిన కథల్నీ, కొత్త కథల్నీ చెప్పుకోవలసిన అవసరం ఉందంటారు. స్త్రీల విషయంలో ఈ 'సాంస్కృతిక పరాయీకరణ'కు కారణాలను స్త్రీవాదులూ, విమర్శకులూ ఇప్పటికీ పరిశోధిస్తూనే ఉన్నారు.

ఇక సమకాలీన స్త్రీవాద విమర్శ విషయానికొస్తే మార్గరెట్ ఆట్వుడ్ , ఎలెనా ఫెరాంటే, జాడీ స్మిత్, ఝంపా లహిరి, చిమమంద అడిచి వంటి ప్రామాణికత కలిగిన అతి కొద్ది స్త్రీవాద రచయిత్రులను మినహాయిస్తే అమెరికన్ రచయిత్రి రెబెక్కా సోల్నిట్ వంటి కొందరు స్త్రీవాదానికి ఫ్యాషన్ ఐకాన్స్ గా చెలామణి అవుతున్నారు. నిజానికి రెబెక్కా వంటి స్త్రీవాదులు 'స్త్రీ మౌనం' గురించి ఉటంకించే అనేక విషయాలు స్త్రీవాదానికి కొత్తగా కలిపినదేమీ లేదు. అవన్నీ Maya Angelou, Adrienne Rich, Cynthia Ozick, Simone de Beauvoir, Allison Bechdel లాంటి మునుపటి తరం స్త్రీవాదులు అనేక రచనల్లో చెప్పినవే. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే బహుశా స్త్రీవాదుల స్వరాలు చేరాల్సిన చెవులకు చేరకపోవడం వల్ల చెప్పినదాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం తప్పనిసరి అయిపోయిందేమో అనిపిస్తుంది.

ఏదేమైనా లింగవివక్షపై అవగాహన వచ్చినంత తేలిగ్గా రచయిత్రులకు  సాహితీ సంస్కృతిని పునర్లిఖించడం సాధ్యం కాలేదంటారు సాండ్రా గిల్బర్ట్, గాయత్రి స్పివాక్ వంటి విమర్శకులు. ఈ క్రమంలో మరోరకమైన వివక్షలు వారికి వివిధ రూపాల్లో అవరోధాలుగా తయారయ్యాయి. నిజానికి ఎక్కువమంది రచయితలు స్త్రీవాద సదస్సులకు వెళ్ళడానికి ఆసక్తి చూపరు. స్త్రీల రచనల్ని గానీ, వారి వ్యాసాలను గానీ చదవరు. హేతువాద ఉద్యమంలో స్త్రీల ఉనికిని ఉద్దేశ్యపూర్వకంగా గుర్తించరు. ఇటువంటి వివక్షలో కూడా పలురకాలుంటాయి. మొదటి రకపు వివక్ష సాహిత్యానికి ఎంతమాత్రమూ సంబంధంలేని వారి నుండి ఎదురవుతుంది. సుమారు 50-60 శాతం ఉండే వీరిలో చాలామంది స్త్రీవాదాన్ని వినరు, చదవరు. కొంతమంది మాకెందుకొచ్చిందని విసుగ్గా ఆవలిస్తారు, మరికొంతమంది అజ్ఞానం నటిస్తారు. వీళ్ళంతా స్త్రీవాద సాహిత్య విమర్శను ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరిస్తారు. ఇక స్త్రీవాద విమర్శపై రెండో రకమైన తిరస్కరణ వివక్ష లేదని అంటూ విపరీతమైన ఆశావహదృక్పథాన్ని అవలంబించే పండితవర్గం నుండి ఎదురవుతుంది. వీరు ప్రతీ సాహితీ విభాగంలోనూ ఒక స్త్రీవాది ఉంటే చాలనుకునే వర్గం. ఇక స్త్రీవాద విమర్శకు మూడో తరహా తిరస్కరణ ప్రత్యక్ష శత్రుత్వం ద్వారా జరుగుతుంది. చాలాసార్లు శత్రుత్వాన్ని బాహాటంగా ప్రదర్శించడానికి రచయితలు ఇష్టపడకపోయినా రచయిత్రులు ఏ మాత్రం మొహమాటపడకుండా తమ వ్యతిరేకతనూ, తిరస్కారాన్నీ ప్రదర్శిస్తారు. ఈ శత్రుత్వం వెనుక పితృస్వామ్య మూలాలుంటాయి. 

ఏదేమైనా "స్త్రీవాదులు గళం విప్పడం అన్ని చారిత్రక మూలల్నీ సమూలంగా పెకలించివేస్తుంది" అనేది కేవలం ఒక మెటఫోర్ గా చూడడం వరకే బావుంటుంది. స్త్రీవాదం వినాశనాన్ని కోరదు, ఎటువంటి వివక్షలకూ తావులేని సమాజాన్ని నిర్మించే దిశగానే ప్రయాణిస్తుంది. అందువల్ల స్త్రీవాద ఉద్యమాన్ని విచ్ఛేదనంగా చూడడం కంటే పునర్నిర్మించడంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాయత్రి చక్రవర్తి స్పివాక్ అనేక రచనలను విశ్లేషించడానికి ఉపయోగించిన డెఱిడా ప్రతిపాదించిన 'డీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్'ని స్త్రీ ఉనికిని పునఃనిర్వచించే దిశగా మన ప్రాచీన సాహిత్యం మొదలు సమకాలీన సాహిత్యం వరకూ వర్తింపజేస్తూ స్త్రీ అస్తిత్వాన్ని ఇప్పటి తూకపురాళ్ళతో మరోసారి తూచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో స్త్రీవాద సాహిత్య విమర్శకుల అవసరం మునుపటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఉంది. ఒకనాడు అస్తిత్వం చాటుకునే దిశగా సంకెళ్ళు తెంచుకుంటూ మొదలైన స్త్రీవాద ఉద్యమం క్రమేపీ ఆధిపత్యపోరులోకి దిగకూడదని ఆశిద్దాం. స్వాతంత్య్రం కోసం చేసే ప్రతీ పోరాటమూ గెలుపు దిశగా అడుగులు వేయిస్తుంది, కానీ ఆధిపత్యం కోసం చేసే ప్రతీ పోరాటంలోనూ కేవలం వినాశనమే మిగులుతుంది. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ మాత్రమే సాధించే దిశగా స్త్రీవాదం తన సాధికారతను చాటుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

తొలి ప్రచురణ : 1st జనవరి 2024

https://www.andhrajyothy.com/2024/editorial/her-stories-written-by-him-1189635.html

స్త్రీవాద సాహిత్య విమర్శ

పాశ్చాత్య సాహిత్యంలో మొదట్నుంచీ సంస్కృతిని పురుషుడిగానూ, ప్రకృతిని స్త్రీగానూ అభివర్ణించడం చూస్తూ ఉంటాం. కనీసం 19వ శతాబ్దం వరకూ సాహిత్యంలోని శైలులకు ఆపాదించిన అస్పష్ట నిర్వచనాలు ఈ లింగవివక్షల వల్ల తీవ్రంగా ప్రభావితమైనవే. ఈ క్రమంలో “the male quality is the creative gift.” అంటూ గెరాల్డ్ మాన్లీ హాప్కిన్స్ బాహాటంగానే పితృస్వామ్యాన్ని సమర్ధించుకోగా మగవారు తమ అధీనంలో ఉంచుకున్న విద్య, సృజనాత్మకత, సాంస్కృతికపరమైన ఆధిపత్యం వంటివి స్త్రీని ఈ సమీకరణం నుండి పూర్తిగా తప్పించాయి. ఆమె ఉనికిని పూర్తిగా మినహాయిస్తూ పాశ్చాత్య సాంస్కృతిక సంపద అంతా పితృస్వామ్యపు హక్కుగా మారిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి యావత్తూ విద్యావంతులైన మగవారికి వారి హేతువాద పూర్వీకుల నుండి వంశపారంపర్యమైన ఆస్తిలా సంక్రమించింది. కానీ ఈ మగవారికి సంబంధీకులైన స్త్రీలు మాత్రం జేన్ ఆస్టెన్ నవలల్లో స్త్రీ పాత్రల్లా ఎస్టేటు చివరి 'డౌవర్ హౌస్' లకు పరిమితమైపోయారంటారు అమెరికన్ సాహితీ విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్.

Image Courtesy Google

గతించిన కాలంలో క్రియాశీల వ్యవస్థకు దూరంగా, వాస్తవ ప్రపంచంతో  ఎంతమాత్రం సంబంధం లేకుండా స్త్రీలు తమ జీవితకాలమంతా పూర్తి ఒంటరితనంతో కేవలం సమీక్షలోనే గడిపేశారు. అనేక ఏళ్ళపాటు స్త్రీ జీవితంలో ఆమెకు వెలుపలి సంఘటనలకు చోటులేని కారణంగా ఆమె తన కథను తాను చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్పుకోడానికి ఆమెకు కథంటూ లేదు. అలాగని ఆమె జీవితం నిరుపయోగమైనదనీ అనలేం, చలనంలేని లాంతరు నుండి వచ్చే వెలుగులా ఆమె చీకటి ప్రపంచంలో తమ కథలను చెప్పుకునే ఔత్సాహిక కథకులకు మౌనంగా దిశానిర్దేశం చేస్తుంది. వారి సృజనాత్మకతకు ప్రేరణ కోసం ఆమెవైపు చూస్తే వారిని ఊరడించి సలహా ఇస్తుంది. తనకంటూ ఒక కథ లేని ఆమె ఇతరులు చెప్పే కథలను సంతోషంగా వింటుంది, దయ చూపిస్తుంది : ఆమె సహజత్వానికి దూరంగా సాహిత్యంలో పితృస్వామ్య వ్యవస్థ ఒక మూసలో పోసి తయారు చేసిన ఒక ఆదర్శ స్త్రీమూర్తి. జాన్ రస్కిన్ వంటివారు ఆమె శక్తి పాలనకూ, యుద్ధానికీ తగదన్నారు, ఆమె హేతువాదం సృజనాత్మకతకూ, ఆవిష్కరణకూ పనికిరాదన్నారు. 'విక్టోరియన్ ఐడియల్' స్త్రీని గృహస్థుగా, భర్తకు సాంత్వన చేకూర్చే ఒక వస్తువుగానే చూసింది. 

ఈ క్రమంలో స్త్రీ ఉనికిని అన్ని విధాలా పరిమితం చేసిన తీవ్రమైన పురుషాధిక్య భావజాలంతో కూడిన ఇమ్మాన్యుయేల్ కాంట్ ప్రతిపాదనలు స్త్రీవాద తత్వవేత్తల విమర్శల్లో విశేషంగా చర్చకు వచ్చాయి. కాంట్ ఎస్థెటిక్స్ ప్రకారం మగవాడు చింతన, పరిశీలన, ఆలోచన, హేతువు, తర్కం వంటి అంశాలకు ప్రతినిధిగా ఉంటే స్త్రీ కేవలం సౌందర్యానికీ, భావోద్వేగాలకూ మాత్రమే ప్రతినిధిగా కనబడుతుంది. స్త్రీని ఒక 'సౌందర్యమూర్తి' గా ప్రతిష్ఠించే క్రమంలో ఆమెను అనైతికతకు ఆస్కారంలేని దేవతా మూర్తిగా చేసి ఒక నైతిక చట్రంలో ఇమిడ్చే నర్మగర్భమైన ప్రయత్నం కనబడుతుంది. స్వతఃసిద్ధమైన స్త్రీ అస్తిత్వానికి దూరంగా ఆమెకు ఒక నిర్ధిష్టమైన రూపాన్ని అంటగట్టే ప్రయత్నంలో సాహితీ సృజనలో అవసరమైన ఇన్-యాంగ్ అంటే నీతి-అవినీతి,మంచి-చెడు, న్యాయం-అన్యాయం వంటి ద్వంద్వాలను ఆమె అస్తిత్వానికి అన్వయించుకునే అవకాశం లేకుండా  కనిపించని ఆంక్షలు అమల్లో ఉండేవి. అందుకే ప్రాచీన కావ్యాల్లో కవులూ,రచయితలూ సృష్టించిన స్త్రీ పాత్రలు, అయితే మచ్చలేని చందమామను తలపించే దేవతా మూర్తులుగానో లేదా దానికి పూర్తి విరుద్ధంగా మంత్రతంత్రాలు నేర్చిన మంత్రగత్తెలూ, రాక్షసులుగానో చిత్రించబడేవారు. డాంటే, గోథే, మిల్టన్ వంటివారు ఆద్యులుగా పవిత్రమైన వర్జిన్ మొదలు గృహానికి పరిమితం చేసిన 'దేవత లాంటి ఇల్లాలి' వరకూ అన్ని కావ్యాల్లోనూ ఈ సంప్రదాయం చాలాకాలం కొనసాగింది.

ఇమ్మాన్యుయేల్ కాంట్ స్త్రీ తర్కాన్ని పూర్తిగా విస్మరించనప్పటికీ ఆమె హేతువాదం నైతిక, సామజిక వ్యవహారాల్లో పరిణితిలేనిదనీ, పూర్తి నిరుపయోగమైనదనీ నిర్ధారించారు. దీనికి ఊతమిస్తూ కార్ల్ గిల్లిగాన్ మానసికతత్వ పరిశోధనలు సైతం స్త్రీలు నైతిక నిర్ణయాలను భావోద్వేగాలూ, బాంధవ్యాల ప్రాతిపదికగా సందర్భానుసారం తీసుకుంటారని అంటారు. నిజానికి కాంటియన్ తత్వం స్త్రీ ఉనికిని కేవలం మగవాడిని పరిపూర్ణం చెయ్యడానికి పరిమితం చేస్తూ ఆమె ధర్మాన్ని వివాహవ్యవస్థ ద్వారా మాత్రమే నిర్వచిస్తుంది. ఆ విధంగా కాంట్ స్త్రీపురుషుల వివాహాన్ని రెండు ప్రకృతుల మేళవింపుగా చూస్తారు. భావాన్ని స్త్రీత్వంగానూ, హేతువునూ,తర్కాన్నీ పురుషత్వంగానూ నిర్వచిస్తారు. ఈ కారణంగా ఆమెను తెరచాటుగా ఉంటూ మగవాడిని ఆదర్శవంతమైన నైతిక జీవనం దిశగా అడుగులు వెయ్యడంలో ప్రోత్సహిస్తూ, సహాయసహకారాలందించే పాత్రకి మాత్రమే పరిమితం చేశారు. ఈ నియమాలననుసరించి మానవ సంస్కృతి, నాగరికతా వృద్ధి చెందుతాయని కాంట్ అభిప్రాయపడతారు. ఏదేమైనా కాంటియన్ నైతిక సిద్ధాంతం బట్టి చూస్తే స్త్రీ ఆలోచనలకు విలువలేదు. కాంటియన్ వాదం సంప్రదాయ పితృస్వామ్య గుణాలుగా పరిగణించే నిర్లిప్తమైన హేతువాదాన్ని మాత్రమే గౌరవించి కరుణ, భావోద్వేగాలు వంటి స్త్రీ తత్వాన్ని నిర్వచించే అంశాలను తోసిపారేస్తుంది.

ఈ కారణాల దృష్ట్యా పురుషాధిక్య భావజాలం వ్రేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థలో తన అస్తిత్వం గుర్తెఱిగి అప్పుడప్పుడే రచనా వ్యాసంగంలో తొలి అడుగులు వెయ్యడం మొదలు పెట్టిన రచయిత్రులు సహజంగానే అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రాచీన కాలంనుండీ ఏకపక్షంగా మగవారికి మార్గదర్శకత్వం చేస్తూ వచ్చిన 'వడ్డించిన విస్తరి' లాంటి కావ్యాలూ,గ్రంథాలూ స్త్రీవాద రచయిత్రుల విషయంలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల స్త్రీవాదులు తమ రచనల ద్వారా పితృస్వామ్యపు సాహితీ సృజనలో భాగంగా రూపుదిద్దుకున్న మూస నుండి బయటపడి ప్రప్రథమంగా తమ ఉనికిని నిర్వచించుకునే అవసరం ఏర్పడింది. అనేక ఏళ్ళుగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థలో రచయితలకు రాయడం విషయంలో పూర్వపు చరిత్ర, జ్ఞానం కొంతవరకూ దిశానిర్దేశం చేసేవి. మధ్యయుగం చివరి వరకూ స్త్రీలకు రచనలు చేసే అవకాశమే లేకపోగా 1970ల తరువాత గానీ అసలు వారి రచనలకు గుర్తింపే దొరకలేదు. అందువల్ల తాను రాయడంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తనకు ఏం రాయాలో, ఎలా రాయాలో ఏదో అదృశ్యవాణి శాసిస్తున్నట్లు అనిపించేదంటారు ఇటాలియన్ రచయిత్రి ఎలెనా ఫెరాంటే, అనేకసార్లు అది పురుషుడి స్వరంలో ఉన్న ఒక అదృశ్యశక్తిగా అనిపించేదంటారు. "అతడు నా సమ వయస్కుడో, లేదా నాకంటే వయసులో  పెద్దవాడో నాకు తెలియదు, బహుశా కాస్త వృద్ధుడై ఉంటాడు. అందువల్ల నేను  రాయాలంటే అతడిలా ఆలోచించాలి, అతణ్ణి అనుకరించాలి. ఏకకాలంలో ఒక మగవాడిగానూ, మరికొన్నిసార్లు నా ఉనికిని కాపాడుకుంటూ ఒక స్త్రీ గానూ కూడా ఆలోచించాలి." అంటారామె.

1980ల తరువాత స్త్రీవాద తత్వవేత్తలు భాషలో స్త్రీపురుష నిర్వచనాలు ఆదినుంచీ లేవనీ, అది కేవలం పితృస్వామ్య వ్యవస్థ సృష్టనీ అంటారు. అమెరికన్ స్త్రీవాద తత్వవేత్త జుడిత్ బట్లర్ లాటిన్ అమెరికన్ స్త్రీవాద సిద్ధాంతాలలో 'స్త్రీ' అనే పదానికి నిర్వచనాలున్నాయనే ప్రతిపాదనలని సవాలు చేస్తూ అవన్నీ పితృస్వామ్యపు అభూత కల్పనలని కొట్టిపారేస్తారు. ఇదిలా ఉండగా,మరోవైపు ఫ్రెడ్రిక్ నీషే పురుషాధిక్య భావజాలంతో కూడిన మానసిక విశ్లేషణలు స్త్రీని ఆధిపత్యం,అజమాయిషీ అవసరమైన ఒక పశువుగా చూడాలని నూరిపోస్తాయి. నీషే 'Thus Spoke Zarathustra' అనే రచనలో ఒక పాత్ర "నువ్వు స్త్రీ దగ్గరకు వెళ్తున్నావా ? అయితే నీ కొరడా తీసుకెళ్ళడం మర్చిపోకు" అంటుంది.

అమెరికన్ కవి రాబర్ట్ లోవెల్ “The tranquillized fifties” గా అభివర్ణించిన 'సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజాన్ని' ప్రభావితం చేసిన వివక్షల మూలాలు నియో విక్టోరియన్ సంస్కృతిలో ఉన్నాయి. స్త్రీవాదం కొత్తగా ఊపిరిపోసుకుంటున్న డెబ్భైల దశకంలో సిల్వియా ప్లాత్, లోరైన్ హన్స్బెర్రీ, ఆడ్రె లార్డ్ వంటి అనేక మంది రచయిత్రులు యాభైల్లో చదువులో పట్టాలు పుచ్చుకున్నవాళ్ళు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న యాభైల కాలంలో స్త్రీలను కేవలం ఒక పిల్లల్ని కనే యంత్రంగా, మగవాడికి ఆనందాన్నిచ్చే వస్తువుగానే చూసేవారు. ఈ వివక్షను అధిగమించి అమెరికన్ కవయిత్రి Marianne Moore వివాహవ్యవస్థ, సంతానం వంటి ఆంక్షల్ని చెరిపేస్తూ ఆకాలంలోనే ఒక శక్తిమంతమైన మహిళగా ఒక ఉన్నత స్థానంలో నిలబడడం విశేషం. కానీ దురదృష్టవశాత్తూ కరడుగట్టిన స్త్రీవాది అయిన ఆమె సాటి కవయిత్రి సిల్వియా ప్లాత్ పై తీవ్రమైన విద్వేషం వెళ్ళగక్కారంటారు. మూర్ దృష్టిలో సిల్వియా ప్లాత్ చేసిన తప్పల్లా పిల్లల్ని కనడం, భార్యగా,తల్లిగా, కవయిత్రిగా మూడు పాత్రల్ని పోషించాలనుకోవడం (“triple threat woman, wife, mother and writer”). విచిత్రంగా ఈ రకమైన వత్తిడి సిల్వియా భర్త, కవీ టెడ్ హ్యూగ్స్ పై లేకపోవడం విశేషం. ఇవన్నీ ఆ కాలంలో యువ కవయిత్రులు ఎదుర్కున్న పలురకాల వివక్షలకు సాక్ష్యాలు. ఏదేమైనా భార్యగా, మాతృమూర్తిగా ప్లాత్ గానీ ; వివాహవ్యవస్థనూ,సంతానాన్నీ వద్దనుకుని ఆధునిక కవులుగా సుప్రసిద్ధులైన పౌండ్, విల్లియమ్స్, ఇలియట్ లాంటివాళ్ళ సరసన నిలబడ్డ మూర్ గానీ ఇద్దరూ ఫ్రాయిడ్ స్త్రీకి ఆపాదించిన 'సహజత్వపు' నిర్వచనాన్ని తమదైన శైలిలో సవాలు చేసినవాళ్ళే.

ఫ్రాయిడ్ సిద్ధాంతాలను సాహిత్యానికి అన్వయించిన విమర్శకులు హరాల్డ్ బ్లూమ్ సాహితీ చరిత్రను రాయడంలో తీవ్రమైన 'పితృస్వామ్యాన్ని' తన మోడల్ గా చేసుకున్నారు. ఈ కారణంగా చాలామంది స్త్రీవాద సాహిత్య  విమర్శకులకు ఆయన రాతలు చాలా అభ్యంతరకరంగా తోచేవి, బహుశా ఇక ముందు కూడా తోస్తాయి. ఆయన కావ్యగతిని మగవాడైన కవికీ, అతడి కావ్యానికి ప్రేరణైన స్త్రీకీ మధ్య సంభోగంగా చూస్తారు. ఈ స్థితిలో వెంటనే  ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, "కావ్యంలో కవయిత్రి స్థానం ఎక్కడ ?" ఆమె ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి ? ప్రేరణది ఏ లింగం ? హరాల్డ్ బ్లూమ్ ని చదివిన ఏ స్త్రీలోనైనా తలెత్తే ప్రశ్నలు ఇవే.

నిజానికి బ్లూమ్ మోడల్ ను ఆదర్శంగా తీసుకుంటే ఆయన ప్రతిపాదించిన “Anxiety of influence” ప్రభావం రచయితలపై ఉన్నంతగా రచయిత్రులపై ఉండదంటారు విమర్శకురాలు సాండ్రా గిల్బర్ట్. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వారిపై ప్రభావం చూపించడానికి వారికొక మోడల్ అంటూ లేదు. 19వ శతాబ్దంలో కాస్త ఆలోచనగల ఏ స్త్రీనయినా ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించే మానసిక రోగి అని ముద్రవేసేవారు. ఈ కారణంగా ఆ కాలపు రచయిత్రులు “Anxiety of authorship,” తో బాధపడ్డారంటారు సాండ్రా. ప్రాచీన కావ్యాల్లో ఆమె ఉనికే సందిగ్ధంలో ఉంది గనుక రాయడం తన వల్ల కాదనీ, తనలో సృజనాత్మకత లేదనీ భావించేదామె. నిజానికి ఆమె సంఘర్షణ పితృస్వామ్య రచనల్లోని ప్రపంచంతో కాదు. అతడి కలంలోనుండి జీవంపోసుకున్న ఆమె మూర్తితో. మాక్బెత్ ను కథానాయకుడిగా చూపి లేడీ మాక్బెత్ ను ఒక దిగజారిన స్త్రీగా అభివర్ణిస్తారు, అలాగే ఒడిపస్ ను కథానాయకుడిగానూ, మెడియాను ఒక మంత్రగత్తెగానూ చూపిస్తారు. ఇకపోతే కింగ్ లియర్ పిచ్చితనం అతడి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చే ఒక గొప్ప విషయమైతే ఒఫీలియా పిచ్చితనం కడుదుర్భరం అన్నట్లు వర్ణిస్తారు. ఏకపక్షంగా ఇలాంటి వర్ణనలు చేసే అతడి చేతుల్లోనుండి కలం లాక్కుని తన గురించి చెప్పే అధికారం అతడికివ్వకుండా తన సాధికారతను చాటుకోవాలంటే స్త్రీ సమాజంలో తన ఉనికిని మళ్ళీ సరికొత్తగా నిర్వచించుకోవాలి. A Room of One's Own లో షేక్స్పియర్ సోదరి జుడిత్ పాత్రను సృష్టిస్తూ, 16వ శతాబ్దంలో ప్రత్యేకమైన నైపుణ్యం, సృజనాత్మకతతో పుట్టిన ఏ స్త్రీకి అయినా పిచ్చిపట్టడం ఖాయం అంటారు వూల్ఫ్. తన సృజనాత్మకతను కవిత్వంలో వాడడానికి ప్రయత్నించే ఆమె యొక్క మానసిక ఆరోగ్యం, చిత్తశుద్ధీ దెబ్బతింటాయని తెలియడానికి కొద్ది పాటి సైకాలజీ తెలిసినా చాలంటారామె.

స్త్రీలను ప్రాచీన కాలంనుండీ కళలకూ,సృజనాత్మకతకు దూరంగా ఉంచిన అంశాలపై 19 వ శతాబ్దం తరువాత స్త్రీవాద తత్వవేత్తలు దృష్టి సారించారు. సాహితీసృజన విషయంలో మగవారిని దైనందిన జీవితానికి సంబంధించిన  బాధ్యతలనుండి మినహాయించడంతో వారికి స్వేచ్ఛగా రచనావ్యాసంగాన్ని కొనసాగించే సౌకర్యం (మేల్ ప్రివిలేజ్) ఉండేది. కానీ ఇది రచయిత్రుల విషయంలో వాస్తవదూరమైన విషయం. స్త్రీల విషయంలో సంసారం,పిల్లల పెంపకం వంటి కుటుంబ బాధ్యతల ప్రాధాన్యతల కారణంగా సాహితీ సృజన సహజంగానే మూలకు నెట్టివేయబడింది. ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్ వంటి కవయిత్రులూ, జేన్ ఆస్టెన్, బ్రోన్ట్ సిస్టర్స్ వంటి ప్రముఖ రచయిత్రులు సైతం దీనికి మినహాయింపు కాదు. జేన్ ఆస్టన్ 'పెర్సుయేషన్' కథానాయిక అన్నే ఎలియట్ ఈ విధంగా అంటుంది : "మగవారికి విద్య వంశపారంపర్య హక్కుగా సంక్రమించింది గనుక వారు స్త్రీల కథలను వారి దృష్టికోణం నుండి చెప్పడం చాలా సులభం. ఎందుకంటే కలం వారి చేతిలో ఉంది." దీనికి విరుద్ధంగా కలాన్ని తన చేతిలోకి తీసుకున్న స్త్రీని  ప్రకృతి విరుద్ధమైన నేరం చేసిన అహంకారిగా పరిగణిస్తూ ఆమెకు విమోచనకు ఆస్కారంలేదని భావించేవారు.

ప్రముఖ సాహితీ విమర్శకులైన హరాల్డ్ బ్లూమ్ సైతం కవిత్వపు ప్రేరణను 'తండ్రీ కొడుకుల బంధం'గా అభివర్ణించారు. [“from the sons of Homer to the sons of Ben Jonson, poetic influence [has] been described as a filial relationship”] ఆయన యావత్ సాహితీ ప్రస్థానాన్ని ఇరువురు అత్యంత శక్తిమంతమైన సరిసమాన వ్యక్తుల మధ్య పోరుగా, అనగా తండ్రీకొడుకుల పోరుగా చూస్తారు [ Laius and Oedipus at the crossroads ]. ఈ కారణంగా పాశ్చాత్య సంస్కృతిలో ఏ రచనకైనా రచయిత ఒక తండ్రితో సమానం, ఆ విధంగా పాశ్చాత్య సాహిత్య సంస్కృతి ఒక పితృస్వామ్యంగా రూపుదిద్దికుంది. ఇకపోతే 'రచనకు సొంతదారు',  'సాహిత్యం రచయితకు ఒక ఆస్తి', లేదా 'రచనకు తండ్రి' వంటి వివిధ మెటాఫోరికల్ కోణాల్లో ఆలోచిస్తే రచయిత అనేవాడు తన రచనలో పాత్రలకూ, వాటి గుణగణాలకూ, సన్నివేశాలకూ అన్నిటికీ అధిపతిగా కనిపిస్తాడు. రచయిత తన అదుపాజ్ఞల్లో ఇష్టానుసారంగా మలచుకున్న పాత్రలు అతడి చేతిలో కీలుబొమ్మలతో సమానం. ఈ విధంగా పితృస్వామ్య రచనలు సాహిత్యంలో పురుషాధిక్యతను మెటాఫోరికల్ కోణంలో శోధిస్తూ ఉండగా  “Woman’s virtue is man’s greatest invention.” అని Honoré de Balzac అన్న మాటలు స్త్రీవాదుల్లో మరిన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి. 

ఏదేమైనా ఎంత పిడికిట్లో బిగించి అదుపులో పెట్టాలని ప్రయత్నించినా ఈడెన్ సాక్షిగా ఈ  కథలన్నీ ఏదో ఒక సమయంలో రచయిత మునివేళ్ళనుండి తప్పనిసరిగా జారుకుంటాయి. కథలన్నీ కాలగతిలో అనేక పరిణామాలకు లోనయ్యే అవకాశం ఉండగా, ఒకసారి బయల్పడిన రచనను పిడికిట్లో బంధించి ఎప్పటికీ శాసించడం వీలుపడదు. ఏ ఒక్క రచన ద్వారానో లేదా ఒక చిత్రం ద్వారానో ఏ మనిషి గళాన్నీ శాశ్వతంగా నొక్కిపెట్టడం అసంభవం. ఈ క్రమంలో స్త్రీవాద తత్వశాస్త్రంలో చారిత్రక నిఘంటువును సమూలంగా మార్చాల్సిన ఆవశ్యకతను స్త్రీవాదులు గ్రహించారు. నేటి తరం స్త్రీవాదులూ, విమర్శకులూ కాంట్ సిద్ధాంతాలను లోతుగా పరిశోధించకపోయినా ప్రత్యేకం  కాంటియన్ నైతిక సూత్రాలూ,హేతువాదాలపై దృష్టి సారించారు. ఈ రెండిటిలో కూడా ప్రత్యేకించి కాంటియన్ నైతిక సూత్రాలు స్త్రీవాదుల చర్చల్లో ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి.

స్త్రీని ఒక జీవమున్న ప్రాణిగా కాక కేవలం ఒక ఇమేజికి కుదించిన ప్రాచీన కావ్యాలను యధాతథంగా అంగీకరించడం ముందుముందు వీలుపడదు. అదే సమయంలో మిల్టన్, డాంటే, కీట్స్ మొదలు హాప్కిన్స్, బ్లేక్, ఈట్స్, ఇలియట్ వరకూ వేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్యాన్ని ఉన్నపళంగా విస్మరించడమూ వీలుకాని పని. తరతరాల సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత స్త్రీపురుష భేదం లేకుండా మనందరిపైనా ఉంది. కానీ అసలు చిక్కంతా ఆ సాహిత్యాన్ని నిస్సంశయంగా, నిర్ద్వంద్వంగా అంగీకరించాలనుకోవడంలోనే ఉంది. సరిగ్గా ఇక్కడే సాహిత్యంలో స్త్రీవాదులూ, విమర్శకుల అవసరం కనిపిస్తుంది. వేల ఏళ్ళ పాశ్చాత్య సాహిత్యాన్ని తీసిపారేసే బదులు ఆ చరిత్రను తిరగరాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చరిత్ర నుండి తీసిపారవేసే విషయాలేమీ పెద్దగా లేవు. ఎటొచ్చీ అందులో కేవలం నాణానికి ఒక వైపు కథనే చెబుతూ రెండోవైపు కథను ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేశారు. ఆ రెండో పార్శ్వం మానవజాతిలో సగం మంది మనుషుల అంటే స్త్రీల జీవితాలు. అందువల్ల చరిత్రను పునరావృతం చెయ్యవలసిన అవసరముందని స్త్రీవాదులు అంటే దానర్థం జరిగిన సంఘటనల్నీ, వాటిని చరిత్రీకరించిన ప్రతుల్నీ, గ్రంథాల్నీ మళ్ళీ విమర్శకు పెట్టవలసిన అవసరం ఉందని. ఆవిధంగా సాహితీసంస్కృతిని పునర్నిర్మించాలి, పునఃసృజించాలి, పునరాలోచించాలి, పునర్లిఖించాలి, పునఃవిశ్లేషించాలి. ఈ మార్పు తీసుకురావాలంటే భాష నుండి మొదలుపెట్టాలి. స్త్రీవాదానికీ మానవతావాదానికీ భేదం చెరిపేసే దిశగా పాశ్చాత్య సాహిత్యంలో మూలగ్రంధాలనుండీ ప్రక్షాళన జరగాలి. వర్జీనియా వూల్ఫ్ చరిత్రను తిరగరాయాలంటారు, అడ్రియన్ రిచ్ స్త్రీల రచనలు గతాన్ని పునర్విమర్శ చెయ్యడంతో మొదలవ్వాలంటారు. ఆవిధంగా వేల ఏళ్ళ సాహితీ సంస్కృతిని స్త్రీవాదులూ, సాహిత్య విమర్శకులూ కలిసి విశ్లేషించి స్త్రీతత్వాన్ని పునఃనిర్వచించాలి. 

లింగవివక్ష గాలిలా కంటికి కనిపించదు. ఆ కారణంగా వివక్ష ఉందని నిరూపణ చెయ్యడం కష్టం, అలాగే దాన్నుండి తప్పించుకోవడమూ అసంభవం. స్త్రీలపై కంటికి కనిపించని భారంగా మారిన ఈ వివక్ష వారి జీవితపు పరిమాణాన్నీ, ప్రమాణాల్నీ, కదలికల్నీ నిర్దేశిస్తోంది. కానీ ఎమిలీ డికిన్సన్, సిల్వియా ప్లాత్, అన్నే సెక్స్టన్, వర్జీనియా వూల్ఫ్ వంటి రచయిత్రులు తమపై మోపబడిన ఆ భారాన్ని ప్రక్కకు తోసేస్తూ, మౌనాన్ని ఛేదిస్తూ అనేక రచనలు చేశారు. అందువల్ల పురుషాధిక్యత, లింగవివక్షకు సంబంధించిన వైరుధ్యాలు ముఖ్యంగా 19వ శతాబ్దపు తొలినాళ్ళలో స్త్రీ పురుష రచయితలిద్దరి అస్తిత్వవాద రచనల్లోనూ స్పష్టంగా కనిపించేవి. 'మేల్ టెక్స్ట్' బంధనాల్ని తెంచుకుంటూ అరోరా లీ, మేరీ ఎలిజబెత్ కాలేరిడ్జ్ వంటి స్త్రీలు కొన్నిసార్లు వారికి ఆపాదించిన ద్వంద్వ ప్రవృత్తులైన దేవతగానూ, మరి కొన్నిసార్లు రాక్షసిగానూ మార్చి మార్చి తమ ఉనికిని నిర్వచించుకోవడం మొదలుపెట్టారు. 

ఈ దిశగా పరిశోధనలు చేస్తూ 'ది మాడ్ వుమన్ ఇన్ ది అటిక్' పేరిట స్త్రీవాద సాహిత్య విమర్శకులు సాండ్రా గిల్బర్ట్ మరియు సుసాన్ గుబార్ లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ద్వంద్వ ప్రవృత్తి కారణంగా తరతరాలుగా 'Anxieties of authorship' ద్వారా కష్టపడుతున్న రచయిత్రులు 18వ శతాబ్దం చివరకు వచ్చేసరికి పితృస్వామ్యపు సంకెళ్ళను ఛేదిస్తూ, తమపై మోపిన  ఆంక్షల్ని ప్రశ్నిస్తూ తమ ఉనికిని కొత్త కొత్త కాల్పనిక ప్రపంచాలను సృష్టించడం ద్వారా పునర్నిర్వచించుకోవడం మొదలుపెట్టారు.  స్త్రీలు  రచనావ్యాసంగం వైపు వెళ్ళే ముందు మగవారు తయారుచేసిన 'ఆమెలోని ఆదర్శ మూర్తి'ని చంపాలని తీర్మానిస్తారు వర్జీనియా వూల్ఫ్. మరోవిధంగా చెప్పాలంటే స్త్రీల ఉనికిని సాహిత్యంలో లేకుండా చేసిన పితృస్వామ్యం కొలమానంగా పెట్టిన 'స్త్రీ ఎస్తెటిక్ ఐడియల్' ను నాశనం చెయ్యాలని అంటారు. అలాగే ఆమె ప్రత్యర్థిగా తయారుచేసిన ఆమెలోని 'రాక్షసి'ని పోలే ప్రతిమని కూడా నాశనం చెయ్యాలంటారు. కానీ పితృస్వామ్యపు సంస్కృతి సృష్టించిన స్త్రీ ఉనికిని నిర్వచించే ఈ రెండు మూర్తులనూ నాశనం చెయ్యాలంటే ముందుగా వాటి మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని, వాటి పుట్టుపూర్వోత్తరాలూ, పూర్వాపరాలూ అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు స్త్రీలు రాసిన రచనల్ని చదవాలి, వాటిలో స్త్రీవాద తత్వాన్ని లోతుగా పరిశీలించాలి. అయితే స్త్రీని దేవతగానో లేదా రాక్షసిగానో చిత్రించిన స్థితి ఆ కాలంలో రచయిత్రులను ఏదో ఒక ఇమేజిని తప్పనిసరిగా చంపే దిశగా ప్రభావితం చేసింది.

పాశ్చాత్య సాహిత్యాన్ని పునర్విమర్శిస్తూ వర్జీనియా వూల్ఫ్ ఒక సందర్భంలో "ఒక వృద్ధ ప్రొఫెసర్ డెబ్బయ్యో సారి కీట్స్ ని శోధించడమో,  నూట యాభయ్యో సారి డాంటే ,మిల్టన్ ల గ్రంథాలను తిరగరాయించడమో చేసేలోగా మా రచయిత్రులం ఒక దుకాణంలో పనిచేసే సాధారణమైన అమ్మాయి వాస్తవ చరిత్ర పూర్తిగా రాయగలం" అంటారు. పితృస్వామ్య చరిత్రను శిలాశాసనాల్లా పదేపదే పునర్లిఖించే బదులు, చరిత్ర చెప్పకుండా వదిలేసిన కథల్నీ, కొత్త కథల్నీ చెప్పుకోవలసిన అవసరం ఉందని వూల్ఫ్ ఉద్దేశ్యం కావచ్చు. ఏదేమైనా స్త్రీల విషయంలో ఈ 'సాంస్కృతిక పరాయీకరణ' కు కారణాలేమై ఉండచ్చు ? ఆమె యొక్క మౌనమా ? స్త్రీకి పరిధులు నిర్దేశించడమా ? లేదా ఆమెను ద్వితీయ స్థానానికి పరిమితం చేయడమా ? అనే దిశగా స్త్రీవాదులూ, విమర్శకులూ ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనికి తోడు పితృస్వామ్యపు సాహితీ సంస్కృతిలో ఒక రచయిత్రి స్థానం ఏమిటన్న దిశగా ఆలోచిస్తే సాహితీ విమర్శలో ప్రధానంగా చర్చించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి: ఇక్కడ ప్రధానంగా వినిపించే స్వరం పురుషుడిది కాబట్టి ఆమె స్వరం అతణ్ణి అనుకరించాలా ? లేదా ఎదిరించాలా ? అతడితో తనదైన సాధికారిక స్వరంలో, తన సొంతమైన వాక్య నిర్మాణంతో, తనదైన  భాషలో తన అభిప్రాయాన్ని చర్చించాలా ? ఇటువంటి అంశాలు కేవలం ప్రశ్నలుగానే మిగిలిపోకుండా ఇటు సిద్ధాంతపరంగానూ, అటు ఆచరణలోనూ రెండు విధాలుగానూ మార్పు తీసుకురావాలి.

ఇక సమకాలీన స్త్రీవాద విమర్శ విషయానికొస్తే మార్గరెట్ ఆట్వుడ్ , ఎలెనా ఫెరాంటే, జాడీ స్మిత్, ఝంపా లహిరి, చిమమంద అడిచి వంటి కొందరు ప్రామాణికత కలిగిన అతి కొద్ది స్త్రీవాద రచయిత్రులను మినహాయిస్తే  అమెరికన్ రచయిత్రి రెబెక్కా సోల్నిట్ వంటి కొందరు స్త్రీవాదానికి ఫ్యాషన్ ఐకాన్స్ గా చెలామణి అవుతున్నారు. ఇటువంటి రచయిత్రుల 'పాపులర్' రచనలు నేటి స్త్రీవాదానికి చిహ్నంగా ప్రతీ ఇంటా కాఫీ టేబుల్ మీదో , యువతుల చేతుల్లో కాఫీ కప్పులతోనో, లేదా బీచుల్లోనో ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. నిజానికి రెబెక్కా వంటి స్త్రీవాదులు  'స్త్రీ మౌనం' గురించి ఉటంకించే అనేక విషయాలు Maya Angelou, Adrienne Rich, Cynthia Ozick , Simone de Beauvoir,  Allison Bechdel లాంటి మునుపటి తరం స్త్రీవాదులు అనేక రచనల్లో చెప్పినవే. నిజానికి పాత పాటే మళ్ళీ పాడుతూ స్త్రీ గళాన్ని వినిపించకుండా శతాబ్దాలుగా అణిచివేశారని తన రచనల్లో రాసే  సోల్నిట్ లాంటి స్త్రీవాదులు తమ రచనల ద్వారా స్త్రీవాదానికి కొత్తగా కలిపినదేమీ లేదు. నేటి స్త్రీవాద రచనల్లో తరచూ పాత విషయాలే పునరావృతమవుతుండడం చూస్తుంటాం. కాస్త లోతుగా పరిశీలిస్తే బహుశా రచయిత్రుల విషయంలో చెప్పినదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం తప్పనిసరి అయిపోయిందేమో అనిపిస్తుంది. బహుశా స్త్రీవాదుల స్వరాలు చేరాల్సిన చెవులకు చేరడం లేదేమో ! అందువల్ల నేటి స్త్రీవాద రచనలు పదే పదే ఫిర్యాదు చేస్తున్నట్లు అనిపించినా అదృష్టవశాత్తూ అవి మునుపటిలా మౌనాన్నైతే ఆశ్రయించడంలేదు. ఇక మన అదృష్టమో దురదృష్టమో మనం సోల్నిట్ లాంటి రచయిత్రుల పుస్తకాలు కూడా వదిలిపెట్టకుండా చదువుతున్నాం.

ఏదేమైనా లింగవివక్షపై అవగాహన వచ్చినంత తేలిగ్గా స్త్రీవాదులకూ, విమర్శకులకూ సాహితీ సంస్కృతిని పునర్లిఖించడం సాధ్యం కాలేదంటారు సాండ్రా గిల్బర్ట్, గాయత్రి స్పివాక్ వంటి సాహితీ విమర్శకులు. ఈ క్రమంలో మరోరకమైన వివక్షలు వారికి వివిధ రూపాల్లో అవరోధాలుగా తయారయ్యాయి. నిజానికి ఎక్కువమంది మగవారు (రచయితలు) స్త్రీవాద సదస్సులకు వెళ్ళడానికి ఆసక్తి చూపరు. స్త్రీ రచనల్ని గానీ, వారి వ్యాసాలను గానీ చదవరు. హేతువాద ఉద్యమంలో భాగంగా పండితులూ, ఉపాధ్యాయినులూ, రచయిత్రులుగా స్త్రీల ఉనికిని ఉద్దేశ్యపూర్వకంగా గుర్తించరు. అసలందులో వారి భాగస్వామ్యాన్ని పూర్తిగా నిరాకరిస్తారు. ఇటువంటి వివక్షలో కూడా పలురకాలుంటాయి. మొదటి రకపు వివక్ష సాహిత్యానికి ఎంతమాత్రమూ సంబంధంలేని వారి నుండి ఎదురవుతుంది. వీరు కాలక్షేపానికి ఏదో సూపర్ మార్కెట్ కో, సినిమాకో  వెళ్ళి ఇంటికి తిరిగొచ్చి నిద్రపోయే బాపతు, వీళ్ళ విషయంలో పఠనం ఏ న్యూస్ పేపరుకో, లేదా సోషల్ మిడియా పోస్టులకో పరిమితమవుతుంది. సుమారు 50-60 శాతం ఉండే వీరిలో చాలామంది వినరు, చదవరు. కొంతమంది మాకెందుకొచ్చిందని విసుగ్గా ఆవలిస్తారు, మరికొంతమంది అజ్ఞానం నటిస్తారు. వీళ్ళంతా స్త్రీవాద సాహిత్య విమర్శను ఉద్దేశ్యపూర్వకంగా తిరస్కరిస్తారు.

ఇక స్త్రీవాద విమర్శపై రెండో రకమైన తిరస్కరణ ఎటువంటి వివక్షా లేదని విపరీతమైన ఆశావహదృక్పథాన్ని (“apparently supportive tokenism") అవలంబించే పండితవర్గం నుండి ఎదురవుతుంది. అంతా బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారనుకునే వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, ఏవైనా సంకలనాలను ప్రచురించేటప్పుడు అందులో కనీసం ఒకరిద్దరు స్త్రీలయినా లేకపోతే బావుండదని ఎవరో ఒక 18వ శతాబ్దపు స్త్రీ కవయిత్రికి చెందిన కొన్ని కవితల్ని ఏరుకొచ్చి కంటితుడుపు చర్యగా అందులో కలిపేవారు. ఏదో విధంగా ప్రసిద్ధికెక్కినవారినో, లేదా ఆ సమయానికి తాజావార్తల్లో ఉన్న ఒకరిద్దరు రచయిత్రుల్నో తప్ప మిగతా అందర్నీ పూర్తిగా విస్మరించేవారు. అదేమంటే వీరి సమాధానం : "ఆమె స్త్రీయే కదా, ఆమె రచనల్ని సంకలనంలో కలిపాం కదా !". వీరు ప్రతీ సాహితీ విభాగంలోనూ ఒక స్త్రీవాది ఉంటే చాలనుకునే వర్గం.  

ఇక స్త్రీవాద విమర్శకు మూడో తరహా తిరస్కరణ ప్రత్యక్ష శత్రుత్వం ద్వారా జరుగుతుంది. చాలాసార్లు శత్రుత్వాన్ని బాహాటంగా ప్రదర్శించడానికి రచయితలు ఇష్టపడకపోయినా రచయిత్రులు ఏ మాత్రం మొహమాటపడకుండా తమ వ్యతిరేకతనూ, తిరస్కారాన్నీ ప్రదర్శిస్తారు. ఈ శత్రుత్వం వెనుక కంటికి కనిపించని గాలిలా పితృస్వామ్య మూలాలుంటాయి. ఏదేమైనా ఈ తిరస్కారాలన్నీ అధిగమించి స్త్రీవాద విమర్శకులు స్త్రీవాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అనేక రచనల్ని ప్రచురించారు. ఏదేమైనా స్త్రీవాదులు గళం విప్పడం అన్ని చారిత్రక మూలల్నీ సమూలంగా పెకలించివేస్తుంది అనేది కేవలం ఒక మెటఫోర్ గా చూడడం వరకే బావుంటుంది. స్త్రీవాదం వినాశనాన్ని కోరదు, ఎటువంటి వివక్షలకూ తావులేని సమాజాన్ని నిర్మించే దిశగానే ప్రయాణిస్తుంది. అందువల్ల స్త్రీవాద ఉద్యమాన్ని విచ్ఛేదనంగా చూడడం కంటే పునర్నిర్మించడంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారత సంతతికి చెందిన అమెరికన్ సాహితీవేత్త గాయత్రి చక్రవర్తి స్పివాక్ ని చదువుతున్నప్పుడు ఆమె అనేక రచనలను విశ్లేషించడానికి ఉపయోగించిన డెఱిడా ప్రతిపాదించిన 'డీ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్' ని స్త్రీ ఉనికిని పునఃనిర్వచించే దిశగా మన ప్రాచీన సాహిత్యం మొదలు సమకాలీన సాహిత్యం వరకూ వర్తింపచెయ్యాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. స్త్రీ అస్తిత్వాన్ని ఇప్పటి తూకపురాళ్ళతో మరోసారి తూచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో స్త్రీవాద సాహిత్య విమర్శకుల అవసరం మునుపటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువ ఉంది. ఒకనాడు అస్తిత్వం చాటుకునే దిశగా సంకెళ్ళు తెంచుకుంటూ మొదలైన స్త్రీవాద ఉద్యమం క్రమేపీ ఆధిపత్యపోరులోకి దిగకూడదని ఆశిద్దాం. స్వాతంత్య్రం కోసం చేసే ప్రతీ పోరాటమూ గెలుపు దిశగా అడుగులు వేయిస్తుంది, కానీ ఆధిపత్యం కోసం చేసే ప్రతీ పోరాటంలోనూ కేవలం వినాశనమే మిగులుతుంది. స్వేచ్ఛనూ, సమానత్వాన్నీ మాత్రమే సాధించే దిశగా స్త్రీవాదం తన సాధికారతను చాటుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఈ వ్యాసం రాయడానికి సహాయపడిన రచనలు : 

Rereading Women By Sandra M. Gilbert
Still Mad By Sanda M Gilbert
The Madwoman in the Attic By Sandra M. Gilbert, Susan Gubar
In the Margins. On the Pleasures of Reading and Writing By Elena Ferrante 
A Room of One's Own By Virginia Woolf
In other worlds By Gayatri Chakravorty Spivak

Tuesday, November 21, 2023

Reading Shakespeare in Modern Era

"క్లాసిక్స్ గురించి అందరూ అత్యుత్సాహంగా మాట్లాడతారు గానీ నిజానికి ఎవరూ చదవరని" తనదైన శైలిలో చమత్కరిస్తారు ఆస్కార్ వైల్డ్. పుట్టినప్పటినుండీ ఆనోటా,ఈనోటా వినీ వినీ నోట్లో నానిపోయి, విలువ కోల్పోయి వీగిపోయిన అనేక సార్వత్రిక పదాల్లో క్లాసిక్స్ కూడా ఒక భాగం. రచయితల్లో 'షేక్స్పియర్' పేరు కూడా ఒకవిధంగా అటువంటిదే.

Image Courtesy Google

పాఠ్యపుస్తకాల్లో భాగంగా ఆయన్ను ఎంతో కొంత అందరం చదివే ఉంటాం. ఆయన కథలు అక్కడక్కడా వినే ఉంటాం. ఆయన తెలీనివారు ఎవరూ ఉండరు. కానీ ఆయనేం రాశారో, షేక్స్పియర్ ఎందుకంత గొప్పో తెలిసినవారు మాత్రం ఈరోజుల్లో అరుదుగా కనిపిస్తారు. 'బుక్ నెర్డ్', 'బుక్ వార్మ్' లాంటి టైటిల్స్ సంపాదించుకున్న చదువరులు సైతం నిజానికి షేక్స్పియర్ క్షుణ్ణంగా చదివి ఉండరు. 'షేక్స్పియర్' అంటే ఒక బ్రహ్మ పదార్థం, సామాన్య పాఠకుడికి అందని ద్రాక్ష, అకాడెమియాకి మాత్రమే సంబంధించిన రాతలు రాసే రచయిత, అబ్బే గ్రాంథికం, టీచర్లు, లెక్చరర్లు మాత్రమే చదువుతారు ఆయన్ని,మనకెందుకు ! 'ప్లెషర్ ఆఫ్ రీడింగ్' కంటెంట్ కాదేమో కదా !' ఇలా అనేక సాకులతో ఆయన్ని ప్రక్కకి నెట్టేసి నా మటుకు నేను పుస్తకాలు  చదువుకుంటుంటే, నా అభిమాన రచయితల్లో ఒకరైన రష్యన్ రచయిత సిగిజ్మన్డ్ క్రిఝిఝానోవ్స్కీ వ్యాసాలు కొన్ని చదువుతున్నప్పుడు ఆయన బెర్నార్డ్ షాకీ, షేక్స్పియరుకీ వీరాభిమాని అని తెలిసింది. ఇది నాలో సహజంగానే కుతూహలం రేకెత్తించింది. ఫెంటాస్టిక్ ఫిక్షన్ రాయడంలో అంతటి నైపుణ్యం గల వ్యక్తిని ప్రభావితం చేసిన రచయిత అంటే షేక్స్పియర్ సాహిత్యంలో కేవలం పదాడంబరాలు మాత్రమే ఉండవేమో ! అంతకుమించిందేదో ఖచ్చితంగా ఉండుండాలి అనిపించింది.

అకడెమిక్స్ లో భాగంగా కొంత చదవడం వల్ల ఆయన కథలు పరిచయమే. అయినప్పటికీ ఆయన లిరికల్ ప్రోజ్ తో పరిచయం లేదు. చాలా వరకూ ఆయన నాటకాలన్నీ కథలుగానే చదువుకున్నాను. మళ్ళీ చాలా కాలానికి నేను చదివిన రచన 'A Midsummer Night's Dream'. మనసులో ఈ ఆలోచన వచ్చిందే తడవు ఎడాపెడా రోజుకో పుస్తకం నమిలి పారెయ్యడానికి షేక్స్పియరియన్ ఇంగ్లీషు అంత సులభమేమీ కాదు. అందువల్ల ఆయన్ని ఎలా చదవాలి అన్న విషయమై కొంత గూగుల్ రీసెర్చ్ చెయ్యాల్సొచ్చింది. షేక్స్పియరును చదవడం ఆంగ్లం మాతృభాషగా ఉన్నవాళ్ళకు సైతం చాలా కష్టమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిప్రాయాలు చూసినప్పుడు అర్థమైంది. నిజానికి షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు. ప్రచురణకు తగిన ఉపకరాలు అందుబాటులో లేని కాలంలో సాహిత్యం లిఖితరూపంలో కాకుండా శబ్దరూపంలోనూ, దృశ్యరూపంలోనూ లేదా నాటకప్రదర్శనల ద్వారానూ వ్యాప్తిచెందే కాలానికి చెందినవి ఈ కథలు. అందువల్ల ఈ కథలన్నీ శబ్ద ప్రధానమైనవి. 'కోరా' వెబ్సైటులో "షేక్స్పియర్ ను ఎలా చదవాలి ?" అనే ప్రశ్నకు ఒక స్త్రీ భలే సమాధానం ఇచ్చారు. షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు కాబట్టి, పుస్తకరూపంలో ఆ 'స్క్రిప్టు' చదవడం గేమ్ ఆడకుండా ప్రోగ్రామర్ రాసిన 'కోడింగ్' చదవడంతో సమానమన్నారు. ఇది చదివి భలే నవ్వొచ్చింది. 

ఏది చదివినా పైపైన చదివి వదిలెయ్యకుండా క్షుణ్ణంగా చదవడం అలవాటు కాబట్టి, షేక్స్పియరును ఒక పద్ధతిలో చదువుదామని నిర్ణయించుకున్నాను. సముద్రంలో మునగాలని నిర్ణయించుకున్నప్పుడు తగిన ఏర్పాట్లు, కొంచెం ప్లానింగ్ అవసరం కదా ! నేను "మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ " క్లుప్తంగా ఇలా మూడు దశల్లో చదివాను/ చూసాను.

* మొదటి దశలో చార్లెస్ లాంబ్, మేరీ లాంబ్ రాసిన షేక్స్పియర్ కథల్లో చదవాలనుకున్న నాటకాన్ని ఆధునికాంగ్లంలో కథలా చదివాను.

* రెండో దశలో మూలాన్ని లిరికల్ ఫామ్ లో పైకి చదువుకుంటూ క్రింద ఇచ్చిన ఫుట్ నోట్స్ లో అర్థాలు అన్వయించుకుంటూ చదివాను.

* మూడో దశలో Kenneth Branagh దర్శకత్వం వహించిన పలు షేక్స్పియర్ నాటకాలు ఆన్లైన్ లో లభ్యమైనవి డౌన్లోడ్ చేసి చూశాను. ఇంతా చేస్తే గానీ "షేక్స్పియర్ ఎస్సెన్స్" పూర్తిగా వంటబట్టదనిపించింది.

Thursday, November 2, 2023

బహుముఖ ప్రతిభాశాలి సుబ్బరామయ్య గారు

సుబ్బరామయ్య గారికున్న పలుకుబడి అంతా ఇంతా కాదు. రైతుకుటుంబంలో పుట్టినప్పటికీ బాగా చదువుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి, స్వల్పకాలంలోనే పరిశ్రమలు కూడా స్థాపించి తానే మరి కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకొని మారుతున్న కాలంతో బాటుగా ఆధునికతను అందిపుచ్చుకుని సమాజంలో అనతికాలంలోనే ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

Image courtesy Google 

కానీ ఎంత కీర్తి ప్రతిష్ఠలార్జించినా, తరతరాలూ కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించినా సుబ్బరామయ్య గారిని లోలోపల ఏదో తెలీని వెలితితో కూడిన అసంతృప్తి తినేస్తూ ఉండేది. తన రంగంలో ఇక సాధించడానికేమీ మిగలకపోవడంతో కొందరి మిత్రుల సలహా మేరకు ఆధ్యాత్మికత బాట పట్టారు. "ఉన్నదొకటే జిందగీ" అని నమ్మే సుబ్బరామయ్యకూ, దేవుడికీ మొదట్నుంచీ పెద్దగా పొసగకపోయినా కాలక్షేపంకోసమో, కుతూహలం కొద్దీనో సాధుసంతుల సాంగత్యంలో గడుపుతూ ఆ నోటా ఈ నోటా విన్న ఆధ్యాత్మిక విషయాలను అందిపుచ్చుకున్నారు. మన సుబ్బరామయ్య గారికున్న వాక్చాతుర్యం ఎంతటిదంటే ఆయన పులిని చూపించి పిల్లి అని నమ్మబలికినా జనం ఇట్టే నమ్మేసేవారు. ఆయన సభల్లో ఆధ్యాత్మిక అంశాలపట్ల ఎంత సాధికారికంగా మాట్లాడేవారంటే విన్నవాళ్ళెవరైనా ముక్కున వేలేసుకుని "ఈయన సమస్త వేదాలూ ఔపాసన పట్టేశాడ్రోయ్" అనుకునేవారు. సుబ్బరామయ్యగారు ఆ ముఖస్తుతులనూ, కరతాళ ధ్వనులనూ కాదనకుండా ముసిముసి నవ్వులతో సవినయంగా స్వీకరించేవారు. కొంతకాలానికి ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సభ జరిగినా "ఆధ్యాత్మిక జీవి" సుబ్బరామయ్య గారే ముఖ్య అతిథి.

ఇలా కొంత కాలం గడిచింది. సుబ్బరామయ్యగారిలో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. ఆధ్యాత్మిక రంగంలో తనను యెరుగనివారు లేరు. ఆయనకు సహజంగానే ఆ వాతావరణం బోర్ కొట్టసాగింది. ఈలోగా పక్కూరిలో ఏదో సాహితీ సభ జరుగుతోందని విని కండువా మీదేసుకుని ఆ సభకు బయలుదేరారు ఖాళీగా ఉన్న సుబ్బరామయ్యగారు. ఆ కొత్త వాతావరణంతో బాటు సాహితీ సమూహాల్లోని విప్లవాత్మక ధోరణులు, వింత పోకడలూ సుబ్బరామయ్యగారిని అమితంగా ఆకర్షించాయి. ముందుగా ఒకరిద్దరు ప్రముఖులతో మొదలైన పరిచయాలు క్రమేపీ ఆయన ఇంట్లో జరిగే సాహితీ సమావేశాలూ, ఆతిథ్యాలతో విస్తృత రూపం దాల్చాయి. త్వరలోనే ఆయన  పేరు సాహితీ సమూహాల్లో మారుమ్రోగసాగింది. సుబ్బరామయ్య గారింట్లో కుక్కు తయారుచేసే మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు, చట్నీలూ, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే మినప గారెల గురించి సాహితీ సంఘాల్లో పుంఖానుపుంఖాలుగా చర్చించుకునేవారు. సాహిత్యంతో పెద్దగా పరిచయం లేని సుబ్బరామయ్యగారు మాత్రం రచయితలు, కవులతో కూర్చుని వారు చెప్పే కబుర్లు పొల్లుపోకుండా వినేవారు. అలా సాహిత్యం గురించి, గొప్ప గొప్ప పుస్తకాల గురించీ ఆ నోటా ఈ నోటా సమాచారం తెలుసుకునేవారు. పుస్తకాల్లో నుండి వాళ్ళూ వీళ్ళూ కోట్ చేసే వాక్యాల్ని అందిపుచ్చుకుని మరొకరితో మరో సందర్భంలో వాడి ఆయనకు సహజంగానే ఉన్న వాక్చాతుర్యంతో సాహిత్యం గురించి తనకు సర్వమూ తెలుసని నమ్మబలికేవారు. రైట్ వింగు, లెఫ్ట్ వింగుల్లో ఇందులో చేరాలా అని లాభనష్టాలు బేరీజు వేసుకోగా, సాహితీవర్గాల్లో బాగా పాపులర్ అయిన లెఫ్ట్ వింగులో చేరడం లాభదాయకమని భావించి "లెఫ్టిస్టు" టాగ్ తగిలించుకుని తిరగసాగారు. సభల్లో మైకు దొరికినప్పుడల్లా "దేవుడు, దెయ్యం ట్రాష్" అంటూ ఆధ్యాత్మికత మీద విరుచుకుపడి సాహితీ సమూహాల జయజయధ్వానాలు అందుకునేవారు.

ఇలా కొంతకాలం గడిచింది. కాలంతో బాటు ఈ రైటు, లెఫ్టు తూకాలు మారసాగాయి. మళ్ళీ వెంటనే రైటు వైపు మొగ్గలేరు కాబట్టి సాహితీ సమూహాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న సుబ్బరామయ్య గారు ఖాళీగా ఇంట్లో ఉండడం ఇష్టంలేక దేశాటనకు బయలుదేరారు. తిరిగొచ్చిన వెంటనే సాహితీ సమూహాల్లో తన ప్రాభవం తగ్గుతోందని గ్రహించారు. మిత్రులకు తన ఇంట్లో తిన్న ఇడ్లీ, దోశలనూ, వాటిల్లో తాను మరచిపోకుండా వేసిన ఉప్పునూ గుర్తుచేశారు. కృతజ్ఞతాభారంతో కృంగిపోయి "మీరు గొప్ప సాహితీవేత్త" అన్నారొకరు. మీలాంటి "సహృదయులైన విమర్శకులు అరుదు" అన్నారు మరొకరు. "మీరు చేసిన సాహితీ కృషి అజరామరం" వంతపాడారు వేరొకరు. ఆ విధంగా సుబ్బరామయ్య గారు "సాహిత్య జీవి"గా మిగిలిపోయారు. ఎటొచ్చీ ఆయన చేసిన "సాహితీ కృషి"కి ఇడ్లీలూ, దోశలూ తప్ప ఎటువంటి ఆధారాలూ లేవు.

కొంతకాలం తరువాత సహజంగానే పాతనీటిని తోసేస్తూ కొత్తనీటి ప్రవాహం వెల్లువెత్తింది. తన వాక్పటిమ  వారిముందు పనిచేయకపోవడంతో సుబ్బరామయ్యగారిలో అసహనం పెల్లుబికింది. దాంతో "సాహిత్యం ఉత్తి డొల్ల", "ఈ రచయితలు తామేదో సర్వాంతర్యాములు అనుకుంటారు", "పుస్తకాల్లో ఏముందండీ, ఒట్టి బూడిద" అంటూ మేకపోతు గాంభీర్యంతో ప్లేటు ఫిరాయించారు సుబ్బరామయ్య గారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. "సాహిత్యం వాళ్ళూ , ఆధ్యాత్మికం వాళ్ళూ ఎవరైనా ఇంటికి వస్తే అయ్యగారు ఇంట్లో లేరని చెప్పు" అని తన పనివాడికి పురమాయించి, ఈసారి తన ప్రతిభను నిరూపించుకోడానికి ఏ రంగం మీద దృష్టిపెడితే బావుంటుందా అని ఆలోచిస్తూ తలపంకించారు సుబ్బరామయ్యగారు. 

ఇందులో పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కాదు. 


Monday, September 25, 2023

The World According to Itzik : Selected Poetry and Prose - Itzik Manger

ఆధునిక యాంటీ సెమిటిజం "జ్యూయిష్ ఎన్లైటెన్మెంట్ మూవ్మెంట్" కి పీడకలలా మారిన తరుణంలో జ్యూయిష్ మేధోవర్గం తమ మూలాల్ని తిరిగి వెతుక్కునే పనిలో పడింది. ఏ జాతికైనా తన మనుషుల్నీ, సంస్కృతినీ గుర్తుపట్టాలంటే వాళ్ళెలా ఆలోచిస్తారో, వాళ్ళు మాట్లాడే భాష ఏమిటో, వాళ్ళు పాడుకునే పల్లెపదాలేమిటో, వాళ్ళ కలలేమిటో తెలియాలి. నాజీలు తమ జాతినీ, సంస్కృతిని సమూలంగా తుడిచేసే ప్రయత్నంలో బయటకి పొమ్మంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇల్లొదిలి భయంతో పారిపోయిన సగటు జ్యూ తనతో బాటు తనకు తెలీని సంకర భాషనీ, ఉనికినీ కూడా వెంటబెట్టుకుని తోడు తీసుకెళ్ళాడంటారు జ్యూయిష్ రచయిత ఇట్జిక్ మాంగర్. అవన్నీ వదిలించుకంటే తప్ప అతడు తన అసలుసిసలు జ్యూయిష్ అస్తిత్వాన్ని పొందలేడు. పురోగతిపేరిట వదిలేసుకున్న మూలాలవైపు అడుగు వెనక్కు వేసే క్రమంలో జ్యూయిష్ సంస్కృతిని పునర్జీవింపజేసే దిశగా వారి జానపదాలకు పూర్వవైభవం ఆపాదించే ప్రయత్నం మొదలైంది.

Image Courtesy Google

జ్యూయిష్ సాహిత్యంలో మతం కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్ల సహజంగానే వారి జానపదాల్లో మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఎక్కువ. నిజానికి జానపదాల మీద ఆధారపడని సాహిత్యం ఉండే అవకాశమే లేదు. అన్ని సంస్కృతుల సాహిత్యమంతా వాళ్ళ జానపదాల నుండి వేళ్ళూనుకున్నదే. ఒకరకంగా జానపదాలు ఆయా జాతుల "ఆత్మ"ను ప్రతిబింబిస్తాయి. జ్యూయిష్ జానపదాల ఆత్మ వాళ్ళ మార్కు "హాస్యం ". వాళ్ళ కథల్లో వ్యంగ్యంతో కూడిన "జ్యూయిష్ జోక్" చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందుకే ఇడ్డిష్ జానపదాలన్నీ హాస్యగాళ్ళతో, అవివేకులతో, కొంటె చేష్టలతో ప్రత్యేకమైన చతురతను కలిగి ఉంటాయి.

ఆ మధ్య జ్యూయిష్ కథల సంకలనం "A Treasury of Yiddish Stories" లో కొన్ని కథలు చదువుతుంటే జ్యూయిష్ రచయిత ఇట్జిక్ మాంగర్ గురించి తెలిసింది. తరువాత ఈయన గురించి జల్లెడపట్టగా అనేక వ్యాసాల్లో ఈయనను జ్యూయిష్ సాహిత్యంలో మంచి "Jokester" గా అభివర్ణించారు. బెల్జియం రచయిత  మచాడో డి అసిస్ తరహాలో ఈయన కూడా అంతర్జాతీయంగా పెద్దగా "గుర్తింపుకి నోచుకోని రచయిత" అనిపించింది. జ్యూయిష్ సాహిత్యంలో స్థానికంగా పేరుప్రఖ్యాతులార్జించిన ఈ "షెల్లీ ఆఫ్ ఇడ్డిష్" కథలు, కవిత్వం, వ్యాసాలూ అన్నీ కలిపి యేల్ యూనివర్సిటీ ప్రెస్ వారు "The World According to Itzik" పేరిట ఒక పుస్తకంగా తీసుకువచ్చారు. అందులో మాంగర్ రాసిన కథల్లో మూడు కథలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మొదటి కథ "The Tales of Hershel Summerwind" : ఈ కథ ప్రారంభంలోనే "ఒక మధ్యాహ్నం వేళ జ్యూయిష్ కూలీలు, కార్మికులు, నీళ్ళ కావిళ్ళు  మోసేవాళ్ళు టీ తాగడానికి వచ్చి కూర్చునే చిన్న హోటల్లో హెర్షెల్ నాకు ఈ కథలన్నీ చెప్పాడు. హెర్షెల్ కథలన్నీ వింతగా, విపరీతంగా అనిపిస్తాయి గానీ అవన్నీ నిజాలే, ఎందుకంటే అవన్నీ అతని స్వానుభవాలు కాబట్టి. " అంటూ పాఠకుల ముందరి కాళ్ళకు బంధం వేస్తూ ఈ జానపదాలన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు ఇట్జిక్. మనం కూడా "అంత నమ్మకంగా చెబుతుంటే నమ్మేస్తే పోలా" అనుకుంటూ ఆయన కథలన్నీ చెవులప్పగించి వినడం మొదలుపెడతాం. హెర్షెల్ సవతి తల్లి తన మొదటి భర్త "మెండెల్" కోడిపుంజుగా పునర్జన్మించాడని నమ్ముతూ దాన్ని ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తూ ఉంటుంది. అదంటే మన హెర్షెల్ కి ఒళ్ళుమంట, దాని వెంటపడి వేధిస్తూ ఉంటాడు.
“Mendel, may your growth be stunted, 
I hope you’ll be forever hunted!”

“Mendel munches stars like mutton, 
He has no rival as a glutton.”
అని పాటలు కడుతూ దాని వెంటపడతాడు. మరో సందర్భంలో హెర్షెల్ తండ్రి  వేరే ఊళ్ళో ఉన్న మిత్రుడి వద్ద నుండి తనకోసం ఏళ్ళ తరబడి దాచిపెట్టిన సారాయి పీపా తెమ్మని పురమాయిస్తే, కొన్ని కొంటెపనులు చేసి పర్యవసానంగా పక్షుల గుంపులు పైకి తీసుకుపోగా వాటితో పాటు అమాంతంగా ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఈ సరదా కథ చివర్లో ఒక మంచి నీతి కూడా జత చేస్తారు రచయిత. Irving Howe అనువాదం మూలకథ చదువుతున్నంత సహజంగా అనిపిస్తుంది. ఈ సరళమైన కథలో సందర్భానుసారంగా జ్యూయిష్ మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, నమ్మకాలూ కనిపిస్తాయి.  
From this story you can see what a great and good God we have. For if He helped such an idler as Hershel Summerwind, He will certainly help all faithful and God-fearing Jews, who follow His commandment and live by His word. 
రెండో కథ  "The Story of the Nobleman's moustaches" : ఈ కథ పోలిష్ సంస్కృతిని ప్రతిబింబించే కథ. పోలిష్ ఉన్నత వర్గీయుల్లో గుబురైన కోర  మీసాలకు చాలా ప్రాముఖ్యత ఉండేదట. వాళ్ళ గౌరవమంతా ఆ మీసంలోనే ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఆ మీసం చుట్టూ ఒక చక్కని కథను అల్లుతూ పాపభీతి లేకుండా జీవించని వారి దుస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు ఇట్జిక్. ఈ కథ కూడా అంతర్లీనంగా హాస్యాన్ని పండిస్తూ చివరకు ఒక నీతితో ముగుస్తుంది. ఈ కథలో అలనాటి జ్యూయిష్ సమాజంలోని నమ్మకాలూ, పాపభీతి, శాపనార్థాలు నిజమవుతాయని నమ్మే మూఢవిశ్వాసాల్లాంటివి అనేకం కనిపిస్తాయి.
From this tale, one should draw the following moral: that one has to avoid being cursed. It’s true that this time, the nobleman well and truly deserved his curse. May the Lord preserve us from such noblemen, now and forever. Amen, selah.
మూడో కథ "The Rabbi of Chelm: May his memory be blessed": ఈ కథను అసలుసిసలు జ్యూయిష్ సంస్కృతిని ప్రతిబింబించే కథగా చూడవచ్చు. తనను మహా జ్ఞానిగా భావించే పరమ అవివేకి రబ్బీ (మతగురువు) కథ ఇది. మూర్ఖులైన ప్రజలు ఆయన ప్రతి పిచ్చి మాటనూ శిరసావహిస్తూ చేసే పనులు చదువుతుంటే నవ్వురాక మానదు. ఏ సంస్కృతిలోనైనా సామెతలూ, వాడుక పదాలు ఎలా పుడతాయో తెలియాలంటే ఈ కథ ఒక మంచి ఉదాహరణ. ఈ మూడు కథల్లోనూ ఏది నచ్చిందంటే చెప్పడం కష్టం. జ్యూయిష్ జానపదాల గురించి తెలుసుకోవాలంటే ఇట్జిక్ మాంగర్ ని చదివితీరాల్సిందే.
The rabbi of Chelm called out for everyone to hear, “People, go home. Wash your hands. Say the asher-yotser prayer* and remember that Justice is—ugh.”
The crowd dispersed, everyone repeating to himself the phrase, “Justice is—ugh.”
To this day if you say the word “Justice” to a Chelmite, he will spit and, with a wave of his hand, he’ll say, looking directly at you, “Justice is—ugh.”
పుస్తకం నుండి మరికొన్ని అంశాలు :
For us, Goethe, in his ripest work, Faust, is an example of the highest artistic perfection and organic rootedness in the creation of his people.
The Faust motif, as is well known, is a German folk motif. It was in the Middle Ages that the German folk began to whisper the tale about the wonderful magician, Doctor Johannes Faust, who sold his soul to the devil. In Goethe’s work that motif received its highest expressive formulation.

You may be sure the barrel is waiting. With the years it’s become better.” Sighing, he said, “Ah, if only man were like a barrel of wine.”

Hershel knew that Zalman’s wife, Ziessel, never missed a funeral.
Coming home from a funeral she would always say, “May all Jewish children enjoy such a funeral.” That’s why she was nicknamed “Ziessel- may-all-Jewish-children.”

And, in general, where income is lacking, do-mestic peace is lacking, too.

The rabbi of Chelm, his high forehead furrowed, sat bent over a book.
He stroked his snow-white beard and sighed frequently. Each of the rabbi’s sighs nearly extinguished the tallow lamp burning on the table. And there was plenty to sigh about.

Tuesday, September 19, 2023

How To Be a Stoic (Penguin Great Ideas) - Epictetus, Seneca, Marcus Aurelius

'స్టోయిసిజం' అంటే స్వార్థంతో కూడిన తత్వమనీ, మనిషితనం లోపించిన ఫిలాసఫీ అనీ కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి కొందరు ఇంకాస్త ముందుకు వెళ్ళి విరాగుల్లో నార్సిసిస్టిక్ లక్షణాలు ఉంటాయని కూడా అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. విరాగులు మనుషుల్ని భావోద్వేగాల నుండి పూర్తిగా వేరుపడి హేతుబద్ధతతో ఆలోచించమంటారు. తనకుమాలిన ధర్మం చెయ్యవద్దంటారు. వ్యక్తిత్వ నిర్మాణంపై, మానసిక అభివృద్ధిపై శ్రద్ధపెట్టమంటారు. వ్యక్తిగత సమయానికీ, ఏకాంతానికీ విలువిమ్మంటారు. సంఘజీవిగా ఉంటూనే తామరాకుపై నీటిబొట్టులా ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఇక కొందరు విరాగులైతే అన్ని శాస్త్రాల్లోకీ తాత్వికత మాత్రమే అధ్యయనం చెయ్యవలసిన శాస్త్రమని బలంగా నమ్ముతారు. అందువల్ల స్టోయిక్ తత్వమంతా వ్యవస్థకు దూరంగా వ్యక్తి ప్రధానంగా కనిపిస్తుంది.

నిజానికి మార్కస్ ఆరీలియస్ వంటివారు ఒక సాధారణ జర్నల్ లా రాసుకున్న అంశాలే తదుపరి కాలంలో "మెడిటేషన్స్" పేరిట ఒక గొప్ప ఫిలాసఫీ పుస్తకంగా అవతరించాయి. సెనెకా రాసిన ఉత్తరాలే స్టోయిక్ ఫిలాసఫీలో కీలక భాగంగా మారాయి. ఎపిక్టెటస్ చేసిన ప్రసంగాలు కాలాలు మారి తాత్విక బోధనల రూపు దాల్చాయి. వీళ్ళ తత్వం చదువుతుంటే ఈ ప్రాచీన గ్రీకు, రోమన్ తత్వవేత్తలు ఆధునిక మానవుడికంటే ఎన్నో రెట్లు వివేకవంతులనిపిస్తుంది. ఎందుకంటే ఆధునిక తరానికి భిన్నంగా వీరికి మొక్కకు పురుగు పట్టి కుళ్ళిపోవడం మొదలుపెడితే వైద్యం వేర్లకు చెయ్యాలని తెలుసు. వీళ్ళు నేటి తరంలోలా ఆకులకూ, కొమ్మలకూ మాత్రమే వైద్యం చేస్తూ కూర్చోకుండా మొక్క మూలాల దగ్గర మట్టిని మారిస్తేనో లేదా శుభ్రం చేస్తేనో మాత్రమే దానికి జీవం వస్తుందనే కనీస గ్రహింపు ఉన్నవాళ్ళు. అందువల్ల వ్యక్తి బాగుంటేనే వ్యవస్థ బావుంటుందని నమ్మే వీరి తత్వమంతా మనిషిని మంచి విలువలతో ఉన్నతుడిగా మార్చే  దిశగానే సాగుతుంది.

ఇక "Those who lack the courage will always find a philosophy to justify it." అని ఆల్బర్ట్ కామూ అన్నట్లు స్టోయిక్ ఫిలాసఫీని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అందులోని భావోద్వేగాలను జయించడం, స్వీయ స్పృహ కలిగి ఉండడం వంటి అంశాల్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలాంటివి ఏ ఫిలాసఫీ విషయంలోనైనా సహజంగా జరిగేదే. నేడు సూడో ఇంటెలెక్చువల్స్ రాస్తున్న బెస్ట్ సెల్లింగ్ మేనేజ్మెంట్ పుస్తకాల్లో ఎదుటి మనిషిని ఎలా ఏమార్చాలి ? మన మాట ఎలా నెగ్గించుకోవాలి ? మనదే పైచెయ్యిగా ఆధిపత్యం ఎలా సాధించుకోవాలి ? మన స్వార్థానికి ఎదుటి మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి ? వంటి అంశాలు  తరచూ కనిపిస్తున్నాయి. వీటికి భిన్నంగా స్టోయిక్ ఫిలాసఫీ ఇతరులకు కీడు తలపెట్టకుండా ఆరోగ్యకరమైన / ఆమోదయోగ్యమైన 'ఆత్మరక్షణ' ఎలా చేసుకోవాలో నేర్పుతుంది.

ఏ మానవ మేధస్సు మనిషి ఉనికిని అర్థవంతంగా చేసిందో, నేడు అదే మేధస్సు కృత్రిమత్వంతో అదుపు తప్పి మనిషిని వినాశనంవైపు నడిపిస్తోంది. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నట్లు ఆధునిక ప్రపంచంలో ప్రతీ స్వల్ప విషయాన్నీ సమస్యగా మార్చుకునే మానవ మేధను నియంత్రణలో ఉంచాల్సిన తరుణంలో కులమత జాతి విద్వేషాలు,  భిన్నవాదాలూ, గందరగోళాల మధ్య మనిషికి స్థితప్రజ్ఞత సాధించడానికి విరాగులు బోధించిన తత్వం యొక్క అవసరం మునుపటి కంటే నేడు మరింత ఎక్కువగా ఉందనిపిస్తుంది.

పెంగ్విన్ వారు 'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' సిరీస్ లో భాగంగా గ్రీకు, రోమన్ తత్వవేత్తలైన మార్కస్ ఆరీలియస్, సెనెకా, ఎపిక్టెటస్ రాసిన పుస్తకాల్లోని కొన్ని భాగాల్ని ఎంపిక చేసి ఆ సారాన్ని 'How to be a stoic' పేరిట ప్రచురించారు. ఇందులో, ఎపిక్టెటస్ 'Enchiridion', సెనెకా 'On the shortness of life' మరియు మార్కస్ ఆరీలియస్ 'Meditations' నుండి సంగ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. మునుపు 'ఎన్చిరిడియన్' తప్ప మిగతా రెండిటి గురించీ విడివిడిగా రాశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రస్తావించడం లేదు. 'ఎన్చిరిడియన్' లో కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం.

* మనిషి 'స్వేచ్ఛ' అంటే సకల సౌకర్యాల మధ్యా భౌతికంగా  స్వతంత్రంగా బ్రతకడం మాత్రమే అనుకుంటాడు. కానీ ఎదుటివాళ్ళ అభిప్రాయాలకు అవసరం లేనప్పుడు కూడా విలువిస్తూ, ఎవరేమనుకుంటారో అని నిత్యం భయంతో బ్రతుకుతూ, ఒక చట్రంలో ఇమిడే క్రమంలో మానసికంగా తన ఆలోచనల్లో బానిసగా మిగిలిపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోలేక తన అధీనంలో లేని విషయాలను గూర్చి తలపోస్తూ నిత్యం చింతలో, ఆందోళనలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.

* మన గురించి ఎదుటివారి అభిప్రాయాలు వారి మనసులో మనపట్ల కలిగే భావాలు, తలంపుల ఫలితం మాత్రమే. మనల్ని నిర్వచించేవి వారి భావాలు కాదు గనుక మన అధీనంలో ఎంతమాత్రమూ లేని ఆ అభిప్రాయాలతో మనకు నిమిత్తం లేదు.

* అజ్ఞాని తన దురదృష్టానికి ఎదుటివారిని నిందిస్తాడు. తనని తాను నిందించుకునేవాడు అభివృద్ధి మార్గం వైపు నడుస్తాడు. వివేకవంతుడు  తననూ నిందించుకోడు, ఇతరులనూ నిందించడు.

* జీవితంలో అన్ని సంఘటనలూ మనకు అనుకూలంగానే జరుగుతాయనుకోకూడదు. జరిగే సంఘటనలను యథావిధిగా అంగీకరించడమే శాంతికి మార్గం.

* ఎటువంటి సందర్భంలోనూ "నేనిది కోల్పోయాను" అనుకోకు. "నేనిది తిరిగిచ్చాను" అనుకో. ఒక యాత్రికుడు తాను తాత్కాలికంగా బస చేసిన  సత్రాన్ని ఎలా భావిస్తాడో అలా ఆ క్షణంలో నీకు దక్కినదానిని ఆనందించడం నేర్చుకో.

* నీ శరీరం ఎవరు పడితే వారి నియంత్రణలోకి వెళ్ళడాన్ని నువ్వు వ్యతిరేకిస్తావు. కానీ నీ మెదడుని మాత్రం నిన్ను విమర్శించిన ఎవరి నియంత్రణలోకైనా వెళ్ళడానికెందుకు అనుమతిస్తావు ? 

* నువ్వు ఎటువంటి వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావో దానికి కట్టుబడి ఉండు, సమూహంలోనైనా, ఒంటరిగానైనా సరే.

* అధికభాగం మౌనాన్ని అలవరుచుకో. అవసరమైనంతే క్లుప్తంగా మాట్లాడు. ఎవరైనా మాట్లాడమని కోరితే సామాన్యమైన, వ్యర్థమైన విషయాలను గూర్చి మాట్లాడకు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులను గూర్చి పుకార్లు, ఫిర్యాదులు, పొగడ్తలు, నిందించడం, పోల్చుకోవడం లాంటివి చెయ్యకు.

* ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని తెలిస్తే సంజాయిషీ ఇస్తూ నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. దానికి బదులు- "వారికి విషయం సగం కూడా తెలియదు. తెలిస్తే మరికాస్త ఎక్కువ చెప్పి ఉండేవారు" అను.

* ఎవరైనా నిన్ను సత్యదూరంగా విమర్శిస్తుంటే, అది వారు సరైనదని నమ్ముతూ, తమ దృష్టి కోణం నుండి మాత్రమే మాట్లాడుతున్నారని గ్రహించు. వారి అభిప్రాయాలు తప్పైతే వారే మున్ముందు తమ అజ్ఞానంతో కూడిన స్వయంకృతానికి ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ నువ్వు మాత్రం నీ విమర్శకుల పట్ల దయతో వ్యవహరించినవాడివవుతావు.