Friday, July 21, 2023

ఆర్వెల్ జోస్యం నిజమవుతోంది!

బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ రచన "1984" పేరు వినగానే చాలామందికి  వెనువెంటనే గుర్తొచ్చేది అందులో ఆయన సృష్టించిన 'న్యూ స్పీక్' అనే పదమే. డిస్టోపియన్ సమాజాల్లో భాషను ఒక సమర్ధవంతమైన ఆయుధంగా వాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్వెల్ ముందుగానే హెచ్చరించారు. ఆర్వెల్ సృష్టించిన ప్రపంచంలోని ఫాసిస్టు ప్రభుత్వం ప్రజలను ఏమార్చడానికీ, భ్రమలో ఉంచడానికీ వాడే ప్రత్యేకమైన భాషే 'న్యూ స్పీక్'.  ఉదాహరణకు ఆర్వెల్ కథలోని ప్రభుత్వం "క్రైమ్ థింక్" (స్వంతంగా ఆలోచించే తప్పు చెయ్యడం), "గుడ్ థింక్" (సంప్రదాయ ఆలోచనలు మాత్రమే చెయ్యడం) లాంటి కొత్త పదాల్ని తమ అజెండాలకు అనుకూలంగా సృష్టిస్తుంది. ఆ కాలంలోనే సాహిత్యంలో దీన్నొక గొప్ప ప్రయోగంగా చూడవచ్చు. నిరంకుశ పరిపాలనలో భాష ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో, ప్రజల్ని మోసపుచ్చే దిశగా దాన్ని ఆయుధంగా ఎలా వాడతారో వర్ణిస్తూ సంస్కృతిలో భాష యొక్క ప్రాథాన్యత అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని 'న్యూ స్పీక్' ద్వారా మరోసారి గుర్తుచేస్తారు ఆర్వెల్. భవిష్యత్తులో భాషను ఆయుధంగా వాడడం రాజకీయ, సామాజికాంశాల విషయంలోనే కాకుండా సాహితీరంగానికి కూడా పెనుప్రమాదంగా పరిణమిస్తుందని ఆర్వెల్ లాంటి వాళ్ళు బహుశా ముందే ఊహించి ఉండవచ్చు.

రచయితగా తాను నమ్మిన విలువలకు ఆర్వెల్ ఎంతగా కట్టుబడి ఉండేవారో తెలియాలంటే ఒక చిన్న సందర్భాన్ని గురించి చెప్పుకోవాలి. ఆర్వెల్ ఒక రచయితగా రచన కూర్పుపై ఎంత శ్రద్ధ పెట్టేవారో దాని సంపాదకీయం  విషయంలో కూడా అంతే పట్టుదలగా ఉండేవారట. తన స్వంత నవలలను ఎడిట్ చెయ్యడం పట్ల ఆర్వెల్ వైఖరి దీనికి ఒక మంచి ఉదాహరణ. బ్రిటిష్ ప్రచురణ సంస్థ అధినేత Victor Gollancz తన రచనల్లో వేలుపెట్టడమే "A Clergyman’s Daughter" and "Keep the Aspidistra Flying" అనే రెండు నవలలు పాడైపోవడానికి కారణమని అంటారు ఆర్వెల్. తన రచనల్లో ఇతరుల ప్రమేయం పట్ల ఆర్వెల్ ఎంత మొండి వైఖరితో కూడిన విముఖత కనబర్చేవారంటే, చివరకు "అమెరికన్ బుక్ ఆఫ్ ది మంత్ క్లబ్" వారు "1984" ని ప్రచురించడానికి ‘The Principles of Newspeak’ appendix and the lengthy essay on Oligarchical Collectivism' ని పుస్తకంలోంచి తీసేస్తే తప్ప కుదరదంటే, ఆ ప్రతిపాదనని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ క్రమంలో ఆయన కోల్పోయినదెంతో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అక్షరాలా ఆ కాలంలో నలభై వేల పౌండ్ల అమెరికన్ సేల్స్. ఆయన తన ఏజెంట్ తో "పెద్ద పెద్ద ముక్కలు అక్కడక్కడా కోసుకుంటూపోతే నవల స్ట్రక్చర్ (నిర్మాణం) దెబ్బతింటుంది కాబట్టి కుదరదని అన్నారట. "ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీకి" ఇదొక మచ్చుతునక. ఏదేమైనా అది ఆర్వెల్ జీవించి ఉన్న సమయం కాబట్టి ఆయన తన రచనను సంపాదకీయాల నుండి కాపాడుకోగలిగారు. మరి ప్రస్తుతం జీవించిలేని రచయితలకు తమ కళను కాపాడుకునే అవకాశం ఉందా ? 

తరాలు మారుతున్నా, అప్పుడూ ఇప్పుడూ కూడా పాలనా వ్యవస్థకు ప్రతిబంధకాలుగా, ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్న సాహిత్యాన్ని బహిష్కరించడం పరిపాటే. నేడు అందరికీ సుపరిచితమైన క్లాసిక్స్ లో To Kill a Mockingbird (Harper Lee), The Handmaid’s Tale (Margaret Atwood), Of Mice and Men (John Steinbeck), Brave New World (Aldous Huxley), The Catcher in the Rye (J.D.Salinger) వంటివన్నీ ఒకప్పుడు బ్యాన్ చేసిన పుస్తకాలే. ఈ జాబితా చెప్పుకుంటూ వెళ్తే బహిష్కరణకు గురైన పుస్తకాలు కోకొల్లలు. కానీ నేడు అదే  బహిష్కరణ అందరికీ ఆమోదయోగ్యంగా (?) ఆధునికమైన రూపుదాలుస్తోంది.  టెక్స్ట్ ను అర్థం చేసుకోడానికి ఫ్రెంచ్ తత్వవేత్త జాక్వెస్ డెఱిడా ప్రతిపాదించిన "డీకన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్" ను పాఠకుల బదులుగా సంపాదకులు వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాహిత్యంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులకనుగుణంగానూ, అనుకూలంగానూ  లేని ప్రతీ పదాన్నీ మరో ఆలోచన లేకుండా తీసివెయ్యడం, దాని స్థానాన్ని తమకనుకూలమైన పదాలతో భర్తీ చెయ్యడం జరుగుతోంది.

ఈ పునఃనిర్మాణానికి అంకురార్పణగా మూలాలను పెకలిస్తూ ఈ మార్పులు బాలసాహిత్యంతో మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పఫిన్ బుక్స్ వారు బ్రిటిష్ రచయిత రోల్ డాల్ పుస్తకాలపై సెన్సార్షిప్ వేటు వేశారు. సాహితీవేత్తగా ఆయన లెగసీలో భాగమైన "చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ", "మెటిల్డా" వంటి రచనల్లో ఫాట్, అగ్లీ , మ్యాడ్ వంటి పదాలు సున్నితత్వానికి సుదూరంగా బాడీ షేమింగ్ ని ప్రోత్సహిస్తూ, అవమానకరంగానూ, వివక్షలకు దారితీసేవిగానూ ఉన్నాయనేది వారి వాదన. ఇదిలా ఉండగా రోల్ డాల్ తో బాటు బాలసాహిత్యంలో దిగ్గజాలైన ఎనిడ్ బ్లైటన్, డాక్టర్ సూస్, రుడ్యార్డ్ కిప్లింగ్ ల రచనలు సైతం జాతి వివక్షలనూ, లింగవివక్షలనూ ప్రోత్సహించే భావజాలాల్నీ, భాషనూ కలిగి ఉన్నాయని సెన్సార్షిప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అగాథా క్రిస్టీ రచనలపై కూడా ఇటువంటి ఆరోపణలే  వచ్చిన నేపథ్యంలో ఆమె మునిమనుమడు పత్రికాముఖంగా "క్రిస్టీకి ఎవరినీ అఫెండ్ ఉద్దేశ్యం లేదని" అన్నారట. భవిష్యత్తులో వీరందరి రచనల్లో ఉపయోగించిన పదాలనూ, భాషనూ మార్చి సమూలమైన మార్పులు చెయ్యాలనే ప్రతిపాదనలు వినబడుతున్నాయి.

ఈ చర్యలు సల్మాన్ రష్దీ, జూడీ బ్లూమ్ వంటి పలువురు సాహితీవేత్తల ఘాటు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. బంగ్లాదేశ్, ఇరాక్, ఇజ్రాయెల్ వంటి వెనుకబడిన దేశాలే కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి  అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇటువంటి చర్యలు భవిష్యత్తులో కళాకారుడి స్వేచ్ఛకు పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. అకడమిక్ పుస్తకాల్లో సవరణలు చేసినట్లే సాహిత్యాన్ని కూడా నేటి సామజిక చట్రాల్లో ఇమిడ్చే యత్నాలు ఎటువంటి జీవ వైవిధ్యాన్నీ సహించలేని ప్రస్తుత సమాజపు అసహనానికి పరాకాష్ట. అందునా రచయితలు జీవించిలేని సమయంలో వారి రచనల్లో ఈ కాలానికి అనుగుణంగా మార్పులు చెయ్యడం వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి, వారి ప్రైవసీకి భంగం కలిగించడమే. పరిశీలిస్తే ఇది సమస్యలో ఒక పార్శ్వం మాత్రమే.

విజేతలు నిజాన్ని తమకనుగుణంగా వక్రీకరించే అవకాశం పుష్కలంగా ఉన్న చరిత్రలోని ప్రామాణికత ఎప్పటికీ అనుమానాస్పదమే. తులనాత్మకంగా చూస్తే, దీనికి భిన్నంగా ప్రతీ మనిషి యొక్క వ్యక్తిగత అనుభవాలకూ గళాన్నిచ్చే సాహిత్యంలో ఆ అవకాశం కాస్త తక్కువని చెప్పచ్చు. కళను కళాకారుడి యొక్క "స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన వ్యక్తీకరణగా" భావిస్తే ప్రతీ కళాకారుడి కళలోనూ ఆ కాలమాన పరిస్థితులకనుగుణంగా ఆ వ్యక్తి యొక్క అస్తిత్వంతో ముడిపడి ఉన్న పలు సాంస్కృతిక, రాజకీయ, సామాజికాంశాలు అనేకం కనిపిస్తాయి. ఈ కారణంగా ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ కాలపు సంస్కృతిని ప్రతిబింబించే జీవన విధానాలూ, వేష భాషలూ, వివక్షలూ మొదలైనవి అనేకం గమనిస్తాం. నిజానికి సాహిత్యం యొక్క పరమావధి అదే కదా ! ప్రపంచంలో ఏ మారుమూలో, మరో కాలంలో జన్మించిన మనిషిలో పరకాయ ప్రవేశం చేసి అతడి కళ్ళతో ఆనాటి ప్రపంచాన్ని పరికించడం.

ఈ తరం పాఠకులకూ, సంస్కృతికీ అనుకూలంగా ప్రాచీన సాహిత్యంలో  భాషాపరమైన మార్పులు చెయ్యడంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మొదటిది ఈ చర్య ద్వారా మరణించిన కళాకారుణ్ణి అగౌరవపరచడమైతే రెండోది ఆ రచయిత అస్తిత్వాన్ని చెరిపేసే లేదా మార్చేసే ప్రయత్నానికి పూనుకోవడం. మంచో,చెడో ఏ కాలపు రచయితల భావజాలాలకైనా ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలనుబట్టి సందర్భానుసారంగా ఒక చారిత్రక నేపథ్యం అంటూ ఉండి తీరుతుంది. సంపాదకుడు తనకు నచ్చని పదాలనన్నిటినీ  ఎఱ్ఱని ఇంకుతో యథేచ్ఛగా కొట్టేసుకుంటూ పోతే ఇక ఆ రచనలో ఏ విధమైన ప్రామాణికతా మిగిలుండే అవకాశం లేదు. అంతేకాకుండా ఒక రచనను పునఃవిశ్లేషించే సంపాదకుల వ్యక్తిగత భావజాలాలు కూడా రచనపై ప్రభావం చూపిస్తాయనేది విస్మరించలేని విషయం. సాహిత్యంలో "బైగోటెడ్ వ్యూస్", "బైగోటెడ్ లాంగ్వేజ్" పేరిట ఆ కాలంలోని మతవిశ్వాసాలనూ, మూఢ భావజాలాలనూ, వివక్షలనూ ఈ కాలానికి తగ్గట్టు చెరుపుకుంటూనో, మార్చుకుంటూనో పోతే ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలూ, వేషభాషలూ, వివక్షల గురించి ఈ తరానికి తెలిసే అవకాశం మృగ్యమైపోతుంది. ఇది మనిషి కులమత జాతి వివక్షలను ఎన్నిటిని దాటుకుని ఈరోజు నాగరికమైన మనిషిగా నిలబడ్డాడో తెలిసే అవకాశం మన ముందు తరాలకు లేకుండా చెయ్యడమే.

ఆర్వెల్ 'The Prevention of Literature' అనే వ్యాసంలో భవిష్యత్తులో వ్యక్తిగత అనుభవాలూ, భావోద్వేగాలూ, నిజాయితీతో కూడిన పరిశీలనలూ లేని డొల్లతనంతో కూడిన కొత్త రకం సాహిత్యం పుడుతుందనీ, లిబరల్ సంస్కృతి అంతరించడంతో పాటే సాహిత్యం కూడా తుది శ్వాస విడుస్తుందని జోస్యం చెప్పడం సమకాలీన సాహితీ ప్రపంచపు విలువల్ని పరిగణనలోకి తీసుకుంటే నిజమేననిపిస్తుంది. ఆ నిరంకుశత్వం నీడల్లో మెటాఫోర్ల ముసుగుల్ని ఆసరా చేసుకుని కవిత్వం కొంతవరకూ నిలదొక్కుకోగలుగుతుందేమో గానీ హేతువాదం పునాదుల మీద నిలబడే వచన రచన మాత్రం అంతరించిపోతుందంటారాయన. నిరంకుశ సంస్కృతిలో వచన రచన చేసే రచయితకి అయితే నిశ్శబ్దమూ లేదా మృత్యువూ తప్ప మధ్యే మార్గం లేదని ఘంటాపథంగా చెప్పిన ఆర్వెల్ జోస్యాన్ని జీవించిలేని రచయితల యొక్క రచనల రూపంలో మిగిలిన అస్తిత్వాన్ని సమాధుల్లోంచి తవ్వితీసి మరీ పోస్ట్మార్టం చేస్తున్న నేటి ప్రచురణ సంస్థలూ, సంపాదకీయాలూ నిజమేనని నిరూపిస్తున్నాయి.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' : 17 జులై 2023

https://www.andhrajyothy.com/2023/editorial/orwells-prophecy-is-coming-true-1104593.html?fbclid=IwAR0qh_-4gDhI7xP-a85PGB3k7npmpAeBj0L9S5CkB7RSvK_2xiPChwfJiZc