Tuesday, November 21, 2023

Reading Shakespeare in Modern Era

"క్లాసిక్స్ గురించి అందరూ అత్యుత్సాహంగా మాట్లాడతారు గానీ నిజానికి ఎవరూ చదవరని" తనదైన శైలిలో చమత్కరిస్తారు ఆస్కార్ వైల్డ్. పుట్టినప్పటినుండీ ఆనోటా,ఈనోటా వినీ వినీ నోట్లో నానిపోయి, విలువ కోల్పోయి వీగిపోయిన అనేక సార్వత్రిక పదాల్లో క్లాసిక్స్ కూడా ఒక భాగం. రచయితల్లో 'షేక్స్పియర్' పేరు కూడా ఒకవిధంగా అటువంటిదే.

Image Courtesy Google

పాఠ్యపుస్తకాల్లో భాగంగా ఆయన్ను ఎంతో కొంత అందరం చదివే ఉంటాం. ఆయన కథలు అక్కడక్కడా వినే ఉంటాం. ఆయన తెలీనివారు ఎవరూ ఉండరు. కానీ ఆయనేం రాశారో, షేక్స్పియర్ ఎందుకంత గొప్పో తెలిసినవారు మాత్రం ఈరోజుల్లో అరుదుగా కనిపిస్తారు. 'బుక్ నెర్డ్', 'బుక్ వార్మ్' లాంటి టైటిల్స్ సంపాదించుకున్న చదువరులు సైతం నిజానికి షేక్స్పియర్ క్షుణ్ణంగా చదివి ఉండరు. 'షేక్స్పియర్' అంటే ఒక బ్రహ్మ పదార్థం, సామాన్య పాఠకుడికి అందని ద్రాక్ష, అకాడెమియాకి మాత్రమే సంబంధించిన రాతలు రాసే రచయిత, అబ్బే గ్రాంథికం, టీచర్లు, లెక్చరర్లు మాత్రమే చదువుతారు ఆయన్ని,మనకెందుకు ! 'ప్లెషర్ ఆఫ్ రీడింగ్' కంటెంట్ కాదేమో కదా !' ఇలా అనేక సాకులతో ఆయన్ని ప్రక్కకి నెట్టేసి నా మటుకు నేను పుస్తకాలు  చదువుకుంటుంటే, నా అభిమాన రచయితల్లో ఒకరైన రష్యన్ రచయిత సిగిజ్మన్డ్ క్రిఝిఝానోవ్స్కీ వ్యాసాలు కొన్ని చదువుతున్నప్పుడు ఆయన బెర్నార్డ్ షాకీ, షేక్స్పియరుకీ వీరాభిమాని అని తెలిసింది. ఇది నాలో సహజంగానే కుతూహలం రేకెత్తించింది. ఫెంటాస్టిక్ ఫిక్షన్ రాయడంలో అంతటి నైపుణ్యం గల వ్యక్తిని ప్రభావితం చేసిన రచయిత అంటే షేక్స్పియర్ సాహిత్యంలో కేవలం పదాడంబరాలు మాత్రమే ఉండవేమో ! అంతకుమించిందేదో ఖచ్చితంగా ఉండుండాలి అనిపించింది.

అకడెమిక్స్ లో భాగంగా కొంత చదవడం వల్ల ఆయన కథలు పరిచయమే. అయినప్పటికీ ఆయన లిరికల్ ప్రోజ్ తో పరిచయం లేదు. చాలా వరకూ ఆయన నాటకాలన్నీ కథలుగానే చదువుకున్నాను. మళ్ళీ చాలా కాలానికి నేను చదివిన రచన 'A Midsummer Night's Dream'. మనసులో ఈ ఆలోచన వచ్చిందే తడవు ఎడాపెడా రోజుకో పుస్తకం నమిలి పారెయ్యడానికి షేక్స్పియరియన్ ఇంగ్లీషు అంత సులభమేమీ కాదు. అందువల్ల ఆయన్ని ఎలా చదవాలి అన్న విషయమై కొంత గూగుల్ రీసెర్చ్ చెయ్యాల్సొచ్చింది. షేక్స్పియరును చదవడం ఆంగ్లం మాతృభాషగా ఉన్నవాళ్ళకు సైతం చాలా కష్టమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిప్రాయాలు చూసినప్పుడు అర్థమైంది. నిజానికి షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు. ప్రచురణకు తగిన ఉపకరాలు అందుబాటులో లేని కాలంలో సాహిత్యం లిఖితరూపంలో కాకుండా శబ్దరూపంలోనూ, దృశ్యరూపంలోనూ లేదా నాటకప్రదర్శనల ద్వారానూ వ్యాప్తిచెందే కాలానికి చెందినవి ఈ కథలు. అందువల్ల ఈ కథలన్నీ శబ్ద ప్రధానమైనవి. 'కోరా' వెబ్సైటులో "షేక్స్పియర్ ను ఎలా చదవాలి ?" అనే ప్రశ్నకు ఒక స్త్రీ భలే సమాధానం ఇచ్చారు. షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు కాబట్టి, పుస్తకరూపంలో ఆ 'స్క్రిప్టు' చదవడం గేమ్ ఆడకుండా ప్రోగ్రామర్ రాసిన 'కోడింగ్' చదవడంతో సమానమన్నారు. ఇది చదివి భలే నవ్వొచ్చింది. 

ఏది చదివినా పైపైన చదివి వదిలెయ్యకుండా క్షుణ్ణంగా చదవడం అలవాటు కాబట్టి, షేక్స్పియరును ఒక పద్ధతిలో చదువుదామని నిర్ణయించుకున్నాను. సముద్రంలో మునగాలని నిర్ణయించుకున్నప్పుడు తగిన ఏర్పాట్లు, కొంచెం ప్లానింగ్ అవసరం కదా ! నేను "మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ " క్లుప్తంగా ఇలా మూడు దశల్లో చదివాను/ చూసాను.

* మొదటి దశలో చార్లెస్ లాంబ్, మేరీ లాంబ్ రాసిన షేక్స్పియర్ కథల్లో చదవాలనుకున్న నాటకాన్ని ఆధునికాంగ్లంలో కథలా చదివాను.

* రెండో దశలో మూలాన్ని లిరికల్ ఫామ్ లో పైకి చదువుకుంటూ క్రింద ఇచ్చిన ఫుట్ నోట్స్ లో అర్థాలు అన్వయించుకుంటూ చదివాను.

* మూడో దశలో Kenneth Branagh దర్శకత్వం వహించిన పలు షేక్స్పియర్ నాటకాలు ఆన్లైన్ లో లభ్యమైనవి డౌన్లోడ్ చేసి చూశాను. ఇంతా చేస్తే గానీ "షేక్స్పియర్ ఎస్సెన్స్" పూర్తిగా వంటబట్టదనిపించింది.

Thursday, November 2, 2023

బహుముఖ ప్రతిభాశాలి సుబ్బరామయ్య గారు

సుబ్బరామయ్య గారికున్న పలుకుబడి అంతా ఇంతా కాదు. రైతుకుటుంబంలో పుట్టినప్పటికీ బాగా చదువుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి, స్వల్పకాలంలోనే పరిశ్రమలు కూడా స్థాపించి తానే మరి కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకొని మారుతున్న కాలంతో బాటుగా ఆధునికతను అందిపుచ్చుకుని సమాజంలో అనతికాలంలోనే ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

Image courtesy Google 

కానీ ఎంత కీర్తి ప్రతిష్ఠలార్జించినా, తరతరాలూ కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించినా సుబ్బరామయ్య గారిని లోలోపల ఏదో తెలీని వెలితితో కూడిన అసంతృప్తి తినేస్తూ ఉండేది. తన రంగంలో ఇక సాధించడానికేమీ మిగలకపోవడంతో కొందరి మిత్రుల సలహా మేరకు ఆధ్యాత్మికత బాట పట్టారు. "ఉన్నదొకటే జిందగీ" అని నమ్మే సుబ్బరామయ్యకూ, దేవుడికీ మొదట్నుంచీ పెద్దగా పొసగకపోయినా కాలక్షేపంకోసమో, కుతూహలం కొద్దీనో సాధుసంతుల సాంగత్యంలో గడుపుతూ ఆ నోటా ఈ నోటా విన్న ఆధ్యాత్మిక విషయాలను అందిపుచ్చుకున్నారు. మన సుబ్బరామయ్య గారికున్న వాక్చాతుర్యం ఎంతటిదంటే ఆయన పులిని చూపించి పిల్లి అని నమ్మబలికినా జనం ఇట్టే నమ్మేసేవారు. ఆయన సభల్లో ఆధ్యాత్మిక అంశాలపట్ల ఎంత సాధికారికంగా మాట్లాడేవారంటే విన్నవాళ్ళెవరైనా ముక్కున వేలేసుకుని "ఈయన సమస్త వేదాలూ ఔపాసన పట్టేశాడ్రోయ్" అనుకునేవారు. సుబ్బరామయ్యగారు ఆ ముఖస్తుతులనూ, కరతాళ ధ్వనులనూ కాదనకుండా ముసిముసి నవ్వులతో సవినయంగా స్వీకరించేవారు. కొంతకాలానికి ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సభ జరిగినా "ఆధ్యాత్మిక జీవి" సుబ్బరామయ్య గారే ముఖ్య అతిథి.

ఇలా కొంత కాలం గడిచింది. సుబ్బరామయ్యగారిలో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. ఆధ్యాత్మిక రంగంలో తనను యెరుగనివారు లేరు. ఆయనకు సహజంగానే ఆ వాతావరణం బోర్ కొట్టసాగింది. ఈలోగా పక్కూరిలో ఏదో సాహితీ సభ జరుగుతోందని విని కండువా మీదేసుకుని ఆ సభకు బయలుదేరారు ఖాళీగా ఉన్న సుబ్బరామయ్యగారు. ఆ కొత్త వాతావరణంతో బాటు సాహితీ సమూహాల్లోని విప్లవాత్మక ధోరణులు, వింత పోకడలూ సుబ్బరామయ్యగారిని అమితంగా ఆకర్షించాయి. ముందుగా ఒకరిద్దరు ప్రముఖులతో మొదలైన పరిచయాలు క్రమేపీ ఆయన ఇంట్లో జరిగే సాహితీ సమావేశాలూ, ఆతిథ్యాలతో విస్తృత రూపం దాల్చాయి. త్వరలోనే ఆయన  పేరు సాహితీ సమూహాల్లో మారుమ్రోగసాగింది. సుబ్బరామయ్య గారింట్లో కుక్కు తయారుచేసే మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు, చట్నీలూ, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే మినప గారెల గురించి సాహితీ సంఘాల్లో పుంఖానుపుంఖాలుగా చర్చించుకునేవారు. సాహిత్యంతో పెద్దగా పరిచయం లేని సుబ్బరామయ్యగారు మాత్రం రచయితలు, కవులతో కూర్చుని వారు చెప్పే కబుర్లు పొల్లుపోకుండా వినేవారు. అలా సాహిత్యం గురించి, గొప్ప గొప్ప పుస్తకాల గురించీ ఆ నోటా ఈ నోటా సమాచారం తెలుసుకునేవారు. పుస్తకాల్లో నుండి వాళ్ళూ వీళ్ళూ కోట్ చేసే వాక్యాల్ని అందిపుచ్చుకుని మరొకరితో మరో సందర్భంలో వాడి ఆయనకు సహజంగానే ఉన్న వాక్చాతుర్యంతో సాహిత్యం గురించి తనకు సర్వమూ తెలుసని నమ్మబలికేవారు. రైట్ వింగు, లెఫ్ట్ వింగుల్లో ఇందులో చేరాలా అని లాభనష్టాలు బేరీజు వేసుకోగా, సాహితీవర్గాల్లో బాగా పాపులర్ అయిన లెఫ్ట్ వింగులో చేరడం లాభదాయకమని భావించి "లెఫ్టిస్టు" టాగ్ తగిలించుకుని తిరగసాగారు. సభల్లో మైకు దొరికినప్పుడల్లా "దేవుడు, దెయ్యం ట్రాష్" అంటూ ఆధ్యాత్మికత మీద విరుచుకుపడి సాహితీ సమూహాల జయజయధ్వానాలు అందుకునేవారు.

ఇలా కొంతకాలం గడిచింది. కాలంతో బాటు ఈ రైటు, లెఫ్టు తూకాలు మారసాగాయి. మళ్ళీ వెంటనే రైటు వైపు మొగ్గలేరు కాబట్టి సాహితీ సమూహాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న సుబ్బరామయ్య గారు ఖాళీగా ఇంట్లో ఉండడం ఇష్టంలేక దేశాటనకు బయలుదేరారు. తిరిగొచ్చిన వెంటనే సాహితీ సమూహాల్లో తన ప్రాభవం తగ్గుతోందని గ్రహించారు. మిత్రులకు తన ఇంట్లో తిన్న ఇడ్లీ, దోశలనూ, వాటిల్లో తాను మరచిపోకుండా వేసిన ఉప్పునూ గుర్తుచేశారు. కృతజ్ఞతాభారంతో కృంగిపోయి "మీరు గొప్ప సాహితీవేత్త" అన్నారొకరు. మీలాంటి "సహృదయులైన విమర్శకులు అరుదు" అన్నారు మరొకరు. "మీరు చేసిన సాహితీ కృషి అజరామరం" వంతపాడారు వేరొకరు. ఆ విధంగా సుబ్బరామయ్య గారు "సాహిత్య జీవి"గా మిగిలిపోయారు. ఎటొచ్చీ ఆయన చేసిన "సాహితీ కృషి"కి ఇడ్లీలూ, దోశలూ తప్ప ఎటువంటి ఆధారాలూ లేవు.

కొంతకాలం తరువాత సహజంగానే పాతనీటిని తోసేస్తూ కొత్తనీటి ప్రవాహం వెల్లువెత్తింది. తన వాక్పటిమ  వారిముందు పనిచేయకపోవడంతో సుబ్బరామయ్యగారిలో అసహనం పెల్లుబికింది. దాంతో "సాహిత్యం ఉత్తి డొల్ల", "ఈ రచయితలు తామేదో సర్వాంతర్యాములు అనుకుంటారు", "పుస్తకాల్లో ఏముందండీ, ఒట్టి బూడిద" అంటూ మేకపోతు గాంభీర్యంతో ప్లేటు ఫిరాయించారు సుబ్బరామయ్య గారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. "సాహిత్యం వాళ్ళూ , ఆధ్యాత్మికం వాళ్ళూ ఎవరైనా ఇంటికి వస్తే అయ్యగారు ఇంట్లో లేరని చెప్పు" అని తన పనివాడికి పురమాయించి, ఈసారి తన ప్రతిభను నిరూపించుకోడానికి ఏ రంగం మీద దృష్టిపెడితే బావుంటుందా అని ఆలోచిస్తూ తలపంకించారు సుబ్బరామయ్యగారు. 

ఇందులో పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కాదు. 


Monday, September 25, 2023

The World According to Itzik : Selected Poetry and Prose - Itzik Manger

ఆధునిక యాంటీ సెమిటిజం "జ్యూయిష్ ఎన్లైటెన్మెంట్ మూవ్మెంట్" కి పీడకలలా మారిన తరుణంలో జ్యూయిష్ మేధోవర్గం తమ మూలాల్ని తిరిగి వెతుక్కునే పనిలో పడింది. ఏ జాతికైనా తన మనుషుల్నీ, సంస్కృతినీ గుర్తుపట్టాలంటే వాళ్ళెలా ఆలోచిస్తారో, వాళ్ళు మాట్లాడే భాష ఏమిటో, వాళ్ళు పాడుకునే పల్లెపదాలేమిటో, వాళ్ళ కలలేమిటో తెలియాలి. నాజీలు తమ జాతినీ, సంస్కృతిని సమూలంగా తుడిచేసే ప్రయత్నంలో బయటకి పొమ్మంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇల్లొదిలి భయంతో పారిపోయిన సగటు జ్యూ తనతో బాటు తనకు తెలీని సంకర భాషనీ, ఉనికినీ కూడా వెంటబెట్టుకుని తోడు తీసుకెళ్ళాడంటారు జ్యూయిష్ రచయిత ఇట్జిక్ మాంగర్. అవన్నీ వదిలించుకంటే తప్ప అతడు తన అసలుసిసలు జ్యూయిష్ అస్తిత్వాన్ని పొందలేడు. పురోగతిపేరిట వదిలేసుకున్న మూలాలవైపు అడుగు వెనక్కు వేసే క్రమంలో జ్యూయిష్ సంస్కృతిని పునర్జీవింపజేసే దిశగా వారి జానపదాలకు పూర్వవైభవం ఆపాదించే ప్రయత్నం మొదలైంది.

Image Courtesy Google

జ్యూయిష్ సాహిత్యంలో మతం కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్ల సహజంగానే వారి జానపదాల్లో మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఎక్కువ. నిజానికి జానపదాల మీద ఆధారపడని సాహిత్యం ఉండే అవకాశమే లేదు. అన్ని సంస్కృతుల సాహిత్యమంతా వాళ్ళ జానపదాల నుండి వేళ్ళూనుకున్నదే. ఒకరకంగా జానపదాలు ఆయా జాతుల "ఆత్మ"ను ప్రతిబింబిస్తాయి. జ్యూయిష్ జానపదాల ఆత్మ వాళ్ళ మార్కు "హాస్యం ". వాళ్ళ కథల్లో వ్యంగ్యంతో కూడిన "జ్యూయిష్ జోక్" చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందుకే ఇడ్డిష్ జానపదాలన్నీ హాస్యగాళ్ళతో, అవివేకులతో, కొంటె చేష్టలతో ప్రత్యేకమైన చతురతను కలిగి ఉంటాయి.

ఆ మధ్య జ్యూయిష్ కథల సంకలనం "A Treasury of Yiddish Stories" లో కొన్ని కథలు చదువుతుంటే జ్యూయిష్ రచయిత ఇట్జిక్ మాంగర్ గురించి తెలిసింది. తరువాత ఈయన గురించి జల్లెడపట్టగా అనేక వ్యాసాల్లో ఈయనను జ్యూయిష్ సాహిత్యంలో మంచి "Jokester" గా అభివర్ణించారు. బెల్జియం రచయిత  మచాడో డి అసిస్ తరహాలో ఈయన కూడా అంతర్జాతీయంగా పెద్దగా "గుర్తింపుకి నోచుకోని రచయిత" అనిపించింది. జ్యూయిష్ సాహిత్యంలో స్థానికంగా పేరుప్రఖ్యాతులార్జించిన ఈ "షెల్లీ ఆఫ్ ఇడ్డిష్" కథలు, కవిత్వం, వ్యాసాలూ అన్నీ కలిపి యేల్ యూనివర్సిటీ ప్రెస్ వారు "The World According to Itzik" పేరిట ఒక పుస్తకంగా తీసుకువచ్చారు. అందులో మాంగర్ రాసిన కథల్లో మూడు కథలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మొదటి కథ "The Tales of Hershel Summerwind" : ఈ కథ ప్రారంభంలోనే "ఒక మధ్యాహ్నం వేళ జ్యూయిష్ కూలీలు, కార్మికులు, నీళ్ళ కావిళ్ళు  మోసేవాళ్ళు టీ తాగడానికి వచ్చి కూర్చునే చిన్న హోటల్లో హెర్షెల్ నాకు ఈ కథలన్నీ చెప్పాడు. హెర్షెల్ కథలన్నీ వింతగా, విపరీతంగా అనిపిస్తాయి గానీ అవన్నీ నిజాలే, ఎందుకంటే అవన్నీ అతని స్వానుభవాలు కాబట్టి. " అంటూ పాఠకుల ముందరి కాళ్ళకు బంధం వేస్తూ ఈ జానపదాలన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు ఇట్జిక్. మనం కూడా "అంత నమ్మకంగా చెబుతుంటే నమ్మేస్తే పోలా" అనుకుంటూ ఆయన కథలన్నీ చెవులప్పగించి వినడం మొదలుపెడతాం. హెర్షెల్ సవతి తల్లి తన మొదటి భర్త "మెండెల్" కోడిపుంజుగా పునర్జన్మించాడని నమ్ముతూ దాన్ని ప్రాణంకంటే మిన్నగా ప్రేమిస్తూ ఉంటుంది. అదంటే మన హెర్షెల్ కి ఒళ్ళుమంట, దాని వెంటపడి వేధిస్తూ ఉంటాడు.
“Mendel, may your growth be stunted, 
I hope you’ll be forever hunted!”

“Mendel munches stars like mutton, 
He has no rival as a glutton.”
అని పాటలు కడుతూ దాని వెంటపడతాడు. మరో సందర్భంలో హెర్షెల్ తండ్రి  వేరే ఊళ్ళో ఉన్న మిత్రుడి వద్ద నుండి తనకోసం ఏళ్ళ తరబడి దాచిపెట్టిన సారాయి పీపా తెమ్మని పురమాయిస్తే, కొన్ని కొంటెపనులు చేసి పర్యవసానంగా పక్షుల గుంపులు పైకి తీసుకుపోగా వాటితో పాటు అమాంతంగా ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఈ సరదా కథ చివర్లో ఒక మంచి నీతి కూడా జత చేస్తారు రచయిత. Irving Howe అనువాదం మూలకథ చదువుతున్నంత సహజంగా అనిపిస్తుంది. ఈ సరళమైన కథలో సందర్భానుసారంగా జ్యూయిష్ మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, నమ్మకాలూ కనిపిస్తాయి.  
From this story you can see what a great and good God we have. For if He helped such an idler as Hershel Summerwind, He will certainly help all faithful and God-fearing Jews, who follow His commandment and live by His word. 
రెండో కథ  "The Story of the Nobleman's moustaches" : ఈ కథ పోలిష్ సంస్కృతిని ప్రతిబింబించే కథ. పోలిష్ ఉన్నత వర్గీయుల్లో గుబురైన కోర  మీసాలకు చాలా ప్రాముఖ్యత ఉండేదట. వాళ్ళ గౌరవమంతా ఆ మీసంలోనే ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఆ మీసం చుట్టూ ఒక చక్కని కథను అల్లుతూ పాపభీతి లేకుండా జీవించని వారి దుస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు ఇట్జిక్. ఈ కథ కూడా అంతర్లీనంగా హాస్యాన్ని పండిస్తూ చివరకు ఒక నీతితో ముగుస్తుంది. ఈ కథలో అలనాటి జ్యూయిష్ సమాజంలోని నమ్మకాలూ, పాపభీతి, శాపనార్థాలు నిజమవుతాయని నమ్మే మూఢవిశ్వాసాల్లాంటివి అనేకం కనిపిస్తాయి.
From this tale, one should draw the following moral: that one has to avoid being cursed. It’s true that this time, the nobleman well and truly deserved his curse. May the Lord preserve us from such noblemen, now and forever. Amen, selah.
మూడో కథ "The Rabbi of Chelm: May his memory be blessed": ఈ కథను అసలుసిసలు జ్యూయిష్ సంస్కృతిని ప్రతిబింబించే కథగా చూడవచ్చు. తనను మహా జ్ఞానిగా భావించే పరమ అవివేకి రబ్బీ (మతగురువు) కథ ఇది. మూర్ఖులైన ప్రజలు ఆయన ప్రతి పిచ్చి మాటనూ శిరసావహిస్తూ చేసే పనులు చదువుతుంటే నవ్వురాక మానదు. ఏ సంస్కృతిలోనైనా సామెతలూ, వాడుక పదాలు ఎలా పుడతాయో తెలియాలంటే ఈ కథ ఒక మంచి ఉదాహరణ. ఈ మూడు కథల్లోనూ ఏది నచ్చిందంటే చెప్పడం కష్టం. జ్యూయిష్ జానపదాల గురించి తెలుసుకోవాలంటే ఇట్జిక్ మాంగర్ ని చదివితీరాల్సిందే.
The rabbi of Chelm called out for everyone to hear, “People, go home. Wash your hands. Say the asher-yotser prayer* and remember that Justice is—ugh.”
The crowd dispersed, everyone repeating to himself the phrase, “Justice is—ugh.”
To this day if you say the word “Justice” to a Chelmite, he will spit and, with a wave of his hand, he’ll say, looking directly at you, “Justice is—ugh.”
పుస్తకం నుండి మరికొన్ని అంశాలు :
For us, Goethe, in his ripest work, Faust, is an example of the highest artistic perfection and organic rootedness in the creation of his people.
The Faust motif, as is well known, is a German folk motif. It was in the Middle Ages that the German folk began to whisper the tale about the wonderful magician, Doctor Johannes Faust, who sold his soul to the devil. In Goethe’s work that motif received its highest expressive formulation.

You may be sure the barrel is waiting. With the years it’s become better.” Sighing, he said, “Ah, if only man were like a barrel of wine.”

Hershel knew that Zalman’s wife, Ziessel, never missed a funeral.
Coming home from a funeral she would always say, “May all Jewish children enjoy such a funeral.” That’s why she was nicknamed “Ziessel- may-all-Jewish-children.”

And, in general, where income is lacking, do-mestic peace is lacking, too.

The rabbi of Chelm, his high forehead furrowed, sat bent over a book.
He stroked his snow-white beard and sighed frequently. Each of the rabbi’s sighs nearly extinguished the tallow lamp burning on the table. And there was plenty to sigh about.

Tuesday, September 19, 2023

How To Be a Stoic (Penguin Great Ideas) - Epictetus, Seneca, Marcus Aurelius

'స్టోయిసిజం' అంటే స్వార్థంతో కూడిన తత్వమనీ, మనిషితనం లోపించిన ఫిలాసఫీ అనీ కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి కొందరు ఇంకాస్త ముందుకు వెళ్ళి విరాగుల్లో నార్సిసిస్టిక్ లక్షణాలు ఉంటాయని కూడా అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. విరాగులు మనుషుల్ని భావోద్వేగాల నుండి పూర్తిగా వేరుపడి హేతుబద్ధతతో ఆలోచించమంటారు. తనకుమాలిన ధర్మం చెయ్యవద్దంటారు. వ్యక్తిత్వ నిర్మాణంపై, మానసిక అభివృద్ధిపై శ్రద్ధపెట్టమంటారు. వ్యక్తిగత సమయానికీ, ఏకాంతానికీ విలువిమ్మంటారు. సంఘజీవిగా ఉంటూనే తామరాకుపై నీటిబొట్టులా ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఇక కొందరు విరాగులైతే అన్ని శాస్త్రాల్లోకీ తాత్వికత మాత్రమే అధ్యయనం చెయ్యవలసిన శాస్త్రమని బలంగా నమ్ముతారు. అందువల్ల స్టోయిక్ తత్వమంతా వ్యవస్థకు దూరంగా వ్యక్తి ప్రధానంగా కనిపిస్తుంది.

నిజానికి మార్కస్ ఆరీలియస్ వంటివారు ఒక సాధారణ జర్నల్ లా రాసుకున్న అంశాలే తదుపరి కాలంలో "మెడిటేషన్స్" పేరిట ఒక గొప్ప ఫిలాసఫీ పుస్తకంగా అవతరించాయి. సెనెకా రాసిన ఉత్తరాలే స్టోయిక్ ఫిలాసఫీలో కీలక భాగంగా మారాయి. ఎపిక్టెటస్ చేసిన ప్రసంగాలు కాలాలు మారి తాత్విక బోధనల రూపు దాల్చాయి. వీళ్ళ తత్వం చదువుతుంటే ఈ ప్రాచీన గ్రీకు, రోమన్ తత్వవేత్తలు ఆధునిక మానవుడికంటే ఎన్నో రెట్లు వివేకవంతులనిపిస్తుంది. ఎందుకంటే ఆధునిక తరానికి భిన్నంగా వీరికి మొక్కకు పురుగు పట్టి కుళ్ళిపోవడం మొదలుపెడితే వైద్యం వేర్లకు చెయ్యాలని తెలుసు. వీళ్ళు నేటి తరంలోలా ఆకులకూ, కొమ్మలకూ మాత్రమే వైద్యం చేస్తూ కూర్చోకుండా మొక్క మూలాల దగ్గర మట్టిని మారిస్తేనో లేదా శుభ్రం చేస్తేనో మాత్రమే దానికి జీవం వస్తుందనే కనీస గ్రహింపు ఉన్నవాళ్ళు. అందువల్ల వ్యక్తి బాగుంటేనే వ్యవస్థ బావుంటుందని నమ్మే వీరి తత్వమంతా మనిషిని మంచి విలువలతో ఉన్నతుడిగా మార్చే  దిశగానే సాగుతుంది.

ఇక "Those who lack the courage will always find a philosophy to justify it." అని ఆల్బర్ట్ కామూ అన్నట్లు స్టోయిక్ ఫిలాసఫీని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అందులోని భావోద్వేగాలను జయించడం, స్వీయ స్పృహ కలిగి ఉండడం వంటి అంశాల్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలాంటివి ఏ ఫిలాసఫీ విషయంలోనైనా సహజంగా జరిగేదే. నేడు సూడో ఇంటెలెక్చువల్స్ రాస్తున్న బెస్ట్ సెల్లింగ్ మేనేజ్మెంట్ పుస్తకాల్లో ఎదుటి మనిషిని ఎలా ఏమార్చాలి ? మన మాట ఎలా నెగ్గించుకోవాలి ? మనదే పైచెయ్యిగా ఆధిపత్యం ఎలా సాధించుకోవాలి ? మన స్వార్థానికి ఎదుటి మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి ? వంటి అంశాలు  తరచూ కనిపిస్తున్నాయి. వీటికి భిన్నంగా స్టోయిక్ ఫిలాసఫీ ఇతరులకు కీడు తలపెట్టకుండా ఆరోగ్యకరమైన / ఆమోదయోగ్యమైన 'ఆత్మరక్షణ' ఎలా చేసుకోవాలో నేర్పుతుంది.

ఏ మానవ మేధస్సు మనిషి ఉనికిని అర్థవంతంగా చేసిందో, నేడు అదే మేధస్సు కృత్రిమత్వంతో అదుపు తప్పి మనిషిని వినాశనంవైపు నడిపిస్తోంది. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నట్లు ఆధునిక ప్రపంచంలో ప్రతీ స్వల్ప విషయాన్నీ సమస్యగా మార్చుకునే మానవ మేధను నియంత్రణలో ఉంచాల్సిన తరుణంలో కులమత జాతి విద్వేషాలు,  భిన్నవాదాలూ, గందరగోళాల మధ్య మనిషికి స్థితప్రజ్ఞత సాధించడానికి విరాగులు బోధించిన తత్వం యొక్క అవసరం మునుపటి కంటే నేడు మరింత ఎక్కువగా ఉందనిపిస్తుంది.

పెంగ్విన్ వారు 'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' సిరీస్ లో భాగంగా గ్రీకు, రోమన్ తత్వవేత్తలైన మార్కస్ ఆరీలియస్, సెనెకా, ఎపిక్టెటస్ రాసిన పుస్తకాల్లోని కొన్ని భాగాల్ని ఎంపిక చేసి ఆ సారాన్ని 'How to be a stoic' పేరిట ప్రచురించారు. ఇందులో, ఎపిక్టెటస్ 'Enchiridion', సెనెకా 'On the shortness of life' మరియు మార్కస్ ఆరీలియస్ 'Meditations' నుండి సంగ్రహించిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. మునుపు 'ఎన్చిరిడియన్' తప్ప మిగతా రెండిటి గురించీ విడివిడిగా రాశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రస్తావించడం లేదు. 'ఎన్చిరిడియన్' లో కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం.

* మనిషి 'స్వేచ్ఛ' అంటే సకల సౌకర్యాల మధ్యా భౌతికంగా  స్వతంత్రంగా బ్రతకడం మాత్రమే అనుకుంటాడు. కానీ ఎదుటివాళ్ళ అభిప్రాయాలకు అవసరం లేనప్పుడు కూడా విలువిస్తూ, ఎవరేమనుకుంటారో అని నిత్యం భయంతో బ్రతుకుతూ, ఒక చట్రంలో ఇమిడే క్రమంలో మానసికంగా తన ఆలోచనల్లో బానిసగా మిగిలిపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోలేక తన అధీనంలో లేని విషయాలను గూర్చి తలపోస్తూ నిత్యం చింతలో, ఆందోళనలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.

* మన గురించి ఎదుటివారి అభిప్రాయాలు వారి మనసులో మనపట్ల కలిగే భావాలు, తలంపుల ఫలితం మాత్రమే. మనల్ని నిర్వచించేవి వారి భావాలు కాదు గనుక మన అధీనంలో ఎంతమాత్రమూ లేని ఆ అభిప్రాయాలతో మనకు నిమిత్తం లేదు.

* అజ్ఞాని తన దురదృష్టానికి ఎదుటివారిని నిందిస్తాడు. తనని తాను నిందించుకునేవాడు అభివృద్ధి మార్గం వైపు నడుస్తాడు. వివేకవంతుడు  తననూ నిందించుకోడు, ఇతరులనూ నిందించడు.

* జీవితంలో అన్ని సంఘటనలూ మనకు అనుకూలంగానే జరుగుతాయనుకోకూడదు. జరిగే సంఘటనలను యథావిధిగా అంగీకరించడమే శాంతికి మార్గం.

* ఎటువంటి సందర్భంలోనూ "నేనిది కోల్పోయాను" అనుకోకు. "నేనిది తిరిగిచ్చాను" అనుకో. ఒక యాత్రికుడు తాను తాత్కాలికంగా బస చేసిన  సత్రాన్ని ఎలా భావిస్తాడో అలా ఆ క్షణంలో నీకు దక్కినదానిని ఆనందించడం నేర్చుకో.

* నీ శరీరం ఎవరు పడితే వారి నియంత్రణలోకి వెళ్ళడాన్ని నువ్వు వ్యతిరేకిస్తావు. కానీ నీ మెదడుని మాత్రం నిన్ను విమర్శించిన ఎవరి నియంత్రణలోకైనా వెళ్ళడానికెందుకు అనుమతిస్తావు ? 

* నువ్వు ఎటువంటి వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావో దానికి కట్టుబడి ఉండు, సమూహంలోనైనా, ఒంటరిగానైనా సరే.

* అధికభాగం మౌనాన్ని అలవరుచుకో. అవసరమైనంతే క్లుప్తంగా మాట్లాడు. ఎవరైనా మాట్లాడమని కోరితే సామాన్యమైన, వ్యర్థమైన విషయాలను గూర్చి మాట్లాడకు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులను గూర్చి పుకార్లు, ఫిర్యాదులు, పొగడ్తలు, నిందించడం, పోల్చుకోవడం లాంటివి చెయ్యకు.

* ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని తెలిస్తే సంజాయిషీ ఇస్తూ నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. దానికి బదులు- "వారికి విషయం సగం కూడా తెలియదు. తెలిస్తే మరికాస్త ఎక్కువ చెప్పి ఉండేవారు" అను.

* ఎవరైనా నిన్ను సత్యదూరంగా విమర్శిస్తుంటే, అది వారు సరైనదని నమ్ముతూ, తమ దృష్టి కోణం నుండి మాత్రమే మాట్లాడుతున్నారని గ్రహించు. వారి అభిప్రాయాలు తప్పైతే వారే మున్ముందు తమ అజ్ఞానంతో కూడిన స్వయంకృతానికి ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ నువ్వు మాత్రం నీ విమర్శకుల పట్ల దయతో వ్యవహరించినవాడివవుతావు.

Wednesday, September 13, 2023

ఆంధ్రజ్యోతి "పలకరింపు"

ప్రపంచ సాహిత్యాన్ని విస్తృ తంగా చదివి, ఆ పాఠకానుభవాన్ని పదిలపరిచే క్రమంలో రాసుకున్న వ్యాసాలను ‘ధీ’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు నాగినీ కందాళ. వ్యాసాల వస్తువు, శైలి, కూర్పు, శీర్షిక, ము ద్రణలలో నవ్యతని తీసుకు వచ్చిన ‘ధీ’ రచయితతో... -- కె.ఎన్‌. మల్లీశ్వరి


1. సాహిత్య విమర్శ పరిధిని మీరెలా నిర్వచిస్తారు?

రచయిత వ్యక్తిగతాల జోలికి వెళ్ళ నంతవరకూ నిజానికి విమర్శకు ప్రత్యేకమైన పరిధులు, పరిమితులు అంటూ ఏవీ ఉండవలసిన అవసరం లేదు. పాఠకులు ఏదైనా రచనను తమ ఆలోచనా పరిధిలోకి తెచ్చుకుని తమ వైన ప్రత్యేకమైన సాహితీ విలువల తూకపురాళ్ళతో దాని నాణ్యతను నిర్ణ యిస్తారు. దేశ విదేశీ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్న పాఠకుల అభి ప్రాయాలను విమర్శగా భావించవచ్చు గానీ సాధారణ పాఠకుల సమీక్షనూ, అభిప్రాయాన్నీ విమర్శగా చూడడం సరికాదనుకుంటాను. ఇక ప్రొఫెషనల్‌ క్రిటిక్స్‌ చూపు కేవలం రచన ఉపరితలం వద్దే ఆగిపోకుండా మరికాస్త ముందుకెళ్ళి భాష, వ్యాకరణం, శిల్పం, భావం ఇలా నలుదిశలా ప్రసరిస్తూ రచన నాణ్యతను అంచనా వేస్తుంది. అటువంటి విమర్శకులు దొరికిన రచయితలు అదృష్టవంతులు. కానీ ప్రస్తుతం మనకు మొక్కుబడి సమీక్షలే ఉన్నాయి తప్ప నిక్కమైన విమర్శ లేదు. కమ్యూనిజం, మార్క్సిజం, మానవ పరిణామ క్రమం, చరిత్ర, గ్రీకు, రోమన్‌, భారతీయ పురాణాల వంటి విషయాల్లో కనీస ప్రాథమిక అవగాహన లేనివారు విమర్శకు పూనుకోకూడదనుకుంటాను.

2. ‘ప్రపంచ సాహిత్య వ్యాసాలు’ అన్న టాగ్‌లైన్‌తో వచ్చిన మీ తొలి పుస్తకం ‘ధీ’ కూర్పులో ఎటువంటి క్రమాన్ని పాటించారు?

‘ధీ’లో ముప్ఫై వ్యాసాలు సుమారు పదేళ్ళ కాలంలో వివిధ సమ యాల్లో బ్లాగులో, పత్రికల్లో రాసిన సుమారు మూడు వందల వ్యాసాల నుండి గ్రహించినవి. ప్రపంచ సాహిత్యం ప్రాతిపదికగా ఎంపిక చేసిన వ్యాసాలు కాబట్టి ఈ రచనలో భారతీయ సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు లేవు. మొదటి పుస్తకం కావడంతో- బాగున్నాయి అనిపించిన కొన్ని వ్యాసాల్ని ఎంపిక చేశామే కానీ ఒక క్రమం అంటూ ప్రత్యేకంగా ఏమీ పాటించలేదు. ‘కాగ్నిటివ్‌ రీడింగ్‌’ను ఇష్టపడే పాఠకురాలిని కాబట్టి సహజంగానే ఇందులోని వ్యాసాలు తర్కం, హేతుబద్ధతకు పనిపెడతాయి. ఈ కారణంగా మరీ పాఠం చెప్పినట్లు ఉండకుండానూ, అదే సమయంలో పాఠకుల మెదడు మీద వత్తిడి లేకుండానూ మధ్య మధ్యలో ఒక సరళమైన వాస్తవిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసం, వెనువెంటనే ఒక చిక్కనైన తర్కానికి సంబం ధించిన వ్యాసం వచ్చే పద్ధతిలో ఇందులోని వ్యాసాల్ని పొందుపరిచాము.

3. ప్రపంచ సాహిత్య విమర్శకి, తెలుగు సాహిత్య విమర్శకి మధ్య మీరు గ్రహించిన అంతరాలు?

సహజంగానే ప్రపంచ సాహిత్యం కాన్వాసు చాలా పెద్దది. నేను గమనించినంతలో తెలుగు సాహిత్య విమర్శలో భాషా సౌందర్యాలకు, పద గాంభీర్యాలకూ పెద్దపీట వేస్తారు. తెలుగు సాహిత్యంలో భాష, వ్యాకరణాల విషయంలో తీసుకునే శ్రద్ధ భావం విషయంలో కనబడదు. అదే సమయంలో ఇతర భారతీయ భాషల సాహిత్యంలో సైతం రచనలో సాంస్కృతిక అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగులో బహు అరుదుగా కనిపిస్తుంది. కథల్లోని పాత్రలను అన్ని అస్తిత్వ చిహ్నాలకూ దూరంగా మొండి గోడల్లా నిలబెట్టే ప్రయత్నం తెలుగు సాహిత్యంలో ఈ మధ్య అధికంగా కనబడుతోంది. మంచో, చెడో- మనిషికున్న చరిత్రను, సంస్కృతినీ, అన్ని అస్తిత్వ చిహ్నాలనూ సమూలంగా తుడిచేశాక ఇక చెప్పుకోడానికి మనకి కథలేం మిగులుతాయి! విమర్శకైనా ఆస్కారం ఏముంటుంది! ఇటువంటి రచనల మీద విమర్శ చెయ్యాలంటే భాష మీద పట్టు ఉంటే సరిపోతుంది. విమర్శకు వారికి ఇతరత్రా అర్హతలు ఏమీ ఉండవలసిన అవసరం లేదు. ఏదేమైనా మినహా యింపులు ఇక్కడ కూడా ఉన్నాయి. సింహభాగం తెలుగు సాహిత్యం గురించి మాత్రమే చెబుతున్నాను. అందువల్ల లోతులేని ఈ కాలపు సాహిత్యానికి తగ్గట్టే విమర్శ కూడా బలహీనంగానే ఉంటోంది. విమ ర్శకులు కూడా రచనల్లో ఏం చెప్పాలనుకున్నారు అన్నదాని కంటే భాషా ప్రావీణ్యం పైన మాత్రమే ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు అనిపిస్తుంది. రచనల్లో భాష, భావం విషయంలో ఇక్కడ సమతూకం శూన్యం.

4. మీ విమర్శని నడిపే చూపు గురించి చెప్పండి?

నావన్నీ పఠనానుభవాలే, విమర్శ అనుకోను. దానికి నేను ఎంచుకునే పుస్తకాలు కూడా కొంత కారణం. సద్విమర్శకు మరికొన్ని అదనపు అర్హతలు అవసరమవుతాయి. ఉదాహరణకు నేను ఏదైనా రచన చదువు తున్నప్పుడు నా దృష్టి రచయిత చెప్పాలనుకుంటున్న దేమిటో వినాలనే కుతూహలం దగ్గరే ఆగిపోతుంది. రచనలో శైలీ, శిల్పం వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ చదివే అలవాటు నాకు లేదు. చదువుతున్నప్పుడు ఆ రచన నన్ను ఆలోచింపజేసిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. మేధ విషయంలో విమర్శకులు రచయిత కంటే పై స్థాయిలో ఉండాలి. నేను చదివే రచయితల వద్ద నేనిప్పటికీ విద్యార్థినే.

5. వ్యాస నిర్మాణానికి భాషా పరంగా ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు?

బాల్యంలో మూడు భాషలు సమాంతరంగా మాట్లాడే వాతావరణం నుండి వచ్చినదాన్నిగా నా భాషలో యాసతోబాటు కొన్ని సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు కూడా సహజంగానే వచ్చి చేరాయి. మా ముందు తరం వాళ్ళకు భిన్నంగా మా తరం వాడుక భాషలో అచ్చ తెలుగు అరుదుగానే కనిపిస్తుంది. వాడుక భాషలోనూ, రాయడంలోనూ కూడా విరివిగా ఆంగ్లపదాల వాడకం మా తరంలో చాలా సహజం. పదేళ్ళ క్రితం నా భాషలో ఆంగ్ల, హిందీ పదాలు అనేకం దొర్లేవి. కానీ తెలుగులో తరచూ రాయడం వల్ల క్రమేపీ ఆ అలవాటు తగ్గింది. ఇప్పుడా సమస్య లేదు. అనవసర వర్ణనలకు దూరంగా నా వ్యాసాల్లో సరళమైన భాషకు ప్రాముఖ్యతనిస్తాను.

ఇంటర్వ్యూ : కె.ఎన్‌. మల్లీశ్వరి

ప్రచురణ : ఆంధ్రజ్యోతి "పలకరింపు" - 28 ఆగస్ట్ 2023

https://www.andhrajyothy.com/2023/editorial/all-i-have-is-reading-experience-i-dont-think-of-criticism-1129015.html

Friday, July 21, 2023

ఆర్వెల్ జోస్యం నిజమవుతోంది!

బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ రచన "1984" పేరు వినగానే చాలామందికి  వెనువెంటనే గుర్తొచ్చేది అందులో ఆయన సృష్టించిన 'న్యూ స్పీక్' అనే పదమే. డిస్టోపియన్ సమాజాల్లో భాషను ఒక సమర్ధవంతమైన ఆయుధంగా వాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్వెల్ ముందుగానే హెచ్చరించారు. ఆర్వెల్ సృష్టించిన ప్రపంచంలోని ఫాసిస్టు ప్రభుత్వం ప్రజలను ఏమార్చడానికీ, భ్రమలో ఉంచడానికీ వాడే ప్రత్యేకమైన భాషే 'న్యూ స్పీక్'.  ఉదాహరణకు ఆర్వెల్ కథలోని ప్రభుత్వం "క్రైమ్ థింక్" (స్వంతంగా ఆలోచించే తప్పు చెయ్యడం), "గుడ్ థింక్" (సంప్రదాయ ఆలోచనలు మాత్రమే చెయ్యడం) లాంటి కొత్త పదాల్ని తమ అజెండాలకు అనుకూలంగా సృష్టిస్తుంది. ఆ కాలంలోనే సాహిత్యంలో దీన్నొక గొప్ప ప్రయోగంగా చూడవచ్చు. నిరంకుశ పరిపాలనలో భాష ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో, ప్రజల్ని మోసపుచ్చే దిశగా దాన్ని ఆయుధంగా ఎలా వాడతారో వర్ణిస్తూ సంస్కృతిలో భాష యొక్క ప్రాథాన్యత అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదని 'న్యూ స్పీక్' ద్వారా మరోసారి గుర్తుచేస్తారు ఆర్వెల్. భవిష్యత్తులో భాషను ఆయుధంగా వాడడం రాజకీయ, సామాజికాంశాల విషయంలోనే కాకుండా సాహితీరంగానికి కూడా పెనుప్రమాదంగా పరిణమిస్తుందని ఆర్వెల్ లాంటి వాళ్ళు బహుశా ముందే ఊహించి ఉండవచ్చు.

రచయితగా తాను నమ్మిన విలువలకు ఆర్వెల్ ఎంతగా కట్టుబడి ఉండేవారో తెలియాలంటే ఒక చిన్న సందర్భాన్ని గురించి చెప్పుకోవాలి. ఆర్వెల్ ఒక రచయితగా రచన కూర్పుపై ఎంత శ్రద్ధ పెట్టేవారో దాని సంపాదకీయం  విషయంలో కూడా అంతే పట్టుదలగా ఉండేవారట. తన స్వంత నవలలను ఎడిట్ చెయ్యడం పట్ల ఆర్వెల్ వైఖరి దీనికి ఒక మంచి ఉదాహరణ. బ్రిటిష్ ప్రచురణ సంస్థ అధినేత Victor Gollancz తన రచనల్లో వేలుపెట్టడమే "A Clergyman’s Daughter" and "Keep the Aspidistra Flying" అనే రెండు నవలలు పాడైపోవడానికి కారణమని అంటారు ఆర్వెల్. తన రచనల్లో ఇతరుల ప్రమేయం పట్ల ఆర్వెల్ ఎంత మొండి వైఖరితో కూడిన విముఖత కనబర్చేవారంటే, చివరకు "అమెరికన్ బుక్ ఆఫ్ ది మంత్ క్లబ్" వారు "1984" ని ప్రచురించడానికి ‘The Principles of Newspeak’ appendix and the lengthy essay on Oligarchical Collectivism' ని పుస్తకంలోంచి తీసేస్తే తప్ప కుదరదంటే, ఆ ప్రతిపాదనని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ క్రమంలో ఆయన కోల్పోయినదెంతో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అక్షరాలా ఆ కాలంలో నలభై వేల పౌండ్ల అమెరికన్ సేల్స్. ఆయన తన ఏజెంట్ తో "పెద్ద పెద్ద ముక్కలు అక్కడక్కడా కోసుకుంటూపోతే నవల స్ట్రక్చర్ (నిర్మాణం) దెబ్బతింటుంది కాబట్టి కుదరదని అన్నారట. "ఆర్టిస్టిక్ ఇంటెగ్రిటీకి" ఇదొక మచ్చుతునక. ఏదేమైనా అది ఆర్వెల్ జీవించి ఉన్న సమయం కాబట్టి ఆయన తన రచనను సంపాదకీయాల నుండి కాపాడుకోగలిగారు. మరి ప్రస్తుతం జీవించిలేని రచయితలకు తమ కళను కాపాడుకునే అవకాశం ఉందా ? 

తరాలు మారుతున్నా, అప్పుడూ ఇప్పుడూ కూడా పాలనా వ్యవస్థకు ప్రతిబంధకాలుగా, ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్న సాహిత్యాన్ని బహిష్కరించడం పరిపాటే. నేడు అందరికీ సుపరిచితమైన క్లాసిక్స్ లో To Kill a Mockingbird (Harper Lee), The Handmaid’s Tale (Margaret Atwood), Of Mice and Men (John Steinbeck), Brave New World (Aldous Huxley), The Catcher in the Rye (J.D.Salinger) వంటివన్నీ ఒకప్పుడు బ్యాన్ చేసిన పుస్తకాలే. ఈ జాబితా చెప్పుకుంటూ వెళ్తే బహిష్కరణకు గురైన పుస్తకాలు కోకొల్లలు. కానీ నేడు అదే  బహిష్కరణ అందరికీ ఆమోదయోగ్యంగా (?) ఆధునికమైన రూపుదాలుస్తోంది.  టెక్స్ట్ ను అర్థం చేసుకోడానికి ఫ్రెంచ్ తత్వవేత్త జాక్వెస్ డెఱిడా ప్రతిపాదించిన "డీకన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్" ను పాఠకుల బదులుగా సంపాదకులు వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాహిత్యంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులకనుగుణంగానూ, అనుకూలంగానూ  లేని ప్రతీ పదాన్నీ మరో ఆలోచన లేకుండా తీసివెయ్యడం, దాని స్థానాన్ని తమకనుకూలమైన పదాలతో భర్తీ చెయ్యడం జరుగుతోంది.

ఈ పునఃనిర్మాణానికి అంకురార్పణగా మూలాలను పెకలిస్తూ ఈ మార్పులు బాలసాహిత్యంతో మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పఫిన్ బుక్స్ వారు బ్రిటిష్ రచయిత రోల్ డాల్ పుస్తకాలపై సెన్సార్షిప్ వేటు వేశారు. సాహితీవేత్తగా ఆయన లెగసీలో భాగమైన "చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ", "మెటిల్డా" వంటి రచనల్లో ఫాట్, అగ్లీ , మ్యాడ్ వంటి పదాలు సున్నితత్వానికి సుదూరంగా బాడీ షేమింగ్ ని ప్రోత్సహిస్తూ, అవమానకరంగానూ, వివక్షలకు దారితీసేవిగానూ ఉన్నాయనేది వారి వాదన. ఇదిలా ఉండగా రోల్ డాల్ తో బాటు బాలసాహిత్యంలో దిగ్గజాలైన ఎనిడ్ బ్లైటన్, డాక్టర్ సూస్, రుడ్యార్డ్ కిప్లింగ్ ల రచనలు సైతం జాతి వివక్షలనూ, లింగవివక్షలనూ ప్రోత్సహించే భావజాలాల్నీ, భాషనూ కలిగి ఉన్నాయని సెన్సార్షిప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అగాథా క్రిస్టీ రచనలపై కూడా ఇటువంటి ఆరోపణలే  వచ్చిన నేపథ్యంలో ఆమె మునిమనుమడు పత్రికాముఖంగా "క్రిస్టీకి ఎవరినీ అఫెండ్ ఉద్దేశ్యం లేదని" అన్నారట. భవిష్యత్తులో వీరందరి రచనల్లో ఉపయోగించిన పదాలనూ, భాషనూ మార్చి సమూలమైన మార్పులు చెయ్యాలనే ప్రతిపాదనలు వినబడుతున్నాయి.

ఈ చర్యలు సల్మాన్ రష్దీ, జూడీ బ్లూమ్ వంటి పలువురు సాహితీవేత్తల ఘాటు విమర్శలను ఎదుర్కొంటున్నాయి. బంగ్లాదేశ్, ఇరాక్, ఇజ్రాయెల్ వంటి వెనుకబడిన దేశాలే కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి  అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇటువంటి చర్యలు భవిష్యత్తులో కళాకారుడి స్వేచ్ఛకు పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. అకడమిక్ పుస్తకాల్లో సవరణలు చేసినట్లే సాహిత్యాన్ని కూడా నేటి సామజిక చట్రాల్లో ఇమిడ్చే యత్నాలు ఎటువంటి జీవ వైవిధ్యాన్నీ సహించలేని ప్రస్తుత సమాజపు అసహనానికి పరాకాష్ట. అందునా రచయితలు జీవించిలేని సమయంలో వారి రచనల్లో ఈ కాలానికి అనుగుణంగా మార్పులు చెయ్యడం వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి, వారి ప్రైవసీకి భంగం కలిగించడమే. పరిశీలిస్తే ఇది సమస్యలో ఒక పార్శ్వం మాత్రమే.

విజేతలు నిజాన్ని తమకనుగుణంగా వక్రీకరించే అవకాశం పుష్కలంగా ఉన్న చరిత్రలోని ప్రామాణికత ఎప్పటికీ అనుమానాస్పదమే. తులనాత్మకంగా చూస్తే, దీనికి భిన్నంగా ప్రతీ మనిషి యొక్క వ్యక్తిగత అనుభవాలకూ గళాన్నిచ్చే సాహిత్యంలో ఆ అవకాశం కాస్త తక్కువని చెప్పచ్చు. కళను కళాకారుడి యొక్క "స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన వ్యక్తీకరణగా" భావిస్తే ప్రతీ కళాకారుడి కళలోనూ ఆ కాలమాన పరిస్థితులకనుగుణంగా ఆ వ్యక్తి యొక్క అస్తిత్వంతో ముడిపడి ఉన్న పలు సాంస్కృతిక, రాజకీయ, సామాజికాంశాలు అనేకం కనిపిస్తాయి. ఈ కారణంగా ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ కాలపు సంస్కృతిని ప్రతిబింబించే జీవన విధానాలూ, వేష భాషలూ, వివక్షలూ మొదలైనవి అనేకం గమనిస్తాం. నిజానికి సాహిత్యం యొక్క పరమావధి అదే కదా ! ప్రపంచంలో ఏ మారుమూలో, మరో కాలంలో జన్మించిన మనిషిలో పరకాయ ప్రవేశం చేసి అతడి కళ్ళతో ఆనాటి ప్రపంచాన్ని పరికించడం.

ఈ తరం పాఠకులకూ, సంస్కృతికీ అనుకూలంగా ప్రాచీన సాహిత్యంలో  భాషాపరమైన మార్పులు చెయ్యడంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మొదటిది ఈ చర్య ద్వారా మరణించిన కళాకారుణ్ణి అగౌరవపరచడమైతే రెండోది ఆ రచయిత అస్తిత్వాన్ని చెరిపేసే లేదా మార్చేసే ప్రయత్నానికి పూనుకోవడం. మంచో,చెడో ఏ కాలపు రచయితల భావజాలాలకైనా ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలనుబట్టి సందర్భానుసారంగా ఒక చారిత్రక నేపథ్యం అంటూ ఉండి తీరుతుంది. సంపాదకుడు తనకు నచ్చని పదాలనన్నిటినీ  ఎఱ్ఱని ఇంకుతో యథేచ్ఛగా కొట్టేసుకుంటూ పోతే ఇక ఆ రచనలో ఏ విధమైన ప్రామాణికతా మిగిలుండే అవకాశం లేదు. అంతేకాకుండా ఒక రచనను పునఃవిశ్లేషించే సంపాదకుల వ్యక్తిగత భావజాలాలు కూడా రచనపై ప్రభావం చూపిస్తాయనేది విస్మరించలేని విషయం. సాహిత్యంలో "బైగోటెడ్ వ్యూస్", "బైగోటెడ్ లాంగ్వేజ్" పేరిట ఆ కాలంలోని మతవిశ్వాసాలనూ, మూఢ భావజాలాలనూ, వివక్షలనూ ఈ కాలానికి తగ్గట్టు చెరుపుకుంటూనో, మార్చుకుంటూనో పోతే ఆ కాలపు సంస్కృతీ సంప్రదాయాలూ, వేషభాషలూ, వివక్షల గురించి ఈ తరానికి తెలిసే అవకాశం మృగ్యమైపోతుంది. ఇది మనిషి కులమత జాతి వివక్షలను ఎన్నిటిని దాటుకుని ఈరోజు నాగరికమైన మనిషిగా నిలబడ్డాడో తెలిసే అవకాశం మన ముందు తరాలకు లేకుండా చెయ్యడమే.

ఆర్వెల్ 'The Prevention of Literature' అనే వ్యాసంలో భవిష్యత్తులో వ్యక్తిగత అనుభవాలూ, భావోద్వేగాలూ, నిజాయితీతో కూడిన పరిశీలనలూ లేని డొల్లతనంతో కూడిన కొత్త రకం సాహిత్యం పుడుతుందనీ, లిబరల్ సంస్కృతి అంతరించడంతో పాటే సాహిత్యం కూడా తుది శ్వాస విడుస్తుందని జోస్యం చెప్పడం సమకాలీన సాహితీ ప్రపంచపు విలువల్ని పరిగణనలోకి తీసుకుంటే నిజమేననిపిస్తుంది. ఆ నిరంకుశత్వం నీడల్లో మెటాఫోర్ల ముసుగుల్ని ఆసరా చేసుకుని కవిత్వం కొంతవరకూ నిలదొక్కుకోగలుగుతుందేమో గానీ హేతువాదం పునాదుల మీద నిలబడే వచన రచన మాత్రం అంతరించిపోతుందంటారాయన. నిరంకుశ సంస్కృతిలో వచన రచన చేసే రచయితకి అయితే నిశ్శబ్దమూ లేదా మృత్యువూ తప్ప మధ్యే మార్గం లేదని ఘంటాపథంగా చెప్పిన ఆర్వెల్ జోస్యాన్ని జీవించిలేని రచయితల యొక్క రచనల రూపంలో మిగిలిన అస్తిత్వాన్ని సమాధుల్లోంచి తవ్వితీసి మరీ పోస్ట్మార్టం చేస్తున్న నేటి ప్రచురణ సంస్థలూ, సంపాదకీయాలూ నిజమేనని నిరూపిస్తున్నాయి.

తొలి ప్రచురణ : ఆంధ్రజ్యోతి 'వివిధ' : 17 జులై 2023

https://www.andhrajyothy.com/2023/editorial/orwells-prophecy-is-coming-true-1104593.html?fbclid=IwAR0qh_-4gDhI7xP-a85PGB3k7npmpAeBj0L9S5CkB7RSvK_2xiPChwfJiZc

Tuesday, May 16, 2023

Checkout 19 - Claire-Louise Bennett

గత ఏడాది చివర్లో న్యూ యార్క్ టైమ్స్ బుక్ రివ్యూ వారు 2022 లో ప్రచురితమైన పుస్తకాలలో చదవవలసిన పది పుస్తకాలంటూ ఒక చిన్న లిస్టును విడుదల చేస్తూ అందులో బ్రిటిష్ రచయిత్రి క్లైర్ లూయీస్ బెన్నెట్ రచన "చెక్ ఔట్ 19" పేరును కూడా ప్రస్తావించారు. సహజంగానే అంతఃప్రపంచానికి సంబంధించిన (సెరెబ్రల్ స్టఫ్) పుస్తకాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న నాకు రాయడం, చదవడం అనే రెండు అంశాల చుట్టూ తిరిగే ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రత్యేకం కథంటూ ఏమీ లేని ఈ రచనలో కథానాయకురాలు బాల్యం నుండీ పుస్తకాల్లోని కాల్పనిక ప్రపంచాలూ, వ్యక్తులూ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చెప్పుకొస్తూ, వాటితో ముడిపడిన అనేక అనుభవాలను పాఠకులతో పంచుకుంటారు. ఇక "చెక్ ఔట్ 19" అనేది ఆమె పనిచేసే డిపార్ట్మెంటల్ స్టోర్ లో కౌంటర్ నెంబర్ అని తప్ప ఈ పుస్తకంలో కథాంశానికీ, టైటిల్ కీ ఏమీ సంబంధం ఉండదు.

Image Courtesy Google

అంతఃప్రపంచాన్ని సుసంపన్నం చేస్తూ కాల్పనిక ప్రపంచాలూ, కల్పిత పాత్రలూ పాఠకుల జీవితాన్ని ఎలా ఉత్తేజంతో నింపుతాయో తెలియాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ముఖ్యంగా బాల్యంనుండీ పుస్తకపఠనం జీవితంలో భాగమైనవాళ్ళు, ఆంగ్ల సాహిత్యంతో బాగా పరిచయమున్నవారూ ఈ రచనతో అడుగడుగునా తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. మునుపు సుసాన్ సొంటాగ్ ను చదివినప్పుడు నాకు ఆవిడ ద్వారా పరిచయమైన రచయితలెంతమందో ! అప్పటికి మచాడో డి ఆసిస్, ఎలియాస్ కానెట్టి, వాల్టర్ బెంజమిన్ లాంటి వాళ్ళ పేర్లు పలుసార్లు విని ఉన్నప్పటికీ, వారి రచనల గురించీ, శైలి గురించీ సుసాన్ రాసిన వ్యాసాల కారణంగానే వారిని చదవాలనే ఆసక్తి కలిగింది. మళ్ళీ ఇంతకాలానికి బెన్నెట్ ను చదువుతుంటే నాకు సుసాన్ లాంటి మరో "బుక్ వోర్మ్ ఫ్రెండ్" తారసపడినట్లనిపించింది.

ఈ రచనను కథ చదివినట్లు ఒక్కసారిగా చదివిప్రక్కన పెట్టడం వీలుపడదు. ఇందులో పేజీల నిండా పఠనానుభావాలూ, పాఠకులకు పరిచయం లేని కొంతమంది రచయితలూ, రచనల ప్రస్తావనలు ఉండడం వల్ల ఆ రిఫరెన్సులు పట్టుకుని ఆయా రచనల్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ, వారి పేర్లు నోట్ చేసుకుంటూ మెల్లగా చదివాను. మున్ముందు కాలంలో చదవడానికి బెన్నెట్ వల్ల కొంతమంది కొత్త రచయితలు కూడా పరిచయమయ్యారు. ఎటొచ్చీ బెన్నెట్ విశ్లేషణలు సుసాన్ రచనలంత ఇంటెక్చువల్ గా ఉండవు. సరళంగా ఉండే ఆమె విశ్లేషణల వల్ల ఒక సాధారణ పాఠకుడు సైతం ఆమె లోతైన పఠనానుభవాల్లో తనను తాను చూసుకోగలుగుతాడు. ఇక ఈ రచయిత్రి వచనానికో ప్రత్యేకత ఉంది. కొన్ని వాక్యాలు చదివి ఇది బెన్నెట్ వచనమని ఇట్టే చెప్పెయ్యొచ్చు. మళ్ళీ మళ్ళీ పునరావృతమయ్యే వాక్యాలతో కూడిన క్లైర్ లూయిస్ బెన్నెట్ వచనం అమెరికన్ రచయిత్రి గెర్ట్రూడ్ స్టైన్ ప్రోజ్ ని తలపిస్తుంది. ఈ పుస్తకమంతా గొలుసుకట్టులా ఇటువంటి వాక్యాలే కనిపిస్తాయి. ఈ తరహా వచనం అరుదుగా చూస్తాం.

ఉదాహరణకి ఈ ప్రారంభ వాక్యాలను చూడండి : 

Later on we often had a book with us. Later on. When we were a bit bigger at last though still nowhere near as big as the rest of them we brought over books with us. Oh loads of books. And sat with them there in the grass by the tree. Just one book, in fact. Just one, that’s right. Lots of books, one at a time. That’s it, one at a time.

No wonder at all that we are itching to turn it over. No wonder whatsoever that we anticipate turning the page so very fervidly. As if it were a matter of life or death in fact. Life or death. Life or death. It is a matter of life or death in fact. Yes. Yes. Yes, it is. Turning the pages. Turning the pages. When we turn the page we are born again. Living and dying and living and dying and living and dying. Again, and again. And really that’s the way it ought to be. The way that reading ought to be done. Yes. Yes. Turning the pages. Turning the pages. With one’s entire life.

ఇందులో బెన్నెట్ ఫిక్షన్ చదవడం గురించే కాకుండా ఒక రచయిత్రిగా కూడా తన అనుభవాల గురించి రాసుకొస్తారు. ఈ కథలో రీడింగ్ మరియూ రైటింగ్ లైఫ్ గురించి చిన్న చిన్న కథలుగా అమలిపోయిన ఆమె చెప్పిన అనేక పిట్ట కథలుంటాయి. ఒక కథలో ఆమె సృష్టించిన కథానాయకుడు Tarquin Superbus కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని తన ధనమంతా ధారపోసి ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపిస్తాడు. కానీ తీరా లైబ్రరీలో పుస్తకాలన్నీ కొని అమర్చాకా విచిత్రంగా వాటిల్లో పేజీలన్నీ ఒక్క అక్షరం కూడా లేని ఖాళీ కాగితాలని గమనించి నిరాశ చెందుతాడు. Tarquin కి నమ్మకస్తుడైన ఒక వ్యక్తి, మొత్తం లైబ్రరీలో పదాలున్న ఒకే ఒక్క పేజీ ఉందనీ, ఆ పేజీలో ఉన్న ఒకే ఒక్క వాక్యంలో మనం తెలుసుకోవలసిన సమస్తమూ నిక్షిప్తమై ఉంది గాన, ఆ పేజీ కనుగొన్నట్లైతే అతడు పూర్తి జ్ఞానసంపన్నుడవుతాడనీ, ఆ అనుభవం అతడికి మాత్రమే సొంతమనీ అంటాడు. ఈ కథ చెప్పడం ద్వారా రచయిత్రి అక్షరానికి ఉన్న శక్తిపైనా, చదవడం అనేది వ్యక్తిత్వ నిర్మాణంలో పోషించే పాత్రపైనా ఏకకాలంలో దృష్టిసారించారనిపిస్తుంది.

ఇక మనం లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం గురించి బెన్నెట్ రాసిన  విషయాలు సరదాగా ఉంటాయి, 

"మనకి టన్నుల కొద్దీ పుస్తకాల అవసరం లేదు. మనకొక్క పుస్తకం చాలు. మనకు అప్పుడో పుస్తకం, ఇప్పుడో పుస్తకం ఉంటే చాలు. కానీ మనం లైబ్రరీకెళ్ళినప్పుడల్లా ఆతృతగా ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు తీసేసుకుంటాం. సర్వసాధారణంగా ఎనిమిది పుస్తకాల వరకూ తీసుకుంటాం. చాలాసార్లు అయితే ఆరూ లేదా ఎనిమిదీ లేదా పన్నెండు పుస్తకాలు తీసుకుంటాం. మన అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎంపికచేసి తీసుకున్నవైతే సహజంగా నాలుగు వరకూ తీసుకుంటాం. పోనీ ఆ పుస్తకం తీసుకుందాం. ఈ పుస్తకం కూడా తీసుకుందాం. అయితే అయ్యింది, అదీ ఇదీ కూడా తీసుకుందాం అనుకుంటాం. పుస్తకాల ఎంపిక విషయంలో ఆదీ అంతం లేని డైలమా ఇది. పుస్తకాల షాపుల్లోనూ,లైబ్రరీల్లోనూ ఈ తతంగం అలా అంతులేని కథలా నడుస్తూనే ఉంటుంది. పోనీ ఇంటికి తీసుకెళ్ళిన పుస్తకాలన్నీ చదువుతామా అంటే, ఉహూ, సాధ్యం కాదు. మన చేతిలో ఎంత మంచి పుస్తకమున్నా మనదగ్గర లేని మరో పుస్తకంలో కొత్త కాల్పనిక ప్రపంచాలకు దారులు వేసే కొత్త కొత్త పదాలేవుండుంటాయా అని అన్యమనస్కంగా కుతూహలపడుతూనే ఉంటాం, అటువంటి ఆలోచనల నుండి తప్పించుకోవడం దాదాపూ అసంభవం."

We couldn’t help it could we. We just couldn’t stop ourself from thinking about the other books and the different kinds of words they each contained and when we picked up one of the other books in order to find out it was just the same. It really was just the same no matter which book we picked up. As long as there were other books we thought about the sorts of words they might contain nonstop and were thus precluded from becoming engrossed with the very book we had in our hands. The very book. A silly business. Yes, it was a silly business. Tossing one book down and picking one book up and tossing that to one side and picking up yet another and so on and getting nowhere. Nowhere at all. Over and over again.

ఇందులో ప్రొటొగోనిస్ట్ సహచరుడు డేల్ ఆలోచనల్లో వివక్షతో కూడిన  ఛాయలు కనిపిస్తాయి. "ఇంటెలెక్చువల్ రెల్మ్" స్త్రీలకు కాదనీ, అది కేవలం మగవారికోసమే ఉద్దేశింపబడిందనే భావనను సమర్ధించేవిగా ఉంటాయి. ఈ క్రింది వాక్యాలు చదివి ముందు "వాట్ ద రబ్బిష్" అనుకున్నప్పటికీ చివర రెండు వాక్యాలూ చదివి మాత్రం నవ్వుకోకుండా ఉండలేకపోయాను. :) "అమ్యూజింగ్" ఐ సే... 

Dale wrote poetry and read poetry and had plenty of poetry books, including volumes by Anne Sexton and Sylvia Plath—which he made sure to keep out of my reach. Probably if I got my hands on them and read them all up something terrible would befall me or else something terrible but infinitesimal already woven into me would get notions and take over and what on earth then? Women can’t withstand poetry, seemed to be Dale’s view. Women are beautiful and tender creatures and poetry breaks them, of course it does. Poetry rips right through you, makes shit of you, and a man can be made shit of and go on living because no one really minds, not even the man.

సహజంగా సాహితీ విద్యార్థులు జ్ఞానం సంపాదించడానికో, పరీక్షలు రాసి  ఎక్కువ మార్కులు తెచ్చేసుకోడానికో సాహిత్యాన్ని చదవరు. నిరంతరం తాము జీవించి ఉన్నామన్న స్పృహ కలగడం కోసం చదువుతారు. రోటీ కపడా మకాన్ లాంటివాటిని దాటి జీవితం నుండి ఇంకేదో కావాలనే తపన తీర్చుకోడానికి చదువుతారు. వీళ్ళు పుస్తకాల్లోనే కాకుండా వాస్తవ జీవితంలో కూడా మెటఫోర్లని, చిహ్నాలనీ, సారూప్యతల్నీ, సంకేతాలనీ ఛేదించడంలో నిష్ణాతులు. కానీ కొన్నిసార్లు వీళ్ళు వాస్తవానికీ, సాహిత్యానికీ మధ్య పరిధులు గుర్తించలేక పొరబడుతుంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ విషయం తమకేదో సంకేతాలిస్తోందని భ్రమపడతారు, మన అల్పమైన అస్తిత్వం గురించో, అపరిపక్వమైన మన వ్యక్తిత్వాల గురించో, అన్నిటినీ మించి మున్ముందు ఏం జరగబోతుందో అన్న విషయం గురించో. What was to come? What was to come? We wanted to know, we wanted to know what lay ahead of us very very much, it was all we could think about and it was so unclear—yet at the same time it was all too clear.

ఈ మధ్య చదివిన సమకాలీన సాహిత్యానికి చెందిన రచనల్లో "చెక్ ఔట్ 19" నాకు మంచి పఠనానుభవాన్ని మిగిల్చిన రచన. హ్యాపీ రీడింగ్. :)

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు :

That’s just the kind of uncomfortable scenario you’d find yourself in if you were popular, she knew that very well—she knew that popularity meant being trapped at every turn—no, it held no attraction at all and she was fed up of seeing how his popularity meant that they expected him to be fun every single time. What if he didn’t feel like it? Was he afraid of letting them down ?

You could get away with more on a Friday afternoon because no one was entirely there anyway.

The briefest love is also sometimes the longest love.

It was a nice bed. It was a nice bed. It was a nice room. The ceiling sloped and there were rafters. There was plenty of room. There was. It was spacious but cosy. We had plenty to read. Of course we did. We’d brought books over with us. And of course we acquired lots more very quickly. Everywhere we went people gave us books didn’t they. They did. They did. Everywhere we went. Very soon we had stacks of books. Stacks of them. We don’t much like stacks of books do we. No. No. Not really. We liked one book then and we like one book now. That’s right. We lay awake in bed all night long with one book on the duvet beside us. Wide awake. Yes. We couldn’t sleep could we. No, and our eyes were still ever so puffy. One book.

We could tell, had always known it—the encroaching inevitability of that life path had been a source of anxiety to us both since we were approximately eleven years old. We tried to keep that anxiety at bay with reading, with writing, with alcohol, with fantasies, with all the strength and imagination that those things gave us, and were on the lookout, always, for signs, proofs, indications, merest hints that we had promise, that we were special, that our lives would take a different turn.

I mostly read books by old white men such as Graham Greene and Edgar Allan Poe and Robert Louis Stevenson and that man who wrote Heart of Darkness, whose name escapes me. I hardly ever saw so much as a glimpse of myself in any of their books and I didn’t care to. I didn’t want to exist in books. I liked how the men talked to other men and I liked the places they went to. I liked being able to go with these men wherever they went and they went everywhere of course, all over the world, hardly ever really liking each other, so often paranoid, so often out on a street near the water last thing, or walking first thing down avenues churning with blossom, dying, dying weakly beneath a thin lapel, dying on the vine.

Drawing him kept him steady in the centre of her mind and brought him in closer, even closer, blotting everything else out. He wasn’t absent—she wasn’t remembering him—he was here—he was right here, moving through her mind, making it warm and luxuriant, and he could see of course all the many things she kept stored away in it, though only from an oblique angle—he couldn’t see all the way into those things in her mind which were all around him, not yet.

I’d come across a quote of hers (Anaïs Nin),that had really made me feel better: “We do not grow absolutely, chronologically. We grow sometimes in one dimension, and not in another; unevenly. We grow partially. We are relative. We are mature in one realm, childish in another. The past, present, and future mingle and pull us backward, forward, or fix us in the present. We are made up of layers, cells, constellations.”

You feel they wouldn’t exist without your seeing them. Like they wouldn’t exist without you. And isn’t the opposite true too—that the pages you read bring you to life? Turning the pages, turning the pages. Yes, that is how I have gone on living. Living and dying and living and dying, left page, right page, and on it goes. Sometimes all it takes is just one sentence. Just one sentence, and there you are, part of something that has been part of you since the beginning, whenever that might rightly be.

We’ve discovered haven’t we that something or other doesn’t have to belong to us in order for us to enjoy it. That’s right, it doesn’t matter does it, if whatever it is isn’t ours. An ostensibly permissive and uncommon attitude that got us into a lot of bother, once upon a time. Once. Yes. And only once.