Tuesday, August 17, 2021

On the Shortness of Life - Seneca

"He's a real nowhere man
Sitting in his nowhere land
Making all his nowhere plans for nobody
Doesn't have a point of view
Knows not where he's going to
Isn't he a bit like you and me?
Nowhere man please listen
You don't know what you're missing
Nowhere man, the world is at your command."

అంటూ జాన్ లెనన్ తాత్వికంగా రాసిన పాట రోమన్ తత్వవేత్త సెనెకా రచన 'On the Shortness of Life' చదువుతున్నప్పుడు పలుమార్లు గుర్తొచ్చింది. మనం నిత్యం మన ఆలోచనలు ఎటు తీసుకెళ్తే అటు పోతూ, చుక్కాని లేని నావలా గాలివాటుకి కొట్టుకుపోతూ ఉంటాం. ఒకవిధంగా మనిషి పుట్టిన నాటినుండీ మరణించే వరకూ తన ఆలోచనలకు కట్టు బానిసగా జీవిస్తాడు. తనను తాను జయించిన యోగికీ, సామాన్యుడికీ ఉన్న తేడా బహుశా ఇదొక్కటే కావచ్చు. చాలా సార్లు భౌతికంగా ఒకచోట ఉన్నా మనసు మాత్రం అనేక పరధ్యానాలతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. పసివాడిగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దైపోయి ప్రపంచాన్ని జయించేస్తానా అని తొందర,పెద్దయ్యాకా ఎప్పుడెప్పుడు ఆకాశహర్మ్యాలు కట్టేస్తానా,రిటైర్మెంట్ కి ఎంత పోగుచేసుకుంటానా అని తపన. స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీ రోజుల స్వేచ్ఛ కోసం, కాలేజీలో చదువుతున్నప్పుడు ఆర్ధిక స్వాతంత్య్రం కోసం ఇలా బహుశా అన్ని దశల్లోనూ మనిషి తానున్న చోటునుండి దూరంగా ఎడారిలో ఒయాసిస్ లా ఊరించే భవిష్యత్తును అందుకోవాలని పరిగెడుతూనే ఉంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ పరుగాపి అలసి సొలసి గమ్యం చేరగానే అతడి మనసులో తేనెతుట్టెను కదిపినట్లు అనేక ఆలోచనలు ముసురుకుంటాయి. 

"అసలెంత దూరం పరిగెత్తాను ! "

 "నా జీవిత కాలమంతా ఈ వ్యర్ధమైన పరుగుతోనే గడిచిపోయిందే !"

 "ఈ విరామ సమయంలో నేను చెయ్యాలనుకుని చెయ్యలేని పనులు అన్నీ చెయ్యడానికి నాకింకా ఎంత సమయం మిగిలుంది !"

 "నా జీవన ప్రమాణం మరికొంత పెరిగితే బావుణ్ణు, జీవితం ఎంత చిన్నది !!"

కానీ గడిచిపోయిన సమయం ఎప్పటికీ తిరిగిరాదు. అందుకే Living is the least important activity of the preoccupied man; yet there is nothing which is harder to learn. అంటారు సెనెకా.

Image Courtesy Google

బహు కొద్దిమంది మాత్రమే నిష్క్రమణను ఆగమనమంత హుందాగానూ తీసుకోగలరు. వాళ్ళకి మిగతావారికి భిన్నంగా జీవనప్రమాణం ఎక్కువేమీ ఉండదు, అందరికీ ఉండే 24 గంటలేగా వాళ్ళక్కూడా ఉంటాయి. కానీ వారి సమయాన్ని మిగతావారిలా  దుర్వినియోగపరుచుకోకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకు జీవితపు చరమాంకంలో పశ్చాత్తాపం లాంటి భావనలేవీ ఉండవు. ఎందుకంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఆదర్శవంతంగా జీవించడానికి అవసరమైన వివేకమో,కిటుకో వాళ్ళ దగ్గరేదో ఉంటుందేమో. ఈ పుస్తకంలో రోమన్ తత్వవేత్త సెనెకా తన అనుభవసారాన్నంతా రంగరించి అటువంటి కొన్ని కిటుకుల్ని చెబుతారు. 'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' లో భాగంగా ప్రచురించిన సెనెకా రచన 'On the Shortness of Life' జీవితపు తొలిదశల్లో అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం. 

కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం :

నువ్వు అమరుడిననుకుంటూ జీవిస్తున్నావు ; నీ ఉనికిలో అస్థిరత్వం నీకు తెలియదు సరికదా  ఎంత సమయం గడిచిపోయిందో నీకు కనీస స్పృహ కూడా లేదు, నీ వద్ద అపరిమితమైన సమయం ఉన్నట్లు దానిని వృధాగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు, అదే సమయంలో ఇదే చివరి రోజన్నట్లుగా నీ సమయాన్ని ఎవరో ఒకరికి ధారాదత్తం చేస్తున్నావు, లేదా ఏ ప్రాముఖ్యతా లేని అల్పమైన విషయాలపై పెడుతున్నావు. నీకు భయం కలిగించే విషయాల పట్ల నువ్వు మానవుడిలా వ్యవహరిస్తావు, నువ్వు కోరుకున్న విషయాల పట్ల మాత్రం అమరుడిననుకుంటావు.

పరధ్యానంతో ఉన్న మనిషి ఏ పని చెయ్యడానికీ  సంసిద్ధత కలిగి ఉండడు. మెదడు పరధ్యానాలతో నిండిపోయి ఉన్నప్పుడు దేనినీ లోతుగా గ్రహించలేదు సరికదా, దాని లోపల బలవంతంగా కూరిన ప్రతి విషయాన్నీ తిరస్కరిస్తుంది.

వివేకవంతుడు తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని అనవసరమైన విషయాలపై కేంద్రీకరించి దుర్వినియోగం చేసుకోకుండా పూర్తిగా తన కోసం తాను  వినియోగించుకుంటాడు. తన వద్దనున్న సమయం విలువ తెలిసి మసులుకుంటాడు కాబట్టి దాన్ని మారకానికి పెట్టడానికి తగిన విలువైనదేదీ అతడికి ఎప్పటికీ దొరకదు. పబ్లిక్ కి తమ జీవితాల్లోకి చొరబడడానికి వీలుగా ఎవరైతే ఎల్లప్పుడూ దారులు తెరచి ఉంచుతారో వాళ్ళ దగ్గరుండే సమయం చాలా తక్కువ.

తన సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణమైన జీవితం గడిపిన మనిషి జీవితం నుండి నువ్వేమీ తీసుకోలేవు. అతడి జీవితానికి నీకు చేతనైనంత కొత్తగా ఏదైనా కలపగలవు, అంత వరకే. నిజానికి కడుపునిండిన వాడికి నువ్వు పెట్టే పంచభక్ష్య పరమాన్నాలు అవసరం లేదు కానీ నీవిచ్చిన దాన్ని అతడు తప్పక గౌరవిస్తాడు. ఒక మనిషి తెల్ల జుట్టు, ముడుతలు చూసి ఎక్కువ కాలం జీవించాడని భ్రమపడరాదు. అతడు ఎక్కువ కాలం జీవించలేదు,అతడు ఎక్కువ కాలం ఈ భూమ్మీద ఉనికిలో ఉన్నాడు అంతే. 

మనుషులు ఏదైనా సహాయం చేసో, శ్రమను పెట్టుబడిగా పెట్టో పెన్షన్లూ,పారితోషికాలూ వంటివి ఆనందంగా పుచ్చుకుంటారు. కానీ వెనక్కు తిరిగిరాని విలువైన సమయాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇటువంటి వ్యక్తులు మృత్యువు తలుపు తట్టినప్పుడు మాత్రం నరకంలో పెద్ద పెద్ద శిక్షలేవో పడతాయని భయపడి కనిపించిన దేవుణ్ణల్లా ప్రార్ధిస్తారు,తమను ఎలాగైనా బ్రతికించమని వైద్యులను ప్రాథేయపడతారు. తమ ప్రాణాల్ని కాపాడుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తారు.

నిజానికి జీవితాన్ని ఎల్లప్పుడూ తాత్విక దృష్టితో చూసేవాళ్ళు  మాత్రమే జీవితాన్ని వాస్తవంగా జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ జీవితం పట్ల పూర్తి స్పృహతో ఉండడమే కాకుండా తత్వాన్ని చదవడం ద్వారా తమ ముందు తరాల తాత్వికతను కూడా తమ జీవితానికి అన్వయించుకుంటారు. 

"దైనందిన జీవితంలో ఒక్కోసారి ఎంతమాత్రం ప్రాముఖ్యత లేని విషయాలు నా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయనిపించినప్పుడు అలసినపోయిన మృగం గుహలో తలదాచుకున్నట్టు నా జీవితాన్ని నాలుగ్గోడల మధ్య పరిమితం చేసి కొంతకాలం విరామం తీసుకుంటాను." అంటారు సెనెకా.

‘Let no one rob me of a single day who is not going to make me an adequate return for such a loss. Let my mind be fixed on itself, cultivate itself, have no external interest – nothing that seeks the approval of another; let it cherish the tranquillity that has no part in public or private concerns.’ But when my mind is excited by reading a convincing account of something and spurred on by noble examples, I long to rush into the forum, to speak on behalf of one man and offer help to another, which will at least be an attempt to assist even if it does not succeed, or to curb the pride of someone else grown arrogant by success.

ఈ పుస్తకంలో రచనలు చెయ్యడం,చదవడం వంటి వాటి పారమార్థికతను గుర్తు చేస్తారు సెనెకా. రాయడం అనగానే ప్రచురణ కోసమో, మార్కెటింగ్ కోసమో, అదీ కాకపోతే కీర్తినార్జించడం కోసమో కాకుండా ప్రప్రథమంగా తన కోసం రాసుకోవాలంటారాయన. చదవడం విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. కేవలం జ్ఞాన ప్రదర్శన కోసం కాకుండా తన మానసిక వికాసాన్ని పెంపొందించుకోడానికి చదవడాన్నీ,రాయడాన్నీ సాధకాలుగా చేసుకోవాలంటారు. ప్రపంచంకోసం చేసే రచన తన సారాంశాన్ని పదగాంభీర్యాల మధ్యా, భాషా సౌందర్యాల మధ్యా ఎక్కడో కోల్పోతుందనేది ఆయన భావన.

In my studies I suppose it must indeed be better to keep my theme firmly in view and speak to this, while allowing the theme to suggest my words and so dictate the course of an unstudied style of speech. ‘Where is the need,’ I ask, ‘to compose something to last for ages? Why not stop trying to prevent posterity being silent about you? You were born to die, and a silent funeral is less bothersome. So if you must fill your time, write something in a simple style for your own use and not for publication: less toil is needed if you study only for the day.’ Again, when my mind is lifted up by the greatness of its thoughts, it becomes ambitious for words and longs to match its higher inspiration with its language, and so produces a style that conforms to the impressiveness of the subject matter. Then it is that I forget my rule and principle of restraint, and I am carried too far aloft by a voice no longer my own.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు :

Often a very old man has no other proof of his long life than his age.’

Even if others hold the front line and your lot has put you in the third rank, you must play the soldier there with your voice, your encouragement, your example and your spirit. Even if a man’s hands are cut off, he finds he can yet serve his side by standing firm and cheering them on. You should do something like that: if Fortune has removed you from a leading role in public life you should still stand firm and cheer others on, and if someone grips your throat, still stand firm and help though silent. The service of a good citizen is never useless: being heard and seen, he helps by his expression, a nod of his head, a stubborn silence, even his gait.

No man is despised by another unless he is first despised by himself. An abject and debased mind is susceptible to such insult; but if a man stirs himself to face the worst of disasters and defeats the evils which overwhelm others, then he wears those very sorrows like a sacred badge. For we are naturally disposed to admire more than anything else the man who shows fortitude in adversity.

Wednesday, August 11, 2021

Notes on Grief - Chimamanda Ngozi Adichie

కొన్నేళ్ళ క్రితం నైజీరియన్ అమెరికన్ రచయిత్రి చిమమంద న్గోజి అడిచే కథలు 'ది థింగ్ అరౌండ్ యువర్ నెక్' చదివాను,ఆ తరువాత మళ్ళీ ఆవిడ రచనలేవీ చదవలేదు. ఈ కోవిడ్ సమయంలో రాసిన 'నోట్స్ ఆన్ గ్రీఫ్' కనిపించగానే, చిరపరిచితమైన వ్యక్తి ఎవరో దారిలో ఎదురైనట్లు అనిపించింది. గుర్తుపట్టనట్లు తలప్రక్కకు తిప్పుకునో,తలొంచుకునో వెళ్ళిపోవడమో కంటే, ఒకసారి ఆగి యోగక్షేమాలడుగుతూ పలకరిస్తే పోతుందిగా అనిపించింది. అలా ఈ పుస్తకం చదవడం జరిగింది. శోకం అందమైన అనుభవం కాకపోయినా చాలా విలువైన అనుభవం. మన జీవితం కంటే మనం ప్రేమించినవారి మృత్యువు నేర్పించే జీవిత పాఠాలు వెలకట్టలేనివి. ఈ విషయంలో 'హాఫ్ ఆఫ్ ఎ ఎల్లో సన్' అనే పుస్తకంలో అడిచే రాసిన ఈ వాక్యాలు నాకెంతో అద్భుతంగా తోస్తాయి : “Grief was the celebration of love, those who could feel real grief were lucky to have loved.” 

Image Courtesy Google

'గ్రీఫ్' దీనికి సరైన తెలుగు పదం తట్టలేదు. శోకం,దుఖ్ఖము లాంటివి మనుషుల్ని కోల్పోవడాన్ని సూచించే ఖచ్చితమైన పదాలనిపించలేదు. ఈ రచనలో చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ రూపంలో అడిచే తన తండి మరణం తాలూకూ శోకాన్ని గురించి రాశారు. గ్రీఫ్ ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హేండిల్ చేస్తారు. కొందరు తనివితీరా బయటకి ఏడుస్తారు, కొందరు మనసులోనే బాధను దిగమింగుకుని మౌనాన్ని ఆశ్రయిస్తారు, కొందరు శోకాన్ని ఆగ్రహం రూపంలో వ్యక్తం చేస్తారు, కొందరు తమ బాధ్యతల్లో ఊపిరిసలపనంతగా మునిగిపోయి శోకాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు, కొందరు 'ఫేక్ ఇట్ అన్టిల్ యూ మేక్ ఇట్' అనుకుంటూ నలుగురితో కలిసిపోయి నవ్వుతూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. ప్రేమల్లో రకాలున్నట్లే శోకాన్ని వ్యక్తం చెయ్యడంలో కూడా చాలా రకాలుంటాయి. మనలా కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీళ్ళు రావడడం లేదనీ, బయటకి ఏడుస్తూ రూఫ్ టాప్స్ మీదకెక్కి గగ్గోలుపెట్టడం లేదనీ మనిషికి శోకం లేదనుకోవడం మూర్ఖత్వం. అడిచే అంటారు, Grief is a cruel kind of education. You learn how ungentle mourning can be, how full of anger. You learn how glib condolences can feel. You learn how much grief is about language, the failure of language and the grasping for language. అందుకే ఎవరైనా మర్యాదపూర్వకంగా 'ఐ కెన్ అండర్స్టాండ్' అంటే నవ్వొస్తుంది. ఎందుకంటే 'నో,యూ డోంట్'.

కొందరు శోకాన్ని వ్యక్తపరచడానికి చాలా విచిత్రమైన మార్గాన్ని ఎన్నుకోవడం కూడా నాకు తెలుసు. అదేమిటో తెలుసా, వాళ్ళెప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వు వారి మానసిక బలానికి గుర్తు. విధిని సూటిగా కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ 'నన్నేం చెయ్యగలవు నువ్వు? ' అని ప్రశ్నించే తిరస్కారం. జీవితం విలువ తెలిసి ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళని చూసి అసూయ పడేవారికి ఆ చిరునవ్వు వెనుక ఉండే బలమైన వ్యక్తిత్వం గురించి తెలిసే అవకాశం లేదు.
Another revelation: how much laughter is a part of grief. Laughter is tightly braided into our family argot, and now we laugh remembering my father, but somewhere in the background there is a haze of disbelief. The laughter trails off. The laughter becomes tears and becomes sadness and becomes rage. I am unprepared for my wretched, roaring rage. In the face of this inferno that is sorrow, I am callow and unformed. But how can it be that in the morning he is joking and talking, and at night he is gone forever?

ముఖ్యంగా తల్లినో, తండ్రినో కోల్పోవడం అంటే మన అస్తిత్వంలో కొంతభాగాన్ని కోసేసి తమతోపాటు తీసుకెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. తండ్రిని కోల్పోయిన దుఖ్ఖములో I am yanked away from the world I have known since childhood. అంటారు అడిచే.

ఇక నైజీరియాలో కూడా వైధవ్యం విషయంలో భారతీయ సాంప్రదాయలను పోలిన ఆచారాలు  ఉంటాయని తెలిసి విచిత్రంగా అనిపించింది. భర్త మరణిస్తే గుండు చేయించుకోవడం, కొంతకాలం సరళమైన ఆహారం తీసుకోవడం లాంటివి ఇప్పుడు కూడా అమలులో ఉన్నాయట. కానీ అడిచే తల్లి వాటిని మూఢత్వంగా కొట్టిపారెయ్యకుండా తన భర్త గౌరవార్థం తనకు తానుగా పాటిస్తానంటారు.

My mother says that some widows have come to tell her what the custom is. First, the widow will be shaved bald – and before she can continue, my brothers promptly say that this is ridiculous and not going to happen. I say that nobody ever shaves men bald when their wives die; nobody ever makes men eat plain food for days; nobody expects the bodies of men to wear the imprint of their loss. But my mother says she wants to do it all: ‘I’ll do everything that is done. I’ll do it for Daddy.

ఈ రచనలో మృత్యువుని కవిత్వంగా మార్చిన వర్ణనలలాంటివి ఉంటానుకుంటే నిరాశే మిగులుతుంది. ఇది పుస్తకం పేరుకి తగ్గట్లే అడిచే తన తండ్రిని గురించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రాసుకున్న సాధారణమైన జర్నల్ మాత్రమే. రచయిత్రిగా కట్టిపడేసే ఆమె శైలి నాకు పరిచయమే కాబట్టి ఈ రచనలో సృజనాత్మకతకూ,ఎస్తెటిక్స్ కు సూదూరమైన వివరాలు భాషకు అందని అడిచే శోకాన్ని పూర్తి వెలుగులో చూపించాయి అనిపించింది.

పుస్తకం నుండి మరికొన్ని అంశాలు :

All of us weeping and weeping and weeping, in different parts of the world, looking in disbelief at the father we adore now lying still on a hospital bed.

My breathing is difficult. Is this what shock means, that the air turns to glue?

Needle-pricks of resentment flood through me at the thought of people who are more than eighty-eight years old, older than my father and alive and well. My anger scares me, my fear scares me, and somewhere in there is shame, too – why am I so enraged and so scared?

I wince now at the words I said in the past to grieving friends. ‘Find peace in your memories,’ I used to say. To have love snatched from you, especially unexpectedly, and then to be told to turn to memories. Rather than succour, my memories bring eloquent stabs of pain that say, ‘This is what you will never again have.’ Sometimes they bring laughter, but laughter like glowing coals that soon burst aflame in pain. I hope that it is a question of time – that it is just too soon, too terribly soon, to expect memories to serve only as salve.

Sunday, August 8, 2021

The Allegory of the Cave - Plato (Benjamin Jowett)

ఎలిజబెత్ గాస్కెల్ 'నార్త్ అండ్ సౌత్' బీబీసీ అడాప్టేషన్ చూసి ఒక దశాబ్దం పైనే అయినట్లుంది. అందులో మిల్టన్ లో కాటన్ మిల్ యజమాని జాన్ థ్రోన్టన్ కి చిన్నప్పుడే తండ్రి మరణం కారణంగా  కుటుంబం,మిల్లు బాధ్యతలు మీద పడడంతో చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతాడు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన మార్గరెట్ హేల్ తండ్రితో థ్రోన్టన్ కు స్నేహం కుదరడంతో ఆయన దగ్గర రోజూ కొంత సేపు ట్యూషన్ చెప్పించుకుందామని నిర్ణయించుకుంటాడు. అప్పుడు హేల్ తండ్రి, "జాన్ కి చదువు అరిస్టాటిల్ తో మొదలు పెట్టాలా లేదా ప్లేటో తో మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాను" అంటాడు. అది చూసినప్పుడు అనిపించింది,ఒకప్పటి చదువు వాస్తవ జీవితంలో సంక్లిష్టతలను సమర్థవంతంగా ఎదుర్కునే క్రమంలో వివేకాన్ని పెంపొందించేదిగా ఉండేది. పూర్తిగా కాకపోయినా అటువంటి చదువుకు ఉండే ప్రాముఖ్యతను గుర్తెరిగిన సమాజం అది. మరి ఇప్పుడు, లెక్కలూ,అంకెలూ,నిర్వచనాలూ అంటూ అంతా 'ఫాక్ట్ బేస్డ్' చదువైపోయింది. నేడు సాంకేతిక విద్యకు ఇస్తున్న ప్రాముఖ్యత మానవీయ విలువలు పెంపొందించే విద్యకు లేదు. దానితో 'మైండ్ అండ్ సౌల్' విషయంలో సంతులనం లోపించి మనిషి అపరిమిత జ్ఞానసంపన్నుడైనప్పటికీ వివేకహీనుడుగా మిగిలిపోతున్నాడు. ఫలితం, నేటి విచక్షణారహిత సమాజం మన కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. జ్ఞాపకశక్తిని తెలివితేటలకూ,తెలివితేటల్ని వివేకానికీ ముడిపెట్టి మురిసిపోతున్న అమాయకపు తరం మనది. ఒకానొకప్పుడు ఏథెన్సులో ఇటువంటి వాస్తవాలను గొంతెత్తి చెప్పిన నేరానికి సోక్రటీస్ కు మరణదండన విధించారు. ఇంత దూరం ప్రయాణించి వచ్చినా మునుపటి తరానికీ,నేటి తరానికీ ఈ విషయంలో పెద్ద తేడా లేకపోవడం దురదృష్టకరం. 

Image Courtesy Google

మొత్తం పది పుస్తకాల ప్లేటో 'రిపబ్లిక్' లో ఏడవ పుస్తకంలో ప్లేటో అన్నగారైన గ్లాకన్ కూ, సోక్రటీస్ కూ నడుమ జరిగిన సంభాషణల్లో భాగంగా 'The Allegory of the Cave' గా ప్రసిద్ధికెక్కిన ఒక చిన్న కథను  చెప్తారు సోక్రటీస్. ఇది చదివినప్పుడు రోలాండ్ బార్త్, గై డెబోర్డ్, వాల్టర్ బెంజమిన్, బెర్ట్రాండ్ రస్సెల్, కలాస్సో వంటి తత్వవేత్తలు తరువాత కాలంలో చేసిన అనేక ప్రతిపాదనలకు మూలాలు ఈ కథలోనే  ఉన్నాయనిపించింది. నేను వీరి ప్రతిపాదనలను ఇదివరకే కొంత చదివి ఉండడంతో ఈ పిట్టకథ 375 బీసీ నాటిదని తెలిసి మరింత ఆశ్చర్యమనిపించింది.

సోక్రటీసు గ్లాకన్ కు చెప్పిన కథ ఇది : అనగనగా ఒక గుహ,ఆ గుహలో నుండి కాస్త పైకి వెళ్తే బయట ప్రపంచానికి ఉన్న ఒకే ఒక ద్వారం..ఆ గుహలో తల తిప్పి వెనక్కి చూడడానికి కూడా వీలులేకుండా మెడకూ,కాళ్ళకూ సంకెళ్ళతో చిన్నప్పటినుండీ ఖైదు చెయ్యబడ్డ కొందరు మనుషులు. వాళ్ళకి వెనుక భాగంలో కాస్త దూరంగా ఎప్పుడూ వెలుగుతూ ఉండే మంట..ఆ మంటనుండి వచ్చే వెలుగు కారణంగా వీళ్ళ ఎదురుగా ఉన్న గోడమీద వీళ్ళ దృష్టికి ఆవల ఉండే ప్రపంచం తాలూకు ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి.ఒక్కోసారి ఈ గుహలో ప్రతిధ్వనించే శబ్దాలను ఆ ప్రతిబింబాలే స్వయంగా మాట్లాడుతున్నాయనుకుని భ్రమపడే అవకాశం కూడా ఉంది.

To them, I said, the truth would be literally nothing but the shadows of the images.

Image Courtesy Google

 ఇప్పుడు సూర్యకాంతినీ, చీకటినీ, ప్రతిబింబాలనీ   మెటఫోర్లుగా వాడుతూ సోక్రటీస్ చెప్పిన కథలోని    సారాంశాన్ని చూద్దాం : 

 * ఒకవేళ వారిలో ఒక ఖైదీ  విడుదలైన   పక్షంలో అతడు ఉన్నట్లుండి తన చీకటి గుహలో   అలవాటైన నీడల బదులు వెలుగులు   చిమ్మే సూర్య కాంతిని చూడలేక   సతమతమవుతాడు.

 * చీకటి బదులు వెలుతురునూ, ప్రతిబింబాల   బదులు వాస్తవాన్నీ చూడగలగడానికి   అతడు చాలా  కష్టపడతాడు. తన కళ్ళకి సౌకర్యవంతంగా ఉండే అలవాటైన నీడలే నిజమేమో అనుకుంటాడు.

 * ఇప్పుడు వెలుగులో గుహ వెలుపలి ప్రపంచంలో అతడు చూసే వస్తువులను పేర్లతో సహా చెప్పి గుర్తుపట్టమని ఎవరైనా అంటే అతడు గందరగోళానికి గురవుతాడు. ఎందుకంటే ప్రతిబింబాలకు అతడు పెట్టుకున్న పేర్లు వేరు. అతడికి సంబంధించినంత వరకూ గుహలో అతడి చీకటి జీవితం వాస్తవం. మిగతాదంతా భ్రమ.

* మొదట్లో వెలుతురును సూటిగా చూసే ప్రయత్నం చేస్తే కళ్ళు నెప్పెట్టి, చూపు తిప్పుకుంటాడు. తన కళ్ళు గ్రహించగలిగిన కాంతిని మాత్రమే చూసే ప్రయత్నం చేస్తాడు. కానీ కాస్త దగ్గరగా మనుషుల్నీ,జంతువుల్నీ చూశాకా అతడు తాను ఇంత కాలం చూసిన నీడలన్నీ భ్రమలని చివరకు అర్ధం చేసుకుంటాడు. శబ్దాలకు ఆధారభూతమైన మూలాలను గ్రహిస్తాడు.

* ఇప్పుడు తాను చూసిన అద్భుతమైన వాస్తవాలను తన సహచరులతో పంచుకోడానికి గుహలోపలికి పరిగెత్తుకుంటూ వెళతాడు. (ఇప్పుడు ఇతడు సత్యాన్ని గ్రహించిన జ్ఞానీ,తాత్వికుడూ.) 

* కానీ లోపల మనుషులకు ఇవేవీ తెలియదు. వాళ్ళకి ఇప్పటికీ ఆ చీకటి గుహలో నీడలే నిజం. లోపల కనిపిస్తుందంతా భ్రమని వారికి చెప్పజూస్తే ఈ తాత్వికుణ్ణి పిచ్చివాడు అనుకుంటారు.

* బయట తమకు తెలీని వెలుగులోకి వెళ్ళగానే కళ్ళు బైర్లుకమ్మి మతితప్పి  వ్యవహరిస్తున్నాడని అతన్ని హేళనచేసి తరిమికొడతారు.

* ఇప్పుడు ఆ గుహలో వ్యక్తులు మునుపటిలాగే నీడల్ని గమనిస్తూ ఏ నీడ ముందో,ఏ నీడ తరువాతో అని వారిలో వారు పెట్టుకునే పోటీలు ఈ తాత్వికుణ్ణి మునుపటిలా ఆకర్షించలేవు. అతడు వారి పోటీల్లో పాలుపంచుకోడానికి ఆసక్తి చూపడు. వారి మూర్ఖత్వంతో కూడిన గౌరవాలనూ, విజేత పురస్కారాలనూ అతడు లెక్క చెయ్యడు, ఆ పోటీల్లో విజేతలను చూసి ఈర్ష్య చెందడు. వాళ్ళ చీకటి ప్రపంచం,దాని విధివిధానాలన్నీ అతడికి అఙ్ఞానంగా తోస్తాయి. కానీ వాళ్ళు మెజారిటీ.

Would he not say with Homer, ‘Better to be the poor servant of a poor master,’ and to endure anything, rather than think as they do and live after their manner?

ఈ పిట్ట కథను ఏ తరానికి అన్వయించినా సరిగ్గా అతికిపోతుంది. వాస్తవ జీవితాలు సోషల్ మీడియా కిటికీల్లో ప్రతిబింబాలుగా రూపాంతరం చెందిన ఈ కోవిడ్ పాండెమిక్ సమయంలో ఈ కథ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది అనిపిస్తుంది. శాస్త్ర సాంకేతికాభివృద్ధి వలన మన అస్తిత్వాలు 'ప్లేటో కేవ్' లోని గోడ మీద నీడల్లా పరిణామం చెందిన క్రమంలో నీడల్ని నిజమనుకుని,ప్రతిధ్వనుల్ని నీడల వెనుక స్వరాలని అనుకుంటూ వాస్తవమేదో భ్రమేదో తెలుసుకోలేని అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ఖైదీలం మనం. ఎవరైనా మెజారిటీ మూర్ఖత్వాన్ని ఎద్దేవా చేస్తూ 'వెలుగు' ను చూపించే ప్రయత్నం చేసినా వాళ్ళని సోక్రటీస్ లా పిచ్చివాడనీ,ప్రమాదకారి అనీ ముద్రవేసే సమాజంలోనే ఇప్పటికీ ఉన్నాం. 

ఒక తత్వవేత్త సాధారణ సమూహానికి తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు సోక్రటీస్. జ్ఞానం అందుబాటులో ఉన్నా దాన్ని గ్రహించే విషయంలో మనిషిలో మానసిక సంసిద్ధత లేకపోతే వాస్తవం కళ్ళముందే కనిపిస్తున్నా ఎప్పటికీ అజ్ఞానాంధకారంలోనే మిగిలిపోతాడు. మనిషిలో జ్ఞానాన్ని అతడు ఉండే పరిసరాలూ, అతడు కలిసిమెలిసి తిరిగే సమూహాలూ ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి కూడా ఈ కథ ఒక చక్కని ఉదాహరణ. ఈ పుస్తకానికి అనేక అనువాదాలున్నప్పటికీ బెంజమిన్ జోవెట్ అనువాదం దొరికితే తప్పకుండా చదవండి.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు : 

But then, if I am right, certain professors of education must be wrong when they say that they can put a knowledge into the soul which was not there before, like sight into blind eyes.  

And whereas the other so-called virtues of the soul seem to be akin to bodily qualities, for even when they are not originally innate they can be implanted later by habit and exercise, the virtue of wisdom more than anything else contains a divine element which always remains, and by this conversion is rendered useful and profitable; or, on the other hand, hurtful and useless. Did you never observe the narrow intelligence flashing from the keen eye of a clever rogue—how eager he is, how clearly his paltry soul sees the way to his end; he is the reverse of blind, but his keen eyesight is forced into the service of evil, and he is mischievous in proportion to his cleverness

The students of the art are filled with lawlessness.

So men who begin to analyse the first principles of morality cease to respect them.

Young men are fond of pulling truth to pieces and thus bring disgrace upon themselves and upon philosophy.

The study of philosophy to continue for five years; 30-35

Thursday, August 5, 2021

The Terror of Fables - Roberto Calasso

ఆస్ట్రియన్ రచయిత రాబర్ట్ ముసిల్ మాగ్నమ్ ఓపస్ 'ది మాన్ వితౌట్ క్వాలిటీస్' లో కథానాయకుడు అల్రిచ్ స్పోర్ట్స్ మాగజైన్లో ప్రచురించిన ఒక వ్యాసంలోని వాక్యం 'a racehorse of genius' చదివి ఆలోచనలో పడతాడు..ఆ సందర్భంలో అల్రిచ్ కి ప్రపంచ చరిత్ర యావత్తూ ఈ వాక్యంతోనే ముడిపడి ఉన్నట్లు తోస్తుంది..వెనువెంటనే అతడు ఒక మాథెమెటీషియన్ గా తన జీవితం నుండి ఒక సంవత్సరం పాటు శెలవు తీసుకుని 'ఎ మాన్ వితౌట్ క్వాలిటీస్' గా రూపాంతరం చెందుతాడు..ఈ కథ విన్నప్పుడు తరతరాలనుండి వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలూ,రాజకీయ సామజిక స్థితిగతులూ,సాంఘిక నియమాలూ,వ్యవస్థలూ మనకు ఆపాదించిన అస్తిత్వపు చిహ్నాలను సమూలంగా చెరిపేసి అల్రిచ్ లా శెలవు తీసుకోవడం మనకు కుదిరే పనేనా అనిపిస్తుంది..గత సంవత్సరం చదివిన ఒట్టెస్సా మోష్ఫెగ్ రచన 'మై ఇయర్ ఆఫ్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్' లో కూడా యధాతథంగా కాకపోయినా దాదాపూ ఇటువంటి అంశమే చర్చకు వస్తుంది..అందులో యువ కథానాయిక జీవితపు నైరాశ్యం నుండి బయటపడడానికి ఒక సంవత్సరంపాటు ఒంటరిగా తన అపార్ట్మెంట్లో సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వాడుతూ నిద్రాణస్థితిలో జీవించాలని నిర్ణయించుకుంటుంది..రాబర్ట్ ముసిల్ కథానాయకుడు సంఘజీవిగా తన అస్తిత్వాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే ,మోష్ఫెగ్ కథానాయిక ఒంటరితనంతో అలసిపోయి డిప్రెషన్ బారిన పడుతున్న నేటి తరానికి ప్రతినిధిలా కనిపిస్తుంది..ఏదేమైనా ఈ రెండు కథల్లోనూ అలసిపోయి అస్తిత్వపు మూలలను వదిలించుకోవాలనే తపన మాత్రం సుస్పష్టం..సాంస్కృతిక మూలాలను రక్షించుకోవడం పేరిటో లేదా సౌకర్యవంతమైన మార్గమనుకునో అనుకరణ,అనుసరణలను విధిగా పాటిస్తూ జీవించేవారు కొందరైతే,Be a Roman in Rome తరహాలో తమ చుట్టూ ఉన్న పరిసరాలకూ,మనుషులకూ,వ్యవస్థలకూ అనుగుణంగా తమ ఉనికిని నిరంతరం మార్చుకుంటూ స్పష్టమైన అస్తిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళు కొందరు..కానీ ప్రాక్టికల్ గా అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకోవడం మన చేతుల్లో ఉండే పనేనా ?

Image Courtesy Google

ప్రాచీనకాలం నుండీ ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతీ,సంప్రదాయాల పేరిట పూర్వపు నియమాలు,చరిత్ర,నాగరికత లాంటివి అందించబడతాయి..ముఖ్యంగా సాహిత్యంలో కథలూ,కవిత్వం లాంటివి ఈ కొనసాగింపుకి కీలక మాధ్యమాలుగా వర్తిస్తాయి..సాహితీ  ప్రపంచంలో 'మిత్' (పురాణం/గాథ) చాలా ప్రత్యేకమైనది..ఈ 'మిత్' ను వాడుక భాషలో పుక్కిట పురాణమని కూడా అంటుంటాం..'మిత్' చరిత్రను సజీవంగా ఉంచుతుంది..ఆ నోటా ఈ నోటా వినే పిట్టకథల ద్వారానో, బుఱ్ఱకథలు, తోలుబొమ్మలాటలూ, సాహిత్యం,చిత్రలేఖనం ,నాట్యం వంటి వివిధ కళారూపాల ద్వారానో ,ఇతరత్రా చిహ్నాల ద్వారానో ఒక తరం నుండి మరో తరానికీ, ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థలోకీ జొరబడే ఈ పురాణాలు మనిషికి గతించిన కాలపు సంస్కృతిని పరిచయం చేస్తాయి..పాలిటిక్స్,జర్నలిజం వంటి రంగాలలో విస్తృతమైన అధ్యయనాలు చేసిన రోలాండ్ బార్త్ , తన 'మైథాలజీస్' లో 'మిత్' గురించి రాస్తూ ఏ సంస్కృతికి సంబంధించిన పురాణమైనా 'సైన్ ని సిగ్నిఫైర్ గా మార్చే సెమియోటిక్  సిస్టం లో భాగమని' అంటారు..వివిధ సంస్కృతులకు సంబంధించిన చరిత్ర యావత్తూ ఈ మిత్ ప్రాతిపదికగా రూపొందినదే..మిత్స్ సమాజాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా శాసిస్తాయి.

ఇటాలియన్ రచయిత రోబర్టో కలాస్సో 'ది ఫోర్టీ నైన్ స్టెప్స్' అనే పుస్తకంలో 'ది టెర్రర్ ఆఫ్ ఫేబుల్స్' పేరిట రాసిన వ్యాసంలో మిత్ కు కొన్ని పేజీలు కేటాయిస్తూ పురాణాల వల్ల మనిషికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేశారు..చరిత్ర మనకు మార్గం సులభం చేస్తుందా లేక మోయలేక వదిలించుకోవాలనుకునే గుదిబండగా మిగులుతుందా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తూ ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి..కథలూ,గాథలూ మేలు చెయ్యడం గురించి తెలుసు గానీ కీడు చెయ్యడం ఏమిటని ఆశ్చర్యంగా అనిపించినా, కలాస్సో తన పదునైన వాదనతో పాఠకుల్ని ఆలోచనలో పడేస్తారు..ఈ మిత్ ను రెండు అర్ధాల్లో తీసుకోవచ్చు అంటారు కలాస్సో : మొదటిది, 'ప్రశ్నించడానికి అవకాశం లేని అద్భుతం' అయితే రెండోది దానికి పూర్తిగా భిన్నమైన అర్థంలో 'ఒక అబద్ధం / భ్రమ / పుక్కిటి పురాణమని' కొట్టిపారేసేది..మిత్ గురించి చర్చించే నేపథ్యంలో ప్లేటో 'రిపబ్లిక్' ను ఉదహరిస్తూ గ్రీకు పురాణాల్లో తరచూ వివాదాస్పదమైన అంశంగా నిలిచిన ఈ మిత్ కు పూర్తి స్థాయి సాధికార స్వరంలో వ్యతిరేకత ఎదురైంది మాత్రం ప్లేటో 'రిపబ్లిక్' లోనే అంటారు..ప్లేటో 'రిపబ్లిక్' లో తాత్వికతకూ,కవిత్వానికీ పూర్వపు వైరాన్ని వెలికి తీస్తారు..ఆనాటికి కవిత్వానికి మారు పేరేదైనా ఉందంటే అది ప్రాచీన గ్రీకు సాహిత్యానికి పునాదులు వేసి,ఇలియడ్,ఒడిస్సీలను సృష్టించిన హోమర్ మాత్రమే..ఆ కోణంలో చూస్తే మొత్తం రిపబ్లిక్ ను ప్లేటో, హోమర్ ల మధ్య ఘర్షణగా పరిగణించవచ్చు..గ్రీకులు హోమర్ ను తమ తొలి ఆధ్యాత్మిక గురువుగా , ప్రపంచానికీ , దేవుళ్ళకీ మధ్య తన కవిత్వాన్ని వారధిగా చేసిన అనుసంధానకర్తగా చూస్తారు..అటువంటి హోమర్ ని ప్లేటో , 'రిపబ్లిక్' రెండవ పుస్తకంలో కవిత్వం పేరిట కట్టుకథలల్లి పుక్కిట పురాణాలు సృష్టించిన వ్యక్తి అంటూ అధిక్షేపిస్తారు..ఇక రిపబ్లిక్ పదవ పుస్తకం దగ్గరకు వచ్చేసరికి కవులను 'మిమెసిస్' (the dangerous art of imitation) సాధన చేసే వ్యక్తులుగా నిందిస్తారు..కవులు లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ తాము ప్రాతినిథ్యం వహించే కళకు న్యాయం చెయ్యడంలో విఫలమయ్యారని అంటారు ప్లేటో. 

హోమర్ కు వ్యతిరేకంగా ప్లేటో వాదనలన్నీ కేవలం ఒక ఆదర్శవాది చేసిన అభియోగాలనుకుంటే పొరపాటే..నిజానికి ప్లేటో ఆరోపణలన్నీ పూర్తి స్థాయి మెటాఫిజికల్ దృష్టికోణం నుండి చేసినవేనంటారు కలాస్సో..ఒక వేళ హోమర్ సృష్టించిన దేవుళ్ళను నమ్మాల్సిన పక్షంలో, నిరంతరం తమ రూపాలను మార్చుకుని మానవుల్ని మోసం చేసే దేవుళ్ళను ఇంద్రజాలికులుగా , మాంత్రికులుగా, గారడీలు చేసే వ్యక్తులుగా భావించవలసివస్తుంది..కానీ నిజానికి దైవత్వాన్ని తన కవిత్వంలో పునః సృష్టించే క్రమంలో హోమర్ సైతం దేవుళ్ళు నిరంతరం రూపాంతరం చెందే ప్రక్రియకు ప్రత్యక్ష సాక్షి కాదు..హోమర్ ఆ మెటామార్ఫోసిస్ కు పరోక్షంగా ప్రాతినిథ్యం వహించే సాధనంగా మాత్రమే అగుపిస్తారు..ఈ కారణంగా ఏ విధమైన స్పష్టతా,నియంత్రణా లేని ఈ మెటాఫిజికల్ జోన్ సహజంగానే ఫిలాసఫర్లకు శత్రు సమానంగా కనిపిస్తుంది..అందువల్ల వాస్తవికతకు సుదూరంగా అబ్సర్డిటీ తో కూడిన ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే కవులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సంఘం నుండి బహిష్కరింపబడాలన్నది ప్లేటో వాదన.

నిశితంగా గమనిస్తే ఆంగ్లో సాక్సన్ల క్రిస్టియానిటీకీ, వైకింగ్స్ పాగనిజానికీ మధ్య ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన వైరం లాంటిదే ప్లేటో హోమర్ ల మధ్య 'సిములాక్రం' లో (Simulacrum = వాస్తవానికి ప్రతిరూపం/అనుకరణ/ప్రాతినిథ్యం వహించేది) కూడా కనిపిస్తుంది..'సిములాక్రం' మనిషిని తనను అనుసరించమని శాసిస్తుంది,దానిని చూసిన మనిషి తన ప్రమేయం లేకుండానే దాని ప్రతిరూపంగా మారిపోతాడు..ఒకవేళ ప్లేటో రిపబ్లిక్ లో భావించినట్లు సిములాక్రం వాస్తవదూరంగా,లోపభూయిష్టంగా ఉన్న పక్షంలో దానికి రూపకల్పన చేసిన కవి కూడా తాను సృష్టించిన దేవుడిలాగే ఇంద్రజాలికుడిలా,తాంత్రికుడిలా మారిపోతాడు..అందువల్ల దైవమైనా,ఆ దైవాన్ని సృష్టించిన కవి అయినా 'సిములాక్రం' అన్న పదంలో కంటికి కనిపించని శత్రువుల్లా దాగి ఉన్నారన్నది ప్లేటో భావన..దీనినే మరో విధంగా చూస్తే , 'మిత్' అనేది ఒక అవాస్తవికతను మరో అవాస్తవికతగా చూపించే ప్రయత్నం చేస్తుంది..ప్లేటో ఈ అవాస్తవికతను వ్యతిరేకిస్తారు. 

ఈ తరహా హోమరిక్ మిత్ నూ, వాళ్ళ 'మిమెటిక్' పోయెట్రీ నీ ఖండించిన 'ప్లేటో ప్రపంచం'లో కేవలం కవికే గాక అతడు సృష్టించిన దేవుళ్ళకు కూడా స్థానం లేదు..ప్లేటో కవిని "A man skillfully able to transform himself into everything" అని నిర్వచిస్తారు..కవిత్వం విషయంలో సిములాక్రా , అనగా కొన్ని ప్రత్యేకమైన లేదా మెటాఫోరిక్ పదాల వాడకం పట్ల ప్లేటో కి ఉన్న ఖచ్చితమైన అభ్యంతరాలవల్ల పెద్ద నష్టం లేకపోయినప్పటికీ , కావ్యసృష్టిలో  భాగమైన మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడం వల్ల మాత్రం రెండు ప్రమాదాలుంటాయంటారు కలాస్సో..మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడంతో 'A is transformed into B' అనే బదులు 'A is B' అని వాడవలసిన పరిస్థితి ఎదురవుతుంది..మొదటిది (మెటామోర్ఫోసిస్) ఖచ్చితంగా వృత్తాంతపరమైనది కాబట్టి అంటే నేరేటివ్ కి అవకాశమున్న అంశం కాబట్టి ఏ ఇమేజ్ అయినా రూపాంతరం చెందే క్రమంలో జ్ఞానసముపార్జనకు ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానం ప్రసాదించని సంస్కృతీ,నాగరికతా అంటూ ఉండే అవకాశం లేదు గనుక..దీనికి భిన్నంగా, రెండో పద్ధతి 'A is B' నేటి సాంకేతిక రంగంలోని అల్గోరిథంలా ఇన్పుట్,ఔట్పుట్ పద్ధతిలో ఉండడం వల్ల మెటామోర్ఫోసిస్ కు అవకాశం శూన్యం..అందుచేత ప్లేటో మెటామోర్ఫోసిస్ ని తిరస్కరించడం అంటే,కవి భావోద్వేగాల వల్ల ప్రభావితమయ్యే ఊహాత్మకతనూ,తద్వారా ఇమేజ్ ని అర్థంచేసుకునే (cognitive power ) ప్రయత్నంలో జనించే అపరిమితమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క.

ప్లేటో వాదనలో ఉన్న లొసుగులు చూశాం కాబట్టి,ఇప్పుడు ఆయన చెబుతున్న ఇమిటేషన్ లో ఉన్న ప్రమాదాలేమిటో కూడా చూద్దాం..పురాణాలు మనుషుల్ని తమను అనుకరించేలా మాయ చేస్తాయి,తమ సైద్ధాంతిక ప్రతి రూపాలుగా తయారుచేస్తాయి..ఈ మాయలో పడ్డవాళ్ళు కర్ట్ వన్నెగట్ సృష్టించిన Karass (A network or group of people who are somehow affiliated or linked spiritually ) లాంటివాళ్ళు..గుడ్డి అనుకరణ మినహా తామేం చేస్తున్నారో కనీస స్పృహ లేని వీళ్ళు తమను తాము ఆ సిములాక్రాలో భాగంగా అంగీకరిస్తారు.

ఇక మిత్ ను గురించి సోక్రటీస్ నిర్వచనం ప్లేటో ప్రతిపాదనకు కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది..ఈ విషయంలో ప్లేటో లో ఉన్న మొండితనం సోక్రటీస్ లో కనిపించదు..సోక్రటీస్ మిత్ గురించి మాట్లాడుతూ “Beautiful indeed is this risk, and we somehow need to be enchanted with these things [i.e., with the fables themselves].” అంటారు..ఈ సందిగ్ధంలో రాబర్ట్ ఫ్రాస్ట్ కవితలో చెప్పిన రెండు మార్గాలూ గుర్తొచ్చాయి..ప్లేటో హెచ్చరించిన అస్పష్టత,అనుకరణలతో కూడిన దారిలో ప్రయాణించడమా లేదా గుడ్డి అనుసరణకు అవకాశమివ్వకుండా తర్కాన్ని నమ్మి స్పష్టతతో కూడిన సౌకర్యవంతమైన దారిలో ప్రయాణించడమా అనేది ఇక్కడ ఎవరికి వారు చేసుకోవాల్సిన నిర్ణయం.

ఈ మిత్ ప్రభావాన్ని మనకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఒక ఆసక్తికరమైన గ్రీక్ మిత్ ను ఉదహరిస్తారు కలాస్సో : మిత్ మనమీద చెక్కతో చేసిన టారియన్ ఆర్టెమిస్ విగ్రహంలా పనిచేస్తుందంటారాయన..ఓరెస్టిస్ దాన్ని ఆలయంలోనుండి దొంగిలించి చేతుల్లో గట్టిగా పొదువుకుని పారిపోతున్నంతసేపూ  అతడిలో ఒకవిధమైన ఉన్మాదం జనిస్తుంది..చాలా దూరం పరిగెత్తి అలసిపోయిన ఓరెస్టిస్ ఒకరోజు హఠాత్తుగా ఆ విగ్రహాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకుని యూరోటస్ నదికి సమీపంలో ఒక చిట్టడివిలోని  పొదల్లో దాచేసి వెళ్ళిపోతాడు..ఆ విగ్రహం అక్కడే ఏళ్ళ తరబడి ఎవరికంటాబడకుండా శిథిలమైపోతుంది..ఒకరోజు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఇద్దరు స్పార్టన్ యువకులు ఆస్ట్రాబాకస్,ఏలోపెకస్ లు యాదృచ్చికంగా ఆ విగ్రహం చూడడం జరుగుతుంది..తీక్షణంగా తమకేసి చూస్తున్న ఆ విగ్రహాన్ని చూసి తామేం చూస్తున్నారో గ్రహించలేని స్థితిలో వాళ్ళిద్దరూ పిచ్చివాళ్ళవుతారు..సిములాక్రం కి ఉన్న శక్తి కూడా ఇటువంటిదే అంటారు కలాస్సో..దాని గురించి అర్థం చేసుకోగలిగిన వారిని మాత్రమే అది నయం చేస్తుంది..మిగతావారికి అది ఒక విరుగుడు కాని వ్యాథిలా సంక్రమిస్తుంది..

Thus the myth: The power that arouses terror is also the only one that can cure it, as happened with Orestes. But only if it is recognized for what it is.

తొలి ప్రచురణ ఆంధ్ర జ్యోతి వివిధ : 2 ఆగష్టు 2021

https://lit.andhrajyothy.com/vividha/poet-pleto-37634

https://www.andhrajyothy.com/telugunews/what-did-plato-have-to-do-with-poets-19210802042167?fbclid=IwAR0hR2M9kZvzyIyZ9yJrYkH-Klr53Vz_oy-OYh6GhMF2lTSYdjfh7bELCE4

Monday, August 2, 2021

Hyderabad Book Trust Article

చిన్నప్పటి నుండీ ఏకాంతం నా ప్రియ నేస్తం..నీళ్ళలోంచి బయటకు తీసిపడేసిన చేప పిల్ల చందంగా ఆటవిడుపుగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినా నా అంతః ప్రపంచాన్ని దాటి ఆవలవైపు ఆట్టే సేపు ఉండలేను. నిర్ణీత సమయం దాటితే శ్వాస ఆడనట్లు సతమతమవుతాను. నేను ప్రత్యేకం కాదు, నాలాంటి అంతర్ముఖులు నా చుట్టూ కోకొల్లలు. ఎప్పుడైనా జ్ఞాపకాల తెరలు తీసి చూద్దును కదా, నలుగురి మధ్యలో నన్నెంత వెతుక్కున్నా నాకు 'నేను' కనపడలేదు. సమూహాల్లో మసిలేటప్పుడు ఇతరుల స్వాభావికమైన నీడలు పడని స్వచ్ఛమైన ఉనికి జాడలు పట్టుకోవడం ఒకింత కష్టం కదూ ! వెనక్కి తిరిగి చూసుకుంటే నా అపురూపమైన జ్ఞాపకాలన్నీ ఏకాంతంతో ముడిపడిన క్షణాలే. అందులోనూ ఏకాంతానికి కాస్త వర్షం జతగా వస్తే ఆ అనుభవం విలువ అమాంతం పెరిగిపోతుంది. వర్షపు రోజుల్లో స్కూలుకి మధ్యాహ్నం అనుకోకుండా సెలవొస్తే పండగలా ఉండేది. కిషోర్ సోలోస్ వింటూ, కిటికీ ప్రక్కన ఫేము కుర్చీలో కూర్చుని బొమ్మలకి రంగులు పులుముకుంటున్న నన్ను, వరండాలో చల్లని వర్షపు జల్లుల్లో తడిసి ముద్దవుతున్న నూరువరహాలూ, రాధామనోహరాలూ ఆత్మీయంగా పలకరించేవి. "మేము పనిగట్టుకుని వర్షంలో తడిసినా జలుబు చేస్తుందని అమ్మ చేత చివాట్లు తినక్కర్లేదోచ్" అన్నట్లు నాకేసి ఒకింత గర్వంగా చూసేవి. ఉక్రోషంతో ఒక్కోసారి వేస్తున్న బొమ్మల్నీ, చదువుతున్న చందమామల్నీ ప్రక్కన పడేసి వెళ్ళి వాటిని పట్టుకుంటే చల్లని వానచినుకులు బుగ్గల్ని ముద్దాడుతూ ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఆ చల్లని చిరు స్పర్శ ఇప్పటికీ ఎంత తాజాగా ఉందో ! 

Young Woman at the Window by Salvador Dali

మనుషులతో పేచీలేదు గానీ మౌనం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. మౌనానికి వాళ్ళకు తోచిన వక్రభాష్యాలద్ది గర్వమనో,అహంకారమనో,కలుపుగోలుతనం లేదనో ట్యాగ్ లు తగిలిస్తే సంజాయిషీలు ఇచ్చే అలవాటు లేకపోయినా "అవేమీ కాదు బాబోయ్. మనుషులంటే ఇష్టమే,మాట్లాడడమే కష్టం" అని అప్పుడప్పుడూ అరిచి చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రకృతితో ఈ పేచీలేవీ ఉండవు, తమ ఉనికిని డప్పు కొట్టుకుని చాటుకోనవసరం లేకుండా స్థిర గంభీరంగా మానవాళిని గమనిస్తూ ఉండే కొండాకోనలూ, నిశ్శబ్దంగా దారిచేసుకుని ప్రవహించే వాగువంకలూ మన మౌనాన్ని గౌరవిస్తాయి,గౌరవించడమే కాదు ఆ మౌనంలో దొర్లిపోతున్న మాటల్ని ఒడిసిపట్టుకుని మరీ వింటాయి. ప్రకృతికి సంజాయిషీలు అఖ్ఖర్లేదు, నా ఇజం,నా నైజం,నా స్వభావం అంటూ నిరంతరం నిరూపణల అవసరం లేదు. అందుకేనేమో నాలాంటి చాలా మందికి ప్రకృతిని మించిన ప్రియ సఖి లేదు. 

'నో మాన్ ఈజ్ ఆన్ ఐలాండ్' అన్న నానుడిని నిర్ద్వందంగా అంగీకరించినా, నాకెప్పుడూ బుర్రలో ఒక ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. అసలు ఆదర్శ జీవన విధానం అంటే ఏమిటి ? దానికో స్పష్టమైన నిర్వచనం సాధ్యమేనా ! ప్రకృతితో మమేకమై జీవించడమే పరమావధి అని కొందరంటారు. మానవాళికి దూరంగా ఉలిపికట్టెలా జీవించడం కూడా ఒక జీవితమేనా అని మరికొందరంటారు. ఎవరి నిర్వచనాలు వారివి. ఆదర్శం కదాని అందరూ ఉన్నపళంగా పట్టణాల్ని వదిలి ప్రకృతికి దగ్గరగా జీవించడం మొదలుపెట్టినా,పల్లెల్ని వదిలి అందరూ పట్టణాలకు వలస వెళ్ళినా సామజిక సమతౌల్యం దెబ్బతింటుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేర్పిన పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ఎక్కడి వాళ్ళక్కడ,తామున్న చోటే సంతోషాన్ని తయారుచేసుకోవాలి, తమ చుట్టూ ఉన్న సాధారణ ప్రపంచాన్నే అసాధారణంగా మలుచుకోవాలి. ఇది సాధ్యపడాలంటే మనకు బాహ్య ప్రభావాలకు లోనుకాని ఘనమైన అంతః ప్రపంచం ఉండి తీరాలి. లేదంటే ఉందో లేదో తెలియని రేపటిరోజు కోసం నిరీక్షిస్తూ, లాక్డౌన్ శృంఖలాలు తెంచుకునే సమయంకోసం వేచి చూస్తూ నిరాసక్తంగా,నిస్తేజంగా రోజుల్ని వెళ్ళదీయడం తప్ప మరో గత్యంతరం లేదు. కానీ ఇంత అశాశ్వతత్వం మధ్య మనదైన ఒకే ఒక్క జీవితంలో ఒక్క క్షణాన్నైనా జారవిడుచుకోవడం ఎంత మూర్ఖత్వమో కదా !

పొట్ట చేతపట్టుకుని ఊరూరా తిరిగే ఉద్యోగం మాలో ప్రాంతీయాభిమానాల్ని సమూలంగా చెరిపేసింది. ఈ ప్రాంతం, ఈ సమూహం, ఈ క్షణం : ఇంతవరకే మా ఆలోచనల్ని పరిమితం చేసింది. బహుశా ఈ కారణంగానే మహానగరాల్లో రద్దీనీ, దుమ్మూధూళీ కలగలిసిన పెట్రోల్ వాసనల్ని ఎంతగా ఇష్టపడేవాళ్ళమో, నిర్మానుష్యంగా ఉండే పచ్చని అడవి దారుల్ని కూడా అంతే ఇష్టపడేవాళ్ళం. ప్రకృతిలోనైనా, జనారణ్యంలోనైనా ఒకే తీరుగా జీవించడం నేర్చుకున్నాం. మాల్స్ పట్టి తిరగడం అలవాటైన ప్రాణాలైనా అడవులు పట్టి ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగానే తిరిగాం. దేవలోకంలో ఉన్న కాలంలో ప్రతీ వారాంతం క్రమం తప్పకుండా లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళేవాళ్ళం. కనుచూపు మేర పచ్చని తివాచీలా పరుచుకున్న తేయాకు తోటల్ని దాటుకుంటూ నీలగిరుల్లో లయబద్ధంగా కురిసే వర్షపు చినుకుల్నీ, కొండల్ని  చీల్చుకుంటూ ప్రవహించే మేఘాల్నీ, తనువంతా తడిసి పులకరిస్తున్న ప్రకృతి అందాల్నీ కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ప్రయాణిస్తుంటే వెనుకనుండి కార్ హారన్లు పదపదమంటూ తొందర పెట్టేవి. మేము ప్రక్కకి తొలిగి వాళ్ళకి దారిచ్చేవాళ్ళం. గమ్యాన్ని చేరుకోవాలని వాళ్ళకి ఉన్న తొందర మాకు ఎప్పుడూ లేదు. ప్రయాణాన్ని ఆస్వాదించడమే మా పరమావధి. నలుగురూ సౌకర్యవంతంగా నడిచే దారుల్లో నడవకపోవడంతో ఎవరి కంటాపడని కొన్ని అరుదైన ప్రాకృతిక ప్రదేశాలు మాకు మాత్రమే కనిపించేవి. మనిషి జాడలేని అటువంటి ప్రదేశాల్లో గంటల తరబడి స్వేచ్ఛాజీవుల్లా విహరించేవాళ్ళం. కారాపి ఫ్లాస్కులో వెంట తెచ్చుకున్న ఫిల్టర్ కాఫీ తాగుతుంటే "ఇక్కడ క్షేమం కాదు ఏనుగులు తిరిగే ప్రదేశాలని" ఫారెస్ట్ పెట్రోలింగ్ వాళ్ళు మమ్మల్ని సున్నితంగా హెచ్చరించేవారు. నీలాల నింగీ, కాళ్ళ క్రింద నేలా,పచ్చని పశ్చిమ కనుమలూ,వాటిపై ప్రవహిస్తున్న మేఘాల సాక్షిగా మా అనుభవాల పెట్టెలో అలా చేరిన అదృష్టాలెన్నో. ఎవరైనా ఫోటోలు చూసి "ఈ ప్రదేశం ఎక్కడ ?" అని అడిగితే మాత్రం స్పష్టమైన చిరునామా చెప్పడానికి తడబడేవాళ్ళం. మాకు ప్రయాణమే తప్ప గమ్యాల ఆచూకీ తెలియదు. పారిజాతాల్ని తలపించే కాఫీ పూల పరిమళాలూ, తేయాకు,అరటి తోటల పచ్చదనాలూ, పచ్చని పచ్చి మిరియాల కారాలూ,రోజ్ ఆపిల్స్ తో చేసే కేరళ పానీయాలూ, ఋతువులతో పాటు మారిపోయే అనంతమైన ప్రకృతి వర్ణాలూ, కనీకనిపించని పొగమంచు దారులూ ఇలా జ్ఞాపకాల తుట్టె కదిపితే ఎన్ని అనుభవాలని ! 

మనకి కొత్తొక వింత, పాతొక రోత. ఒకనాడు ఎదుగూ బొదుగూ లేని జీవితాలెందుకని ఆధునికత బాటపట్టి పల్లెల్నీ,ప్రకృతినీ వదిలి పట్టణాలకు వలసపోయాం. ఇప్పుడు పట్టణాలు జనసందోహంతో కిక్కిరిసిపోయి మనిషికి ఏకాంతం కరువైంది. ఇది మెజారిటీ జీవన విధానంగా మారింది. వినియోగదారీ వ్యవస్థ పెచ్చుమీరిన ఈ కాలంలో ఒకనాటి సాంప్రదాయ జీవన శైలులే 'ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్' లా మినిమలిజం,సింపుల్ లివింగ్ లపేరిట మళ్ళీ ప్రచారంలోకి వచ్చాయి. ఈకాలంలో ఇలా జీవించేవాళ్ళు ప్రివిలెజ్డ్ క్లాస్ (?) గా పరిగణింపబడుతున్నారు. మళ్ళీ ఈ జీవన విధానం విసుగుపుడితే ఆధునికతను ఆనందంగా హత్తుకుంటాం. ఈ చక్ర భ్రమణాలు నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. ఒంటరితనం తప్ప ఏకాంతానికి అర్ధం తెలీని నేటి తరానికి కోవిడ్ సెకండ్ వేవ్ కటువుగానైనా కొన్ని కొత్త పాఠాలు నేర్పింది. నీలోపలున్న అంతులేని అంతః ప్రపంచాన్నోదిలి బాహ్య ప్రపంచంలో నలుదిక్కులకూ పరిగెడతావేమని ప్రశ్నించింది. వెతికి వెతికి అలసిపోవలసిందే గానీ నీలో లేని సంతోషం,నువ్వు నీతో చెయ్యని స్నేహం నీకు బయట దొరకదని నిరూపించింది. కోరుకున్నది కాకపోయినా కోవిడ్ ముందు నుండే 'సోషల్ డిస్టెన్సింగ్' అలవాటు ఉంది కాబట్టి ఎప్పటిలాగే పుస్తకాలూ, సినిమాలూ, పెయింటింగ్, సంగీతం లాంటి హాబీలతో లాక్డౌన్ సమయం మాకు ఆనందంగానే గడిచిపోయింది. నిజానికి ఈ కళారూపాలన్నీ లేకపోతే ఈ లాక్ డౌన్ రోజుల్లో ఏమైపోయేవాళ్ళమో అనిపించేది. ఇవన్నీ మానవసంబంధాలకి ప్రత్యామ్న్యాయాలు కాదు కానీ, మనిషిని అతడి అంతః ప్రపంచంతో దగ్గరగా కలిపి ఉంచే సాధనాలు. నిజానికి ఉన్నచోటు నుండి కదలకుండా, విసాలూ,పాస్స్పోర్టుల అవసరం లేకుండా, రెక్కలుకట్టుకుని విశ్వం నలుమూలలూ చుట్టి రావడానికి పుస్తకపఠనాన్ని మించిన మరో మంచి మార్గం ఉందా ! కాలంతో బాటు వేగంగా పరిగెత్తడం తప్ప ఒక్క క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడలేని ఈ మెటీరియలిస్టిక్ తరంలో మేరీ ఆలీవర్,వెండెల్ బెర్రీ,హెన్రీ డేవిడ్ థోరో, ఎమెర్సన్, రస్కిన్ బాండ్ లాంటి అనేకమంది రచయితలు ప్రకృతితో తమ సాన్నిహిత్యం గురించి గంటల కొద్దీ చెప్పే కబుర్లకి సరిసాటి అయిన మరో సాహచర్యం నాకైతే ఇంతవరకూ దొరకలేదు. బైరన్ అన్నట్లు "I love not man the less, but nature more" అనుకున్న సందర్భాలెన్నో. 'హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్' అనే సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా నమ్ముతాను. మనం అందరం ఎక్కువ సమయం (బహుశా పూర్తి సమయం) గడిపేది మన మెదడులోనే కాబట్టి ఆ ప్రపంచాన్ని శుభ్రంగా, అందంగా, ఆనందంగా ఉంచుకోవడం చాలా అవసరం, అది ప్రకృతిలోనైనా,పదుగురిలోనైనా సరే అనుకుంటాను. మా సంతోషాన్ని మేము తయారుచేసుకున్న రెసిపీలో కీలకమైన పదార్థం 'ఆర్ట్'. ఇది మా రెసిపీ మాత్రమే, మీకు నచ్చాలని రూలేమీ లేదు సుమా !

ఈ సందర్భంలో ఫ్రెంచ్ తత్వవేత్త మొంటైన్ ఏకాంతాన్ని గురించి చెప్పిన కొన్ని విలువైన మాటలు ప్రస్తావించాలి : "వివేకవంతుడు నలుగురిలోనైనా, నాలుగ్గోడల మధ్య ఏకాంతంలోనైనా ఎక్కడైనా ఆనందంగానే ఉంటాడు. కానీ అతడు అవకాశం ఉంటే మాత్రం నిస్సందేహంగా ఏకాంతాన్ని కోరుకుంటాడు. సమాజంలో భాగమైన చెడును ఎదుర్కునే క్రమంలో ఎంతో కొంత మకిలి అంటకుండా దాని ప్రభావంనుండి తప్పించుకోవడం అసాధ్యం అని అతడికి స్పష్టంగా తెలుసు. ఇక్కడ రెండే మార్గాలుంటాయి :ఒకటి, మనం సమూహాల్ని వాటి చెడుతో సహా అనుసరించాలి ;రెండు, వారిని ద్వేషిస్తూ వారినుండి విడివడి జీవించాలి. రెండు మార్గాలూ హాని కారకమే." . కానీ నాకు ఆయన మాటలతో చిన్న పేచీ ఉంది. రెండవ మార్గంలో ఎవర్నీ ద్వేషించకుండా కూడా విడివడి మనకు నచ్చినట్లు జీవించే అవకాశం ఉంది కదా ! అనుకుంటాను. కానీ ప్రస్తుతం మనందరం ఉన్న పరిస్థితుల్లో, దీనికంటే ముఖ్యమైన ప్రశ్న : అసలు మనకా ఛాయిస్ ఉందా ? 

తొలి ప్రచురణ - హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేజీ : 30th July'2021 

https://www.facebook.com/HBTBooks/posts/4281019705280995

Thursday, July 22, 2021

The Meditations : An Emperor's Guide to Mastery - Marcus Aurelius and Sam Torode

బయట మారణహొమం జరుగుతోంది. రావణకాష్టంలా చితులు ఎడతెరిపి లేకుండా మండుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు పరిచయస్తుల మరణ వార్తలు వినని రోజు లేదు. నిస్సహాయతా,అస్థిమితం. చుట్టూ జరుగుతున్న ఘోరాల్ని చూసి కళ్ళలో నీరు ఉబికి రాలేదు కానీ ఒకవిధమైన స్తబ్దత నెలకొంది. ఏ పని చెయ్యాలని పూనుకున్నా మనసూ,శరీరం మాట విననంటున్నాయి. ఏమీ చెయ్యాలనిపించని నిరాసక్తత (ఇది నా విషయంలో చాలా అరుదు) . జీవితంలో మునుపెన్నడూ మోటివేషన్ ని ఇంతగా వెతుక్కున్నది లేదు. భారతంలో కోవిడ్ సెకండ్ వేవ్ కళ్ళు మూసుకున్నా విస్మరించగలిగే విపత్తు కాదు. నన్ను మించిన వాడులేడని అహంకారంతో అంతా 'నేనే' అని విర్రవీగిన మనిషికి జాతి,మత,కుల,వర్గ తారతమ్యాలు లేకుండా నువ్వేమిటో,ఈ సమస్త విశ్వంలో నీ ఉనికేమిటో మరోసారి కౄరంగా గుర్తుచేసింది ప్రకృతి. 'అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అంటూ మానవాళిని రక్షించు దేవా అంటూ కనిపించని దేవునికి మనసులోనే ప్రార్థిస్తూ,మెకానికల్ గా బాధ్యతలను నిర్వర్తిస్తూ, మౌనంగా గడుపుతున్న రోజులు. వారం నుండీ రెండు పేజీలు కూడా కుదురుగా చదవడానికి ఏకాగ్రత కుదరలేదు. అటువంటి సమయంలో చాలా కాలంగా చదువుదామనుకుని వాయిదా వేస్తూ వచ్చిన మార్కస్ ఔరీలియస్ 'మెడిటేషన్స్' జ్ఞాపకం వచ్చింది. కానీ సుదీర్ఘమైన ఒరిజినల్ వెర్షన్ చదివే ఏకాగ్రతలేక సామ్ టోరోడ్ రాసిన ఈ అబ్రిడ్జ్డ్ వెర్షన్ ముందుగా చదివాను. ఎప్పటిలా నేను ఈ పుస్తకాన్ని 'చదవడంలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి' చదవలేదు. పేరుకి తగ్గట్టుగా నిజంగానే ఒక ధ్యానంలా చదివాను. ఇటువంటి చీకటిరోజుల్లో చదవడం వల్ల కావచ్చు,మనసుకి బాగా హత్తుకుంది,ఆస్తికులు గీతాపారాయణ లాంటివి క్రమం తప్పకుండా ఎందుకు చేస్తారో అనుభవపూర్వకంగా అర్ధమైంది. ఈ చీకటి కాలంలో తన జ్ఞానాన్నీ,వివేకాన్నీ అందించి మనసుకు సాంత్వన చేకూర్చిన ఔరీలియస్ కు కృతజ్ఞతాంజలులు.

Image Courtesy Google

పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం :

మనుషులు వాస్తవిక జీవితంలోని సంక్లిష్టతలనుండి సేద తీరడానికి విహార యాత్రలకూ, ప్రాకృతిక ప్రదేశాలకూ వెళ్తుంటారు. కానీ ప్రశాంతతను బయట వెతుక్కోవడం కంటే నీలోకి నువ్వు ప్రయాణించి చూడు. నీ ఆలోచనలు సన్మార్గంలో ఒక క్రమపద్ధతిలో ఉన్నంతసేపూ నీ మనసుని మించిన శాంతిధామం మరొకటిలేదు. అక్కడ నీవు సర్వస్వతంత్రుడివి.

మనుషుల చెడు ప్రవర్తన నిన్ను కష్టపెడుతోందా ? అయితే ఇది గుర్తుపెట్టుకో : మనుషులు ఒక సమూహంగా బ్రతుకుతారు. వారిలో కొందరు తెలిసీ తెలియని అజ్ఞానం వల్ల చెడుగా ప్రవర్తిస్తారు. గతంలో ఇలా ప్రవర్తించిన వాళ్ళు ఎందరో మరణించారు. నీతో సహా నిన్ను బాధపెడుతున్న వాళ్ళు కూడా ఏదో ఒకనాడు పిడికెడు బూడిదగా మారతారు.
నీలో కీర్తికాంక్ష రగులుతోందా ? వర్తమానానికి ఇరువైపులా కొలవవీలులేని అనంతమైన కాలాన్నీ, ప్రశంసల్లోని డొల్లతనాన్నీ, విధివిధానాల్లోని అస్థిరత్వాన్నీ పరిశీలించు, అన్నీ ఎంత త్వరగా జ్ఞాపకాల నుండి అదృశ్యమైపోతాయో కదా ! అటువంటి పక్షంలో ఈ కీర్తినేం చేసుకుంటావు ? నీ అంతఃప్రపంచంలోకి చూడు. ఎటువంటి బాహ్య ప్రభావాలకూ లోనుకాని,మలినాలంటని నీ ఆత్మతో ప్రపంచాన్ని నిష్పక్షపాతంగా చూడగలుగుతావు. నువ్వు చింతాగ్రస్తుడవై ఉండడానికి  నీ భావాలే  కారణం. నీ జీవితానుభవాన్ని ప్రపంచంపట్ల నీ దృక్పథం మాత్రమే నిర్ణయిస్తుంది.

ఆ పై వాక్యాలు చదివినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి. మనం తదనంతరం కూడా కీర్తింపబడడడంలో బహుశా తప్పేమీ లేదు. మన జీవిత లక్ష్యాలను ప్రతిఫలాపేక్ష లేకుండా వాటిపట్ల ఉండే ఆసక్తితో,ప్యాషన్ తో సాధించినప్పుడు వచ్చే కీర్తి తరాలపాటు నిలిచి ఉంటుంది.కానీ కేవలం ఫలాపేక్షతో ఎంచుకున్న జీవితాలక్ష్యాల వెన్నంటి వచ్చే కీర్తి ఎక్కువకాలం నిలబడదు.అది తాత్కాలికం.

మన గురించి ఇతరులేమాలోచిస్తున్నారు ? వాళ్ళేమంటున్నారు ? ఏం చేస్తున్నారు ? అనే ఆలోచనలే అనేక సమస్యలకు మూలకారణం. నీ దృష్టిని నీ ఆలోచనలూ ,వాక్కూ,కర్మల పై పెట్టి నీ జీవితమార్గంలో ముందుకు నడువు. ఇతరుల తప్పటడుగులను ప్రక్క చూపులు చూడకు. 

అందమైనవన్నీ స్వతఃసిద్ధంగా అందమైనవి. వాటికి ఆ అందం ఒకరు ఆరాధించడం వల్ల రాదు. పొగడ్తలూ,మెచ్చుకోళ్ళూ అందానికి కొత్తగా ఏ చేర్పులూ చెయ్యవు. అలాగే ఒకరు హీనంగా చూడడం వల్ల ఆ అందం తరగదు. నీచులు అందమైనవని తలపోసే విషయాలను చూడు. అందానికి ఎటువంటి ఆధారం అవసరం లేదు. అదేవిధంగా సత్యానికీ, న్యాయానికీ , మంచితనానికీ కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఇవన్నీ పాపులారిటీ కాంటెస్ట్స్ మీద ఆధారపడతాయా ? లేదా అవమానాల వల్ల అపఖ్యాతిని మూటగట్టుకుంటాయా ? వజ్రం తనను కీర్తించలేదని తన మెరుపును కోల్పోతుందా ?

జీవనప్రవాహంలో చలనం లేకుండా స్థిరంగా ఉండేవేవీ ఉండవు. అన్నీ ఎంత త్వరగా వెలుగుచూస్తాయో,అంత త్వరగానూ ప్రసరించి అదృశ్యమైపోతాయి. ఈలోగా నేననే అహం, ఆత్మన్యూనత,చింత ఇవన్నీ ఎంత వ్యర్థమైనవి. అనంతమైన గతాన్నీ భవిష్యత్తునీ చూడు. నీ విజయాలెంత అల్పమైనవో,నీ కష్టాలెంత స్వల్పమైనవో గ్రహించు. ప్రగల్భాలు పలకడం, నిందించడం బదులు ఈ విశ్వంలో నీ అల్పమైన ఉనికిని గుర్తుంచుకుని నీకు దొరికిన జీవితాన్ని ఆనందించడం నేర్చుకో. 

ఎవరైనా నాకు అపకారం చేశారా ? అయితే అది వారి సమస్య. వారు తమ సొంత వ్యక్తిత్వానికి హాని తలపెట్టుకున్నారు, నీకు కాదు. వారి కర్మలను సృష్టికర్తకు వదిలేసి నీవు నీ ఆలోచనలపట్లా,కర్మల పట్లా మాత్రమే దృష్టి సారించు.

జీవితంలో విలువైనది ఏమిటి ? చప్పట్లు కొట్టించుకోవడం,పొగిడించుకోవడమా ? అది కేవలం రెండు చేతులు కలిసిన శబ్దం, నాలుకల కదలిక మాత్రమే. కీర్తి కాంక్షను నువ్వు త్యజించినప్పుడు మిగిలేదేమిటో తెలుసా ? నువ్వు నీ స్వభావరీత్యా జీవించడం నేర్చుకుంటావు. సమస్త కళల,వృత్తుల అంతిమ లక్ష్యం ఇదే.

నువ్వు మరణాంతరం కూడా తరతరాలు కీర్తింపబడాలని కోరుకోవడం ఎంత హాస్యాస్పదం ! నువ్వు ఎప్పుడూ చూసే అవకాశంలేని మనుషుల మాటల్ని ఆశించడం ఎందుకు ?

కీర్తికోసం వెంపర్లాడేవారిని చూడు, వారు ఇసుక రేణువుల్ని ప్రోగుచేసుకోడానికి పోటీపడుతున్నారు. రేపెప్పుడైనా గాలివీయగానే ఆ ఇసుక రేణువులు క్రమంగా దానితో పాటు కొట్టుకుపోతాయి. 

అమానవీయులు ఇతరుల పట్ల వ్యవహరించినట్లు నీవు వారి పట్ల వ్యవహరించకు, లేదా నీవు కూడా అమానవీయుడవవుతావు. 

ఋషులైనవారందరూ పేరుప్రఖ్యాతులార్జించి ప్రముఖులు కాలేకపోవచ్చు. నీకు బహుశా వక్తృత్వపు నైపుణ్యం,విద్యా పాండిత్యం ఉండకపోవచ్చు, కానీ అది  తాత్వికుడిగా మారడానికి నీకు అవరోధం కానివ్వకు. పాండిత్యాలూ,నైపుణ్యాలూ మేచ్చుకోలు,గౌరవం ఇస్తాయి గానీ ఒక మంచి జీవితాన్ని ఇవ్వవు. ఒక మనిషి నిజమైన విలువ/ప్రామాణికత అంతర్గతమైనది. ఎవరి కంటికీ కనిపించనిది.

నీలో లోపాలను విస్మరించి ఎదుటివారి లోపాలను మాత్రం ఎంచి వారిని తిరస్కారభావంతో చూడడం ఎంత హేయం ! 

చేతులూ, కాళ్ళూ శరీరము నుండి విడివడి సజీవంగా ఉండడం ఎప్పుడైనా చూశావా ? సమాజం నుండి విడివడి బ్రతికే మనిషి కూడా మానవజాతినుండి అలా తనను తాను వేరు చేసుకుంటాడు.

ఈ కీరా చేదుగా ఉంది .పడేస్తే పోతుంది. నా దారిలో ముళ్ళున్నాయి. వాటి చుట్టూ మరో దారిలో వెళ్తే సరిపోతుంది. అంతేగానీ నాకే ఎందుకిలా జరుగుతోంది ? ఈ  ప్రపంచం ఎంతటి కౄరమయినది ? అందరూ నన్ను బాధపెట్టడానికే కంకణం కట్టుకున్నారు అని అజ్ఞానంతో కూడిన ఆలోచనలు చెయ్యకు. 

ఆరోగ్యకరమైన కళ్ళు అన్ని వర్ణాల్నీ చూడగలవు. ఆరోగ్యకరమైన చెవులు అన్ని ధ్వనులనీ వినగలవు. ఆరోగ్యకరమైన ముక్కు అన్ని వాసనలనూ గ్రహిస్తుంది. పచ్చదనాన్ని తప్ప ఏమీ చూడలేకపోవడం, వీణానాదాలు తప్ప ఏమీ వినలేకపోవడం, గులాబీల పరిమళాన్ని తప్ప దేన్నీ ఆఘ్రాణించలేకపోవడం ఒక ప్రమాదకరమైన జబ్బు.

నీవెంత మంచి జీవితాన్ని జీవించినా అందరినీ సంతోషపెట్టలేవు. కొంతమందికి నీ ఉనికి గిట్టకపోవచ్చు. చివరకి సోక్రటీస్ చనిపోయినప్పుడు కూడా "హమ్మయ్య,నేనిప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు,అతడు నన్ను ప్రత్యక్షంగా ఏమీ విమర్శించలేదు గానీ అతడి సమక్షంలో నేను పనికిరానివాడిగా ఆత్మన్యూనతను అనుభవించాను" అనుకున్న వారు ఉన్నారు. అందువల్ల అందరి మెప్పూ పొందాలన్న వ్యర్థ ప్రయత్నం మానుకో. నీ సిద్ధాంతాల ప్రకారం నువ్వు జీవించు. సమయం వచ్చినప్పుడు ఈలోకంనుండి శాంతితో,తృప్తితో నిష్క్రమించగలవు. 

మనుషుల వ్యక్తిత్వం వారి కళ్ళలోనూ,ముఖ కవళికల్లోనూ ప్రతిబింబిస్తుందంటారు. ఒక కౄరమైన వ్యక్తి తాత్కలికంగా కారుణ్యమూర్తిలా అందమైన చిరునవ్వుతో ప్రపంచాన్ని మోసం చెయ్యాలనుకున్నప్పటికీ, ఏదో ఒక సమయంలో ఆ ముసుగు జారిపోయి వారి వికృత రూపం బహిర్గతమవుతుంది.

నీ ఊహల్లో అనంతమైన సమస్యలనూ,దుర్ఘటనలనూ ఊహించుకుని చాలా చింతపడ్డావు. ఇక చాలు. 

ఈరోజు నేను నా సమస్యలనుండి విముక్తుణ్ణయ్యాను. లేదా వాటిని సమూలంగా చెరిపేశాను. నా సమస్యలన్నీ నా ఆలోచనల పర్యవసానంగా జనించినవే. అందుచేత ఇంతకాలం నాకు నేను చెప్పుకుంటున్న కథను మార్చుకున్నాను.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు యధాతథంగా , 

“It is noble to do good and be insulted for it.”   —Antisthenes.

Far better to have an honest opponent than a false friend. 

“Why be angry at the world?   As if the world cares!”   —Euripides.

Celebrities, fashions, plays, spectacles, gladiatorial fights . . . how often people remind me of flocks of sheep, herds of cattle, dogs fighting over bones, and puppets pulled by strings.    Even so, keep a sense of humor about these things, not an air of superiority.

Words spoken in centuries past, eloquent and inspiring in their time, now seem antiquated. The names of great leaders—Camillus, Caeso, Volesus, and the rest—have likewise lost their power.   All things pass away into the realm of memory, story, and finally into oblivion. (I’m speaking of those whose lives shine brightly. The majority of people aren’t celebrated in stories and legends—they’re forgotten as soon as they are buried.)  Even if it were possible for you to be remembered eternally, what is remembrance worth to you? Nothing.

Don’t be discouraged if you fail to live up to your principles all the time. When you stumble, get up and keep going.   Return to philosophy gladly, out of love for wisdom; not with your head hung low, like a servant returning in fear to a harsh master. Philosophy seeks your highest good and asks only that you live according to your nature.   Unnatural pleasures lure you from the path of reason. But what is more pleasurable than wisdom? Peace and happiness flow from the understanding and practice of philosophy.

Others may insult you, injure you—even kill you and cut you to pieces—yet they are powerless to harm your character. Nothing can defile your mind or force you to be unjust, outside of your own will.    A person can stand by a mountain stream and insult it all day long—the stream remains pure. Even if they throw dirt into it, the dirt is quickly dispersed and carried away.   Let your soul be like that stream—flowing freely, simplly, and contentedly.

When others try to hurt you, they hurt themselves. When they cheat or steal from you, they impoverish their own character.   Leave wicked deeds where they happen. Don’t pick them up and carry them forward in the form of resentments.

Rationality is the quality of seeing past appearances to discern the true nature of things. We call a person rational who is evenhanded and unprejudiced.   Equanimity means the calm acceptance of all that exists and all that happens.   Magnanimity means greatness of spirit, unmoved by the lure of pleasure, the lust for fame, and the fear of death.   If you strive to be rational, equanimous, and magnanimous— not merely to be publicly called by these adjectives—you will completely transform your life

Ponder the leaves—brought forth in spring, fallen and scattered in fall, replaced by new ones next season.   Hold everything lightly. Don’t cling to some things and run from others as if they—or you—were everlasting.

Saturday, July 17, 2021

The Good Story : Exchanges on Truth, Fiction and Psychotherapy - John Maxwell Coetzee and Arabella Kurtz

"We have art in order not to die of the truth." అంటారు ఫ్రెడ్రిక్ నీచ. సత్యాన్ని పూర్తి వెలుగులో చూసే శక్తి అందరికీ ఉండదు. అందుకే, మనం భరించలేని గత జీవితపు అనుభవాల చేదు జ్ఞాపకాల్ని ధైర్యంగా ఎదుర్కోకుండా వాటిని వెనక్కి నెట్టేసి, వీలైతే సమాధి చేసి, మెల్లిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తాం. కాని, జ్ఞాపకాలను సమూలంగా చెరిపెయ్యడం సాధ్యం కాదు. అవి కేవలం అణగదొక్కబడతాయి. మస్తిష్కపు చీకటి మూలల్లో ఎక్కడో ఒకచోట నిక్షిప్తమై ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి పైకి తేలుతాయి. అలజడి కలిగిస్తాయి. అప్పుడు వాటిని ఎదురుకోవడం కోసం, నీచ చెప్పినట్లు, ఒక కళనో మరో భ్రమనో తెరచాటు చేసుకుంటాం. ఆ సహాయంతో ఆ జ్ఞాపకాలకు ఒక కొత్త రూపం ఇస్తాం. లేదూ వాటిని తట్టుకోవడానికి అనువైన ఒక సందర్బాన్ని నిర్మించుకుంటాం. అలా వాటితో ఎలానో ఒకలా రాజీపడతాం.

Image Courtesy Google

ఏదేమైనా, బాధపెట్టే జ్ఞాపకాల రూపును కల్పితకథనాలతో మార్చుకొనే స్వేచ్ఛ మనిషికి ఉందా? ఏది నిజం? ఏది కల్పితం? కాలంతో పాటూ మన జ్ఞాపకాలూ మారుతాయి. అప్పటి సంఘటనలు కొత్త సత్యాలతో, కొత్త అర్థాలతో కనిపిస్తాయి. మన ఆలోచనలు మారేకొద్దీ, అనుభవాలు పెరిగేకొద్దీ గతం పట్ల దృక్పథమూ మారిపోతుంటుంది. గతం ఎప్పుడూ అలా కొత్తగానే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు, ఒక రచయిత తన ఆత్మకథను రాసుకుంటున్నప్పుడు అతను కేవలం అనుభవాలని ఏకరువు పెడుతున్నాడా లేక వాటికి ఒక సందర్భాన్నిచ్చి ఒక కొత్త రూపాన్ని తొడుగుతున్నాడా? మన జీవితాలనుంచి మనం చెప్పుకునే కథలలో సత్యశోధన ఎంతవరకూ అవసరం? మన కల్పనలో ఎంతవరకూ మన జీవితం నిజం? తమ అనుభవాలకు కొత్త సందర్భాన్ని, దృక్పథాన్ని ఇచ్చుకుంటూ తమ గతాన్ని ఎంతోకొంతయినా కాల్పనికం చేసుకోవడం నైతికమేనా? అటువంటి స్వేచ్ఛ రచయితకు ఉందా? ఒక రచనలో రచయిత ప్రమేయం ఎంత? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే దిశగా సైకోథెరపిస్టు అరాబెలా కర్ట్స్ (Arabella Kurtz), సౌత్ ఆఫ్రికా రచయిత, సాహిత్యంలో నోబెల్ గ్రహీత (2003) జె. ఎమ్. కూట్సీ (John Maxwell Coetzee) మధ్య జరిగిన సంభాషణలను ది గుడ్ స్టోరీ (The Good Story: Exchanges on Truth, Fiction and Psychotherapy) పేరిట పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.

‘మన గురించి మనం చెప్పుకునే కథల్లో నిజానిజాలు మనకు పూర్తిగా తెలియకపోయినా మనకంటూ మిగిలేవి అవే కాబట్టి ఆ కథలతో మనకున్న సంబంధాలంటే నాకు ఆసక్తి’ అని చెప్తూ, కూట్సీ మన కథల్ని మూడు విధాలుగా వర్గీకరిస్తారు. నా గురించి నేను నిజాయితీగా వాస్తవమని నమ్మే కథ ఒకటుంటుంది. కానీ నాకు అస్సలు సంబంధం లేని ఆదర్శవంతుడు, సర్వజ్ఞుడు, దైవజ్ఞుడూ అయిన మరో వ్యక్తి అది నిజం కాదని భావించవచ్చు. నా కథ అబద్ధమని కాకపోయినా కనీసం పూర్తి నిజం కాదని అనుకోవచ్చు. రెండోది సర్వసాధారణంగా జరిగే విషయం. నా గురించి నేను నిజమని నమ్మే కథ ఒకటుంటుంది. కానీ నాగురించి బాగా తెలిసిన నా జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలూ ఆ కథ నాకు అనుకూలంగా అల్లుకున్న కథ అని, భ్రమలతో కూడిన కథనీ కూడా అనుకోవచ్చు. ఇక మూడవది. అందరికీ ఎవరి కథ వారికున్నట్లే నాకు కూడా ఒక కథ ఉంటుంది. ఇది పైరెండు కథలకూ భిన్నమైనది, అసలు ఏమాత్రమూ నిజం కానిదీ అయినా సరే, అది ‘నా కథ’. నాకున్న ఒకే ఒక్క కథ. అందువల్ల నేను దానికి పూర్తి విధేయుడనై ఉంటాను. ‘నిజం’ నిరాకారమైనది. నీ నిజం వేరు, నా నిజం వేరూ కావచ్చు. సౌందర్యమయంగా కనిపించేదంతా సత్యమని, వికారంగా ఉండేదంతా అసత్యమనీ అనుకోవడం మానవ నైజం. నిజానికి ప్లేటో సిద్ధాంతం ఈ పునాదుల మీద నిలబెట్టినదే. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తప్పనిసరైనప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. (The heart of the poets’ case is that beauty is its own truth.) ప్లేటో తన వాదనలో ప్రధానంగా కవిని వేలెత్తి చూపించినా ఇది ప్రతి మనిషికీ వర్తించే విషయమే. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు, గతంలో నేరచరిత్ర ఉన్న వ్యక్తి, దుర్మార్గాలతో కూడిన గతంతో సహజీవనం చెయ్యడం వర్తమానంలో నరకప్రాయం కాబట్టి, తన ‘సత్యాన్ని’ అప్పటి కాలమానస్థితులకు తగ్గట్లు తనకు వీలుగా పునఃనిర్మించుకుంటాడు. గతంలో తన దుష్ప్రవర్తనకు సమర్థింపుగా కారణాలను వెతుక్కుంటాడు. అది వీలుకాని పక్షంలో ఆ వాస్తవాన్ని పూర్తిగా తన అస్తిత్వంలోనుండి చెరిపివేసుకుని తనకు మరో కొత్త వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్నీ ఆపాదించుకుంటాడు. ఈ కారణంగా కాలం గడిచే కొద్దీ, గతం నిర్దిష్టమైన సత్యానికి దూరం జరుగుతూ ఒక కాల్పనిక రూపాన్ని సంతరించుకోవడం అనివార్యమవుతుంది. ఈ కారణంగా ఎంతో కొంత కాల్పనికత లేని సత్యం అంటూ ఉండడం దాదాపు అసాధ్యం. ఈ విషయాన్ని నిరూపించడానికి నథానియల్ హాథోర్న్ (Nathaniel Hawthorne) రచన ది స్కార్లెట్ లెటర్‌ను (The Scarlet Letter) ఉదాహరణగా తీసుకుంటాడు కూట్సీ. 17వ శతాబ్దపు ఉత్తర అమెరికాలో పరిశుద్ధ క్రైస్తవ (Puritan) వ్యవస్థకు చెందిన నవలా నాయిక హెస్టర్ ప్రిన్, ఇంటికి దూరమైన భర్త తిరిగివచ్చేలోగా వివాహేతర సంబంధం కారణంగా సంతానాన్ని కంటుంది. ఈ విషయం తెలిసిన కులపెద్దలు అడల్టరీకి గుర్తుగా ఎర్రటి A అనే ఇనుప అక్షరాన్ని మెడలో ఒక గొలుసులా జీవితాంతం వేసుకొని ఉండాలని ఆమెకు శిక్ష విధిస్తారు. కానీ హెస్టర్ దాని చుట్టూ రిబ్బన్‌లతోనూ, లేసులతోనూ ఎంబ్రాయిడరీ చేసుకుని అలంకరించుకోవడం మొదలుపెడుతుంది. హెస్టర్ తన అవమానానికి గుర్తుగా ధరించే అక్షరంతో ఎంత మమేకమైపోతుందంటే చివర్లో ఆమెను ఆ శిక్షనుండి విముక్తురాలిని చేసినా దాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోదు. ఈ కథలో హెస్టర్ తన అవమానాన్ని ఇలా మరో రూపంలోకి ఫ్యాబ్రికేట్ చేసుకుంటుంది. ఈ విధంగా ఆమె ఒక ప్రక్క సామాజిక నియమాలకు తలొగ్గుతూనే, మరో ప్రక్క ప్యూరిటన్ వ్యవస్థలో నిషిద్ధమైన అలంకరణను ఆసరా చేసుకోవడం ద్వారా సాంఘిక కట్టుబాట్లను ధిక్కరిస్తుంది. ఈ విధంగా ది స్కార్లెట్ లెటర్ కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా సామాజిక స్థాయిలో కూడా మన తప్పులను, మనం సిగ్గుపడే వ్యక్తిత్వ లోపాలనూ అంగీకరించే ప్రయత్నం చెయ్యమని పరోక్షంగా చెబుతుంది. ఇలా చెయ్యడం వల్ల మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికిని సరికొత్తగా ఆవిష్కరించుకునే స్వేచ్ఛ దొరుకుతుంది. గాన్ విత్ ది విండ్ నవలలో కూడా రెట్ బట్లర్ కూతురు పుట్టాక అలవాటైన తన పాత జీవితానికి స్వస్తి చెప్తాడు. ఎవరినీ లెక్కచెయ్యని స్వార్థపరుడు కాస్తా, సమాజంలో తన బిడ్డకు మంచి స్థానాన్ని ఇవ్వడం కోసం అందరితో మర్యాదగా మసులుకుంటూ గతాన్ని పునఃనిర్మించుకునే ప్రయత్నం చేస్తాడు. మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. గతాన్ని మనకు వీలుగా ఇలా మార్చుకోవడానికి సాహిత్యం అనంతమైన అవకాశాలిస్తుంది. సహజంగా ‘కథ’ అనగానే సత్యదూరమైనది, కాల్పనికమైనదీ అనే స్థిరాభిప్రాయం ఉంటుంది. కానీ ఫిక్షన్ అనేది పూర్తి నిజమూ కాదు, అబద్ధమూ కాదు. అది సమీకరణాల్లో చరాంశంలా సాపేక్షమైనది, అస్థిరమైనదీనూ. హెస్టర్ కథను పరిశీలిస్తే ఆమె ఫలానా నేరం చేసిందని తీర్పునిచ్చిన మెజిస్ట్రేట్‌కు ఆమె గురించి తెలిసిన కథ పూర్తి యథార్థం కాకపోవచ్చు. అలాగే బ్రూక్ ఫార్మ్ హెస్టర్ ఒక ‘అనుభవం కోసం’ చేశానని నమ్మే కథ కూడా పూర్తి నిజం కాకపోవచ్చు. ఈ రెండు కథల్లో తోచిన సత్యాన్ని తూకం వేసి నిర్ణయించుకునే అవకాశం పాఠకులకు ఉంటుంది. అది కూడా ఖచ్చితమైన సత్యం కానక్కర్లేదు. హెస్టర్ కథలో సత్యం చివరకు ప్రశ్నార్థకంగా మిగులుతుంది కాబట్టే ది స్కార్లెట్ లెటర్ ఒక మంచి కథ అని అంటాడు కూట్సీ. మానసికచికిత్సను కూట్సీ క్యాథలిక్ క్రిస్టియనుల కన్ఫెషన్ ప్రక్రియతో పోలుస్తాడు. బైబుల్‌లో You shall know the truth, and the truth shall set you free అనే వాక్యం ఉంటుంది. సైకాలజిస్టుల వద్దకు మానసిక వైద్యం నిమిత్తం వెళ్ళే రోగులను నయం చేసే క్రమంలో వారిలో అంతర్గత భయాలను పోగొట్టి వారి సత్యాన్ని పూర్తి వెలుగులో చూపగలిగే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. మానసిక రోగులకు చేసే థెరపీ లక్ష్యం వాళ్ళను గతం నుండి విముక్తుల్ని చేసి స్వేచ్ఛను ప్రసాదించగలగడం మాత్రమే అయితే దానికి ‘సత్యం’ మాత్రమే ఏకైక మార్గమా అన్నది ప్రశ్న! మన జీవితాల గురించి మనం చెప్పుకునే కథలు వాస్తవంగా జరిగినదాన్ని ప్రతిబింబించడంలో చాలాసార్లు విఫలమవుతాయి. వాటిల్లో వాస్తవికత లోపభూయిష్టమైనది. అలాగని అవి పూర్తిగా అబద్ధాలనీ కొట్టిపారెయ్యలేం. నిజానికి మనుషులు తమ దుర్బలత్వానికి సిగ్గుపడో, తమలో చీకటి కోణాలను దాచుకోవడానికో అబద్ధాలు చెప్తారు. ఇటువంటి అబద్ధాలను కట్టుకథలుగా మలచుకుంటే తప్ప మనకు ఆ కథలు చెప్పడానికి మరో మార్గం లేదు. మన దగ్గరున్న ముడిసరుకునే సత్యమని భావించినప్పుడు దానినుంచి సాపేక్షిక సత్యాలెన్నిటినో అంశాలుగా తీసుకుని వేరు వేరు కథలల్లే అవకాశం ఉంది. ఉదాహరణకు సెర్బాంతేస్ (Servantes) రాసిన డాన్ కిహోటేను (Don Quixote) తీసుకున్నా అందులో మనం సృష్టించుకునే ఆదర్శవంత సత్యం (ideal truth) వాస్తవిక సత్యం (real truth) కంటే మెరుగైనదేమో అనిపిస్తుంది. నవల రెండో భాగంలో ఒక సందర్భంలో కిహోటే తాను అశ్వారూఢుడయిన మహా వీరుడిని అన్న భ్రమ నుండి విడివడి ఇలా అంటాడు: ‘నాకు ఒక శూరుడి ధర్మం పట్ల నమ్మకముంది, నేను నా నమ్మకాలకనుగుణంగా మసలుకునే వ్యక్తిని. అలా చెయ్యడం ద్వారా మనిషిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. నేను మునుపటిలా స్పానిష్ సమాజంలో శిథిలమైపోతున్న నా భవంతిలో మరణం కోసం ఎదురుచూస్తూ దుర్భరమైన స్థితిలో ఉండడం మీకు ఇష్టమా? లేదా ఇప్పటిలా పేదలకు, అణగారిన వర్గాలకు, బాధితులైన స్త్రీలకూ రక్షకుడుగా ఉండడం ఇష్టమా? అయినా నా నమ్మకాలు మనిషిగా నా ఎదుగుదలకు తోడ్పడుతున్నప్పుడు మీరు వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారెందుకు?’ కిహోటే మాటల్ని పరిశీలిస్తే మనిషి శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు కొన్ని భ్రమలని కూడా వాస్తవాల్లా నమ్మడంలో కోల్పోయేదేముంటుంది అనిపిస్తుంది. మనిషి మానసికారోగ్యానికి అవసరమైన మోతాదులో కాల్పనికత చేసే మేలుని గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ నాకైతే కనపడలేదు. నేటి సమాజంలో శాస్త్ర సాంకేతికాభివృద్ధి కారణంగా సృజనాత్మకతకు తావివ్వని మితిమీరిన స్పష్టత, తార్కికత లాంటివి మనిషి మానసికాభివృద్ధిని అనేక విధాలుగా నిర్వీర్యం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. కిహోటే ఆదర్శవాదాన్ని అతడి అనుచరులందరూ ఆచరించకపోయినా అతడి ఆదర్శాల వల్ల ప్రపంచానికొరిగే నష్టమైతే లేదని ముక్తకంఠంతో తీర్మానిస్తారు. ఇటువంటి భ్రమల వల్ల ప్రపంచం మరికొంచెం సజీవంగా, వినోదాత్మకంగా మారుతుందని అభిప్రాయపడతారు. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడం అందరికీ సాధ్యం కాదు, కానీ కొందరు జీవిస్తుంటే చూసి తృప్తి పడేవాళ్ళు కూడా మరికొందరు ఉంటారు. ఎప్పుడో ఆరేడేళ్ళ క్రితం నేను చదివిన యూత్, డిస్గ్రేస్ నవలల నాటి కూట్సీకి భిన్నమైన దృక్పథం ఈ కూట్సీలో కనిపిస్తుంది. ఒక అసాధారణమైన జ్వర తీవ్రతతో సృజనకు పూనుకునే కళాకారుల్లో నైతికతను ఆశించకూడదని, ఆ మాటకొస్తే నైతికపరిథిలో ప్రాణంపోసుకునే ఏ కళారూపమైనా ఉత్తమమైనది కాదనే ఆనాటి తన వాదనకు భిన్నంగా, ఇక్కడ ప్రామాణికతకు (authenticity) నైతికతకు భేదాన్ని గుర్తించిన తీరులో కూట్సీలో ఒక పరిణతి చెందిన రచయిత కనిపిస్తాడు. ఒక మనిషి అబద్ధమాడినా, మోసం చేసినా, దొంగతనం చేసినా కూడా తనను తాను సత్యవంతుడని, మోసగాడు, దొంగ కాదనీ అనుకోనంతవరకూ ఆ వ్యక్తి ప్రామాణికమైన వ్యక్తిగానే లెక్క. కానీ ఎందుకో సమాజం ప్రామాణికతకు అవసరం లేని గొప్పతనాన్ని ఆపాదిస్తుంది. ఉదాహరణకు డికెన్స్ లాంటి రచయితలు తమ రచనల్లో ప్రామాణికతకు పెద్దపీట వేస్తారు, హిపోక్రసీని సహించరు, కానీ అనైతికతపట్ల మాత్రం ఉదారంగా వ్యవహరిస్తారెందుకో అంటాడు కూట్సీ. కళాసృజన విషయంలో గాని, సత్యశోధనలో గానీ పూర్తి స్పష్టతను ఆశించడం సరికాదనే వాదనను నిరూపించే క్రమంలో సెబాల్డ్ (W. G. Sebald) నవల ఔస్టలిట్స్‌లో (Austerlitz) సూత్రధారుడు ఆపెరా గాయకుల గురించి రాసిన ఒక వివరాన్ని కూట్సీ ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు ఈ గాయనులు స్టేజ్ మీద ఉన్నప్పుడు తమ కనుపాపలు పెద్దవిగా చేసుకోవడం కోసం కళ్ళలో బెలడోనా డ్రాప్స్ వేసుకునేవారట. కంట్లో బెలడోనా కారణంగా వాళ్ళేమీ స్పష్టంగా చూడగలిగేవారు కాదు కాని, వాళ్ళ కళ్ళు స్పష్టంగా కాంతులీనుతూ కనపడి ప్రేక్షకులకు వారు మరింత సౌందర్యవతుల్లా కనిపించేవారు. ఇలా చేయడం వల్ల వారి గాయకప్రతిభలో వచ్చిన మార్పేమీ లేదు. కాని, అది వారి ప్రదర్శనను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదించడానికి సహాయపడుతుంది. ఇలా, ఒక విషయంలో నైపుణ్యాన్ని సాధించే క్రమంలో సృజనకు కాస్త పట్టువిడుపులు ఉండడం అవసరం. ఈ పట్టువిడుపుల వల్లనే సృజనాత్మకతతో కూడిన కళారంగంలోనూ, భావోద్వేగాలతో నిండిన మనోప్రపంచంలోనూ వివిధ రకాలైన నూతనోత్తేజాలకు ఆస్కారం ఉంటుంది. మానసిక చికిత్స, సృజనాత్మకత అనే రెండు దారులూ సరిగ్గా ఇటువంటి సందర్భాల్లోనే కలుస్తాయి. కథలన్నీ అన్యాయంపై న్యాయం సాధించే విజయంగా ఉంటే పాఠకులకు రుచిస్తుంది. తప్పు చేసినవాడికి శిక్ష పడి తీరాలనుకుంటారు పాఠకులు. అలా కాని పక్షంలో ‘అంత ఘోరమైన పాపాలకు పాల్పడి అలా ఎలా తప్పించుకుని సుఖంగా ఉంటాడు!’ అనుకుంటాడు సగటు పాఠకుడు. సినిమాలలో హీరో విలన్‌ని కొడితే మనం ఉత్సాహంగా చప్పట్లు కొడతాం. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం గెలిచాయని సంతోషపడతాం. ది స్కార్లెట్ లెటర్, డాన్ కిహోటే, గాన్ విత్ ది విండ్ లాంటి కథల్ని మంచి కథలుగా నిలబెట్టేది ఈ న్యాయభావన (notion of justice) మాత్రమే అంటాడు కూట్సీ. ఉదాహరణకు కథానాయకుడు తన అనైతికమైన గతాన్ని తిరగరాయాలని ప్రయత్నించి విఫలమవ్వడం జగద్ధర్మం గురించి చెబుతుంది. అదే అతడు తన గతాన్ని సులభంగా దాచిపెట్టి సుఖసంతోషాలతో కడదాకా జీవించాడని చెప్పే కథ పాఠకులకు రుచించదు. ఎందుకంటే అందులో న్యాయాన్యాయాల ప్రసక్తి లోపిస్తుంది కనుక. సంగీతకారులు, చిత్రకారులు, రచయితల వంటి కళాకారులందరూ మనకు మనం విధేయులుగా ఎలా ఉండాలో నేర్పిస్తారు. మన అనుభవాల సాపేక్షకతత్వం కారణంగా లోపాలతో సహా మన ప్రామాణికతను అంగీకరించడం తప్ప మనకు మరో దారి లేదని రుజువు చేస్తారు. ఒకనాటి ప్యూరిటన్ వ్యవస్థలో కన్ఫెషన్ తీసుకునే చర్చ్ ఫాదర్ స్థానాన్ని, ఈనాటి మతాతీత సంప్రదాయంలో కళాకారులు భర్తీ చేస్తున్నారు. The art I love seems to say this to me: ‘Look at what is going on around you – in all its richness and detail and colour, its beauty and its ugliness; don’t stop looking and thinking about what you see; but also don’t forget that it is you who are looking, that you have a position and a place from where you look – and so do other people. Inhabit that place fully.’ మనసులో భారం దింపుకోడానికి పుస్తకపఠనం ఒక మంచి చికిత్స అయితే రాయడం ఒక మంచి ఆత్మచికిత్స అవుతుంది. రాయడం అనే సెల్ప్ థెరపీ వల్ల మంచి చెడులు విశ్లేషించుకునే అవకాశం వస్తుంది. మనం చేసిన తప్పులకు అక్షరరూపం ఇవ్వడానికి, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోడానికీ ఉపయోగపడుతుంది. మనం నిద్ర పోతున్నప్పుడు కూడా మనలో కళాకారుడు మెలకువగానే ఉంటాడు. కాల్పనికవాదం సృష్టించిన కథలలో కళాకారుడి లోపలి గాయం కీలకాంశం. అతణ్ణి మెలకువగా ఉంచేది ఆ గాయమే, దాని తాలూకు వేదనే. తన గాయాన్ని మాన్పుకోడానికి కళాకారుడు కళను సృష్టిస్తాడు. సత్యాన్ని పూర్తి వెలుగులో చూసే సాహసం లేకనే తన లోపలి భయాలకు, అంతఃసంఘర్షణలకూ సృజనను సాధనంగా చేసుకుని కాల్పనిక లోకాలకు రూపకల్పన చేస్తాడు. తద్వారా తన గాయాలనుండి ఉపశమనం పొందుతాడు. కథకుడికీ, మామూలు మనుషులకూ తేడా ఏమిటంటే, కథకుడు పూర్తి స్పృహతో తనలో అన్ని భావోద్వేగాలనూ జడ్జిమెంట్ లేకుండా అనుభవిస్తాడు. నైతికానైతికతలకు అతీతంగా తనలో చెలరేగే భావాలకు నిజాయితీగా అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేస్తాడు. దీనికి భిన్నంగా సాధారణ వ్యక్తులు తమలో లోపాల్ని అణచివేసే/ అధిగమించే ప్రయత్నం చేస్తారు. సంఘానికి భయపడో, సిగ్గుపడో తమలో చెడుని దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సంఘర్షణ కొన్నిసార్లు వారి జీవితాన్ని కబళిస్తుంది కూడా. రచయితే లేకపోతే మామూలు మనుషులకి మనలో లోపాలను గురించి మాట్లాడటానికి సరిపడే భాష ఉండేది కాదని కొందరి భావన. రచయిత కథలను చెప్పడం ద్వారా మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోగలమో, కలవరపరిచే గతం నుండి విముక్తి ఎలా సాధించగలమో నేర్పిస్తాడు. అలా నేర్పించేది ఒక మంచి కథ. ఎ గుడ్ స్టోరీ.

తొలి ప్రచురణ మే 2021 ఈమాట : https://eemaata.com/em/issues/202105/25963.html

పుస్తకం నుండి కొన్ని నచ్చిన అంశాలు :

JMC – I feel I must press further on the question I raised last time: Is the goal of the therapist (deliberately I don’t write, the goal of therapy) to bring the patient face to face with the true story of their life or to provide them with a story of their life that will enable them to live more adequately (more happily, which in the minimal Freudian prescription amounts to being able to love and work again)? How flexible can therapy afford to be in actual practice? Of course the therapist always desires the ideal outcome, the whole truth and the embracing of the whole truth by the patient; but given the constraints of time and money, doesn’t the therapist more often than not have to settle for a good-enough outcome, a truth that is not the whole truth but is good enough to get the patient back in working order?

The obvious answer is: I am prevented by my allegiance to the truth. But in practice can the truth – the whole truth – be attained without interminable analysis? And if interminable analysis is not practical, why not settle for a version of the truth that, in some sense, works?

He looked everywhere for love and validation, but was unable to find what he was looking for because the feelings of abandonment and neglect from childhood could not be consciously admitted. In short, he did not really know what he was looking for. This is not freedom – the freedom to pick a preferred version of one’s life from the trees, as it were – but the opposite.

I am rowing against a certain tide here, and I am aware of that. Let me note two currents in the tide. The first is the claim (by certain critics) that there is such a thing as the dialogical novel. The second is the claim (by many writers) that writing, at its most intense moments, is a matter of being dictated to rather than of dictating – that there have to be two persons or two souls in the room for a poem (in the widest sense) to get composed.

Perhaps it is always a mistake to try to transfer features of individual psychology to the psychology of the collective.

You suggest that a strongly felt membership of a group, a sense of belonging, need not be accompanied by regression in a psychological sense. I would put the emphasis elsewhere. I would say that involuntary group membership often results in regressive behaviour, as a way of blocking out an unhappy sense of not belonging yet not being able to get out. Such regression is like deliberately getting drunk to anaesthetise intolerable feelings.

Out of membership of great involuntary groups, like religion or caste or nation, one can, I have no doubt, get an enormous sense of security and validation and even pride. But belonging to an inescapable group can also be the root of a debilitating lifelong quarrel.

I don’t want to stray too far from the topic, but reading seems to demand a phenomenological analysis of its own. There is a dead reading and a living reading. Dead reading, in which the words never come alive on the page, is the experience of many children, those children who never, as they say, learn to love reading. It is not impossible to learn by means of dead reading, in a rote kind of way; but in itself it is a barren, unappealing experience. Living reading, on the other hand, strikes me as a mysterious affair. It involves finding one’s way into the voice that speaks from the page, the voice of the Other, and inhabiting that voice, so that you speak to yourself (your self) from outside yourself. The process is thus a dialogue of sorts, though an interior one. The art of the writer, an art that is nowhere to be studied though it can be picked up, lies in creating a shape (a phantasm capable of speech), and an entry point that will allow the reader to inhabit the phantasm.